The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో’

ఆ ఇంట్లో .. ఆ రాత్రి

నిద్ర పట్టక నవారు మంచం పై అటూ ఇటూ  కదులుతూన్న కల్పన దుప్పటి ముసుగు తీసి చెవులు రిక్కించింది .  నిశబ్ద నిశీధిని చీల్చుతూ కుక్కలు  భౌ భౌ మంటూ  అరుపులు.. కీచురాళ్ళ ద్వనులు ..  దగ్గరవుతూన్న బూట్ల టక టక శబ్దం..మనసులో ఆందోళన .. తెలియని భయం .. ఏం జరగబోతోంది ..? మనసు పరిపరి విధాల ఆలోచిస్తూ .. చలికి తోడు భయంతో బిగుసుకు పోయి ముసుగు తన్నింది.  ఉక్క పోతగా.. ముసుగు తీసింది.  అసలు నిజంగా ఆ శబ్దాలు వినిపిస్తున్నాయా ..? లేక తన భ్రమా.. ? సందేహం .. ఆమెకి .

తలుపు తట్టిన చప్పుడు.  చెవులు రిక్కించింది .  బుంటి గొంతు చించుకొని అరుస్తోంది . అంతలోనే తలుపు బద్దలైపోతుందా అన్నట్లు ధన్.. ధనా ధన్ శబ్దం .. ఇంటి కుక్క బుంటి మరింత గట్టిగా మొరుగుతోంది.   అది మిద పది కరిచేప్పుడు ఎలా అరుస్తుందో అలా ..
ఏం చేయాలి ఇంటాయన లేరు . పిల్లలు గాఢ నిద్రలో.. కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమెకు.  అలాంటి క్షణాలు ఎప్పుడైనా రావచ్చని ముందే ఉహించినా.. వాటిని ఎదుర్కోవడానికి తనను తాను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నా ఆమెకు  కాళ్ళు వణుకుతున్నాయి.  లేచి వెళ్లి తలుపు గడియ తీయకపోతే పగులగొట్టి లోపలి వచ్చేసేటట్లు ఉన్నారు వాళ్ళు.  ఈ లోగా దక్షిణం వైపు, పడమటి వైపు కూడా బూట్లతో నడచిన  చప్పుదు.. ఇంటిని చుట్టు  ముట్టినట్లుగా.. బుంటి అటూ ఇటూ పరుగులుతీస్తూ .. అరుస్తూ .  ఎవరో దాన్ని ఒకటేసినట్లున్నారు .  కుయ్యో .. మొర్రో .. అంటూనే వాళ్లపైకి లంఘిస్తూ .. అడ్డుకోవడానికి యత్నిస్తూ .
నెమ్మదిగా వెళ్లి తలుపుకు వేసిన గెడ తీసిందో లేదో .. ఎనిమిది మంది ఒక్కసారిగా లోనికి దూసుకొచ్చారు యమభటుల్లా .. ఇంట్లో తలో దిక్కు అయ్యారు .   వాళ్ళలో ఒకరు ఇల్లంతా ఆ చీకటిలో టార్చ్ లైట్ ఫోకస్ చేసి చూస్తూ  “మీ ఆయనేడి?” సూటిగా ఆమె  కళ్ళలోకి చూస్తూ  అధికారయుతంగా ప్రశ్న సంధించాడు .  వాళ్ళంతా తలకి నల్లటి తోలు టోపీలు, పై నుండి కింద దాక పొడవాటి కోట్లు దిగేసుకొని , కాళ్ళకి బూట్లుతో గజ గజ వణికించే చలిని నుంచి కాపాడు కోవడం కోసమో.. నా లాంటి వాళ్ళని బెదరగొత్తడం కోసమో ఆ దుస్తులు మనసులో ఆమె .  వాళ్ళనే భయం భయంగా, బెదురుగా బెదురుగా చూస్తూ ..
ఆమె జవాబు చెప్పేలోగా ఆగలేని ఒకడు “వాళ్ళెవరు?” పక్కన మంచం మీద నిండా తన్నిన ముసుగును చూపిస్తూ ..
“మా పక్కింటి అమ్మాయి ”  , ఆమె జవాబు .
వాళ్లకి నమ్మకం కలిగినట్లు లేదు .
“మీ ఆయనెక్కడ ?” గద్దించాడు పిల్లి గడ్డం
“లేరు ” ముక్తసరిగా లో గొంతుకతో ఆమె
“నిజం చెప్పు” చేతిలో ఉన్న గన్ ఆమె కేసి గురిపెడుతూ  ఆ పిల్లిగడ్డం
“నిజంగానే లేరు” ప్రాణాలుగ్గబట్టుకొని కల్పన గొంతు పెగలక వచ్చిన పీల స్వరంలో.
“ఎక్కడికెళ్ళాడు” వాళ్ళలో వొకరు
“తెలియదు ” ఆమె మొహం లోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తూ  మరొకరు
“ఎప్పుడెల్లాడు “?
” ఎందుకెళ్ళాడు ?”
“ఎప్పుడొస్తాడు?” ప్రశ్నల పరంపర
“తెలియదు” అదే సమాధానంతో ఆమె
” తెలియదా … నీకు తెలుసు చెప్పకుండా నాటకాలాడుతున్నావా ..?” విసురుగా ఏదో అనబోయాడు పిల్లిగడ్డం.
” ఈ మంచం మిద ఉన్నదెవరు ? ” అప్పుడే లోనికి వచ్చినతను ముసుగులో కదలికల్ని చూస్తూ
“మా… ” ఆమె జవాబుకి అవకాశం లేకుండానే, సూదంటు చూపు వాడోచ్చ్చి గబుక్కున ముసుగు లాగేశాడు .
భయంతో వణికిపోతున్న ఇరవై ఏళ్ల యువతిని చూసి సవాలక్ష ప్రశ్నలు వేశారు.
ఇల్లంతా భీభత్సం చేశారు .  బట్టల పెట్టెలని, బిరువాలోని సామానుల్ని వంటగదిని ఏది వదలలేదు.  బెడ్ రూమ్ పైన ఉన్న ఎలిసి (అటక)మీద కూడా ఎక్కి చూసారు . చిందరవందర చేసారు .
వాళ్లకు కనిపించిన హోమియోపతి మందుల పుస్తకాలు, మందుల కిట్టు పట్టుకొని “ఇవి ఏంటి” చురకత్తుల చూపులతో బండాడు గద్దింపు
“హోమియోపతి ….  ” ఆమె జవాబుకి తావివ్వకుండానే
“ఎవరికోసం ” ?  పిల్లి గడ్డం ప్రశ్న
” మేమే వాడతాం”
“నువ్వూ ఇస్తావా మందులు” సూదంటు చుపులాడు
“లేదు, మా ఆయన ఇస్తారు “
“ఎవరికోసం ” మళ్లీ అదే ప్రశ్న బండాడి నోటివెంట
” ఎవరి కోసం ఏమిటి .. మా కొసమె.. మా ఇంట్లో వాళ్ళకోసమే ” చివర్లో వత్తి పలికింది ఆమె .
“కాదు.. నక్సలైట్ల కోసం .. అవును, వాళ్ళకోసమే కదూ..  ” తనకేదో తెల్సిపోయింది అన్నట్లుగా ఫోజు పెట్టి ఆమె మొహం లోకి చూస్తూ నల్లగా బుర్ర మీసాలతో ఉన్నతను .. మిగతా వాళ్ళూ అదేపని చేస్తూ ..
“నక్సలైట్లా .. వాళ్ళెవరు ” అమ్మయకంగా మొహం పెట్టి ఆమె ప్రశ్న కొంచెం కూడదీసుకొని
“మీ ఇంటికి చీకట్లో వచ్చి చీకట్లో వెళ్ళిపోయే వాళ్ళు.  వాళ్లకి వైద్యం మీ ఆయన చేస్తారు కదా .” ఆమెను నఖ శిఖ పర్యంతం కళ్ళతో పరీక్షిస్తూ, పరిశీలిస్తూ ..  వాళ్ళలో ఒకడు  అంటే, మిగతా వాళ్ళు చూపులతో గుచ్చేస్తూ ..
” వైద్య సదుపాయం లేని ఊళ్ళో ఉన్నాం. పిల్లాజెల్లా ఎ అవసరం వచ్చినా వెంటనే పట్నం వెళ్ళే అవకాశం లేని గ్రామంలో ఉన్నాం. ఆ ఇబ్బందుల నుండి బయటపడటం కోసం మా ఆయన వైద్యం నేర్చుకున్నారు ”  చీకట్లో వచ్చింది మీరే కదా మీరు నక్సలైట్లా అని కడిగేయ్యాలని ఒక క్షణం అనిపించినా, తనను తాను సర్ది చెప్పుకొని నిదానంగానే అన్నదామె.
ఆ మాటలకు ఒకడు అహ్హహ్హ…  మా చెవుల్లో పూవులు పెడ్తూన్నావా .. అన్నట్లుగా ఆ నవ్వు.
మిగతా వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ఇంగ్లీషులో మాట్లాడుకొంటూ ఉండగా , ఆ నవ్వినతనే ” చీకట్లో వైద్యం కోసం  ఎప్పుడెప్పుడు వస్తుంటారు ”  ఆరా తిస్తున్నట్లుగా
” మా ఆయన వైద్యుడు కాదు. రైతు .  సామాన్య రైతు మాత్రమే” కొంచెం కటువుగా.  ఆమెలో అంతకు ముందటి భయం, బెరుకు స్థానంలో ధైర్యం ..
అంతలో ఒకరు ” ఈ పుస్తకాలు మీ ఇంట్లో ఎందుకున్నాయ్” ప్రశ్న.   కార్ల్ మార్క్స్-కాపిటల్, నార్మన్ బెతూన్, కొట్నిస్, మావో సే  టుంగ్ ల  పుస్తకాలు పెట్టెలోంచి తీసి ఆవల విసిరేస్తూ
ఆ పెట్టెలోనే ఉన్న నీలం రంగు అంచుతో ఉన్న పింగాణి పాత్ర పై  బంగారు రంగుతో తీగెలు ఎంతో ముద్దులొలుకుతూ.. మధ్యలో చైనియుల బొమ్మతో  ఆ పాత్ర అంటే ఆమెకెంతో ఇష్టం .  చాల అపురూపంగా దాచుకుందామె.  ఉగాదిరోజు ఉగాది పచ్చడి చేయడానికి మాత్రమే ఆ గిన్నె వాడేది .  ఆ పాత్రతో పాటు ఇంకా  కొంత పింగాణి సామగ్రి నీ ఎత్తి కింద పడేశారు ఆగంతకులు .   ఆ పాత్రను అలా ద్వంసం చేయడం చూస్తోన్న ఆమె హృదయం ముక్కలు చేస్తున్న భావన . రక్తం మారిగి పోతోంది .  కోపం కట్టలు తెంచు కుంటూ .. ఆవేశం పొంగి వస్తూ ఉంటే..  పళ్ళ బిగువున అణుచుకుంటూ .. తనను తాను తమాయించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె .  అంతలో ఒకతను ఫైల్ అందుకొన్నాడు.  అందులోంచి జారిపడిందో కాగితం.  దాని వైపు చూసింది. కల్పన.  ఒక్క క్షణం గుండె గుభేల్మంది.  కానీ, మసక చీకటి.  టార్చిలైట్ల వెలుతురులో వాళ్ళెవరూ ఆ కాగితాన్ని గమనించలేదు .  ఆమె నెమ్మదిగా వంగింది.  వాళ్ళకి ఏ మాత్రం అనుమానం రాకుండా , చాలా సమయ స్పూర్తితో  చాకచక్యంగా వ్యవహరించింది.  ఆ కాగితం పైనున్న ఫోటో ని నెమ్మదిగా లాగేసింది. వేళ్ళతో ఉండలాగా చేసి నోట్లో వేసుకుని నమిలేసింది.
ఆ కాగితం ఆమె భర్త SSLC సర్టిఫికేట్ ఫోటోతో .  అమ్మో .. ఆ కాగితం ఆగంతకుల చేతిలో పడితే ఏమైనా ఉందా ..  భర్త వారి చేతికి చిక్కినట్లే. కల్పన తనకు తానే ఆశ్చర్యపోయింది.  అంత తెలివిగా తానేనా వ్యవహరించింది అని. పరిస్థితులు మనిషికి అన్నీ నేర్పుతాయేమో!
 ఆ రోజుల్లో ఫొటోలకి ఫ్రేమ్ కట్టి గోడలకి వేలాడేసేవారు.  ఆ ఇంట్లోను అదే విధంగా ఉండేవి.  సి. ఐ .డి వాళ్ళు ఎప్పుడయినా వచ్చే అవకాశం ఉందని ముందే గ్రహించిన ఆ కుటుంబం ఆ ఇంటాయనకు సంభందించిన ఫొటోలన్నీ తిసేసింది.  చిన్న ట్రంక్ పెట్టెలో పెట్టి తన చెల్లెలింటికి పంపించేశారు.
గతరాత్రి భార్యాపిల్లల్ని పొలం గట్టుపై కూర్చో బెట్టుకుని మాట్లాడాడు  ఆయన . పిల్లలు నలుగురినీ కూర్చోబెట్టి తాను  కొన్ని రోజులు ఊరికి వెళ్ళాలని, బాగా చదువుకోమని చెప్పాడు.  అమ్మ చెప్పినట్టు వినమనీ విసిగించ వద్దనీ చెప్పాడు.  వాళ్ళకేమీ అర్ధం కాలేదు. ” నాన్నా రోజూ పగలు ఇంటికి రావడం లేదే” కొడుకు ప్రశ్న.
“ప్చ్..”పెద్ద కూతురి నిట్టూర్పు అలా అడగకుడదని సైగ చేస్తూ ..
“నాన్నా .. నువ్వు నాకు ముద్ద పెట్టకపోతే .. నాకు ఆకలేస్తుందిగా .. నా బొజ్జ ఏడుస్తుందిగా” ఆయన ఒళ్లో కూర్చొని గారాలుపోతూ చిన్నకూతురు.
కల్పన కళ్ళలో నీరు తిరుగుతుండగా ఒళ్లో కూర్చున్న రెండో కూతురి మీదుగా వంగి తప్పు అట్లా అనకూడదని చెప్పింది . ” నాన్నా నేనూ నీతో వస్తా ”  చిన్న కూతురి మారం
“నువ్వు వచ్చేప్పుడు నాయినమ్మని తీసుకొస్తావా ” పెద్ద కూతురు.
“నాయినమ్మ వారం రోజుల్లో వచ్చేస్తుందిలే .. పంపమని చిన్నాన్నకు ఉత్తరం రాస్తా” అనునయంగా ఆయన.
“కల్పనా జాగ్రత్త . అప్రమత్తంగా ఉన్దన్ది. పిల్లలు నిన్ను విసిగిస్తారేమో. కాస్త ఓపికగా ఉండు. అమ్మ వచ్చేవరకూ నాన్నని జాగ్రత్తగా చూసుకో …,” అని పిల్లలవైపు తిరిగి “నాన్నఎతేల్లాడని తాత అడిగితే ఏం చెబుతారు ? “
” ఆచ్ ..అంటా” చిన్నకూతురు
“బిళ్ళలు, మామిడిపళ్ళు తేవడానికి వెళ్ళాడని చెప్తా” రెండో  కూతురు.
“మాకుతెలియదు, అని చెప్తా” పెద్ద కూతురు
“బుయ్ బూయ్ బస్ ఎక్కి వెళ్ళాడని చెప్తా ” యాక్షన్తో చెప్పాడు కొడుకు
భారమవుతున్న వాతావరణాన్ని తేలిక పరుస్తూ నవ్వారిద్దరూ .  మారోసారి జాగ్రత్తలు చెప్పి చీకటిలో కలసి పోయాడు ఆయన.
జీతగాడి సాయంతో ఎడ్ల బండిలో ఇంటికి చేరింది కల్పన పిల్లలతో సహా .
ఆ మరుసటి రోజే జరిగిందీ సంఘటన.  రెండు రోజుల ముందు వీళ్ళు వచ్చి ఉంటే ఆ ఆలోచనే ఆమెని భయకంపితురాలిని చేసింది . దాదాపు రెండు గంటల సేపు భీభత్సం చేసి, వేసిన ప్రశ్నలే అటుతిప్పి ఇటుతిప్పి వేసి విసిగించి వెళ్ళిపోయారు .
ఆ ఇల్లు మాదే .
ఆమె కల్పన నా కన్నతల్లి
ఆయన రంగారావు నా కన్నతండ్రి
1976 సంవత్సరం లో జరిగిన వాస్తవ సంఘటన
వి. శాంతి ప్రబోధ

 

Tag Cloud

%d bloggers like this: