The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘ఒంటరి తల్లి’

దారి చూపిన ఒంటరి నక్షత్రం   

ఒకే ఒక్క సంతకం ఆయుధంగా నా యుద్ధం మొదలయింది .
ఇప్పుడు నావెనుక పెద్ద సైన్యం వేలు లక్షల సంతకాలతో.  రోజు రోజుకు నాకు మద్దతు తెలిపే  సైన్యం పెరిగిపోతోంది .  నేను విజయం అందుకోవాలని ప్రపంచం నులుమూలల ఉన్న భారతీయుల నుండి మెయిల్స్ . మెస్సేజ్ లు .  కొందరయితే ఏకంగా ఫోన్ చేస్తున్నారు . ఒక సామాన్యురాలికి ఇంత స్పందనా ..?!

అనూహ్యంగా ..
ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం,  ఉత్సాహం , ఉద్వేగం కలగాపులగంగా .. నా కూతురు కళ్ళలో దీపాలు వెలిగించగలనన్న నమ్మకం నాలో మరింత బలాన్ని పెంచుతూ … బహుశా ఈ సమస్య నా ఒక్కదానికే కాదు, చాలామంది  ప్రధానమైనదిగా భావించడం  వల్లేమో ..

ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నేకాదు. నాలాంటి సమస్యలు ఎంతోమంది మంది స్త్రీలే ఎదుర్కొంటున్నారని ఇప్పుడర్ధమవుతోంది .  అందుకేనేమో మార్పు కోసం వేసే నా అడుగులకు తోడుగా అడుగేస్తూ .. బాసటగా నిలుస్తూ ..  నాలో ఆత్మవిశ్వాసం  పెంపొందిస్తూ ఉన్నారని ఆలోచిస్తూ ఆరిన బట్టల్ని తీసి మడతపెడుతోంది  గాయత్రి.

కానీ ఆ పోలీసు ఆఫీసర్ ఎంత రూడ్ గా మాట్లాడాడు .  భాష భరించలేనిదిగా .. ఛి ..ఛీ .. ఎంత అసహ్యంగా మాట్లాడాడు  సమస్యని అర్ధం చేసుకోకుండా ..  చదువుకున్న వాళ్ళు కూడా  సంస్కారం లేకుండా అసభ్యంగా  మాట్లాడతారా .. ? మడతపెట్టిన బట్టలు సర్దుతూ . అప్పటికి ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్నే అయినా మళ్ళీ మళ్ళీ ఆమెలో తొంగిచూస్తూ .

హూ.. అలాంటి వాళ్ళని తల్చుకొని టైం వెస్ట్ చేసుకోవడం , బుర్రని పాడుచేయుకోవడం ఎందుకు అని వెళ్లి సోఫాలో కూర్చుంది . ఎదురుగా ఉన్న టీపాయ్ పై గమన  కోసం కొన్న లాప్టాప్ కనిపించడంతో  మెయిల్ చెక్ చేద్దామనుకుంటూ లేచి  లాప్టాప్ అందుకుంది గాయత్రి .  శని , ఆదివారాలు డాన్స్ క్లాసు పిల్లతోనే సరిపోతుంది .  మిగతా రోజుల్లో అయితే సాయంత్రాలు మాత్రమే వస్తారు .   పనుల్లోపడి రెండురోజులుగా మెయిల్ చెక్ చేసుకోలేదు .  మొన్నటివరకూ ఫోన్ వాడడమే గాని మెయిల్ , వాట్సాప్ , ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా జోలికే వెళ్ళేది కాదు . అలాంటిది ఇప్పుడు బాగా వినియోగిస్తున్నా .. అవసరం అన్ని నేర్పిస్తుందేమో , అలవాటు చేస్తుందేమో .. అనుకుంటూ మెయిల్ బాక్స్ తెరిచింది .

సంగీత కార్లేకర్ మెయిల్ .  ఓ .. మొన్ననగా పంపితే తన నుండి రిప్లై లేదని ఈ రోజు ఫోన్ చేసిందన్నమాట .. కొన్ని నిముషాల క్రితం మాట్లాడిన మహిళ మాటలే గుర్తొచ్చాయి గాయత్రికి .
వెంటనే అసలు ఇలాంటి ఆడవాళ్ళూ ఉంటారా .. ? అనే సందేహం మొలిచి ఆశ్చర్యంతో ఆమె మెయిల్ చూస్తోంది కానీ ఆవిడ మాటలే చెవుల్లో ..
 .
నిజంగా ఆవిడకి ఎంత ధైర్యం , ఎంత తెగింపు , ఎంత  ఆత్మవిశ్వాసం?  సమాజం నుండి వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే తెగువ , గుండె నిబ్బరం?! అవి  లేకపోతే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోగలిగేదా ..  ?! లేకపోతే పెళ్ళికాకుండా బిడ్డను కనిపెంచడమే కాకుండా .. ఆ బిడ్డ తండ్రిపేరు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదంటుందా . . ఆమె మాటలు వినగానే ఆ ధోరణి.కొంచెం అతిగాను  అరిగించుకోవడం కొంచెం కష్టంగానూ అనిపించినా ఆలోచిస్తుంటే  బాగున్నట్లుగా కూడా తోచింది గాయత్రికి .  ఎలాంటి సంకోచాలు, సందిగ్దాలు లేకుండా  తనకి కావలసింది తను అందుకోవాలనుకునే సంగీత  కార్లేకర్ తత్త్వం చాలా వింతగా , కొత్తగా విస్మయపరిచింది .
‘అమ్మా ఏమాలోచిస్తున్నావ్ ? నేనొచ్చి లైట్ వేసినా నీవు గమనించనే లేదు ‘ కూతురి ప్రశ్న .
చిన్నగా నవ్వేసి ‘ అమ్ములూ ఆవిడకెంత ధైర్యం .. ‘ అనాలోచితంగా
‘ఎవరికమ్మా ..  ఏమి చెప్పకుండా  నాకెలా అర్ధమవుతుంది ‘ షూ లేస్ విప్పుతూ గమన
‘ఓ .. అవును కదూ ..హూ .. ‘ చిన్నగా తనను తాను మొట్టికాయ వేసుకొని   ‘సంగీతా కార్లేకర్ అనే ఆవిడ ఢిల్లీలోనే ఉంటోందిట . ఇంతకుముందే ఫోన్ చేసింది . ‘ అంటూ ఎండ కోసం బయట పెట్టిన ఇండోర్ ప్లాంట్ ని తెచ్చి హాల్లో ఓ మూలగా పెట్టింది .
‘ఓ .. అయితే .. ?’ తనపని ఆపి తల్లికేసి చూస్తూ గమన
‘ఆవిడ పెళ్లికాకుండానే తల్లి అయిందట . కొడుకు పుట్టాడట .  బర్త్ సెర్టిఫికెట్ కి తండ్రిపేరు అడిగారట . నేను అవివాహితను . నా బిడ్డకు తండ్రిలేడని చెప్తే ఆ బిడ్డకు గార్డియన్ గా లీగల్ సర్టిఫికెట్ కావాలన్నారట .
తనకేసి తదేకంగా చూస్తున్న కూతురు చూపుల్ని తప్పించుకుంటూ  ‘ ఆ బిడ్డను నవమాసాలూ మోసి కన్నది నేను .  పెంచేది నేను . ఆ బిడ్డకు తండ్రిపేరు చెప్పకపోతే తల్లిని కాకుండా పోతానా ..? సహజంగానే నా బిడ్డకి గార్డియన్ నేను .  అది నా హక్కు అని కోర్టుకు వెళ్లిందట .    పెళ్లి చేసుకోకుండా తల్లి అయినప్పటికీ ఆ బిడ్డను తండ్రి కాదనుకుంటే బిడ్డ తల్లి  కస్టడీలో ఉన్నప్పుడు ఆమె గార్డియన్ అంటూ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందట ఢిల్లీ హై కోర్టు .  అప్పుడామె సుప్రీం కోర్టు ను ఆశ్రయించిందట .  సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందట .’   చెప్పి  కిచెన్ లోకి దారితీసింది గాయత్రి .
‘ సుప్రీం కోర్టు ఏమంటోందట ?’  ఆమె వెనకే వచ్చిన గమన  వేసిన ప్రశ్నకు చిరునవ్వుతో  ‘ ఆమె తనబిడ్డ తండ్రి ఎవరో చెప్పాలనుకుంటే చెప్తుంది. లేదంటే లేదు. అది ఆమెహక్కు అని చెప్పిందట సర్వోత్తమ న్యాయ స్థానం . తీర్పు చెప్పడమే కాకుండా ఆ బిడ్డ బర్త్ సర్టిఫికెట్ , స్కూల్ అడ్మిషన్ , పాస్పోర్ట్ ఎక్కడైనా తల్లిపేరు ఉంటె సరిపోతుందని చెప్పిందట .’  స్నాక్స్ ప్లేట్ లో సర్దుతూ చెప్పింది గాయత్రి

తల్లి కళ్ళలో ఆనందం చూసి ‘అమ్మా.. మనకీ ఢిల్లీ కోర్టు  అదే చెప్పింది కదమ్మా ..’ తల్లి చేతిలోంచి ప్లేటు అందుకుంటూ గుర్తు చేసింది గమన .
‘అవునవును, బహుశా ఆవిడే  ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుకి బాట వేసిందేమో .. ‘ సాలోచనగా ఆలోచిస్తూ చిన్న నవ్వుతో అంది గాయత్రి .
‘అమ్మా ..  నీకు నువ్వు  సాహసం ఊపిరులూదుకుంటూ నీ  ముందు నిలిచిన సవాళ్ళను ఎదుర్కొంటూ పోతున్నావు. కానీ ఆమె అలాకాదన్నమాట .  ఏటికి ఎదురీదే సాహసి.  తనకు తానుగా కొత్తదార్లేసుకుపోతూ సవాళ్ళను ఎదుర్కొంటోంది . ఎప్పుడైనా అంతేనేమో .. దారులు వేసేవాళ్ళు ఎన్నో సవాళ్లు , ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే ..  వాళ్ళు పరిచిన బాటలో మిగతావాళ్ళు సునాయాసంగా నడిచేస్తారు కదా .. ‘  కారప్పూస నోట్లో వేసుకుంటూ  అంటున్న పదిహేనేళ్ల కూతురి కేసి విస్మయంగా, విచిత్రంగా  చూసింది గాయత్రి .
తల్లీకూతుళ్ల మాటల మధ్యలో  గాయత్రి పక్కనున్న మొబైల్ మోగడం మొదలు పెట్టింది
ఎవరో చూద్దామని తీసి చూసింది గాయత్రి. కొత్త నంబర్ .
‘అమ్మా .. నువ్వు ఈ మధ్య ఫోనుల్లో చాలా  బిజీ అయిపోయావ్ ‘  అంటూ తానూ తల్లిపక్కకు చేరింది .
‘ ఏమోనే ..  ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు . కొందరు సపోర్ట్ చేస్తున్నారు .  కొందరు తామూ బాధితులమేనని తమ వ్యధ చెప్పుకుంటున్నారు .  కొందరు సలహా అడుగుతున్నారు . కొందరు తాము ఎలా ఎదుర్కొన్నారో చెప్తున్నారు .  రకరకాల మనుషులు . రకరకాల సమస్యలు ..’ అంటూ ఫోన్ చూస్తూన్న  గాయత్రికి ఎవరో తెలియని కాల్ తీసుకోవాలనిపించలేదు .  పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ మళ్ళీ  మోగుతోంది . ఎవరో మాలతీమాధుర్ పేరు చూపుతోంది ట్రూకాలర్ .  ఇది తాను గమనతో గడిపే సమయం కావడంతో ఒకింత అనాసక్తితోనే కాల్ తీసుకుంది గాయత్రి .
‘నమస్తే మేడం ..
ముందుగా మీకు అభినందనలు .
మీరు చేస్తున్న యుద్ధం చిన్నది కాదు .  ఒకప్పుడు నేనూ ఇలాంటి యుద్ధమే చేశాను . చివరికి విజయం సాధించాను . మీకు మీ అమ్మాయికి న్యాయం జరిగి తీరుతుంది ‘ అవతలి నుండి పాఠం అప్పచెప్పినట్లుగా గడగడా .
‘మీరు ‘ ప్రశ్నార్ధకంగా ఆగింది గాయత్రి
‘ఓ సారీ అండీ .. నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా ..  నా పేరు మాలతి .  హైదరాబాదు నుండి కాల్ చేస్తున్నాను . ‘
‘చెప్పండి ‘ హైదరాబాద్ పేరువినగానే గాయత్రికి తల్లిదండ్రులు కళ్ళముందు మెదిలారు .   నాన్నకి ఏమాత్రం బాగుండడం లేదు . చెల్లి దగ్గర హైదరాబాదులోనే ఉన్నారు. ఆయనకి నీ మీద బెంగ..ఒకసారి వీలయితే వచ్చిపోరాదు . ఉదయం ఫోన్లో చెల్లి చెప్పిన విషయం మదిలో మెదిలింది.
అవతలినుండి ‘మేడం మీ అమ్మాయి పాస్పోర్ట్ కోసం ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో ఇప్పుడే చేంజ్ . ఆర్గ్ ద్వారా తెలిసింది .  నా సంపూర్ణ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది .  ఆ .. చెప్పలేదు కదూ .. నేనూ సింగల్ పేరెంట్ నే .. మా అబ్బాయికి స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ లో తండ్రిపేరు లేకుండా ఎక్సమ్ రాయనివ్వనంటే  కోర్టుకు వెళ్ళా .. నిజానికి వాడు పుట్టిన కొంత కాలానికి నాతో కలసి నడుస్తూస్తానని బాస చేసిన వాడు తన దారి తాను చూసుకున్నాడు .  సహజీవనంలో ఉండాల్సింది ఒకరంటే ఒకరికి ప్రేమ , నమ్మకం , సడలని విశ్వాసం . అవేవి లేని అతను నన్ను మోసం చేస్తున్నాడని అప్పట్లో గ్రహించలేకపోయాను . అతని ప్రేమంతా నా వెనుక ఉన్న ఆస్తి , అంతస్తు అని అతని ద్వారానే తెలిసిన మరుక్షణం అతన్ని క్షమించలేకపోయాను.  అది మా అమ్మానాన్నలకు నచ్చకపోయినా  స్వతంత్ర జీవితమే ఎంచుకున్నాను… ‘
అవతలనుండి వింటున్నారోలేదో సందేహం వచ్చి ‘ సారీ మేడం .. మిమ్మల్ని విసిగిస్తున్నానేమో ..’ సందేహిస్తూ మాలతి
‘ఫర్వాలేదులెండి .. అసలు సమస్యని ఎలా అధిగమించారో చెప్పనే లేదు ‘  అంటూ తరగాల్సిన కూరగాయలు తీసి ముందు పెట్టుకుంది గాయత్రి . అంతకు ముందు లేని ఉత్సాహం గాయత్రి గొంతులో .
‘ఆ అక్కడికే .. గడచిన కాలంలోకే వస్తున్నానండీ .. మా అబ్బాయి స్కూల్ లో మొదట నా పేరు రాయడానికి ఒప్పుకోలేదు . అతనికి తల్లీ  తండ్రీ నేనే అని వాదించిన మీదట నా పేరు రాశారు తండ్రిపేరు లేకుండా . మా వాడు 10కి వచ్చాడు . బోర్డు ఎక్సమ్ కి ఫీ కట్టాం . అప్లికేషన్ లో తండ్రి పేరు తప్పని సరి లేదంటే పరీక్షలు రాయడం కుదరదు అన్నారు .  మా వాడు చాలా టెన్స్ అయ్యాడు పరీక్ష రాయగలనో లేదోనని .  వాడి పరీక్షఫీజు కట్టేవరకూ వచ్చిన పరిస్థితులతో యుద్ధం చేశాను.

‘ఓ రియల్లీ యూ డిడ్ ఏ  గ్రేట్ జాబ్ , కంగ్రాట్యులేషన్ ‘ మనస్ఫూర్తిగా అభినందించింది గాయత్రి

కూరగాయలు తరుగుతూ మొబైల్ లో మాట్లాడుతున్న తల్లినే పరీక్షగా గమనిస్తోంది గమన కారప్పూస ఒక్కోపలుకు నోట్లో వేసుకుంటూ .

నాన్నలాగే అమ్మ కూడా  నన్ను వద్దనుకుంటే .. ? ఈ మధ్య తరచూ పొడుచుకొచ్చే ప్రశ్న  ఊహ మాత్రంగా  ఓ క్షణం మెదిలి మాయమైంది . ఏ చుక్కలూ లేని ఒంటరి ఆకాశంలా ..రాలిపోయిన పువ్వులా ..   ఏ ఆర్ఫనేజ్ లోనో , రోడ్డుపై అడుక్కుంటూనో … ఛ ..ఛా .. ఇలా ఆలోచించకూడదు.  అమ్మ ఎంత త్యాగం చేసింది. నా బతుకులో రాగాలు పలికించడం కోసం కరిగిపోయే కాలంలో తానూ కరిగిపోతూనే ఉంది .  నేనే లోకంగా బతుకుతోంది .   అమ్మ బాధ్యతలు , నాన్న బాధ్యతలతో పాటు ఇద్దరి ప్రేమ ఆప్యాయత అన్నీ కలిపి  అందిస్తోంది.  ఆ మాటే అంటే ఒప్పుకోదు అమ్మ .
ఎన్ని కష్టాలు , ఇబ్బందులు , సమస్యలు సవాళ్ళు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటోంది .  ఆమె డీలాపడిపోవడం, ఏడుస్తూ కూర్చోవడం, ఇతరులపై ఆధారపడడం  ఎప్పుడూ చూడలేదు.   అమ్మే నాకు  నాన్న.  నాకుమంచి స్నేహితురాలు కూడా అమ్మే .. ఆ మాటే అమ్మతో అంటే .. నువ్వేరా చిట్టితల్లీ నా ఆప్త మిత్రురాలివి అంటుంది .  నాలుగైదేళ్లుగా ఇద్దరి మధ్యా అన్నివిషయాలూ పంచుకోవడం చర్చించుకోవడం మరింత పెరిగింది .  ఇక పాస్పోర్ట్ సమస్య వచ్చిన దగ్గర నుండీ మరీ ఎక్కువయింది అని తలపోస్తున్న గమన తల్లివైపు ఆరాధనా పూర్వకంగా చూసింది . తల్లి అవతలి వారితో మాట్లాడే మాటలు కొన్ని  చెవిలో పడుతున్నాయి .
సింగల్ పేరెంట్ చైల్డ్ గా పిల్లలు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందో తనకు అనుభవమేగా .  ఆవిడ తన భర్తని వద్దనుకుంది. అతనూ వద్దనుకున్నాడు .  కానీ ఆ బిడ్డడికి తండ్రి ప్రేమ , పేరూ రెండూ కావాలనుకుంటే ..? గమనంలో సందేహం .
తన విషయం అలా కాదే .. అమ్మ తన భర్తను వద్దనుకోలేదు . కావాలని వదులుకోనూలేదు .  ఆడపిల్ల పుట్టిందన్న ఏకైక కారణంతో అతనే తప్పుకున్నాడు .  ఎంత వివక్ష ? ఆనాటినుండీ ఈనాటివరకూ  ఏనాడన్నా ఇటు తొంగి చూశాడా .. లేదే .. చచ్చామో బతికామో కూడా అతనికి తెలియదు .  ఇదే నగరంలో మంచి స్థాయి ఉద్యోగి అని మాత్రమే తనకి తెల్సు.  లీగల్ గా  వెళ్తే మీ అమ్మకి , నీకు ఎంతో కొంత ఇవ్వకపోడు మీ నాన్న . నిజానికతను మంచివాడే .  ఎవరికైనా ప్రాణభీతి ఉంటుంది కదా .. అందుకే మిమ్మల్ని కాదనుకున్నాడు.  మీ అమ్మకి ఇంత కష్టపడే పని ఉండదు అంటూ అమ్మకి  నచ్చచెప్పమని ఫోన్ చేసినప్పుడల్లా నాతో నస పెడుతుంది అమ్మమ్మ .  అతన్ని మీ నాన్న అని అమ్మమ్మే కాదు ఎవరన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది .
నేను అమ్మని గౌరవిస్తాను . వద్దని పోయిన వాడి సొమ్ము తానొద్దనుకుంది అమ్మ .  అదే నామాట అని చెప్తే  ఇదెక్కడి పిచ్చి మాలోకం అని గోలపెడుతుంది అమ్మమ్మ .
ఎక్కడో పెళ్ళిలో చూసి అమ్మ కుటుంబస్థాయి వేరైనా  ఏరికోరి పెళ్లి చేసుకుని  డెలివరీకి పుట్టింటికి పంపకుండా తన దగ్గరే ఉంచుకున్నాడట అతను.  ఊళ్ళో వైద్య సదుపాయాలు అంతంతమాత్రమని అమ్మమ్మ తాతయ్య వాళ్లనే తమదగ్గరికి పిలిపించాడట.  అంతా అమ్మపై ప్రేమ.   పుట్టబోయే బిడ్డ పై అప్పుడే ఎంత మమకారమో అనుకున్నారట . అమ్మ అదృష్టానికి పొంగిపోయారట .  కానీ ..  ఏం జరిగింది ? నేను పుట్టిన ఘడియలు బాగోలేదని నన్ను చూడొద్దని అతనికి వాళ్ళమ్మ  చెప్పిందట .  నా జాతకం జ్యోతిష్కుడి దగ్గర చూపించిందట . గడ్డం దగ్గర రూపాయి బిళ్ళంత నల్లటి మచ్చతో పుట్టిన బిడ్డ తండ్రికి ప్రాణగండమని జ్యోతిష్కుడు చెప్పాడట.  హాస్పిటల్ బిల్ కట్టాడు కానీ మా మొహమే చూడలేదట. అమ్మ పరిస్థితికి  తాత భోరున ఏడ్చి ఊరికి వచ్చెయ్యమంటే అమ్మే వెళ్లలేదట. అతను  మనసు మార్చుకుని వస్తాడన్న ఆశతో కొంతకాలం ఎదురు చూసింది అమ్మ . ఆ ఆశతోనే బతికింది.
అమ్మా తాతయ్య వాళ్ళతో వెళ్లి ఉండాల్సింది కదా అని చాలాసార్లు అడిగింది . అప్పుడు రాని సమాధానం ఇప్పుడు వచ్చింది ఆమె సంభాషణ ద్వారా .. అమ్మని ఇంటికి తమతో తీసుకువెళ్తే ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల భారం నెత్తిపై ఉంది . దానికి తోడు ఈ తల్లీకూతుళ్లను తీసుకుపోతే ఇంకా పెరిగే ఇబ్బందులగురించి అమ్మమ్మ తాతయ్య మాటలు విన్న అమ్మ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకొంటూ తనబతుకు తను బతికింది.
అందరి సానుభూతి భరించడం కష్టం అనుకున్న అమ్మ ఊళ్ళోని సామాజిక పరిస్థితుల్లో ఇమడలేననుకుంది .  ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంది.  గుప్పెడు మనసులో చప్పుడు  లేకుండా ఆలోచనలు, అనుభూతులు దాచిపెట్టుకుంది .   సరదాగా నేర్చుకున్న యోగ , కూచిపూడి నాట్యం వృత్తిగా మార్చుకుంది.  తన కాళ్లపై తాను నిలదొక్కుకుంది .  కానీ మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోయింది. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది .  తన బిడ్డకు తను తప్ప ఎవరూ లేరు . తాను మాములుగా ఉండాలి . తన బాధలేవీ తెలియకుండా పెంచాలనుకునేది.  ఏలోటూ రానివ్వకూడదని కష్టపడేది .  నాకు తెలిసినదగ్గరనుండీ గమనిస్తూనే ఉన్నా .. అమ్మకి సామాజిక జీవనం, పెళ్లిళ్లు పేరంటాలు దాదాపు లేనట్లే.  ఎటు వెళ్లాలన్నా ఆర్ధిక సమస్యలకుతోడు సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పలేనితనం అని అమ్మతో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ అర్ధమవుతోందని మదిలోనే తలపోసింది గమన .  ఆమె ఆలోచనలను భంగపరుస్తూ
‘జాతి భద్రత కోసం పాస్పోర్ట్ లో తండ్రి పేరు అవసరమంటాడా పోలీసాఫీసర్ .. హు .. తండ్రి పేరుకీ దేశభద్రతకీ సంబంధం ఉందా ..?’ తల్లి అంటున్న మాటలు చెవినపడ్డాయి.
ఆడపిల్ల పుట్టుకకు కారణమైన తండ్రి ఆమెను వదిలించుకుంటే .. దేశాన్ని రక్షించాల్సిన పోలీస్ తండ్రి పేరుతోనే దేశ భద్రత అంటున్నారు .. అసలు వీళ్ళమెదడులో ఏముంది ? పెండముద్దా .. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడతారు . తాము ఏమి చేసినా మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటారా .. చెలరేగుతున్న అనేకానేక ప్రశ్నలను అదుపుచేస్తూ గమన చెవిలో తల్లి మాటలు
‘అప్పుడు తెలియక అతన్ని రోడ్డుపైకి ఈడ్చలేదు .. ఆతను లేకుండా నా బిడ్డను నేను పెంచుకుంటాననే మొండి పట్టుదల, మా అమ్మానాన్నలకు నేనూ నా బిడ్డ భారం కాకూడదు అనే భావన తప్ప ఏమీ తెలియదానాడు . సమాజం నుండీ వచ్చే సవాళ్ల గురించీ ఆలోచించలేదు .  నన్నూ నా  బిడ్డనీ వద్దనుకున్నాడని అర్ధమయినప్పుడు గుండెలవిసేలా ఏడ్చాను. పల్లెటూరునుండి వచ్చిన అమాయకత్వం ఆనాటిది.  అదే ఇప్పుడయితే ఏ విధంగా ఉండేదాన్నో ..
మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ మొగుడువదిలేసిన కూతుర్ని తమతో తీసుకుపోయి దగ్గర ఉంచుకోవడానికి అమ్మానాన్నలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్ధమయిన తర్వాత, ఈ జీవితం నాది.  నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా నేను నేనుగా బతకడానికి నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను.  సమూహంలోంచి నాలోకి నేను ఒదిగిపోయి బతికాను .   సమాజం మనం ఎలా ఉండాలో చెప్తుంది కానీ .. మనం ఎలా ఉంటే అలా స్వీకరించదు  ఎందుకో .. ‘  మనసు మడతలను విప్పుతూ స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నూనె పోస్తూన్న  గాయత్రి .
ముక్కూమొహం తెలియని వాళ్లిద్దరూ చిరకాల మిత్రుల్లాగా మాట్లాడుకోవడం చూస్తే గమనకి ఆశ్చర్యంగా ఉంది .  తన స్టూడెంట్స్ తాలూకు పేరెంట్స్ వచ్చినా చాలా తక్కువగా .. అవసరానికి మించి ఒక్కమాట మాట్లాడని అమ్మ  ఈ రోజు మొదటిసారి మనిషినైనా చూడకుండా పెదాల మధ్యన దాచిన మౌనాన్ని ఛేదించుకొని మాటలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆమె మనసు లోతుల్లో దాగిన విషయాల్ని పరుస్తోంది.   నా పాస్పోర్ట్ సమస్య మొదలయినప్పటి నుండి అమ్మలో చాలా మార్పు . తానెన్నడూ ఊహించని మార్పు.
ఆ  నడకలో , మాటలో , చేతల్లో .. ధీరత్వం .. ఆత్మవిశ్వాసం ప్రస్ఫూటంగా కనిపిస్తన్నాయి .  మళ్ళీ అమ్మ సమూహంలోకి . నిశ్శబ్దపు కౌగిలిలోంచి బయటికి చీకటి చిక్కుముడుల దారులు విప్పుకుంటూ .. కాలం గీసిన చిత్రం ఎంత విచిత్రం .. తల్లిగురించే ఆలోచిస్తూ గమన

తననే తదేకంగా చూస్తున్న గమనని గమనిస్తూనే ఉంది గాయత్రి . తరిగిన కూరగాయలు పొయ్యిమీద వేసి,  చపాతీ పిండి కలుపుతూ మాట్లాడుతూనే ఉంది .

‘తండ్రి ఎవరో తల్లి చెప్తేనే బిడ్డకి తెలిసేది . కానీ తల్లిని బిడ్డకి ఎవరూ పరిచయం చేయనవసరం లేదే .. హాస్పిటల్ వారు బిడ్డ పుట్టగానే ఇచ్చే సర్టిఫికెట్ లోనూ తాను బిడ్డను కన్నట్లే ఇచ్చారు  కదా .. అతను కనలేదు , పెంచలేదు . కనీసం మొహం చూడలేదు . అలాంటప్పుడు తల్లిపేరు తప్పని సరి కావాలి కానీ తండ్రి పేరు కాదు కదా .. తల్లిపేరు పెట్టుకోవడం నా జన్మ హక్కు . నా పుట్టుకకు కారకుడయ్యాడేమో కానీ నేను నా తండ్రి అని చెప్పుకునే అర్హత అతనికి లేదు .
కూతురుగా నన్ను ఎప్పుడో వదిలేసిన ఆ తండ్రి పేరు ఉంచుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవలిసింది నేను కానీ వాళ్ళు కాదు . ఏంటో ఈ సమాజంలో .. మనకోసం మనం ఏర్పరచుకున్న చట్టాలు మనం మార్చుకోలేమా .. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పుతేలేరా ..?  అంటూ నా కూతురు వేసిన  ప్రశ్నలే  నాలో కొత్త చైతన్యాన్ని రగిలించింది .
నా చిట్టితల్లి అప్పుడే ఇంత పెద్దయిపోయిందో.. ఎంతబాగా ఆలోచిస్తోందో ..
నాకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదెందుకు ?  నిండా 15 ఏళ్ళు లేని దీనికి ఎంత చక్కని విశ్లేషణ?  అని దాని మాటలు వింటూ ఆశ్చర్యపోతూనే ఉంటాను. పుస్తకాల పురుగులా ఎప్పుడూ చదువుతూ ఉంటుందిగా .. అందుకే ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది ‘ కూతురి గురించి గర్వంతో ఉప్పొంగిన స్వరంతో గాయత్రి .
‘నిజమేనండీ .. ఎప్పుడైనా ఎక్కడైనా తల్లి పేరు తప్పని సరి కావాలి కానీ తండ్రిపేరు కాకూడదు కదా .. అద్భుతంగా చెప్పింది  మీ అమ్మాయి . ‘ ఏం చదువుతోంది అవతలి నుండి  మాలతిమాధూర్ ప్రశ్న ..
అదేమీ వినిపించుకోని గాయత్రి ‘ ఒకప్పుడెప్పుడో పిల్లల్ని తల్లి పేరుతోనే గుర్తుపట్టేవారని చరిత్రలో చిన్నప్పుడు చదివిన గుర్తు’  జ్ఞాపకాల జాడల్లోకి వెళ్ళబోతున్న గాయత్రి మాటల  మధ్యలోనే అందుకున్న మాలతీ నవ్వుతూ
‘గౌతమీపుత్ర శాతకర్ణి .. ‘
‘హా.హ్హ ..
ఆ కాలంలోలాగా తల్లిపేరుతోనే గుర్తింపు కావాలని నేను కోరుకోవడం లేదు. కానీ, తండ్రిపేరు లేని కారణంగా నా కూతురు  పాస్పోర్ట్ పొందే హక్కుని కోల్పోవడమే ముల్లులా గుచ్చుకుంటోంది . ఒంటరిగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కలగని దుఃఖం ఇప్పుడు గుండెనిండా ..
తండ్రి పేరు రాయలేదని పోలీస్ క్లీరెన్సు ఇవ్వరట ..
ఆ బిడ్డపుట్టుకకకు ఎవడో ఒకడు కారణమై ఉంటాడుగా వాడి పేరు రాస్తే పోతుందని , ఏదో ఒక పేరు రాస్తే పోలా .. అనీ ఉచిత సలహాలు .
అలా ఎందుకు రాసుకోవాలి?   నా జీవితంలో లేనివాడి లేనిపోని బరువుని నేను మోయలేను అంటూ  నా కూతురు నుండి ఛేదించుకు వచ్చే ప్రశ్నలు..
అక్కడికీ పోలీస్ ఆఫీసర్ నీ , పాస్పోర్ట్ ఆఫీసర్ని కలిసి నా పరిస్థితి వివరించా. ఆర్థికంగా , సామాజికంగా , మానసికంగా ఎన్ని ఇబ్బందులు , సమస్యలూ వచ్చినప్పటికీ  కూతురిని నేనెలా పెంచుకొచ్చిందీ తెలుపుతూ  అఫిడవిట్ సబ్మిట్ చేశాను.  ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న నా బిడ్డని గౌరవించకపోయినా  తండ్రిపేరు కోసం వత్తిడి తేవద్దని ప్రాధేయపడ్డాను.
అది తెలిసిన నా కూతురుకి చాలా కష్టం కలిగించింది .  నాకు పాస్పోర్ట్ లేకపోయినా ఫర్వాలేదు .  నువ్వుమాత్రం ఎవ్వరినీ ప్రాధేయపడొద్దని గట్టిగా చెప్పింది .
పాస్పోర్ట్ పొందడం  నా జన్మ హక్కు . ఎన్నాళ్లీ హింస ఉండేది?  ఆకు రాల్చిన చెట్టు చిగురించక పోదు . అట్లాగే మన జీవితాలూ ..  ఈ రోజు కాకపోతే రేపు .. రేపు కాకపొతే మరోరోజు ..
ఇవ్వకుండా ఎక్కడికి పోతారు .. ఆ రోజు వస్తుంది .  న్యాయ బద్దంగా ఎందుకు ఇవ్వరో మనమూ చూద్దాం . మార్గాలు దొరక్కపోవు . ఈ సారి కాకపొతే మరో సారి నాకు అవకాశాలు రాకపోవు. మనం ఎవ్వరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదంటుంది.  నేను ఇబ్బంది పడిపోతున్నాని అది దాని అవకాశాలు వదులుకోవడానికి సిద్దమైపోయింది…  ‘  గాయత్రి తనలో మూటకట్టుకున్న బరువును తేలికపరుచుకుంటూ .
పిల్లల్ని దత్తత తీసుకుంటే .. IVF మరో పద్దతిలో పిల్లల్ని కంటే ..  వాళ్ళకి తండ్రి ఎవరని చెప్తారో .. మన చట్టాలకు కళ్ళు చెవులే కానీ బుర్ర ఉండదా ..?  ప్రతి పౌరుని హక్కుని గౌరవించాల్సిన పనిలేదా ? సింగల్ పేరెంట్ గా ఉన్న తండ్రిని అడగాలి తల్లి ఎవరని ?   ఇడియట్స్ … అన్ని చోట్లా తండ్రి పేరు లేదా భర్త పేరు .. మరి భర్తని భార్య పేరు అడగరెందుకో ..? పాస్పోర్ట్ కోసమే కాదు ఎక్కడైనా ఎప్పుడైనా ముందు ఉండాల్సింది అమ్మ పేరు…  గమన ఆలోచనలకు అప్పుడప్పుడూ  అడ్డుకట్టవేస్తూ తల్లి మాటలు చెవిలో పడుతున్నాయి
తనదగ్గర డాన్స్ నేర్చుకునే అమ్మాయి తల్లి సలహామేరకు చేంజ్ . ఆర్గ్ లో పిటిషన్ వేసింది .  పాస్స్పోర్టులో సింగల్ పేరెంట్ పేరు ఉన్నా సరిపోయేలాగా మార్పులు తేవాల్సిన అవసరం గురించి . అందుకు సహాయం కోరుతూ ప్రధానమంత్రితోపాటు , స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి , హోం వ్యవహారాలమంత్రి , విదేశాంగ మంత్రి లకు అర్జీ పెట్టుకుంది .
మూడోరోజుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి నుండి మెయిల్ ..  అర్జీ ని  సపపోర్ట్ చేస్తూ ..
చీకటి రెక్కలు విరుస్తూ వెలుతురు మెట్లు ఎక్కుతున్న అమ్మది సాహసవంతమైన జీవితం. ఈ తల్లికి బిడ్డనయినందుకు గర్వంగా ఫీలయింది గమన .  ఆ వెంటనే తన మిత్రురాలు స్వాతి వాళ్ళమ్మ గమన కళ్ళముందు మెదిలింది. ఆమెను స్వాతితో సహా వాళ్ళింట్లో అందరూ కరివేపాకులా తీసిపడేస్తారు. పెదవి విప్పని దుఃఖాన్ని మోస్తూ ఏ క్షణమైనా వర్షించే మేఘాన్ని తలుపుకు తెస్తుందావిడ.   మళ్ళీ ఆమెలేకుండా వాళ్లకి ఒక్క క్షణం గడవదు.  అమ్మని దేవతతో పోలుస్తుంటారు కదా .. మరి ఆ అమ్మకి విలువేమీ ఇవ్వరు  ఎందుకో ..?  అసలే అర్ధం కాదు అనుకుంటూ లేచి టీవీ పైనున్న రిమోట్ అందుకుంది గమన .
స్క్రోల్ అవుతున్న వార్తలు చూసి ‘అమ్మా .. ఇటుచూడు ‘ సంతోషంతో  గట్టిగా అరిచింది
ఏమిటన్నట్లుగా ఫోన్ మాట్లాడుతూనే చేస్తున్న పనిని ఆపి టీవీ కేసి దృష్టి సారించింది గాయత్రి .
ఒంటరి తల్లి ఆవేదనతో పాస్పోర్ట్ నిబంధనల్లో మార్పులు.  ఇకనుండి తల్లిదండ్రుల పేర్లలో ఎవరో ఒకరి పేరు రాసినా సరిపోతుంది…  న్యూస్ కొనసాగుతోంది .
కరిమబ్బును సవాలు చేసే ఈ నక్షత్రం ఒంటరి కాదు.  ఎన్నో నక్షత్రాలు ఆమె చుట్టూ  ఓ గేలక్సీలా .. చంద్రకాంతుల మెరుపులతో కాంతులీనుతున్న అమ్మ మొహంలోకి  తదేకంగా చూస్తూ  ఆమె నుండి స్ఫూర్తి పొందుతూ , ఆరాధనాపూర్వకంగా చూస్తోంది గమన .
వి . శాంతి ప్రబోధ
Story Published in Bhumika March 2017

Tag Cloud

%d bloggers like this: