The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘తెలంగాణ’

అమరులు కాదు – అస్తమిస్తున్న సూర్యులు

అక్కడెవరూ కనిపించడం లేదు. టివి మాత్రం పెద్దగా వినిపిస్తోంది
‘ఇంతింతై వటుడింతై అన్నట్లు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ప్రజా జీవనం స్థంబించింది. సీమాంధ్ర మొత్తం అట్టుడికిపోతోంది. వందల కోట్ల నష్టం జరుగుతోంది. బస్సులు బంద్, బడులు బంద్, పవర్ బంద్ జనమంతా రోడ్డు మీదే. బందులు, ధర్నాలు, రాస్తారోకోలు . వంటా వార్పూ, ఆటా పాటా అంతా రోడ్డు మీదే .’.వ్యాఖ్యానం మధ్యలో ‘సమైఖ్యాంధ్ర పిలుస్తుంది రండిరా, సకల జనుల దండు కదిలిందిరా ‘ పాట పాడుతూ వేలాదిగొంతులు దిక్కులు పిక్కటిల్లేలా చేసేనినాదాలు చూపుతూ .
‘ఉరుములు ఉరిమినట్లు, పిడుగులు పడినట్లు సీమాంధ్ర ప్రతిధ్వనించింది. విద్యార్థి గర్జనకు ఉలిక్కిపడింది ‘ వ్యాఖ్యానం సాగుతుండగా, బ్యాక్ గ్రౌండ్లో అందుకు అనుగుణంగా దృశ్యాలు చూపుతూ..

బ్రేకింగ్ న్యూస్ ‘ గుంటూరులో హోటల్ భవనం పై నుండి దూకి ఒకరు ఆత్మహత్య. భగ్గుమన్న సీమాంధ్ర.’ స్క్రోల్ అవుతోంది. ఆ వెంటనే బుల్లితెర అంతా పరుచుకుని పెద్ద పెద్ద అక్షారాలతో ఉన్న అదే వార్త చూపుతూ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తర్వాత రెండు రోజుల వ్యవధిలో నలుగురు ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు మరో ..’ న్యూస్ రీడర్ గొంతులో బాధతో కూడిన జీర.. పాత దృశ్యాలు చూపుతూ.

ఆటో నెలసరి వాయిదా కట్టాలి. మరచిపోయి వెళ్ళిన కాగితాలు తీసుకోవడం కోసం ఆ దారిన వెళ్తూ ఇంటికి వచ్చిన శంకర్ వార్తలు వింటూ ఆ కాగితాలు తీసుకున్నాడు. వెళ్ళ బోతుండగా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అతని కాళ్ళకు బ్రేక్ వేసింది. అలా టీవి చూస్తూ నుంచున్నాడు. అంతలో అన్నను చూసిన రజిత

‘ఏందే గిప్పుడచ్చినవ్’ అడుగుతూ రిమోట్ అందుకుంది. చానల్ మార్చింది.

తెలంగాణా ఇంకా ఇవ్వడం లేదని మనస్తాపంతో ఓ చేనేత కార్మికుడి ఆత్మహత్య. అతని భార్యా బిడ్డల్ని చూపుతూ వాళ్ళ హృదయ విదారక రోదన వేదన చూపుతూ.. ‘ ఒక్క క్షణం అలా చూసి తర్వాత చానెల్లో వచ్చే సీరియల్ పెట్టింది.

గుండెల్ని కలచివేసే ఆ దృశ్యాలే కళ్ళలో కదలాడుతుండగా తల వంచి రెండు కళ్ళ మధ్య గట్టిగా వత్తుకుంటూ శంకర్. తననే ఎగాదిగా చూస్తున్న చిన్న చెల్లి రజిత చూపులను తప్పించుకుంటూ ఎవరో తరుముతున్నట్లు గబగబా అవతలికి నడిచాడు శంకర్. ఆటో నడుపుతున్నా మనసు పరి పరి విధాల ఆలోచిస్తూ పరుగులు పెడుతోంది. ఏడాది క్రితం తన మానసిక స్థితి, ఆలోచించిన తీరుగుర్తొచ్చి, గతంలోకి లాక్కెళ్ళింది అతని మనసు

*** **** ****
ఆ రోజు ఎప్పటికన్నా ముందే ఇంటికి చేరాడు శంకర్, కాస్త తలనొప్పిగా ఉండడంతో. ఎత్తి పెట్టి ఉన్న ప్లాస్టిక్ నవారు మంచాన్ని వాల్చాడు పడుకుందామని. పడుకోబోతూ పక్కనే ఉన్న ఎత్తు చెక్క పీట మీది రిమోట్ అందుకున్నాడు. టివిలో ఏదో సీరియల్ వస్తోంది. ఎప్పుడు చూసినా ఈ జీడిపాకం సీరియళ్ళు.. కుట్రలు, కుతంత్రాలు, కోట్లాటలు .. కన్నీళ్ళు.. నిండానింపుకున్న ఈ సీరియళ్ళు మనిషి జీవితాల్లో ఉన్న కస్టాలు కన్నీళ్ళు చాలవన్నట్లు ఇవీ కుండలకు కుండలు నీళ్ళు తోడేస్తూ .. ఇలాంటివి చూడొద్దని చెప్పినా ఎప్పుడూ ఇవేపెడతారు మనసులో అనుకుంటూ వార్తా చానెల్ పెట్టాడు.

‘అన్నోచ్చిండు ‘ బీడీలు చేస్తూ అరిచింది చిన్న చెల్లి రజిత

‘ అప్పుడే వచ్చినవ .. అయ్యో ఇంకా అన్నంకాలే ‘తన ఒళ్లో చేట పక్కన పెడుతూ హడావిడి పడింది పెద్ద చెల్లి సవిత

‘కానీ ..తీ.. కొంచెమాగి తింట ‘ అంటూ టివి చూడడంలో మునిగిపోయాడు శంకర్

‘… ఆత్మబలిదానం చేసుకున్న ఎంబిఎ విద్యార్థి లూనావత్‌ బోజ్యానాయక్‌. అతని ఆత్మార్పణతో ఓరుగల్లు గొల్లుమంది. ఇక తెలంగాణ రాదేమోనని మనస్తాపం చెందిన విద్యార్థ్ధి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని పట్టపగలే నడిరోడ్డుపై నిప్పంటించుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ అసువులు బాయడంతో తెలంగాణవాదులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి అతి సమీపంలో ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాల ఎదురుగా ఈ సంఘటన చోటు చేసుకోవడం తెలంగాణ వాదులను తీవ్రంగా కలిచి వేసింది.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ ఉద్యమ తారలు మంటల్లో నిలువెల్లా కాలిపోతున్నాయి. పదవుల కోసం పాకులాడే నీతిలేని నేతలకు కనువిప్పు కలగాలని కలలుగానే కుసుమాలు కొవ్వొత్తిలా కరిగిపోయాయి. తమ చావుతోనైనా తెలంగాణ వస్తుందన్న ఆశతో కానరాని లోకాలకు తరలి వెళ్లిపోతూనే ఉన్నాయి. మరో ఉద్యమ కెరటం, పోరాట తరంగం ఆ జాబితాలో చేరింది. ఉన్నత చదువులు చదువుతూ బంగారంలాంటి భవిష్యత్ ను కాదని ఉద్యమాన్నే ఊపిరిగా శ్వాసించిన భొజ్యానాయక్ ప్రత్త్యేక రాష్ట్రం కోసం ప్రాణాన్ని త్రుణప్రాయంగా త్యజించాడు. తెలంగాణ తప్ప తనకింకేమొద్దని తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఉద్యమంలో నేను సైతం అంటూ ముందుకు దూకే ఈ పోరాటయోధులు కుహనా నేతల మాటల తూటాలకు నేలకొరిగారు. అమరవీరులుగా ఆకాశానికేగారు … ‘ గుండె బరువవుతుండగా చూస్తున్న టెలివిజన్ చానెల్ మార్చాడు శంకర్ .

తను ఎంతో ప్రేమగా పెంచుకునే బుజ్జి టామీ కుయ్ కుయ్ అంటూ వచ్చి వేళ్ళు నాకుతున్నా అసలు పట్టించుకోలేదు. ఎత్తుకొమ్మని గారాలు పోతున్నా దాన్ని ఎత్తుకుని ఒళ్లో కూర్చో పెట్టుకోలేదు. కళ్ళు ఆర్పకుండా గుడ్లప్పగించి టివి తెరని అంటిపెట్టుకుని చూస్తూనే ఉన్నాయి.

‘బిడ్డా ఎంతపని చేసినావ్ అంటూ అతని తల్లిదండ్రులు చేసిన ఆక్రందన, ఆవేదనతో యావత్ తెలంగాణ జాతి తల్లడిల్లింది.. ‘ న్యూస్ రీడర్ గొంతులోనూ ఆవేదన ద్వనిస్తుండగా. బోజ్యానాయక్ మృత దేహం పై పడి ఆ తల్లి చేసే హృదయ ఘోష కంటనీరు తెప్పిస్తుండగా మరో చానెల్ మార్చాయి అతని వేళ్ళు .

టీడీపీ నేతల ఇళ్లు, డీసీసీ కార్యాలయం విగ్రహాలను టార్గెట్‌ చేస్తు తెలంగాణవాదులు రాళ్ల వర్షం కురిపించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నేతల ఆస్తులపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలను చించివేశారు. అంతిమయాత్ర చివరివరకు జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. ఆందోళనకారులు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో చేరుకుని రాళ్లతో పెద్ద ఎత్తున దాడి చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్‌ చేశారు. ‘ శంకర్ చేతిలో రిమోట్ అతని మనసులాగే అస్థిమితంగా కదలాడుతూ చానెల్ మారుస్తూనే ఉంది.

‘నేల రాలిన మందారాలు మళ్లీ పూయవు. నింగికెగిసిన తారలు నేలకు దిగిరావు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి తెలంగాణా రాష్ట్రం ప్రకటించాలని తెలంగాణ పోరుగడ్డ ముక్తకంఠంతో నినదిస్తోంది. ఉద్యమ వీరులారా నిరాశ వద్దు. లక్ష్యం సిద్దించే వరకు ఐక్యంగా పోరాడదామంటూ మరింత స్పూర్తిని నింపుతోంది.’ ఇంకా ఎన్ని దినాలో ఇట్లా.. ఉద్యమ సెగల్లో ఇంకా ఎంతమంది మాడి మసై పోవాల్నో మనసు బాధగా మూలిగింది

మరో చానెల్ లో తెలంగాణా కోసం ఆత్మ త్యాగం చేసిన బోజ్యానాయక్ ని పొగుడుతూ అతని భౌతికకాయంపై పోటీలుపడి నిలువెత్తుదండలు వేస్తూ, నివాళి అర్పిస్తూ అధికార, ప్రతిపక్ష నేతలు. ఆ వెనకే తెలంగాణా కోసం ఆత్మ బలిదానం చేసుకున్న బోజ్యానాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాప దృశ్యాలు
అదృష్టవంతుడివిరా, నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చచ్చి బతికావురా భోజ్యా .. నిన్నటివరకు నీవెవరో ఎవరికీ తెలియదు. నీవు చదివే కాలేజీలోనే అందరికీ తెలిసి ఉండక పోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వో హీరో. అందరి నోటా నీ పేరే. ఏ చానెల్ చూసినా నువ్వే. ఒకప్పుడు నన్ను హీరో అనేవాడు నాయన. కానీ ఇప్పుడు నా బతుకు జీరో ప్చ్ .. శంకర్ మనసు బాధగా మూలిగింది. అతనిలో ఏదో ఏదో వెలితి క్షణ క్షణానికి పెరిగిపోతూ .. . నాయిన ఉన్నప్పుడు ఎట్లుండేవాడు. ఎన్నడన్నా ఇట్లా అవుతదనుకున్నాడా.. ఒక్కగానొక్క కొడుకని బాగా చదివించాలని, గొప్పవాడిగా చూసుకోవాలని కలలు గన్నాడు ఆయన. ఆ ఒక్కడి అర్ధాంతర మరణం తమ జీవితాల్ని పాతాళంలోకి తోసేసింది. తన చదువు ఏడవ తరగతితోనే ఆగిపోయింది. తనని ఇంగ్లీషు మీడియంలో ప్రైవేటు బడిలో చేర్చి ఆడపిల్లలని తెలుగు మీడియంలో ప్రభుత్వ బడిలో చేర్చాడు తండ్రి, తను చేసిన కుల వృత్తి తనకి ఎన్నడూ నేర్పలేదు. నాయినకు సాయం జేయరాదురా అని అమ్మ ఎప్పుడన్నా అంటే, ఎందుకే ఆనికి ఈ పనులు. అన్నిటికి మిషిన్లెనాయె నాకే చేతినిండా పనిలేకపాయే. మనలెక్క గొర్రె తోక బెత్తెడు బతుకానికెందుకు? మంచిగా సదుకో కొడుకా.. .. హీరోలెక్క రాజాలాగా బతకాలె అనేవాడు. ఎంత కష్టమైనా ఎన్నడూ అది తనకి తెలియనీయలేదు.

అప్పుడు తల్లి, అక్క చెల్లెళ్ళు ఏనాడు గడప దాటి ఎరగరు. బంధు మిత్రులతో ఎప్పుడూ కళ కళలాడేది. ఇంటి పెద్ద మరణం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉండడానికి పెద్ద బలగమే ఉన్నాఅంతా ఆయన తోటే దూరమయ్యారు. దగ్గరయితే ఎక్కడ అతుక్కుపోతారోనన్న భయంతో. చిన్న మేనమామ ఒక్కడే అప్పుడప్పుడూ ఒచ్చి పోతుంటాడు. శంకర్ బడి మానతానంటే తల్లి ఒప్పుకోలేదు. అట్లాగని ఎవరి సాయమూ కోరలేదు. పాత కాలం నాటి ఇంటిని కొంత కిరాయికి ఇచ్చింది. ఓ ప్రయివేటు పాఠాశాలలో ఆయాగా చేరింది. అక్క చెల్లెళ్ళు బడి మానేశారు. పక్కింటి వాళ్ళ దగ్గరఎప్పుడో సరదాగా నేర్చుకున్న బీడీలు చేయడం మొదలు పెట్టారు. తనకి అది నచ్చలేదు. తను మగవాడు. మగవాడే కుటుంబాన్ని నడిపేది. నాన్నలా కుటుంబాన్ని నడపాలి. సినిమాల్లో చూసినట్లు ఎన్ని కష్టాలు పడి అయినా అక్కాచెల్లెళ్ల పెళ్ళిళ్ళు చెయ్యాలి. తను హీరో అవ్వాలి. అంటే తను పని చెయ్యాలి అనుకున్నాడు. అందుకే అమ్మ మాట వినకుండా తను నిర్ణయం తీసేసుకున్నాడు. బడి మానేశాడు. కొన్నాళ్ళు కిరాణా దుకాణంలో పని చేశాడు. తర్వాత ట్రాక్టర్ షెడ్లో పనిచేశాడు. అక్కడే ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆటో అద్దెకు నడిపాడు. చివరికి ఎవరెవరినో పట్టుకుని లోను తీసుకుని ఆటో కొన్నాడు. రేయింబగళ్ళు కష్టపడి సంపాదించినా ఏముంది అక్క పెళ్లి చేయగలిగాడు అంతే. అందుకు తను ఎంత తిప్పలు పడుతున్నాడు..

వీడు కొద్ది క్షణాల్లో హీరో అయిపోయాడు. తను అలా అవాలంటే .. భోజ్యా స్థానంలో తానుంటే .. ఆ ఊహే అతనికి బలమిస్తూ .. క్షణం క్రితం భోజ్యా తల్లిదండ్రుల వేదనను చూసి ద్రవించిన శంకర్ హృదయాన్ని కఠినం చేస్తూ.. ఆ ఆలోచన కొండచిలువలా అతని మస్తిష్కాన్ని చుట్టేస్తూ ..పూర్తిగా ఆక్రమించేస్తూ .. తన వాళ్ళంతా మసక మసకగా.. నెమనేమ్మదిగా వాళ్ళ రూపాలు మాయమవుతూ .. టివి మోగుతూనే వుంది. భోజ్యానాయక్ అంతిమ యాత్ర దృశ్యాలు ఇంకా చూపుతూనేఉన్నారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వరకు వచ్చింది. కొందరు నాయకులు అక్కడకు చేరి పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పిస్తున్నారు. భోజ్యా అమర్ రహే నినాదాలు మిన్నంటుతున్నాయి.

‘అన్నమయిందిరా పెట్టుమంటవా’ తల్లి పిలుపు చెవిన పడలేదు. ‘ఏందిరా దయ్యం పట్టినోడిలెక్క ఉలుకు లేదు పల్కు లేదు ‘ ఆయాసపడుతూ తల్లి అనసూయ

‘అన్నా.. మా వదినె కండ్లల్ల మెదులుతాందా’ చెవిలో గుస గుస లాడినట్లుగా రజిత మాటలకు ఉలిక్కిపడి ఓ క్షణం అందరినీ తరచి చూశాడు.

‘ఆలు లేదు సూలూ లేదు. ఏందే నీ పరాచికాలు ‘ కసిరింది తల్లి

‘అన్నా, కాళ్ళు కడుక్కరాయే అన్నం బెట్ట్టిన’ పళ్ళెంలో అన్నం పెట్టి కూర వేస్తూ సవిత

‘మీరు తిన్నరా ‘ పెదాలపై నవ్వు పులుముకుని అడిగాడు ఎప్పుడూ లేనిది విధంగా . ఇవాళ కొత్తగా అడుగుతున్నాడే అని ఆశ్చర్యంతో చూసి, లేదన్నట్లుగా తలూపింది రజిత.

అందరం ఒకేసారి తిందాం అంటూ మరో షాక్ ఇచ్చి లేచి వెళ్లి కాళ్ళు కడుక్కోచ్చాడు శంకర్. ఎప్పుడూ చిరాకు పడే అన్న మాటలు విని చెల్లెళ్ళు సంబర పడిపోయారు. మూలన నులక మంచం పై నడుం వంగి పడి ఉన్న నాన్నమ్మ కేసి తిరిగి ‘ఓ ముసిల్దానా తిన్నవాయే’ పలుకరించాడు. ఆయాస పడుతున్న తల్లిని మందులు సరిగ్గా వాడుతుందో లేదో వాకబు చేశాడు. కొడుకు తీరు చూసి ఆనందపడింది ఆ తల్లి. అంతలోనే ఓ సరదా లేదు. సంబరం లేదు. చిన్నతనంలోనే మోయలేని భారం, బాధ్యతలు మీదపడి లేని పెద్దరికం మీదేసుకొని తిప్పలు పడుతున్నాడని మనసులో బాధపడింది కొడుకు పరిస్థితికి.

అన్నం పళ్ళెం తీసుకుని అన్న పక్కన కూర్చుంటూ ‘తెలంగాణ అస్తదాయే ‘ చనువుగా అడిగింది చిన్న చెల్లి రజిత

‘ఏం తెలంగాణనో.. ఏవో .. ఊకె బందులు .. బస్సులు బందులు … ఊర్లల్ల లోల్లి .. అదొచ్చినా రాకున్నా మన బతుకులు ఇంతేగదా .. ‘దగ్గుతూ నిర్లిప్తంగా తల్లి

అన్నకి మంచినీళ్ళ చెంబు పెడుతూ ‘అట్లంటే ఎట్లనే మన తెలంగాణ మనకు కావాలె. మన నౌకరిలు, కొలువులు మనకే కావాలె’ పెద్ద చెల్లి సవిత గోనుగుతున్నట్లుగా. పిల్లి పిల్లల మియావ్ మియావ్ అరుపుల్లో కలసిపోతూ ఆమె సన్నని గొంతు. ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ప్రయివేటుగా పదవతరగతి రాస్తున్నారు. తెలంగాణ వస్తే ఏదైనా చిన్న ఉద్యోగం వస్తదేమోనని ఆమె ఆశ.

‘ఓ పోరి, గా పిల్లినావలికి దోలు’ మూలనున్న ముసలమ్మ ఆజ్ఞాపించింది. అప్పుడే కంటి మీద పడుతున్న కునుకును ఆ పిల్లి పిల్ల అరుపులు భంగం చేయడంతో .

‘చిన్న మామ అస్తనన్నడు. ఈ వార్దంక అచ్చెదున్దె .. , ఇగ రాడేమో ‘ అన్న ముందుకి పచ్చిపులుసు గిన్నె జరుపుతూ సవిత

‘ఇంకా ఉగాదన్న రాలే . అప్పుడే ఎండ దంన్చుతాంది గద. సల్లబూట అస్తడేమో’ చిన్నగా దగ్గుతూ తల్లి

‘పొద్దుగాల్ల బొంబయిరాజయ్య మామచ్చి పోయిండు. ఆల్ల తమ్ముని మరదలు కొడుకు ఉన్నడట. మన కులప్పని చేస్తున్నడట నిజామబాదకాడ. పిల్లగాడు సక్కదన్మ్గున్నడు. మీ రెండో పిల్లకి మంచి జోడి అయితడు అంటున్నడు’ నిదానంగా చెప్పింది అనసూయ.

‘చిన్నక్కకు పెళ్ళా.. ‘ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి రజిత.

‘దానిదైతే నీవంతు వస్తదనా.. ‘ మంచం మీద నుంచి ముసలమ్మ లేచి కూర్చుంటూ.

‘ఓ ముసిల్దానా, ఉషారైనవ్.. చెప్పే, నేనెల్లిపోతే ఎవర్జేస్తరే నీకు .. అందుకే నేనిప్పట్ల నిన్నొదల’ రజిత

‘ఏ ఆగేపోరి, విషయం మాట్లాడంగ.. ‘ అని కొడుక్కేసి తిరిగి ‘ఆ పిల్లగాని తల్లి పాణం మంచిగ లేదట. ఇంట్ల పొయ్యి ఎలిగిచ్చేటోల్లు కావాల్నని జూస్తున్నారట. మా కొడుకచ్చినంక మాట్లాడుతానని జెప్పి ఆమామకు సాగనంపిన ‘ఆయాసపడుతూ చెప్పింది తల్లి అనసూయ.

అక్క పెళ్ళికి చేసిన అప్పులు ఇప్పుడిప్పుడే తీరుతున్నాయ్. రెండు రోజుల్ల పురుడుకు తిస్క రావాలే, ఆ కర్సు ముందటున్నది . చేతిల కుంటి గవ్వ లేదు . ఏమ్బెట్టి జేత్తమే .. ‘ శంకర్ మనసులో మాట పైకే వచ్చింది

‘పైసా కోసం పికర్ జేయొద్దన్నడు. పిల్లను కొంటబోయి ఆల్లిన్టికాడ లగ్గం జెసుకుంటరట’ నెమ్మదిగా చెప్పింది అనసూయ.

‘నడిపిదాని లగ్గమయితే అటేనుక రెండేన్లు ఆగి చిన్నదాంది చెయ్యొచ్చు.. కానీ .. ‘ సాలోచనగా శంకర్

‘ఆదాగుతాది .. ? ముందు దానికే జెయ్యాలె ‘ వాళ్లమాటలు విని చిన్న మనుమరాలిని ఉడికిస్తూ పరాచికంగా వాళ్ళ నాయనమ్మ

‘ఒసే ముసిల్దానా … మూలకు పడుండక ముక్కులు, నీల్గులు చానయితాన్నయ్.. ఆ .. ‘ నాయనమ్మ మీదికి వెళ్తూ రజిత. ముసి ముసి నవ్వులు నవ్వుకుంది ముసిలి.

‘అరే శంకిరి .. నీ పిల్ల యాడున్దిరా ‘ ముసలమ్మ అన్నట్టుగా అనుకరిస్తూ రజిత అన్న కేసి తిరిగి. అంతా ఫక్కుమన్నారు. ‘దీని అల్లరెక్కువయితాంది’ ముద్దుగా విసుక్కుంది తల్లి.

శంకర్ మనసులో జానకి మెదిలింది. తన ఆటోలోనే రోజూ కాలేజికి వెళుతుంది. తనతో చాలా స్నేహంగా ఉంటుంది. సరదాగా జోకులేస్తుంది. అయినా నేను ఇట్లా ఆలోచిన్చడమేమిటి . నా దారి వేరు కదా అనుకున్న శంకర్ ఆలోచనల్లోంచి జానకి మాయమైంది. మళ్లీ భోజ్యానాయక్ చొరబడ్డాడు. టివి కేసి చూశాడు.

బోజ్యశవయాత్ర సాగుతూనే ఉంది. ఉద్రిక్తమైన విద్యార్థులు అక్కడికి వచ్చిన అధికార పార్టీ నాయకులపై చెప్పులు విసురుతున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై చెప్పులు, రాళ్ళతో విద్యార్ధులు దాడి చేశారు. మంత్రి ప్లెక్సీను ద్వంసం చేశారు విద్యార్ధులు. పరిస్థితి రాను రాను ఉద్రిక్తమవుతోంది. పోలిసులాటి ఛార్జ్ మొదలయింది .

అన్నం ముద్ద గొంతులోకి దిగడం లేదు. వేళ్ళు పళ్ళెం లోని అన్నాన్ని కెలుకుతున్నాయి. ఏందిరా అప్పటికెల్లి జుత్తాన్న, చెల్లె లగ్గం ఈ యాడాది కాకుంటే మల్లెడాది జేద్దంలె. దానికోసం ఫికర్వడకు. దందేమంత అయిసయిన్దాని ‘ సముదాయిస్తూ తల్లి .
తల్లికేసి కొన్ని క్షణాలు మౌనంగా చూసి ఎవరో తరుముతున్నట్లు గబగబా అన్నం తినేశాడు. అందరూ అతన్ని వింతగా చూశారు. ఏంటో , ఇవాళ అంతా కొత్తగానే కనిపిస్తున్నాడు అనుకున్నారు

అంతలో చిన్న మేనమామ చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. సవిత వెళ్లి కుండలో నీళ్ళు ముంచుకొచ్చి ఇచ్చింది. తమ్ముడికి భోజనం వడ్డించమని చెప్పింది అనసూయ .

‘తినోచ్చిన్నే. . ‘. ‘ఆ.. ఎప్పుడు తిన్నవుర ? తింటే తిన్టివి తీ .. జరంత తిను’ అంది అప్యాయంగా అక్క

తింటూ తనూ వార్తలు చూస్తూ.. ‘థు .. నీయవ్వ .. గీ నాయకులు పోరగాల్ల పానాలు తీస్కుంట కన్నోళ్ళ గోసవోసుకుంటున్నరు’ మామ కాశిరాం భుజం మీది కండువా తీసి మొహానికి పట్టిన చెమట తుడుచుకుని మళ్లీ భుజం మీద వేసుకుంటూ .

‘వాళ్ళేం చేసిన్రు ఈల్లు పానం తిస్కుంటే’ ఎక్కుపెట్టిన బాణంలా రజిత

‘అగో.. జూడురి ఎట్లా చుపుతాన్రో .. ఏం గొప్ప కార్యం జేసిండని ..? ఆన్ని అంతగనం జూపుడు . కన్న పాపానికి ఎల్లకాలానికి కడుపు కోత వెట్టినన్దుకా .. ‘ తన నిరసనను తెలియజేసి మళ్లీ తానే

‘తెలంగాణం గావాలె, మన రాజ్యం మన్మేలాలే .. కానీ దాని కోసం బతుకులు బలివెట్టుడా .. ఏదన్న బతికి సాదిచ్చుకోవాలే. సచ్చి మట్టిల కల్సినంక ఇంక ఏమ్జేస్తరు. కొట్లాడాలే. కడదాంక కొట్లాడాలే ‘ అన్నాడు కాశీరాం.

‘అదేందే మామ అట్లనవడ్తివి ? ఆడు మాములుగ సస్తే ఎవడన్న వస్తర ? గిప్పుడు జూడు ఆని సావు అల్లకల్లోలం లేపే. ముఖ్యమంత్రి కాడికెల్లి ఆపార్టోడు ఈ పార్టోడు అని లేకుంట పెద్ద పెద్దోళ్ళంతా వచ్చి దండలేయవడ్తిరి. ఆని బతుక్కు అంతకన్న ఎం గావాలె. జన్మ ధన్యమైంది ‘ కొంచెం ఉద్రేకంగా శంకర్

‘ఓరి పిస్సోడా .. మీరంత గిట్ల దిమాక్ లేకుంట జేస్తున్నారు. మీ సావును ఆల్లు రాజకీయం జేస్తున్నరు . సావన్న జస్తం గని అని మీటున్గుల్ల మస్తు జెప్తరు. గా పెద్దోళ్ళు ఒక్కడంటే ఒక్కడన్న జచ్చిండా ..? ఆల్ల కొడుకులు బిడ్డలు, అల్లుండ్లు, కోడండ్లు, అన్నలు, తమ్ముండ్లు ఎవ్వడన్నా సచ్చిన్రా .. లేక పాయె .. ‘ తిన్న చేయి కడిగి పళ్ళెం ముందుకు తోసి శంకర్ కళ్ళ లోకి సూటిగా చూస్తూ. ఆ చూపుల ధాటిని ఎదుర్కోలేక కళ్ళు దించుకున్నాడు శంకర్

‘గా జమానల మీ నాయిన బీ తెలంగానం కోసరం మస్తు తిరిగిండు. గప్పట్ల పోలీసు కాల్పుల్ల సచ్చిన్రు గని గిట్ల పానాలు తీస్కోలె ‘ మంచం మీదనున్ది ముసలమ్మా కంచు గొంతుకతో

‘అవునా..! మా నాయన తిరిగిండా .!.” ఆశ్చర్యంతో తలెత్తి శంకర్ . కులవృత్తి చేసుకుంటూ కుటుంబంలో నలుగురికి అండగా బతికిన తండ్రి తెలుసు. ఉద్యమాలలో తిరిగిన విషయం ఇప్పుడే కొత్తగా వింటున్నారు శంకర్ అతని చెల్లెళ్ళు .

అంతలో శంకర్ చిన్న నాటి స్నేహితుడు సత్యం వచ్చాడు. ‘ఇంటి ముంగట ఆటో జూసి ఇంట్లనే ఉన్నట్టున్నవ్ అని కలిసిపోదమని వచ్చిన ‘ చెప్పాడు

‘పట్నం కెల్లి ఎప్పుడచ్చినావ్ ర ‘ఆత్మీయంగా లేచివెళ్ళి మిత్రుడిని అలుముకున్న శంకర్

‘నిన్ననే వచ్చిన. గొడవలతోని కాలేజి బందు, హాస్టళ్ళు బందు బెట్టిన్రని ఇంటికోచ్చేసిన. నాలుగురోజులుండి పోతనని’ సత్యం సవిత కేసి ఓర చూపు చూస్తూ. కళ్ళలో కళ్ళు కలవడంతో సిగ్గు పడిన సవిత మామ తిన్న ప్లేటు తీసుకుని బయటికి వెళ్ళింది.

‘మంచిగున్నవ బిడ్డా ‘ పలుకరించింది శంకర్ తల్లి

గడప లోపలికి కూర్చొని సవిత చాట అందుకుని చకచక వేళ్ళు కదిలి పోతుంటే బీడీలు చుడుతోంది . రజిత చేసిన బీడీలకు దారం చుట్టడం మొదలు పెట్టింది. అనసూయ ఆకుల కట్ట విప్పి కత్తిరించడానికి సిద్దమవుతూ. గజిబిజి ఆలోచనలతో ఉన్న శంకర్ చేతిలోని రిమోట్తో సౌండ్ తగ్గించబోయి మరింత పెంచాడు.

‘ఒరే ముందది బందువెట్టు ‘ అరిచినట్టుగా మామ. ‘ఏమైంది ‘ ఉలిక్కిపడి శంకర్

‘ఏమవుడేన్ది? ఊకె చూపెట్టిందే చూపెట్టుకుంట రెచ్చగొట్టే మాటలు చెప్పు కుంట ఉడుకు మీదున్న పోరగాల్ల దిమాక్ ఖరాబ్ జేస్తున్నరు. ఒక సావయ్యిందంటే ఒక్క దానేన్క ఒక్కటి ఓ వారం పదిదేసాలు పీనుగులు ఎల్లుడేనాయే .. ‘ బాధగా మామ

‘నిజమే, ఆ దృశ్యాలు యువతని ప్రేరేపిస్తున్నాయి. అనాలోచిత చర్యలకు పాల్పడేలా వత్తిడి చేస్తున్నాయి. బలహీన మనస్కులు ఓ బలహీన క్షణంలో ప్రాణాలు తీసుకుంటున్నారు ‘ సాలోచనగా సత్యం

‘అది ఎ పార్టి గాని ఆనికి గావాల్సింది తెలంగాణ గాదు గద్దె. నాయకులు ఎవ్వలైనా గాని ఆల్ల రాజకీయం ఒక్కటే. ఆల్లు ఒక్క దిక్కే జూస్తరు. గద్దె మీన ఎక్కెతందుకు ఎంతైన జేస్తరు. లోల్లిలు పెడ్తరు. తమాషా జూస్తరు. ఎత్తులేస్తరు జిత్తులేస్తరు. కప్ప దుంకుడు ఆడ్తరు . ఏదన్న జేస్తరు. మీ అసొంటో ల్లకు చెర్ల వలేసినట్టు ఏస్తరు. మాయజేస్తరు. మెత్తని కత్తోలె ప్రాణాలు మింగుతరు. మనోల్లకు అది ఏర్కలేక ఆల్లతోని బోతరు. చిట్టచివరికి ఏమైతది ..? ఆల్లు గద్దె మీన. ఈళ్ల బతుకులు మట్టిల కలసిపోయి .. కడుపుకోత మిగిలిపోయి .. ఇన్నెండ్లయిన పోరగాల్లకు ఇది ఎట్ల సమాజ్ గాకోచ్చిందో .. ‘ తల గోక్కుంటూ మామ

‘అవును, ఆల్లు పైకి చెప్ప్తిదానికి ఎనక చేసేదానికి మస్తు ఫరక్ ఉంటది. ఈ చావులకు బాద్యులు ఎవరు ‘ కాశిరాం మాటలకు ఊతం ఇస్తూ సత్యం ప్రశ్న

‘నక్కజిత్తులున్తయ్ .. ఎత్తులు ఎస్తయ్ .. వల పన్నుతయ్, ఉచ్చు వేస్తయ్ .. మనం అన్ని ఎరుక జేసుకుంట పోవాలె .. సచ్చుడు బందు గావాలె. తెలంగాన గడ్డ పోరాటాల అడ్డ. వీరుల గన్న నేల. విజయమో వీర స్వర్గమో అని పోరాడాలే . పోరాడుకుంట పోరాటంల పానం బోతే అమరుడంటరు. కాని గిప్పుడు జరుగుతున్నదేంది .. తెలిసి తెలియక ఉద్రేకంతోటో, ఆవేశంతోటో పాణం దీస్కుంటే దానికి ఆత్మ బలిదానం అని, అమరుడయ్యిండని పెద్ద పెద్ద మాటలు అనవడ్తిరి. గా శ్రికాంతాచారి చావు కాడి కెల్లి వందల్ల పానాలు గాల్లో గల్సే. ఈల్లంత యుద్ధం జేయలే . పిరికోల్లలెక్క పానం దిస్కున్నారు. గిసొంటి పిరికి పోరగాళ్ళను అమరుడనుకుంట ఆల్లను అటు దిక్కు తోల్తున్నరు’ ఆ మాటల్లో ఆవేదన కాశిరాం మొహంలోనూ ప్రతిఫలిస్తూ

‘చచ్చిన సింగం కన్న బతికిన కుక్క మేలు’ వారి సంభాషణలో పాలు పంచుకుంటూ బోసినవ్వుల ముసలమ్మ. ఆమెకేసి ప్రశంసా పూర్వకంగా చూశాడు శంకర్.

లోగొంతుకతో అన్న ఆమె మాటలు వినని సత్యం ‘ నిజమే, కాకా.. నువ్వన్నట్టు ఆత్మబలిదానాలు పిరికి పనే. నిజంగా పోరాటంలో చనిపోయినోల్లను అమరులని అనాలే. మరి ఈ పార్టిలోల్లు, పత్రికలోళ్ళు , టివి లోల్లకు ఇది తెల్వదా ఏందీ. నువ్వు చదువుకోకున్న ఎంత మంచిగా చెప్పినావ్. ‘ మెచ్చుకోలుగా కాశిరాం కేసి చూస్తూ

‘ఆత్మబలిదానాలతోటి తెలంగాణ రాదని ఇప్పటికే తేలిపాయె. కన్న తల్లిదండ్రులకు , తెలంగాణ తల్లికి కడుపు కోత మిగల్చకున్రి అని చెప్పాలె. పోరాడి తెలంగాణను సాధించుకుందామని అనాలే. తెలంగాణం కావాలనుకున్నోల్లంత తీరోదిక్కు కాకుంట కలిసి పోరాడాలే. లేకుంటే ఓడిపోతం.’ ఆలోచన, అనుభవం జోడించి కాశిరాం

ఆచార్య జయశంకర్ సారు కూడా కోరుకున్నది ఇదే. మనసులో అనుకున్నాడు సత్యం. జరుగుతున్న ఆ సంభాషణని శ్రద్దగా వింటూ తమ పని తాము చేసుకుంటున్నారు మిగతావాళ్ళు .

ఉన్నట్టుండి టైం చూసుకున్నాడు శంకర్ . ఓహ్ అన్కుంటూ లేచాడు. ‘మామా ఇయ్యాల్ల ఉండు’ అని చెప్పి ‘వస్తవార, సవారి ఉన్నది. బడి పిల్లలకు ఇంటికి తోల్కబోవాల’ అని సత్యంతో కలసి బయలు దేరాడు.

*** ***

ఆత్మహత్యలపై పుంఖానుపుంఖాలుగా వార్తా ప్రసారం. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా నాయకుల వ్యాఖ్యలు. చానెళ్ళలో చర్చలు, వ్యాఖ్యానాలు. సున్నితమైన అంశాలు కథనాలు ప్రసారం చేసేముందు తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించకుండా ఎట్లా ప్రసారం చేస్తున్నారు? వారిపై నియంత్రణ ఉండదా? లేకపోతే , స్వయం నియంత్రణ పాటించాలి. ప్రజలలో శాంతి సామరస్యాలు, సుహృద్భావ వాతావరణం నెలకొనేలా పాటుపడాలి కదా . తెలంగాణ అయినా , సీమాంధ్ర అయినా.. ప్రాంతం ఏదయినా … అది వారి బాధ్యత కాదా .. ఆలోచిస్తూ.. శంకర్ ఆటో బ్యాంకు ముందు ఆగింది.

“విధ్యార్థులంటె నేల తల్లి లాంటి వాళ్ళురా
జాతి భారన్నంత భుజాన మోసేటోళ్ళు రా
విద్యార్థి దశ నుండే విశ్వవిజేతలవుతారు రా
వివేకనందుడికి ఆనవాళ్ళు మీరు రా “
ప్రశ్నించెటోళ్ళు మీరు- ఆ ప్రశ్నకు బదులు మీరు
ప్రశ్న జవాబులతో -ప్రణాళికలు రాసెటోళ్ళు
బలిదానలు చేస్తు బూడిద కావొద్దురా
నడిపించేటోళ్ళు మీరు- తూలి పడితే ఎట్లారా?
మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నడువలేరురా
కన్నీళ్ళు తుడిచే మీరు తూలి పడితే కాటికెల్తే ఎట్లారా?
ఆవేశపూరితంగా ఆహుతైతే ఎట్ల రా… ‘
తెలంగాణ చందు పాటలు మైకులో వినిపిస్తూ. శంకర్ మెదడంతా ఆక్రమిస్తూ.. నినదిస్తూ ..

Tag Cloud

%d bloggers like this: