The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘ఏప్రిల్ 2014 ప్రస్థానం పత్రికలో ప్రచురితమైన కథ’

కొండచిలువ కోరల్లో

మాతాత మాట వింటే ఇప్పుడు మాకీ గతి పట్టక పోను. కొంచెం బాధ ధ్వనిస్తుండగా అన్నాడు పొలం గట్టుమీద నడుస్తున్న శేఖర్‌. కాస్త దూరంగా ఉన్న ఆ చెరువు మీదుగా వచ్చే చల్లని మలయమారుతం,
ఎటు చూసినా పచ్చని పరదా పరచినట్టున్న చిక్కని పచ్చదనం, అక్కడక్కడా కనిపించే పశువులు మేతమేస్తూ… కొన్ని ఇంటికేసి దారితీస్తూ… రకరకాల పిట్టల కువ కువారావాలు.. వాగొడ్డున తుమ్మ చెట్లకు, ఈత చెట్లకు వేలాడే పిట్టగూళ్ళు…. ఆ గూళ్ళ లోంచి తల్లి కోసం అది తెచ్చే ఆహారం కోసం ఎదురు చూసే పసి కూనలు. ఎక్కడినించో పచ్చి కందికాయలు తంపటి వేసిన వాసన కమ్మదనం… దూరంగా ట్రాక్టర్‌ దున్నుతున్న శబ్దం.. ఆ వాతావరణం అతనికెంతో ప్రియంగా మారిపోతూ….
ఏమైందిరా…. చాలా సార్లు ఆ మాట అంటున్నావ్‌. బాగానే ఉన్నారు కదా! ఈ మధ్య శేఖర్‌ నుండి చాలా సార్లు ఆ డైలాగ్‌ విన్న మహేష్‌ గట్టు మీద ఉన్న జామచెట్టు నుండి చిలక కొట్టిన దోరగా కనిపిస్తున్న జామకాయను తెంపుతూ
అవును బాగానే ఉన్నాం. కాదు కాదు ఉన్నట్లు కనిపిస్తం అంతే. అదిగో ఆ జామకాయలాగే అని ఒక క్షణం ఆగి ఇక్కడి నుండి చూస్తే చూడు ఆ జామకాయ ఎంత మంచిగా అగుపించింది. నీరెండ పడి అది దోరగా మెరిసింది. కానీ కోస్తే ఇంకా పచ్చిగానే కచ్చగానే అన్నాడు శేఖర్‌ ఆ జామకాయ కేసే చూస్తూ. తన చిన్నతనంలో తమ జామ చెట్లు పోటీలుపడి ఎక్కడం, కాయలు కోయడం ఒక్కోసారి పెద్దనాన్న పిల్లలూ తామూ పోట్లాడుకొని అమ్మతో చెపితే, అమ్మ వాళ్ళని తిట్టడం. అది చూసి పెద్దమ్మ అమ్మతో గొడవ పెట్టుకోవడం… అమ్మ చూడకుండా రాత్రి పడుకునేముందు దొంగతనంగా కోసిన జామపండ్లు తినడం, అలా తింటున్నప్పుడు ఒకసారి దాని గింజ సగం ముక్క అయి దంతానికి అతుక్కుని రాక ఇబ్బంది పెట్టిన వైనం.. బడిలో టీకాలు వేస్తే జ్వరం వస్తుందేమోనని అది రాకుండా జామ చిగురు నూరి ఆ టీకా మీద రుద్దడం… ఎన్నెన్ని జ్ఞాపకాలు తమ పండ్ల, కూరగాయల తోటల్లో.. .అనుకుంటూ శేఖర్‌
నీకేంట్రా నీది వడ్డించిన విస్తరి జీవితం… నేను అనుకోవాలి ఆ మాట కినుకగా మహేష్‌ మరో జామకాయ కోసి శేఖర్‌ చేతిలో పెడుతూ నిజమే… మా జీవితం చూసేవాళ్ళకు వడ్డించిన విస్తరే. కాయ కష్టం చేయకుండా చుక్క చెమటోడ్చకుండా, వీసమెత్తు కొవ్వు కరగకుండా… మా తాత ముత్తాతలు కార్చిన ప్రతి చెమట చుక్క మా పాలిట లక్ష్మిదేవై గలగలలాడింది.
ఏందిరోయ్‌ ఇయ్యాల ఏందో కొత్తగా మాట్లాడుతున్నావ్‌.
అవున్రా… మన వెంకట్రావు సార్‌ క్లాస్‌ వింటుంటే మధ్యలో మా తాత గుర్తోచ్చేవాడు. ఆయన చెప్పే మాటల్లో మా తాత మాటలు వినిపించేవి.
ఇప్పుడు మీ ఊరు చేన్లు, చెట్లు చేమలూ చూసినప్పటి నుండి మళ్ళీ మా తాత యాదికొస్తున్నాడు. ఆయన మాటలు చెవిలో జోరీగలాగ మెదులతున్నాయ్‌. ఎప్పుడో నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తాత చనిపోయాడు. తాత మాటలకి అంతా పిస్సోడని నవ్వేవారు. అప్పుడు నేనూ అంతే అనుకునే వాడిని. కానీ, ఇప్పుడు తెలుస్తోంది. అక్షరం ముక్క రాని మా తాత జ్ఞానం ఏమిటో ఆయన ముందు చూపు ఏమిటో…
అవునా…! మీ తాత గురించి చెప్పరా నాకు వినాలని ఉంది. కళ్ళు పెద్దవి చేసి మహేష్‌ అతని గొంతులో శేఖర్‌ తాత గురించి తెలుసుకోవాలన్న ఆతృత, ఉత్సాహం.
అవును ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తే. నేను నాలుగోతరగతిలో ఉన్నానప్పుడు. శివరాత్రి ముందు రోజు తాతకి మా బాపు వాళ్ళకి పెద్ద లొల్లి అయింది ఎందుకో నాకర్థం కాలేదు ఆరోజు. శివరాత్రి ఉపవాసం. జాగారం అన్నీ ఆరోజే అయ్యాయి ఇంట్లో. మేము మొహాలు వేళ్ళాడేసుకుని బిక్క చచ్చి తిరుగుతున్నాం. మా అమ్మ ఎవరు చూడకుండా ఐదు రూపాయలు చేతిలో పెట్టింది. నేను, చెల్లి, చిన్న బాపు కొడుకు సంజు పోయి అరటి పళ్ళు కొనుక్కొని తిన్నం. ఆ తర్వాత కొద్ది రోజులకే భూతల్లిని అమ్మొద్దని మా బాపు పెద్దబాపు చిన్నబాపులతో తాత మళ్లీ గొడవపెట్టుకోవడం. తాత తిండి మానేసి అలకపాన్పు ఎక్కి కూర్చోవడం ఎందుకో తెలిసేది కాదు.
కానీ, తాత మాట ఎవరూ నెత్తికెక్కించుకోలేదు. ఖాతరు చెయ్యలేదు. పైసలకాశపడి కన్న తల్లిలాంటి భూతల్లిని బేరంపెడ్తున్నరు. మన భూములపై కన్నేసిన గెద్దలు, తోడేళ్ళు డబ్బుతో ప్రలోభ పెడుతున్నరు. గోతికాడ గుంటనక్కలా కాసుకుని ఉన్నరు. బేరంబెడ్తే కన్న తల్లి లేని పిల్లలోలె అయితదిరా మన బతుకు అని నెత్తి నోరు మొత్తుకున్నడు తాత. ఆయన్ని పిచ్చోడిని చూసినట్లు చూశారు. ఆయన ఏమన్నా, ఏం జేసినా ఆగిందా.. జరిగేది జరగక మానిందా.. లేదు. పైస మీద ఉన్న మమకారం, వచ్చిన గొప్ప అవకాశం చేజారిపోతుందేమోనన్న భావం మా బాపు వాళ్ళని నిలువనీయలేదు.
మా పంట పొలాలన్నీ బట్టపీలిక లాగా చీలికలు పేలికలు ముక్కలు చెక్కలు అయ్యాయి. అప్పుడు మా తాతని అందరూ పిచ్చోడిలా చూస్తుంటే నాకర్థమయ్యేది కాదు. తాత మంచిగానే ఉన్నాడు కదా ఎందుకిట్ల పిస్సోడు అంటున్నారు అని బాధ ఉండేది. తాత నోటి నుండి వచ్చిన మంచి ముత్యాల్లాంటి మాటలు అట్లా నా మనసులో ముద్రించుకుపోయాయి. తను చెప్పింది అర్థం చేసుకోలేని కొడుకుల్ని చూసి ఆయన పడ్డ వేదన. యాతన ఇంకా నా కళ్ళలో కదలాడుతూనే ఉంది. జ్ఞాపకాల పొరల్లో దాగి అవి మేమున్నాం అంటూ అప్పుడప్పుడూ ఆలోచనల్లోకి చొచ్చుకొచ్చి గడబిడ చేస్తూనే ఉన్నాయి. లోతుగా ఆలోచిస్తోంటే, మనసు పెట్టి తరచి చూస్తుంటే ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆ మట్టిలోనే పుట్టి, ఆ మట్టిలోనే పెరిగి పెనవేసుకుపోయిన బంధాన్ని వదులుకోవడం అంటే పొట్టలో చేతులు పెట్టి కెలికి పేగు బంధాన్ని బలవంతంగా లాగేసినట్లేనని ఆ బాధే మా తాతదని. మా బాపమ్మ అయితే సరే సరి. రెక్కలు తెగిన పక్షిలా గిలగిలాకొట్టుకున్నది. ఇద్దరూ తెల్లారి లేస్తే జంట పకక్షుల్లా చేన్లోనే ఉండేవారు. ప్చ్‌ ఎగరలేని ఒంటరి పక్షిలాగుంది బాపమ్మ.
ఊహు… అయితే ఏమయింది అసలు విషయం చెప్పు… గత నెలలో వరి కోత మిషన్‌ తో కోసిన వరి దంట్లలోకి పారించిన నీళ్ళలో దిగి ఒంటి కాలిపై జపం చేస్తున్న గోధుమ రంగు, తెలుపు రంగు కలసిన కొంగలని, ఆవలగా ఉన్న పచ్చని మేడిచెట్టుమీద చేరి ఆ చెట్టుకే కొత్త సొగసుని అద్దిన తెల్లని కొంగల గుంపుని అపురూపంగా చూస్తూ ఎడమ చేతి బొటన వేరు గోరు పక్కన చీరుకు పోయిన లేచిన చర్మాన్ని నెమ్మదిగా నోటితో తీస్తూ మహేష్‌.
తనూ ఆ కొంగల్ని, మహేష్‌ నీ చూస్తూ అద్భుతంగా పరచిన ప్రకృతి అందాలని మదిలో చిత్రికరిస్తూనే అదే చెప్తున్నా…. పెద్దబాపు ఏడు చదివితే, మా బాపు పది చదివాడు. చిన్న బాపు డిగ్రీ చదివాడు. తాత ఏం చెప్పిన చదువురాని వాడు పాతకాలం వాడు లోకం పోకడ తెలియని వాడు ఏదో చెప్తున్నడులే అని కొట్టిపారేశారు. ఆ చెవితో విన్నారు ఈ చెవితో వదిలేశారు. ఏమాత్రం చెవికెక్కించుకోలేదు.
పట్నం నుంచి బుర్రు బుర్రు అనుకుంట కార్లల్ల వచ్చే కడక్‌ కడక్‌ బట్టలోల్ల పైసలకిఆశపడి నమ్ముకున్న మట్టిని వాళ్ళ వశం చేసేశారు మా వాళ్ళు.
నిజంగానే… అన్నట్టుగానే సంచుల్లో నింపి జీపులో వేస్కొని నోట్ల కట్టలు తెచ్చి నట్టింట్లో పోశారు. మాకు చెప్పలేనంత ఆనందం, ఆశ్చర్యం కట్టలకు కట్టల పైసలు. అమ్మ, చిన్నమ్మ, ఆమ్మక్క మా బాపు వాళ్ళు అందరికీ అంత సొమ్ము చూసి సొమ్మసిల్లినట్లయింది. మా కళ్ళని మేం నమ్మలేకపోయాం. ఎవరన్న రాగల అనుకుంట పోయి పెద్దమ్మ వాకిలి దర్వాజా బంద్‌ జేసి వచ్చింది. దునియాల ఇంత పైస చూస్తమని ఎన్నడన్న అనుకున్నమా అన్నాడు మాబాపు… అంటూ నోరెళ్ళబెట్టి చూశాం ఆ పైసల్ని. లోపటింట్లో దేవుని రూంలో బియ్యం, పెసర్లు, కందులు, జొన్నలు వంటి ధాన్యాలు, పప్పులు వంటివన్నీ ఏడాది కోసం పెద్ద పెద్ద బానల దొంతరలు ఉన్నై పైసలు రాంగానే వాటిని అట్లనే బానల దొంతరలు పేర్చి దాచిపెట్టారు. మా తాతకు, బాపమ్మకు మడి చెల్క పోయిందని నిద్రలేదు. మిగతా వాళ్లకేమో ఎవరన్న చూస్తే ఎత్తుకుపోతారేమోనని చాలా రోజుల ఎవ్వరికి నిద్రనేలేదు. ఏదేమైనా మేం క్షణాల్లో లక్షాధికారులమో కోటిశ్వరులమో అయిపోయాం.
కూరగాయలు పాలు, పండ్లు అమ్మిన పైసలు చేతికొస్తుండే గాని ఒక్కసారి వెయ్యి రూపాయల నోట్లు చూడలే. అటువంటిది ఇప్పుడు వెయ్యి రూపాయల కట్టలు కూడా వచ్చినయ్‌. వచ్చిన దాంట్లోంచి కొంత ఇంటి ఆడపిల్ల అని పెళ్ళయిన మా అత్తమ్మకు తీసి పెట్టి మిగిలింది నాలుగు వాటాలు వేశారు. మా బాపు వాళ్లకు తలా ఒక వాటా. ఒకటి తాతకి అని నాలుగు వాటాలు వేశారు. కానీ మా తాత మట్టిపిసికే చేతులకు మట్టి కావాలే గాని ఆ పైసలేం జేస్కోను నాకా పైసా వద్దు. నా భూమి నాక్కావాలని అందరి మీదా అరచి లొల్లి లొల్లి చేసినా, తన నిస్సహాయ స్థితికి లోలోన కుమిలిపోయాడు. కారణం చదువు రాని మా తాతతో మా బాపు వాళ్ళు ముందే వేలు ముద్రలు వేయించుకుని చేనంతా తమ పేరు మీద చేయించుకున్నారు. రానున్న ఉపద్రవాన్ని ముందే పసికట్టి ఉంటే చేను వాళ్ళ పేరున పెట్టేవాడు కాదేమో.
చేన్ల పని జేసుడు తప్ప ఆయనకు మరో పనిరాదాయె. మా నాయనమ్మ ఆకుకూరలు అమ్మడం, పాడిజేసి పాలు డబ్బాలవాళ్ళకు పోయడం జేసేది. పొలం పోయే గడ్డిగాదం లేకపోయే. ఇంకా బర్లనేం మేపుతరు. బర్లు పోయినయి. పాలు పోయినయి. అప్పుడు మాది తాత నాటి ఇల్లు పాతకాలపు కూనపెంకల ఇల్లు పెద్దదే. మా తాత పెద్ద తాతలకు మా ముత్తాత కట్టిచ్చినడట. మా పెద్ద తాతో దిక్కు, మా తాతో దిక్కు ఉండేవారు. వాళ్ళ పిల్లలకి పిల్లలం మేము అంతా ఆ ఇంట్లోనే అందరికి నడిచే పెద్ద దర్వాజ వాకిలి ఒకటే. ఇల్లు సరిపోయేది కాదు. అందులోనే సర్దుకొని ఉండేవాళ్ళం. మా అమ్మనో పెద్దమ్మనో ఎవ్వరో ఒకరు ఎప్పుడూ సణుగుతూనే ఉండేవారు. పెట్టెల్లెక్క ఉన్న ఈ చిన్న అరల సంసారం చేసుడు మా తోటి గాదని.
మా ఇంటికి కొంచెమావల 40 గుంటల జాగా ఉంది. అందులో ఇల్లు కట్టుకోవాలని మా బాపు పెద్ద బాపు చిన్న బాపు అనేవారు. చేతిలో పైస లేక ఆగిపోయారు. ఎన్నడు కలలో గూడా చూడనంత కండ్లు చెదిరేటంత పైస, దిమ్మదిరిగేటంత పైస చేతికొచ్చింది. ఆగుతారా… నట్టింటిలోకి వచ్చిన లక్ష్మిని కాదంటున్నడని తాతను ఏర్రోడి కింద జమకట్టి చూశారు ఇంట్లోవాళ్ళు బయటివాళ్ళు అంతా పిస్సోడిని చేసి చూశారు. ఆ చూపును ఆయన ఎట్ల భరించాడో… హృదయ భారంతో పచ్చికలో కూలబడిన శేఖర్‌.
అసలంత బాధ ఎందుకు పడాలి? బోలెడంత డబ్బు చేతికి వచ్చిందిగా ఆశ్చర్యంగా మహేష్‌ తనూ ఆ గడ్డిలో చతికిలబడుతూ.
ప్రాణం పోసే చేతులకు ప్రాణం తీయడం చూస్తే గుండెలో గునపం గుచ్చినట్లు ఉంటది కదా. తాత బాపమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన నిమ్మ, జామ, ఉసిరి, సంత్ర, రేగు చెట్లు నిముషాల్లో నేలకొరిగె ఆక్కూరల మళ్ళు మట్టిలో కలిసిపోయే. బర్రెలకు, మ్యాకలకు జాగా లేకపోయే. ఆ 40 గుంటల జాగా మూడు ముక్కలయింది. కొడుకుల చేతిలో భంగపడి వాళ్ళ కోసం బెంగపడి, తన లాంటి వాళ్లకి ఈ లోకంలో తావు లేదని బాపమ్మని ఒంటరి పక్షిని చేసి లోకం విడిచాడు తాత.
నిన్న మొన్నటిదాకా ముడ్డి మీద బట్ట, బండ మీద దెబ్బ అన్నట్టు తప్ప బట్టలు లేకుండే. మా ఎక్కువంటే మూడు జతలు. నాలుగు జతలు అంతే. రెండు కాళ్ళ బండి తప్ప మరోటి లేదయ్యే. సైకిల్‌ కొనడానికి చాలా ఆలోచన చేసినా కొనలేదు. అటువంటిది వచ్చిన పైసా మా బతుకు తీరు తీరుతీరుగా రోజుకొక తీరుగా మార్చేసే.
యాడాది లోపే మూడు పెద్ద పెద్ద భవంతులు లేసినయ్‌. టయోట బండి కొని తెల్లబట్టలేసుకొని వెయ్యి రూపాయల చెప్పులేసుకుని రంగు కండ్లద్దాలు… సెల్‌ఫోన్‌ తో తిరగడం, ఇంట్లో కలర్‌ టి.వి., ఫ్రిజ్‌, బట్టల మిషన్‌, ఎ.సి, ఏమేమో సామాన్లు ఇంట్లోకి చొచ్చుకొచ్చాయి. మేము సర్కారు బడినుండి ప్రైవేటు బడికి మారాం. నేను పదో తరగతి అయ్యేసరికి నాకూ ఒక సెల్ఫోన్‌, బండి ఆ బండికి రోజు పెట్రోల్‌ జేబునిండా పైసా.
మా బాపమ్మ సముద్రమంత దుఃఖం మనసులులోనే పాతేసి ఆ పాతింట్లోనే ఉంది. తను కాటికి పోయే వరకు ఆ ఇల్లు వదలనని, కదలనని మొండికేసింది, మొరాయించింది. బలవంతం చేస్తే తన పీనుగునే తీసుకుపోయ్యేది అని ఖరాఖండి చెప్పింది. భూమి అమ్మితే వచ్చిన పైసా మొకం చూడలేదు. రెండు రూంలు కిరాయి కిచ్చింది. ఆ కిరాయితోనే బతుకుతాంది. బంధువర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు ఉంటుంది. తనకున్న దాంట్లోనే పక్కవాళ్ళకింత పెడ్తుంది చెప్పుకుపోతున్నాడు శేఖర్‌.
శ్రమ ఒకడిది
సిరి మరొకడిది అన్నాడు మహేష్‌ ఈ మధ్య చదివిన పుస్తకంలోని వాక్యాలు గుర్తురాగా
అవును అట్లాగే అనుకోవచ్చు. పైసా కోసం తాతను మింగేసారని అంటుంది మా బాపమ్మ. అందుకే ఆమెకు కొడుకులంటే కోపం. కొడుకుల పుర్రె తొలిసి అమ్ముతాం అంటుంటే అమ్మొద్దు. భూతల్లిని నమ్ముకుంటే యాల్లకింత తిండివెడతది ఈ పైసలేమిస్తయ్‌ కరిగిపోవుడు తప్ప. అవి చేతిలో పెట్టుకొని పూరా పతనమవుడు తప్ప అంటే అందరూ ఆయనను ఎగతాళి చేశారు ఏర్రోడిని చేశారు.
అదుగో అటు చూడు. ఎలుకలు చేసుకున్న బోర్రెల్లోకి వాటిని కబలించడానికి పాము దూరుతాంది. ఆట్లనే మా ఊర్లల్లకి చొచ్చు కొచ్చి హైదరాబాదు మహానగరం మింగేసింది. బాధతో బొంగురు బోయిన స్వరంతో చెట్టు ఆకు కదలడం లేదు. ఉక్కపోతగా శేఖర్‌ మనసులాగా.
ఒరేయ్‌ చెప్పేది సరిగ్గా చెప్పేడువు… హైదరాబాదు మింగడం ఏమిటి నా మొద్దు బుర్రకు ఏమర్థం కాలేదు. మహేష్‌ పక్కనున్న గడ్డి పరకలు చేత్తో లాగుతూ.
అవును రా ఈ ఊరు చూడంగానే మహానగరం మింగేసిన మా ఊరు కళ్ళలో మెదిలింది. ఒకప్పుడు మా ఊరూ ఇట్లాగే చిన్న పల్లె. పట్నం దగ్గరలో ఉన్న పల్లె. పాలు పెరుగు, ఆక్కూరలు, పూలు, పండ్లు అన్ని మా ఊరికెల్లి పట్నం పోయి అమ్ముకొస్తుండిరి. ఊరు పచ్చపచ్చగా కళ కళ లాడుతూ ఉండేది. అసొంటి మా ఊరు ఇప్పుడు మాయమైంది.
చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు ఆమె కథలు చెప్పేది. ఆ కథలు వినడం కోసం ఆమె చుట్టూ తిరిగేవాడిని. అమ్మమ్మ చెప్పే కథల్లో ఒకటి కొండ చిలువ కథ. కొండచిలువ నోరు తెరిచి ఊ…ప్‌ అని లోపలికి ఊదుకుంటే లోపలికి పోతామని చెప్పినప్పుడు నోరేల్లబెట్టేవాడిని. ఆ తర్వాత అది చెట్టుకు చుట్టుకుంటే మన ఎముకలు పటపట ఇరిగిపోతాయని మనం దానికి ఆహారమవుతామని చెప్పినప్పుడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చెవులప్పగించి వినేవాడిని. ఎంత పెద్ద మనుషులనైనా ఎట్లా మింగేస్తుందని ఆమె చెప్పినప్పుడు నమ్మబుద్ధి అయ్యేదికాదు.
కానీ ఇప్పుడు అర్థమయింది. మా పల్లెని, పల్లె జనాన్ని మహానగరం కొండచిలువలాగే మింగేసిందని. అది బలిసి పోవడానికి మా పల్లెలాంటి ఎన్ని వందల పల్లెలు మహానగరం కోరల్లో చిక్కి శల్యమయ్యాయో..? నిగ నిగా మెరిసే నల్ల త్రాచులాంటి రోడ్లను, ప్లయి ఓవర్లను వాటి అందాన్ని, ఆకాశానికి ఎగిసే బంగ్లాలు అవి మెరిసే మిల మిల మెరుపులను తళ తళలాడే తళుకులను చేశామే కాని ఆ వెనుక అందులో నిండి ఉండే విషాన్ని, విషాదాన్ని గుర్తించలేకపోతున్నాం. ఆ విషాన్ని, విషాదాన్ని ముందే గుర్తించిన మా తాతని అంతగల్సి పిస్సోడి కింద జమకట్టడం, ఆయన్ని పోగొట్టుకోవడం మా జీవితాల్లో పెనువిషాదం కాదా..? మహేష్‌ కళ్ళలోకి గుచ్చి చూస్తూ శేఖర్‌.
ఊ…. అవునురా గుండెల్ని పిండేసే ఎన్నో విషాద గాధలు, గొంతెత్తి చెప్పుకోలేని భయానక దృశ్యాలు ఎన్నో ఈ మహానగర విస్తరణలో అక్షరజ్ఞానం లేని మా అత్తమ్మ వాళ్ళని డబ్బు ప్రలోభపెట్టి అతి చౌకగా వాళ్ళ పొలాలు కొని ఇళ్ళ ఫ్లాటులు వేసి కోట్లు సంపాదించారు కొందరు. కష్టం చేసుకుని చేయి చాచకుండా బతికిన మా వాళ్ళు ఇప్పుడు తిండికి గగనమై రేషన్‌ బియ్యం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నారు ఆలోచిస్తూ దూరంగా కొండలకేసి వెళుతున్న సూర్యుడుని చూస్తూ మహేష్‌.
నీ స్నేహం, వెంకటరావు సారు పాఠాలు బుర్రకెక్కించు కుంటుంటే తెలుస్తోంది. మా అలవాట్లు పద్ధతులు, ఆచారాలు, సంస్కృతి, తిండి అన్ని అన్నీ మారిపోయాయి. మావి కానివి మాకు తెలిసీ తెలియకుండానే మా ముందుకొచ్చాయి. మమ్మల్ని ఊరించి మొహించేలా చేశాయి.
కట్టెల పొయ్యిలో బూడిదతోనో, పొట్టు పొయ్యి, ఊక పొయ్యి బూడిదతోనో గిన్నెలు తోమిన అమ్మ తోమడమే మానేసింది. పని మనిషిని పెట్టుకొని సబ్బుతో తోమించడం మొదలుపెట్టింది. మా బాపమ్మ చెరువుల మట్టితోటో గంజి తోటో తల స్నానం చేస్తే మా చిన్నప్పుడే మేం లైబాయ్‌ సబ్బునే నెత్తికి, పెయ్యికి వాడేవాళ్ళ. ఇప్పుడు రకరకాల వాసనలు. నురగలతో మేనిని మెరిపిస్తామంటూ ఏవేవో సబ్బులు శాంపులు వాడుతున్నాం. వేపపుల్ల, తంగేడు పుల్ల, కానుగు పుల్ల ఏది దొరుకుతే దానితో పళ్ళు రుద్దడం లేకుంటే పొయ్యిల బూడిదతోటో పండ్లు తోమే వాళ్ళం. ఆ జాగాలో మిల మిల మెరిపించే పళ్ళనిస్తాయంటూ ఏవేవో పేస్టులు చాయ్‌ తాగ కుంటిమి అంబలి తాగేవాళ్ళం. పుట్టమన్ను తోటో, పాటిమన్నుతోటో ఇల్లు అలుకు పూత చేసేవారు అమ్మ వాళ్ళు.
సద్దిబువ్వ తిని, ఆనిగెపుకాయ బుర్రలో నీళ్ళు పోసుకొని వెంట తీసుకుపోయేవారు. జీడిగింజ వేసి కాసిన నువ్వుల నూనె నెత్తికి అంటుతుండేవారు. మా బాపమ్మ నెత్తి అరవై ఎండ్లోచ్చిన ఇప్పటికీ ఎక్కడో ఒకటి తప్ప నల్లగా నిగ నిగలాడుతుంది. నా నెత్తి చూడు శాంపులతో ఎట్ల ఉన్నదో నెరిసిపోయే జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుకుంటూ తనకేసి చూస్తున్న మహేష్‌ని చూసి నవ్వుతూ శేఖర్‌.
మా తాత విత్తనాలు కొనేవాడు కాడు. పండిన పంట నుంచి విత్తనం వడ్లు, మక్కలు, జొన్నలు, కూరగాయలు అన్ని తీసేవాడు. బాగా ఎండబెట్టి బూడిద కలిపి బట్టలో కట్టి కుండలో జాగ్రత్త చేసేవాడు. అవన్నీ ఎక్కడ పోయినయో… ఏ ఏట్ల గల్ల్సిపోయినాయో…. ఆ శ్రమ సౌందర్యం కానరావడం లేదు. అప్పటివరకూ ప్రవాహంలా సాగిన అతని మాటల ప్రవాహానికి ఏదో అడ్డుకట్టవేసినట్లు నిట్టూరుస్తూ….
మీ ఊర్లోనే కాదు దాదాపు అన్ని ఊర్లు మారినయ్‌. మార్పు సహజం లేకపోతే మానవుడు ఇంత అభివృద్ధి చెందేవాడే కాదు శేఖర్‌ అభిప్రాయం కోసమా అన్నట్లు ఒక క్షణం ఆగి మళ్లీ తానే
అభివృద్ధి పేరుతోనో టి.వి మన నట్టింట్లకి చొచ్చుకొచ్చి మన దగ్గర లేనివెన్నో, మనకి అలవాటు లేనివెన్నో మనకలవాటు చేసింది. దాని ముందు కట్టి పడేసింది. కచేరి కాడ ముచ్చట్లు తగ్గిపోయాయి. ఒకనాటి ఆదరణ, అప్యాయత, స్వచ్ఛత పోయి పల్లె మనసులు కలుషితం అయిపోయాయి. మనిషి కంటే వస్తువులకే ప్రాధాన్యత పెరిగిపోయింది. కోరికలు గుర్రాలై సవారీ చేస్తున్నాయి కదూ…. సాలోచనగా మహేష్‌.
అవునురా అప్పుడు మేమెప్పుడూ చూడనివి బంజారా హిల్స్‌ లోనో, జుబ్లీహిల్స్‌ లోనో ఉండే ఇంధ్రభవనాలు. ఆ బంగ్లాల్లో ఉండే సోకులన్నీ మాకొచ్చాయని మురిసిపోయేవాళ్ళం. అంతుకు ముందు తినే జొన్న రొట్టే, సర్వ పిండి, పచ్చి పులుసు లాంటి వంటలన్నీ ఇంట్లోంచి మాయమయ్యాయ్‌. అసలు ఇంటి వంట తగ్గిపోయింది. మాకూ చదువు మీద ధ్యాస తక్కువయింది. పిజ్జాలు, బర్గర్లు, సినిమాలు షికార్లు… డిస్కోలు ఎక్కువైపోయాయి. మా అమ్మా వాళ్ళకి టి.వి. సీరియళ్ళతో పోల్చుకుంటూ షోకులు నగలు, చీరలు, షాపింగులతో సమయం చాలదు.
ఇంతకీ మీ బాపు వాళ్ళు ఇప్పుడు ఏమి చేస్తున్నారు ప్రశ్నార్ధకంగా మొహం పెట్టి మహేష్‌
మా బాపు వేళ్ళనిండా బంగారు ఉంగరాలు పెట్టుకొని, బ్యాంకులో పైసలు కరిగిచ్చుకుంట రాజకీయాలు అని తిరుగుతున్నడు. చిన్న బాపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టి డబ్బు మత్తులో మునిగిపోయాడు. పెద్దబాపు కొన్ని పైసలు పిల్లల పేరున జమవేసి కొంత పెట్టి ఫైనాన్స్‌ వ్యాపారం నడుపుతున్నాడు. చేతికున్న బంగారు ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పుతూ శేఖర్‌.
ఓ………. తల ముందుకు ఊపుతూ మహేష్‌
మొత్తం మీద చేన్లో ఒళ్ళు పులిసే లాగా, కండరాలు కరిగే లాగ ఒళ్ళు వంచి పనిచేసే బాధ తప్పినందుకు మా వాళ్ళు అంతా సంతోషపడ్డారు. మా బంధువర్గంలో అంతా మేమేదో ఘనకార్యం చేసినట్లు ఆహా…. కాదు కాదు మా దగ్గర డబ్బు జమైంది కద అందుకే మమ్ములను మా డబ్బును గొప్పగా చూస్తున్నారు. కానీ, మా బాపమ్మ చిన్నాయిన కొడుకు మల్లయ్య తాత మాత్రం ఎన్నడూ మా ఇంట్లోకి తొంగి చూడలేదు. బాపమ్మ దగ్గరికి వచ్చి పోతుంటాడు. అయితే ఎక్కడ కనపడినా మీ తాతలో ఉన్న కష్టపడే గుణం మీలో లేదుర. మీరంతా కష్టం చేయకుండా పైస కావాల్నని, జల్సా చేయాలని అనుకుంటున్నరు. కానీ మీ తాత అట్ల కాదు. కష్టపడాలి, చెమటోడ్చాలి సంపద సృష్టించాలి. నలుగురికి పని కల్పించాలి అనేవాడు. మనం ఏం వేసినా మంచి పంట తీయాలి. అప్పుడే మన ఒళ్ళు మన ఇల్లు మన ఊరు అంతా మంచిగుంటదనేవాడు. ఒక్కడికన్న మా తాత గుణం రాలేదని బాధపడేవాడు. చిల్లి గవ్వలకు ఆశపడి బంగారం లాంటి తిండి పోగొట్టుకున్నారని మా బాపు వాళ్ళని తిట్టేవాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ మా ఇంట్లోవాళ్ళకి కనిపించినా అవే మాటలు. మా తాతకి బావమరిదే కాదు దోస్తు కూడా గద. అందుకే మా వాళ్ళు ఆయన మాటలని వినీ విననట్లే ఉండేవారు.
అప్పట్లో మా బాపువాళ్ళు చిన్నప్పుడు దుకాణంకి పోయి కొనేది చాలా తక్కువ ఉండేవి. మా పొలంలోనే వడ్లు, గోధుమలు మక్కలు, జొన్నలు తైదలు అవింత ఇవింత వేసేవారు. ఎండాకాలం పంటగా నువ్వులు, పల్లి సూర్యపువ్వు వేసేవారు ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కూరగాయలు, పెసర్లు, మినుములు, శనగలు అన్ని వేసేవారు. గట్లమ్మట కందులు వేసేవారు. మక్కలో ఇంత పసుపు వేసేవారు. మా తాతకు చుట్ట తాగే అలవాటుండేది. అందుకోసం పోగాకు కొంచెం వేసేవాడు. ఉప్పు, చక్కెర. చాయ్‌ పత్తా, ఇంత బెల్లం కొనే వాళ్ళట అన్ని పండుతోంటే స్వచ్ఛమైన శుభ్రమైన ఆహారం అందుకే రోగాలు తక్కువ. ఆయుస్సు ఎక్కువ ఉన్నదాంట్లో అంతా సంతోషంగా ఉండేవారు. తృప్తిపడేవారు. మల్లయ్య తాత చెప్పాడు ఆకాశంలో మారుతున్న రంగులకేసి చూస్తూ శేఖర్‌.
అవున్రా మీ మహానగరంలోనే కాదు మా పల్లెల్లోను ఎన్నో మార్పులు. ఇంటిపై అంటేన్నాలు ఎప్పుడు మొలిచాయో అప్పటి నుండి ఎన్నో మార్పులు ఆ మార్పు అంతా అభివృద్ధి కోసమే అంటారు. అసలు అభివృద్ధి అంటే అర్థం ఏమిటో శేఖర్‌ ఏం చెబుతాడోనని అతనికేసి చూస్తూ మహేష్‌.
ఏమోరా… ఇప్పుడు పంటలు పండించేవాళ్ళు తగ్గిపోయారు. అవసరాలు పెరిగాయి. ఊర్లోనే బట్టలు నేసేవాళ్ళు, గంపలు చేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, చెప్పులు చేసేవాళ్ళు కమ్మరోల్లు, వడ్లోల్లు అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారో వాళ్ళంతా వారి ఉత్పత్తులు కనుమరుగయ్యాయి. వరి మోళ్ళ మధ్యలోంచి నీళ్ళపై మెరుస్తున్న సూర్యకిరణాల్ని తదేకంగా చూస్తూ తన ధోరణిలో చెప్పుకుపోయాడు శేఖర్‌.
నిజమేరా మా ఊర్లోను కులవృత్తులు చేసేవాళ్ళు కొందరు తమ వృత్తిలో కుటుంబాన్ని పోషించలేక అందులోంచి బయటపడలేక నరకం అనుభవిస్తున్నారు. ఎవరి సంగతో ఎందుకు? మా కుటుంబాన్ని చూడు. మాది వడ్రంగి వృత్తి. మా చిన్నప్పుడంటే ఎడ్లబండ్లు, నాగళ్ళు, కర్రులు వంటి వ్యవసాయ పనిముట్లు ఇంట్లోకి కావలసిన బెంచీలు, బీరువాలు పీటలు, ఎత్తు పీటలు మంచాలు ఇట్లా ఏదోటి చేసేవాడు మానాయన. ఇప్పుడవి అవుసరపడతలేవు కద. ఎడ్లు బండ్లు పోయే అన్నిటికి మిషన్లు వచ్చే చెక్క జాగాలో తయారైన ప్లాస్టిక్‌ సామాన్లు వచ్చే ఇంకా మా బోటి వాళ్లకు పని ఎక్కడిది? మనం తయారు చేసిన వాటికి విలువ లేకపోవడం. బయటి నుండి వచ్చే వాటిపై ఉన్న మోజు కారణం కావచ్చు. బతుకు భారం అవుతాంటే చదువుకోరా కొడకా లేకుంటే ఈ లోకంలో బతకలేవు అని చెప్పేవాడు మా నాయన. తండ్రి మాటలు గుర్తు తెచ్చుకుంటూ మహేష్‌.
అప్పటివరకు నిండా గాలితో ఎగురుతున్న జీవితం పగిలిన బెలూన్లాగా అయిపోయింది. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది. చేతిలో గుడ్డి గవ్వల్లా, చెల్లని చిల్లర పైసల్లా మిగిలాం. మా తాత మాట విని ఉంటే చేతిలో కాసుల గలగలా లేకున్నా తిండికి లోటుండేది కాదు. ఈ రోజు ఇప్పటికి మా పరిస్థితి ఫరవాలేదు. కానీ ఇట్లాగే ఉంటుందని, రేపటికి మెతుకు కోసం వెతుకులాట ఉండదని అనుకోను కళ్ళు భుజాలు ఎగురవేస్తూ శేఖర్‌.
పడమటి దారులు అరుణారుణ వర్ణం పులుముకుంటుంటే కొండచిలువ కోరల్లో చిక్కిన అభివృద్ధి గురించి ఆలోచనలతో లేచారిద్దరూ రేపటి భానోదయంపై ఆశతో.

Tag Cloud

%d bloggers like this: