The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘ఆడపిల్ల’

చితికిపోతున్న ‘సింగల్ పేరెంట్ చైల్డ్ ‘ బతుకు

ఆమె సింగల్ పేరెంట్ చైల్డ్ . తల్లి తప్ప తండ్రి తెలియదు . ఆమె పుట్టగానే
ఆడపిల్ల అనే కారణంతో అతను ఆమె మొఖమే చూడలేదు . ఆమె తల్లినీ పలకరించలేదు .
నిర్దాక్షిణ్యంగా వదిలేసి తనదోవ తాను చూసుకున్నాడు . తల్లీ బిడ్డలు
బతికారో చచ్చారో కూడా చూడలేదు . తల్లీ తండ్రీ అయి ఆమెను ఆమె తల్లి
పెంచింది.  బడిలోనూ, ఆధార్ కార్డులోనూ బ్యాంకు ఖాతాలోనూ తల్లి పేరే ఉంది
.  అందుకు ఆమె కొంత పోరాటం చేయాల్సివచ్చినా అది సాధించుకుంది ఆ తల్లి .
ఇప్పుడామె పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంది.  అప్పటి నుండి మొదలయ్యాయి ఆమె
కష్టాలు.

పాస్ పోర్ట్ అప్లికేషన్ లో తండ్రి పేరు లేని కారణంగా అది తిరస్కరణకు
గురయింది.  ఆమెకు ముక్కు మొహం తెలియని , ఈనాడూ ఇసుమంత ప్రేమ చూపని అతను
తన జన్మకు కారకుడైనప్పటికీ అతని పేరు చేర్చడం ఆమెకు ఇష్టం లేదు. కానీ
పాస్పోర్ట్ అధికారులు తల్లిదండ్రులిద్దరిపేర్లూ కావాలంటున్నారు. తండ్రి
పేరు లేకుండా పాస్పోర్ట్ ఇచ్చేది లేదని వత్తిడి తెస్తున్నారు.  ఒకరకమైన
మానసిక హింసని అనుభవిస్తోంది ఆమె. అప్పుడు ఆమె ఏం చెయ్యాలి?  తండ్రి పేరు
చెప్పని కారణంగా పాస్పోర్ట్ పొందే తన హక్కుని కోల్పోవలసిందేనా ..?  తాను
దేశాంతరం వెళ్ళవలసి వచ్చే అవకాశాల్ని వదులుకోవలసి వచ్చిందేనా ..?

ఆమె తల్లి ప్రియాంక గుప్తా రంగంలోకి దిగింది. పాస్పోర్ట్ అధికారులకు
విషయం నివేదించింది . సీనియర్ అధికారులను కలిసింది . ఉత్తరప్రత్యుత్తరాలూ
నెరపింది . వారిని ఒప్పించడానికి శతవిధాలా  ప్రయత్నం చేసింది. కానీ ఫలితం
లేదు . .

ఒకవేళ తండ్రి పేరు చేర్చి పాస్పోర్ట్ తీసుకున్నా తనంటే ఇష్టంలేని అతని
పేరు తన పాస్పోర్టులో చూసుకున్నప్పుడు కూతురు ఎంత మానసిక వ్యధను, బాధను
అనుభవిస్తుందో అర్ధం చేసుకుంది ప్రియాంక. ఇది నా ఒక్కదాని సమస్యేనా ..?
ఎంతోమంది ఒంటరి తల్లులు / తండ్రుల సమస్య . సింగల్ పేరెంట్స్ కి ఉండే
సమస్యలకు ఇదో సమస్య తోడయింది.  ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనీ,, సమాజం
నుండి సహకారం అందుకోవాలని భావించింది.  కోర్టు తలుపు తట్టింది .

తండ్రి పేరు అవసరం లేదని న్యాయ వ్యవస్థ ప్రగతి శీలమైన తీర్పు చెప్పింది .
విడాకులు తీసుకోవడం ద్వారానో , లేదా మహిళ సింగిల్మే గా ఉండాలనుకోవడం
వల్లనో గానీ రాను రానూ దేశంలో సింగిల్ పేరెంట్స్ పెరుగుతున్నారు . ఇలాంటి
సందర్భాల్లో  తండ్రిపేరు  తప్పని సరి కాదు .  వారికి ఇష్టమైతే
పెట్టుకోవచ్చు . కానీ బిడ్డకు ఇష్టం లేనప్పుడు ఆమె ఎవరి సంరక్షణలో ఉంటే
వారి పేరు మాత్రమే ఉండొచ్చని  మే 2016, ఢిల్లీ హై కోర్టు తీర్పు
వచ్చినప్పటికీ పరిస్థితి మారలేదు .

ప్రధానమంత్రి , హోం మంత్రి , స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి  తదితరుల
దృష్టికి సింగిల్ పేరెంట్స్ సమస్యలపై దృష్టి సారించవలసిందిగా వేడుకుంటూ
12 జులై, 2016 న  change.org ద్వారా పిటిషన్ వేసింది. ఈ విషయం పై మహిళా
శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వెంటనే (జులై 15)స్పందించారు .

ప్రస్తుత పాస్పోర్ట్ నియమావళి  ప్రకారం తల్లిదండ్రులిద్దరి పేర్లూ తప్పని
సరి . ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని, సమాజంలో
వస్తున్న మార్పులను అనుసరించి మన వ్యవస్థలోనూ , విధి విధానాల్లోనూ , నియమ
నిబంధనల్లోనూ సానుకూల మార్పురావలసిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు .
తనవైపు నుండి ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇటువంటి న్యాయబద్ధమైన అంశాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పడంతో పాటు
” నీ  భర్త ఆమెకు తండ్రిగా ఏనాడూ లేడు .  ఆ బాధ్యతలు నిర్వహించలేదు
కాబట్టి మీ అమ్మాయికి తల్లి పేరు మాత్రమే పెట్టుకునే హక్కు ఉంది . ” అంటూ
ప్రియాంకకు కొండంత అండగా నిలిచారు మేనకా గాంధీ .

ఇప్పుడు ప్రియాంక గుప్త కేంద్ర  విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మా స్వరాజ్ ఈ
విషయంలో జోక్యం చేసుకొని పాస్పోర్ట్ నియమ నిబంధనల్లో అవసరమైన మార్పులు
చేయవలసిందిగా అప్పీల్ చేశారు . అందుకోసం సోషల్ ప్రజల మద్దతు
కూడగట్టుకుంటున్నారు.

మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని మనం ఏర్పరచుకున్న నియమ నిబంధనావళి
వల్ల మనం కోల్పోకూడదు. అంటే, మారుతున్న సామాజిక పరిస్థితులకనుగుణంగా మనం
ఏర్పరచుకున్న నియమాలని మనం మార్చుకోవలసిందే .  వివిధ కారణాల కారణంగా
సమాజంలో సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఆ సింగిల్
పేరెంట్స్ఎక్కువగా ఉన్నది మహిళలే . పురుషులు చాల తక్కువే .

పిల్లలకి తల్లిదండ్రుల ద్వారా సమాజంలో ఓ గుర్తింపు లభిస్తుంది.
తల్లి/తండ్రి మాత్రమే ఆ బిడ్డ బాధ్యతలన్నీ మోసినప్పుడు తల్లి/తండ్రి ఎవరో
ఆ బిడ్డకు తెలియనప్పుడు లేదా తెలిసినా వారిపేరు పెట్టుకోవడానికి
ఇష్టపడనప్పుడు ఆ గుర్తింపు తల్లి/తండ్రి ఏ ఒక్కరికో మాత్రమే ఉంటుంది.
అదే సరైంది కూడా . కానీ ఆ బిడ్డని వదిలించుకుని లేదా వదిలేసి దూరంగా
అనామకంగా ఉన్న వ్యక్తి పేరు తప్పని సరి అని బలవంతం ఎందుకు ?  పురుషాధిక్య
సమాజంలో  సింగిల్ పేరెంట్స్ గా మహిళలు మానసికంగా, చట్టపరంగా ,
సామాజికపరంగా   అనుభవిస్తున్న ఇటువంటి సమస్యలపై చర్చ జరిగి సానుకూల
ఫలితాలు రావాలనీ , వారి సమస్యలకు తెరపడాలని కోరుకుందాం. వీలయినంత త్వరలో
పాస్పోర్ట్ చట్టంలో మార్పులు చోటు చేసుకోవాలని,  ప్రియాంక గుప్తా
కుమార్తె పాస్పోర్ట్ పొందాలని ఆశిద్దాం .

వి. శాంతి ప్రబోధ

(October 17, 2016, Navathelangana, Vedikalo Prachurana)

ఫీనిక్స్ పక్షినై …

నా కలలను ముక్కలు ముక్కలుగా విరిచేసి
చెల్లాచెదురుగా ఆవల విసిరి పారేస్తుంటే..
మండే హృదయపు లోపలి సెగను
గుండె సందుకలో దాచేస్తూ ..
మొహంపై రంగురంగుల నవ్వుల పువ్వులు పూయిస్తూ
విడిపోయిన ఆ కలల ముక్కల్ని
ఏరుకుని అతికించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నా ,,
తీయని మాటల మల్లెల సువాసనలు వెదజల్లుతూ
కులాల, కుతంత్రాల కుళ్ళు ప్రవహించే వారిలో
స్నేహం నేతిబీరకాయలో నేయి అని
గ్రహించలేక, వధ్యశిల కేలాడుతున్న నా కలల పూరేకుల్ని
ఏరుకుని కూర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నా ..

కానీ ,
అదును చూసి కాటేసే క్రిమినల్ ప్లాంట్స్
ఆరగించే డ్రోసిరా, గాటపార్ని, బ్లాడర్ వోర్ట్స్
టెంటకిల్స్ మధ్య ఉన్నానని గ్రహించలేకపోయా
తనువూ మనసూ చీలికలు పేలికలై రక్తమోడుతున్నా
సర్వశక్తులూ కూడదీసుకుని ప్రతిఘటిస్తూనే ఉన్నా

*** ***

విశ్వవిద్యాలయ ప్రాంగణాలు
నా కలలు పండించే నల్లరేగళ్ళనే
ఊహల పొరలు కరిగిపోయి
కన్పించే నగ్నదృశ్యాలు ఇవే ..
నేడిక్కడంతా చవుడు .. కలుపు మొక్కలు,
టెర్మినేటర్‌ సీడ్స్‌, క్రూరమైన వేటగాళ్ళు
ఇంజెక్ట్ చేసే విషబీజాల నారుమళ్ళు
అన్ని వైపులా విస్తరిస్తున్న ఊడల వేళ్ళు
కలలతీరం వదిలి కానరాని లోకాలకు
తరలి పోతున్న మెదళ్ళు

*** ***

క్లాక్ పక్షులు ఆహరం కోసం పాతి పెట్టే గింజలు
రేపటి తరం అడవిగా పురుడు పోసుకున్నట్లు
నా మరణం రాసిన సిరాతో
ఘనీభవించిన ఉక్కు పొరలు కరిగి,
ఆవిరైన మానవత్వపు చుక్కల్లోంచి
సంస్కారపు చివుర్లు మొలిచి
సృష్టించే నూతన అధ్యాయం కోసం
ఫీనిక్స్ పక్షి నై తిరుగుతూనే ఉంటా

వి. శాంతి ప్రబోధ

27 -9- 2015, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక , విజయవాడ బుక్ ఫెస్టివల్ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన “కవితా సందర్భం” లో చదివిన కవిత

బిజిలీ .. బుజ్జి .. బిడ్డ

అది అడవిగుండా సాగే బళ్ల బాట.  ఎత్తు పల్లాల గతుకుల  బాటలో 108 వాహనం దుమ్ము లేపుకుంటూ పోతోంది.  ఆ వాహనంలో ఉన్న యువతికి తోడుగా వెళ్లే ఆమె అత్త 65 ఏళ్ల బిజిలీ మనసులాగే .. ఆ దారిలాగే వారి జీవితాలూ…  ఆమె  శరీరపు ముడుతల మడతల్లో పేరుకుపోయిన ఎన్నో అనుభవాల్లా.. రాళ్ళూ రప్పల తాకిడికి తనువంతా అవుతున్న గాయాల్నితనలోనే ఇముడ్చుకుంటూ సాగిపోతున్న 108 అంబులెన్స్…

ఆ అంబులెన్స్ లోని స్ట్రెచర్ పై ఉన్న యువతి  బుజ్జి పురిటి నొప్పులు పడుతోంది.  ఆ పక్కనే ఉన్న పొడవాటి సీటుపై ఆశావర్కర్ తో పాటు  బిజిలీ కూడా కూర్చొని ఉంది.  డ్రైవర్ సీటు పక్కన ఆ యువతి భర్త కీమ్యా కూర్చున్నాడు.

రోహిణి పోయి మృగశిర వచ్చినా వేసవి తాపం పోలేదు.  దారి పొడవునా పసుపు పచ్చ గుత్తులతో అందాన్ని, ఆహ్లాదాన్ని పంచే రేలపూలు .. చిగుర్లు తొడిగిన తునికి ఆకులు.. రాలుతున్న విప్పకాయలు.. అన్నిటినీ ధూళితో పాటు వారి ఆలోచనల మేఘం కమ్మేస్తూ..   అడవిలోకి పోతున్న మేకల మందల  అరుపులు.. వాటి కాపర్ల కేకలు .. ఆ మందలతోనే సాగే యజమానిని అనుసరించే కుక్కల భౌవ్  భౌవ్ లు..  అన్నీ ఆ వాహనం చేస్తున్న రొదలో కలసిపోతూ.. సాగిపోతూ ..

ఈ సారన్నా మగ పిల్లవాడు పుడతాడో లేదోనన్న బెంగ బిజిలీలో .. మనసులో భయం.  ఆరుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుక్కు  కొడుకులు లేకపోతే  ఎట్లా …  ఈ వంశం ముందుకు పోయేదెట్లా … ఆమెకు ఆలోచనలతో తల వేడెక్కుతోంది. ఆమెను కృంగదీస్తోంది.  తలపై కప్పుకున్న వోణి తీసి నుదుటి  మీదుగా చెవుల వెనుకనుండి తిప్పి కప్పింది.  ఆమె మెడలో ఉన్న రంగు రంగుల పూసల దండలు అటూ ఇటూ కదిపింది సరి చేసుకుంటున్నట్లుగా.


కుదుపులకు పురిటి  నెప్పులు మరింత ఎక్కువయ్యాయేమో  ‘అమ్మా.. అమ్మా .. ‘ మధ్య మధ్యలో బాధగా అస్తోంది బుజ్జి.

‘కాస్త ఓర్చుకోమ్మా .. ఓర్చుకో ‘ ఆమె చేయి పట్టుకుని ధైర్యాన్నిస్తూ ఆశావర్కర్  సునీత

దరిద్రపుమొఖంది, కోరికోరి పైస కట్నం లేకుండా చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే ఆడిపిల్లల్నే కంటాంది. ఇంట్లో ఇప్పటికే ఇద్దరున్నారు. మళ్ళీ ఆడపిల్లయితే పెంచేదేట్లా .. పెద్ద చేసేదేట్లా .. ఆ రోజుల్లంటే ఎట్లనో అట్లా తను ఆరుగురికి పెళ్లి చేసి పంపింది.  కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి ..? ముందటి రోజులు ఇంకా ఎంత హీనంగా ఉంటాయో .. అందుకే మరో ఇద్దరు ఆడపిల్లల్ని పుట్టగానే  హాస్పిటల్ నర్సు, ఆయమ్మలకి అప్పచేప్పేసింది.  ఏమి చేశారో.. ఉన్నారో పోయారో తెలియదు.  కానీ బిడ్డలు పుట్టగానే చనిపోయారని చెప్పారు అందరికీ .  ఈ సారి కడుపులో ఉన్నది ఆడపిల్లో , మగపిల్లాడో పోటోతీసి చూడమని డాక్టర్ నడిగితే తిట్టారు. బతిమాలింది. ఎన్ని పైసలైనా పెడతానంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే  జైలుకు పంపుతామని బెదిరించారు.  ముంబాయి పనులకోసం పోయిన కేవళ్యానాయక్, తుల్జాబాయి  వాళ్ళకోడలికి  కంప్యుటర్ లో ఫోటో తీపిచ్చి చూస్తే ఆడపిల్ల అని చెప్పారట. కడుపులోనే ఆ బిడ్డని కరిగించేశారట అని ఎవరో చెప్పగా విని నా కోడల్ని డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి అడిగితే తననే పోలీసులకు పట్టిస్తానన్నాడు అని తిట్టుకుంది.  తన బాధ వాళ్ళకేం తెలుసని కోడలికేసి తీక్షణంగా చూస్తూ మూగగా వాపోయింది బిజిలీ.

ఎడమ వైపు కిటికిలోంచి కదిలే పచ్చని అడవి కేసి చూస్తూ తల్లీ  ఇన్నిరకాల మొక్కలకు నారుపోసి పెంచుతున్నవే .. నా భార్య కడుపున ఒక మగ బిడ్డని వేయొచ్చుగా..   అంటూ కనిపించని దేవతలకి మనసులోనే ఆర్దిస్తూ ..  బుజ్జి గర్భవతి అయిన ప్రతి సారీ కొడుకుపుడతాడేమోనన్న ఆశ తన్నుకొస్తుంది. కానీ మఖలో పుట్టి పుబ్బలో సచ్చినట్లు అయిపోతుంది. .. ఈ సారి కొడుకయితేనే ఇంటికి తెచ్చేది ఖరాఖండీగా అనుకున్నాడు కీమ్యా .. లేకుంటే ..? ఆ  ఆలోచన రాగానే ఏమీ  అర్ధంగాక దుమ్ముతో మసకబారిపోతున్న చెట్లు చూస్తూ .. కిటికిలోంచి తలవంచి కాండ్రించి ఉమ్మేశాడు.

పురిటి నెప్పుల కంటే అత్త మాటలు ఎక్కువగా  బాధపెడ్తున్నాయి బుజ్జిని. ఈ సారి కొడుకుని కనకుంటే ఇంట్లోకి రానిచ్చేది లేదని అంబులెన్సు ఎక్కినప్పుడు కూడా అన్నది.  అత్త మొండితనం తనకు తెలియనిదా ..!  తను అనుకున్నది చేసి తీరుతుంది.  మొగుడు భీమారయి పోయినా అంత మంది పిల్లలతోని సంసారం నెట్టుకొచ్చింది. కష్టం సుఖం ఏదయినా తన కడుపులోనే పెట్టుకునేది. ఇప్పుడు ఇట్లా మాట్లాడిందంటే … రేపు తన పరిస్థితి .. ఏమిటో .. తల్లి మాటే తన మాట అంటాడు భర్త. అసలు అతని మాటలే ఆమె నోట వస్తాయేమో..! అనుకుంది బుజ్జి.

పుట్టుకతోనే తను దురదృష్టవంతురాలు. పుట్టిన యాడాదిలోపే తల్లిదండ్రులు ఏడుపాయల జాతరకు పోయి ఏట్లో కొట్టుకుపోయారు. నాన్నమ్మ బాగానే చూసుకునేది. 15 ఏళ్ల వయసులో పాతికేళ్ళ కీమ్యాతో రెండో పెళ్లి. మొదటి భార్య కడుపుతో ఉన్నప్పుడు వాతం వచ్చి తల్లి, బిడ్డ చనిపోతే తనను కట్నం లేకుండా చేసుకున్నారు. పెళ్లయిన వెంట వెంటనే పిల్లలు. కొడుకు కావాలన్న కోరిక తీర్చడంలేదని అంతవరకూ బాగానే చూసుకున్న అత్త ఆరళ్ళు. ఎత్తిపొడుపులు .. తనకు ఎవరున్నారు ? అత్తిల్లయినా .. అమ్మ ఇల్లయినా ఇదే కదా ..ఎక్కడికి పోతుంది బిడ్డతో ?   నా తల్లి ఉంటే..  ఆమె కూడా కోడలితో ఇట్లానే ఉండేదా.. ఏమో ..! కడుపులో కదలికలు, నొప్పి ఉధృతమవుతుండగా సాగే బుజ్జి ఆలోచనలు.

‘దేవుడా నాకు మనవడినివ్వు . నా కొడుక్కు రెక్కాసరా ఇవ్వు’ మనసులో అనుకున్న మాటలు అప్రయత్నంగా పైకి వచ్చేశాయి బిజిలీ నోటివెంట.

అప్పటివరకూ కునికిపాట్లు పడుతున్నట్లు బుజ్జి చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న ఆశా వర్కర్ సునీత   ‘ఏం బుజ్జీ .. ఆడపిల్ల అయితే ఏమ్జేస్తవ్ ‘ నవ్వుతూ అడిగింది.  అసలే నొప్పుల బాధతో నీరసపడి,  వడలిపోయిన బుజ్జి  మొహం నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయి, ఆమె ఒంటిని కప్పిన వెలిసిపోయిన గులాబీ రంగు చీరతో పోటీపడుతుండగా.. నోట మాట రాక బిత్తరపోయి కళ్ళలో నీరూరుతుండగా అత్త వైపు ఓ సారి చూసి కళ్ళు మూసింది.

‘దీన్ని, పుట్టినదాన్ని ఆడనే ఇడ్సి పోత ‘ స్థిరంగా బిజిలీ కంచు కంఠం తరుముకొచ్చింది.
‘ ఏందమ్మ .. అప్పటికెల్లి జుస్తాన్న  నీ కోడల్ని బెదిరిచ్చుడు .. ‘ గదిమింది ఆశా వర్కర్ సునీత.
‘ఆమె ఆడబిడ్డని కన్నా .. మగబిడ్డని కన్నా దానికి కారణం ఆమె కాదు నీ కొడుకు.  నీ  కొడుకును రానీయకు ఇంటికి . ‘  కొంచెం గట్టిగానే అన్నది
‘అవ్  గట్లన్టవ్ .. అది కంటే నా కొడుకు నంటవ్ ..’ సునీత కేసి కోపంగా చూసి, బుజ్జి కేసి కోపం అసహ్యం మిళితమైన చూపు విసురుతూ అరిచింది బిజిలీ. తప్పు చేసినదానిలా తెరవబోయిన కళ్ళు గట్టిగా మూసుకుంది  బుజ్జి . ఆమె కన్నుల్లోంచి తడి సన్నగా పక్కకు జారుతూ.
తల్లి గొంతు విన్నాడేమో కాబిన్లో కూర్చున్న కీమ్యా  వెనక్కి తిరిగి అద్దంలోంచి లోపటికి చూశాడు.
బిజిలీ కోపాన్ని అర్థం చేసుకున్న సునీత   ‘చేను చెల్క ఉన్నదా .. ‘చాలా సౌమ్యంగా అడిగింది
‘ఆ.. జరంత ఉన్నది ? అదిడువు..  నేనోటి అంటే నువ్వెందో అడ్గుతవ్ ..? ‘ కటువుగా బిజిలీ స్వరం
‘అరె , యాడి.., అట్ల గుస్సా ఎందుకయితవ్.. అదే జెప్తాన్న.. జర తీరెం విను.  చేన్ల నువ్వు వడ్లు నాటితే జొన్నలొస్తయా ..?’ అడిగింది
ఇదేంటి అర్ధం లేని ప్రశ్న అన్నట్లు ఆశా వర్కర్ కేసి చూస్తూ ‘అట్ల ఎవరన్న జుసిన్రా ..’ బిజిలీ ఎదురు ప్రశ్న
‘లేదు, ఏ విత్తనమేత్తే  ఆ మొక్క మొలుస్తది కదా ..’ అంటూ బిజిలీ కళ్ళలోకి సూటిగా చూసింది సునీత.
అవునన్నట్లు చూసింది తలదించుకుని  ఏదో బోధ పడినట్లయి ఆలోచనలో పడింది ఆమె.
బుజ్జి తన మనసు, శరీరం పెట్టే బాధని అదిమిపెడుతూ ఆశా వర్కర్ చెప్పే మాటలకోసం ఆసక్తిగా చెవులు రిక్కించింది.
‘మరి ఇది సుత  గంతే గదనే బాయీ.. నీ కొడుకు విత్తనం ఏత్తే  కోడలు మొలకనిత్తది .. మక్కలేస్తే మక్కలయితయి గానీ .. వడ్లయితయా .. ? ‘ మళ్లీ  ప్రశ్నించింది సునీత.
బిజిలీ నొసలు ముడివడ్డాయి. జవాబు లేదు. బొడ్లో  దోపిన సంచీ తీసింది. అది చాలా పాతదే అయినా దానికి కుట్టి ఉన్న నాలుగు పలకల అద్దాలు,వాటి చుట్టూ తెల్లటి పూసలు జిగ్ జాగ్ గా .. అందంగా..  అందులోంచి అడకత్తెర, వక్క తీసింది. వక్కని ముక్కలుగా కత్తిరించి ఒక ముక్క తీసి బుగ్గన పెట్టింది.  తలెత్తి బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ జవాబు చెప్పలేకపోతోంది.
‘ నీ మనసుల ఏమాలోచన చేత్తాన్నవో నాకర్తమయితాంది.  నీ కొడుక్కు మారు మనువు జేయ్యాల్నన్న  ఆలోచన జేస్తున్నవ్ ..గంతే గదా .. ‘ బిజిలీ మొహంలో కదలాడే భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ సూటిగా ప్రశ్నించింది ఆశా వర్కర్.

కదలిపోతున్న పచ్చదనాన్ని చూస్తున్న బిజిలి,  ఆ పచ్చదనం తన కుటుంబంలోకి  ఎప్పుడు వస్తుందోనని ఆలోచిస్తోంది.
‘ ఓ బిజిలీ మాటడకచ్చినవ్ ..? పోయినేడాది కూడా నీ కోడలికి మా దవఖాన్లనే కాన్పు అయింది కద ..’ గతం  గుర్తుకు తెచ్చుకుంటూ అడిగింది సునీత.
‘ఆ .. అవును ‘, కొద్దిగా తొట్రుపాటు బిజిలీలో
‘బిడ్డ మంచి గున్నదా ‘ హాస్పిటల్ లో ఉండడానికి అవసరమైన బట్టలు, సామాన్లు సర్దుకుని ఇద్దరు ఆడపిల్లల్ని పక్కింట్లో అప్పజెప్తూన్నప్పుడు చిన్నపిల్ల కనపడకపోవడం గుర్తొచ్చి అడిగింది ఆశా వర్కర్.
గతుక్కుమన్నఆమె ‘ ఆ .. అదా … గప్పుడే జచ్చె ”  బిజిలి  స్వరంలో చిన్న తొట్రుపాటు
తనకు గుర్తున్నంత వరకూ పుట్టిన బిడ్డ బాగానే ఉంది.  ఆ తర్వాత ఏమైనా జబ్బు చేసిందేమో .. అడగబోతుండగా  మోటారు వాహనాలు దగ్గరవుతున్న చప్పుళ్ళు.

మలుపు తిరిగి మోటరుసైకిల్లు, జీపులు, కార్లు ఎదురయినాయి. ఆ ఇరుకు దారిని మరింత ఇరుకు జేస్తూ ..
‘అయ్యో ఏమయిందో .. ఏమో .. ముంగట వున్నవి మూడే తండాలు. ఇంకా ఆడ ఊర్లెడివి .. సుట్టుముట్టు  గుట్టలేనాయె .. ‘గాబరా పడింది బిజిలీ
‘ఏమిగాలే .. ఇవ్వాళ మలావత్ పూర్ణ వస్తున్నది కదా అదే గావచ్చు’  అన్నది ఆశా వర్కర్.
‘పూర్ణనా అదెవరు .. ?’
‘అయ్యో .. యాడీ .. పూర్ణ తెల్వదా .. తండా పిల్లనే  మీ పక్క తండా పిల్లనే, గద .. ‘ అంటూ పూర్ణ గురించి చాలా గొప్పగా చెప్పింది. ప్రపంచం అంతా ఆమెని ఎంత గొప్పగా  పోగుడుతున్నారో చెప్పింది.  తాడ్వాయి హాస్టల్ లో ఉండి చదివే పిల్ల ఎంత ఘనకార్యం చేసిందో వివరించింది సునీత.

అవన్నీ ఏమోగానీ సర్కారు 25 లక్షలు ఇచ్చినదని, ఇంకా చాలా మంది చాలా నజరానాలు ఇస్తున్నారని మాత్రమే బిజిలి చెవిలో గిన్గురుమంటోంది.

‘ఆ…  గుట్టలు కొండలు ఎక్కితే అంత పైసా ఎవరిస్తరు ? మేం చిన్నగున్నప్పటి కెల్లి పుల్లకు పోర్కకు , కాయకు పండుకు గుట్టలేక్కి దిగేటోల్లమే నయితిమి .. ఎన్నడన్న గిట్ల ఇచ్చిన్రా ..’ అంది నమ్మలేనట్లు చూస్తూ .
‘పూర్ణ ఎక్కింది మామూలు గుట్టలు కాదు ఎత్తైన పర్వతాలు.  ఆడపిల్లలని ఈసడించుకుంటున్నావు కానీ,  ఆమెకు అవకాశమిస్తే ఆకాశమే హద్దు .. ఇప్పుడు పూర్ణను చూస్తే తెలుస్తలేదా.. ఆమె కూడా మీ తండాలల్లనే పుట్టింది. చెట్లు పుట్టలు పట్టుకొని తిరిగింది. కానీ, ఆడపిల్ల అని పని పాటలకు పెట్టకుంట బడికి తోలి  చదివిపిత్తాన్రు  ఆమె అమ్మానాన్న.  అదే ఆమె బతుకు మార్చింది’  సునీత మాటలు  వాహనాల, డప్పుల వాయిద్యాల చప్పుళ్ళ మధ్య బిజిలీకి ఏమి అర్ధమయ్యాయో .. ?
ఎదురుగా లంబాడా గిరిజన మహిళల నృత్యాలతో సాగుతున్న వారి ప్రయాణం నత్త నడక లాగా .. అంబులెన్స్ డ్రైవర్ అదేపనిగా చేసే హరన్ చప్పుడు ..
ఎదురుగా వచ్చేవారికి దారి ఇవ్వాలన్నా ఇవ్వలేకుండా ఇరుకైన బాట.. సరిగ్గా వెళ్తే ఇంకో పదిహేనిరవయి  నిముషాల్లో గమ్యానికి చేరతారు.  కానీ ఇప్పుడు ఇంకెంత సమయం పడుతుందో .. బుజ్జికి నొప్పులు రాను రాను ఎక్కువవుతున్నాయి.. బాధతో అరుస్తోంది.  వాటికి   తోడు మనసులో ఆందోళనతో ఉన్న బుజ్జిని గమనిస్తూనే, ఆమెను ఓదారుస్తూనే  ‘నిన్న మొన్నటిదాంక మీ పక్కూరి  పూర్ణ, ఆమె తల్లిదండ్రులు, ఆమె ఊరు బయటోల్లెవరికన్న ఎర్కున్నదా.. గిప్పుడు జూడు  దునియా అంత ఎర్కె . మలావత్ పూర్ణ ఇంటి దిక్కు  ఆఫీసర్లు దారివట్టిన్రు.  చీమల బారుల్లెక్క కార్లు , జీపులు , బండ్లు ఎట్ల పోతున్నయో కండ్ల వడ్తాంది గద.  ఆమెను హాస్టల్ ల ఏసేతందుకు కులం సరిఫికేట్,  ఆదాయం సరిఫికేట్ ల కోసం ఆఫీసర్ల చుట్టూ కాళ్లరిగేటట్టు తిరిగిండు ఆమె నాయిన.   ఇగ గిప్పుడు చూడు ఉల్టా .. ఆల్లె వీళ్ళిల్లు ఎతుక్కుంట అస్తున్నరు.  ఊర్ల పెద్దలు, కలెక్టరు, ఎమ్మల్యే అంత పెద్ద పెద్దోళ్ళు ఆటే దారి పట్టి పోతున్నరు .. ఆమె ఇంకా ఊర్లె అడుగు పెట్టకుంటనే వాళ్ళింటికి పోయి పుర్ణ అమ్మానాన్నలను పలకరిచ్చి పోతున్నరు.  ఆమె మెడల పూలదండలు , బహుమతులు , సన్మానాలు ..  పేపర్లు .. టివి లల్ల  అంతా .. దునియా అంతా ఆమె సుద్దేనాయే .. ‘ ఉద్వేగంగా చెప్పుకుపోతోంది సునీత.

ఆ మాటలు వింటున్న బిజిలీ కళ్ళు విప్పారుతూ .. ముడుతలు పడ్డ చర్మం నిక్కబొడుచుకుని నిగారింపు వస్తూ .. అంతలో వారి గమ్యం  సిరికొండ దవాఖానా రానే వచ్చేసింది.  హమ్మయ్య, వచ్చేశాం అని ఊపిరి పీల్చుకుంది ఆశా వర్కర్.

కొద్ది సేపటికే నార్మల్ డెలివరీ అయింది బుజ్జి . ‘ఆడపిల్ల ‘ డాక్టర్ గొంతు వినగానే బుజ్జి వణికిపోయింది. ఒళ్ళంతా తడచిపోయింది.  బిడ్డ ప్రాణం, తన ప్రాణం అప్పుడే అటే పొతే బాగుండుననుకుంది. విషయం  తెల్సిన కీమ్యా ఆమె మొహం చూడకుండా భుజంపై ఉన్న కండువా తీసి విదిలించి మళ్ళీ మెడచుట్టూ వేసుకుంటూ బయటికి సరసరా నడిచి పోయాడు

మనసులో ఏముందో గాని మోహంలో ఎలాంటి భావాలు కనిపించనీకుండా పురిటి బిడ్డని చేతుల్లోకి తీసుకుంది బిజిలీ ..   భయంతో, బాధతో అత్తిపత్తిలా ముడుచుకుపోయిన బుజ్జి తలపై చేయివేసి నిమిరింది.  ఆ స్పర్శలోని ఆప్యాయత ఆమెలో ఎవరెస్టు ఎక్కినంత సంతోషాన్నిస్తూ.. బతుకు పట్ల భరోసా ఇస్తూ .. బుజ్జి కళ్ళలో ఆశ్చర్యంతో పాటు ప్రసరిస్తున్న వెలుగు,  మొహంలో పొంగుకొస్తున్న మెరుపు చూసి బిజిలీ మనసు నిండి పోయింది.  అత్త భర్తకి నచ్చచెబుతుందన్న ధీమాతో తృప్తిగా నిట్టూర్చి అత్త చేతుల్లోని బిడ్డకేసి చూసింది బుజ్జి .. వారి  కళ్ళు ఆశా వర్కర్ కోసం వెతుకుతూ ..

వి . శాంతి ప్రబోధ

(Published in Bhumika, November, 2015)

‘నేను ఆడపిల్లనవడం వల్లనే …. – నా గురించి నేను’

prajathanthra 0172014 సంవత్సరాన్ని Empowering Adolescent Girls: Ending the Cycle of Violence ( కిశోర బాలికల సాధికారత-హింసా నిర్మూలన) గా జరుపుకోవాలని UNO పిలుపునిచ్చింది. బాలికలు, యువతుల సంరక్షణ, సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం అంతర్జాతీయ బాలికా సాధికారదినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల వివక్ష , అత్యాచారాలు , కొట్టడం , హింసించడం, దాడి చేసి చంపడం ప్రతి రోజూ కనిపిస్తూనే, వినిపిస్తూనే…   అందుకు కారణం కుటుంబ సభ్యులో, బడిలో టీచర్ లో , తోటి వాళ్ళో, ఇరుగుపొరుగులో .. ఎవరో ఒకరు.  నిత్యం ఆడపిల్లలపై, మహిళలపై జరిగే దుశ్చర్యలకి కారణం ఏమిటి? ఎవరు? ఎవర్ని బాధ్యుల్ని చేద్దాం ..?  ఆడపిల్లని మగ పిల్లతో చూడలేనితనం, ఆమె హక్కుల్ని గౌరవించలేని గుణం కావచ్చు, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా ఆమెకు గుర్తింపు లేకపోవడం కావచ్చు.  ఆమెను  అధీనంలో వుండే ఒక వస్తువుగా చూడడం కావచ్చు.   సమానంగా చదువు లేకపోవడం కావచ్చు,  పెద్దల నిర్లక్ష్యం , నిరక్షరాస్యత, అవగాహనలేమి కావచ్చు.  లైంగిక, పునరుత్పత్తి, సామాజిక, ఆర్ధిక సేవలు అందుబాటులో లేకపోవడం కారణం కావచ్చు.  ఏదేమైనా  ఈ సమస్యకి  పరిష్కారం మన దగ్గరే మన కుటుంబంలోనే, మన  సమాజంలోనే ఉంది.  ఆడపిల్లలకి మహిళలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, వారిని విద్యావంతుల్ని , స్వశక్తి వంతుల్ని,  చైతన్య వంతుల్ని చెయ్యాల్సిన బాధ్యత అందరిదీ.  అందుకోసం  ప్రజలలో అవగాహన కల్గించాల్సిన, పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదొక్కటే కాదు.  దానితోపాటు వ్యక్తులు, సంస్థలు , అన్నిరకాల ప్రచార ప్రసార సాధనాలు మీడియా అందరూ బాధ్యత తిసుకున్నప్పుడే మనం ఆడపిల్లను హింస నుండి విముక్తం చేయగలం.  ఈ  హింస ఇలాగే కొనసాగితే నష్ట పోయేది ఆమె మాత్రమే కాదు. జాతి , జాతి మొత్తం ఎంతో నష్టపోతుంది.  ఆరోగ్యవంతమైన ఆడపిల్లలున్న సమాజం ఆరోగ్యవంతంగా ఎదుగుతుందన్నది ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా ..!
ఈ సందర్భంగా కిశోర బాలబాలికలతో పనిచేసిన సమయంలో వివిధ సందర్భాలలో మేం నిర్వహించిన కన్సల్టేషన్ లలోను, వర్క్ షాపులలోనూ వారు వెల్లడించిన విషయాలను, వివిధ కార్యక్రమాలలో పాల్గొని వారు పొందిన స్పూర్తితో తమ జీవితంలో తెచ్చుకున్న మార్పుని

నేను ఆడపిల్లనవడం వల్లనే

                                     – నా గురించి నేను’ 

అనే శీర్షికతో వారం వారం మీ ముందుకు రాదలచుకున్నా.

ఆ  కిశోరబాలికల అనుభవాలు, పొందిన వేదనలు, వాటిని ఎదుర్కొన్న విధం మరికొంత మందిని ఆలోచింప చేస్తుందనీ, చైతన్యం రావడానికి కొంతైనా తోడ్పడుతుందని మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాను.  ఇక్కడ మీ ముందుకు వచ్చే అమ్మాయిలు, వారి సమస్యలు కొత్తవేమీ కాకపోవచ్చు. అలాంటి మనుషులు, సమస్యలు మనమంతా రోజూ చూసేవే కావచ్చు .  వాళ్ళలో కొంతమంది  తమకింతే రాసిపెట్టి ఉందని నిర్లిప్తంగా జీవితాన్ని ఈడ్చేవారూ ఉండవచ్చు .  తమ స్థితికి కుంగిపోయి జీవితాన్ని అంతం చేసుకునేవాళ్ళు ఉండొచ్చు.  తాము ఎందుకు చిన్న చూపుకు గురవుతున్నాం, అన్నతోనో తమ్ముడితోనో సమానంగా ఎందుకు ఉండలేకపోతున్నామని ప్రశ్నించేవాళ్ళు సమానత్వం కోసం కృషి చేసేవాళ్ళూ ఉండొచ్చు.  తమకున్న క్లిష్ట పరిస్తితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు పోయేవాళ్ళూ తారసపడతారు. తమలాంటి మరి కొందరికి ధైర్యాన్ని, ఆత్మస్తైర్యాన్ని నింపేవాళ్ళూ కనిపిస్తారు.  అలాంటి వాళ్ళే మన ముందుకు వస్తారు.  మనకి స్పూర్తినందిస్తారు . అలాగే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నలుగురుకీ చెప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళూ ఉన్నారు.  అందుకే వారి ప్రైవసీ కోసం ఆ అమ్మాయిల పేర్లని, ఊర్లని  మార్చి చెప్తున్నాం. ఫోటోలు ఇవ్వలేక పోతున్నాం.

 

                                                                                       అమ్మేనా …?

“నా తల్లి కన్నా తల్లేనా అని నాకెప్పుడూ సందేహం.  ఆమె పేగు తెంచుకు పుట్టిన బిడ్డను అంత దారుణంగా తీసుకెళ్ళి అమ్మాయిలతో వ్యాపారం చేసే వాళ్లకి అమ్మేయగలదా ..?”

నా పేరు లిఖిత.  మాది నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం.  నేను చిన్నప్పుడు మా అమ్మా నాన్నలతోనే హాయిగా ఉండేదాన్ని.  అంగన్వాడి బడికి పోయేదాన్ని. నాన్న చనిపోయాడు.  ఎట్లా చనిపోయాడో తెలియదు. అమ్మ వల్లే చనిపోయాడని నాన్నమ్మవాళ్ళు అమ్మని ఇంట్లోంచి పంపేశారు.  అమ్మ వేరే అతన్ని చేసుకుంది. నేను అమ్మమ్మ ఇంటికి చేరాను.  నన్ను ఇంట్లోంచి పంపెయ్యమని మా చిన్న అత్తమ్మ రోజూ గొడవ పెట్టుకునేది.  నాన్నమ్మ వాళ్ళు నన్ను రానియ్య లేదు.   అప్పటి నుండి నాకు  అమ్మ, నాన్న, ఇల్లు అంటూ లేకుండానే..ఎప్పుడు ఎవరు ఎటు విసిరేస్తారో తెలియకుండా .. నా బాల్యం గడచి పోయింది. అందరు పిల్లలా బడి తెలియదు.  నేనున్నానని మామ వాళ్ళు అమ్మమ్మను ఇంట్లోంచి గెంటేశారు. నిజామాబాద్ వచ్చేసాం. చెట్లకిందో, బస్టాండుల్లోనో, దుకాణాలముందో  ఇంటి పంచలోనో రాత్రి పూట తల దాచుకునేవాళ్ళం.  అడుక్కు తినే వాళ్ళం.  ఓ రోజు నిద్రపోయిన అమ్మమ్మ లేవనే లేదు.  ఎవరు చెప్పారో.. ఎట్లా తెలిసిందో .. మా అమ్మ నన్ను తన దగ్గరకు తీసుకెళ్ళింది. అప్పటికే పదకొండేళ్ళు ఉండొచ్చు.

నేనెంతో సంతోషించా అమ్మ దగ్గరైనందుకు.  ఒక తమ్ముడున్నాడు. కొత్త నాన్న ఉన్నాడు.  తమ్ముడితో ఆడుకుంటూ ఉండేదాన్ని.  బడికిపోతానని అంటే, అమ్మ వచ్చే ఏడాది తమ్ముడిని నన్ను పంపుతానంది .   మా కొత్త నాన్నఆటో సరిగ్గా నడిపేవాడేకాదు. ఎప్పుడూ తాగి వచ్చేవాడు.  నన్ను ఎట్లాగో చూసేవాడు. ఒకరోజు అమ్మకి , కొత్త నాన్నకి చాలా గొడవ అయింది. ఎందుకో నాకు తెలియదు కానీ నా గురించే అని తెలుస్తాంది.   రెండు రోజుల తర్వాత అమ్మ ఊరికి పోదాం అని ఒక బాగ్ లో బట్టలు పెట్టింది. అమ్మ నేను, తమ్ముడు వెళ్లాం.  ఏ  ఊరికో తెలియదు. అమ్మ నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఏమి చెప్పకుండానే పోయింది. ఎటు పోయిందో తెలియదు.  వాళ్ళు ముప్పైవేల రూపాయలకు కొనుక్కున్నారని తెలిసింది.  అక్కడ ఉన్న వాళ్ళు అంతా నా కన్నా పెద్ద వాళ్ళే .  వాళ్ళు అదో రకంగా .. మొహాలకి , పెదవులకి రంగు పూసుకుని … ఎప్పుడూ మగవాళ్ళు చాలా మంది వచ్చి పోతుండేవారు .   నాకు అక్కడ అన్నం అన్నీ బాగానే పెట్టేవారు. బాగానే చూసుకున్నారు.  రెండు మూడు రోజులయ్యాక నా లాంటి పిల్లలు ఉన్న చోటుకి తీసుకుపోయారు.  అక్కడ మా ఫోటోలు తీసుకోవడానికి వస్తారని బాగా తయారవమని చెప్పారు.   ఆ రోజే నేను, రాజీ ఇద్దరం నెమ్మదిగా తప్పించాం.   మేం పరిగెత్తుంటే వేరే సార్లు మమ్మల్ని పట్టుకుని  వివరాలడిగి బాలసదనంకి పంపారు.  అప్పటి నుండి నేను బడికి పోతున్నా .   ఇప్పుడు ఎనిమిదోతరగతి చదువుతున్నా.  ఇప్పుడు నాకు అర్ధమవుతోంది ఇక్కడికి రాక పోతే నా జీవితం ఎట్లా ఉండేదో …  అందుకే బాగా చదువుకుని నా లాంటి పిల్లకోసమే పనిచేయాలని అనుకుంటున్నా..  మా అమ్మలాగా ఏ అమ్మా ఉండకూడని కోరుకుంటున్నా .

లిఖిత

 

 

                                                        నాన్న ఇలాంటి వాడా?  అసహ్యం వేస్తోంది

మంచి నిద్రలో ఉన్నాను. నా శరీర భాగాల్ని తడిమినట్లయింది. ఒక్క సారిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూద్దును కదా .. మా నాన్న.  నా పక్కనే నిద్రపోతూ .  నిద్రలో నా కెందుకు అట్లా అనిపించిందో నాకర్ధం కాలేదు.

అంతకు ముందు నాన్నమ్మ దగ్గర పడుకునే నేను నాన్న మస్కట్ పోయినప్పటి నుంచీ అమ్మ దగ్గరే పడుకునేదాన్ని.  అమ్మ జబ్బుతో చనిపోయింది. అప్పటి నుంచీ రోజూ నేనొక్క దాన్నేనులకమంచం వేసుకొని పడుకుంటున్నా.  రోజూ లాగే ఆ రోజూ పక్క పరుచుకు పడుకున్నా.   అమ్మ చనిపోయిందని వచ్చిన నాన్న మరి పోలేదు. బయట పందిట్లో పడుకుంటున్నాడు.  అన్న వదిన వేరే రూంలో.   నా మంచం చాలా చిన్నది. సన్నగా ఉంటుంది. నాన్న పడుకునేసరికి చాలా ఇరుకుగా అయింది. లేచి నీళ్ళు తాగి బాత్ రూంకి పొయొచ్చి మళ్ళీ పడుకున్నా.  కొంచెం సేపటి వరకూ అట్లాగే ఉన్నా . నిద్ర పట్టలేదు. లేచి చాప పరుచుకుని పడుకున్నా.

మరో రోజు కూడా అంతే. నిద్రలో హటాత్తుగా మెలకువ వచ్చి చూస్తే నాన్న నా పక్కన.  నాన్న ప్రవర్తన ఇదివరకటిలాగా లేదు. ఏదో తేడా .. తెలియడం లేదు. అతని దగ్గర మందు కంపు.  రాత్రవుతుందంటేనే భయం వేస్తోంది. నిద్ర రావడం లేదు. ఎప్పటికో నిద్ర పోయినా కలత నిద్రే.  నాన్న గురించి ఎవరికి చెప్పాలో, ఎట్లా చెప్పాలో తెలియడం లేదు.

ఓ రోజు అప్పుడే నిద్రపట్టింది. తన పురుషాంగాన్ని నాకేసి గట్టిగా రుద్దుతున్నాడు.  నా శరీర భాగాల్ని తడుముతున్నాడు. మెలకువ వచ్చేసింది. భయమేస్తోంది. ఏమనాలో , ఏమిచెయ్యాలో తెలియక భయంతో బిగుసుకున్నా. ఆ రోజు ఇంట్లో అన్న వదిన కూడా లేరు.  తట్టుకోవడం మనసుకి చాలా కష్టంగా ఉంది.  ఇక ఆగలేక  “ఏందే నాన్న .. ” అన్నాను  కోపాన్ని అదిమి పెట్టుకుంటూ.

చప్పున లేసి ధోతి సర్దుకుంటూ బయటికి పోయాడు.

లేచి వెళ్లి తలుపు పెట్టుకున్నా.  నాన్న ఇట్లా చేస్తున్నాడేంటి ? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న నాలో.   నిజానికి అమ్మ కంటే నాన్ననే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎంతో ముద్దు చేశేవాడు. అట్లాటిది ఇట్లా అయిపోయాడేమిటి.   మా నాన్న ఇట్లాటి వాడా అని చాలా బాధ, భయం కలిగాయి.  నేను కన్న బిడ్డ లాగా కనబడట్లేదా .. ? నేను ఆడపిల్లను కావడం వల్లేనా .? ఆడదానిగా మాత్రమే కనిపిస్తున్నానా .. ?           ఎప్పుడు తెల్లారుతుంది ? అన్నా వదిన మరో రోజుకి గానీ రారు.  వచ్చినా వాళ్లకి చెప్తే నమ్ముతారా ? నన్నే తప్పు పడతారా .. ? ఏమో ..అని  ఏదైనా తెల్లవారగానే అత్తమ్మ దగ్గరకి వెళ్ళిపోయా ..  ఆ తర్వాత నాన్న గురించి ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఆయన్ని చూడాలన్నా నాకు అసహ్యం వేసేది.

శ్వేత

లింగాపూరు

(ఈ సంఘటన ఆ అమ్మాయి  పద్నాలుగుపదిహేనేళ్ళ వయసులో జరిగింది )

ప్రజాతంత్ర సంపూర్ణ స్వతంత్ర వర పత్రిక 23-29, నవంబర్ 2014న  ప్రచురణ అయింది

ఆడపిల్లల్ని బ్రతకనీయండి

నేటి మహిళ రాకెట్ స్పీడుతో రోదసికేసి దూసుకుపోతోందని, ఆర్దిక, సామాజిక, రాజకీయ- ఇది అది లేక అన్ని రంగాలలో ముందుకు వెళ్తోందని ఓ వైపు గర్వంగా చెప్పుకుంటున్నాం. అదంతా నాణేనికి ఒక వైపు. మరో వైపు చూస్తే..?, ఆమె బతికి ఉండగానే కాల్చి బుగ్గి చేసేస్తున్నాం . అమ్మ కడుపులో నవమాసాలు నిండి ఈ లోకం లోకి అడుగుపెట్టకుండానే అమానుషంగా చిదిమేస్తున్నాం. పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న మనలో ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపే . ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆమె, అమ్మ కడుపులో ఉండగానే ఈ వివక్షతకు లోనవుతోంది. పుట్టేహక్కును కోల్పోతోంది. పుట్టినా జీవించే హక్కును కోల్పోతోంది. అందుకు కారణం ఎవరు? మనం ఎవరిని నిందించాలి? ప్రజలనా..? పాలకులనా..? మన విశ్వాసాలనా..? మత నమ్మకాలనా..? అమలు కాని చట్టాలనా..?

మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలు అమలు కాకపోవడం, సంప్రదాయాలు – ఆచార వ్యవహారాలు పేరుతో సాగే ఆడ – మగ వ్యత్యాసాలు, మత నమ్మకాల్లోంచి వచ్చిన అనాచారాలు, అజ్ఞానం, ఆడపిల్ల అంటే ఉన్న చిన్న చూపు, ఆమె అంటే ఉన్న నిర్లక్ష్యం వల్లే ఆమె చేసే పనికి తక్కువ విలువ కట్టడం, ఆమెను కని ఎంతో ఖర్చు చేసి పెంచినా ఆమె బాధ్యత గతంలోలా తీరకపోవడం, పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్ళినా అక్కడ భద్రత లేకపోవడం వంటివన్నీ కారణాలే అని చెప్పుకోవచ్చు. కారణాలేవైనా కానీయండి ఆడపిల్ల పుట్టకముందే, లోకం పోకడ తెలియక ముందే తల్లి గర్భంలో ఉండగానే వివక్షతకు గురవుతోంది. అది ఆమె గిట్టే వరకూ కొనసాగుతూనే ఉంది.

ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఆడ శిశువుల కంటే మగశిశువులు తక్కువ. కానీ చైనాలోను, మనదేశంలోనూ ఆ పరిస్థ్తితి అందుకు భిన్నం. బ్రిటిష్ వారి పాలనలోనే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితిని వారు గుర్తించారు. ఆ తర్వాత ప్రవీణ్ విసారియా, అశోక్ మిత్రా వంటి జనసంఖ్య శాస్త్ర పరిశోధకులు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆడ-మగ నిష్పత్తిలో తేడాలని గమనించారు. జనాభా లెక్కలు ఈ విషయాన్ని ధృవపరిచాయి. ఎనభయ్యో దశకంలో ముంబై , డిల్లీ నగరాల్లో ఆమ్నియోసెంటిసిస్ పరీక్షలు లింగానిర్దారణకు, ఆడపిండాల గర్భవిచ్చిత్తికి దారితీయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఫలితంగా ‘గర్భస్థ పరీక్షా ప్రక్రియ -నియంత్రణ మరియు దురుపయోగ నివారణా చట్టం – 1994 (PNDT Act) వచ్చింది. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదు. మన భారత రాజ్యాంగం, UN Convention on rights of child రెండూ పుట్టే ప్రతి బిడ్డకూ బ్రతికే హక్కు (ఆర్టికల్ – 6) ఉందని చెప్తున్నాయి. మనకి హక్కులు, చట్టాలు ఉండగానే సరిపోతుందా …? వాటి అమలు మాటేమిటి ? వాటి పట్ల ప్రజలలో చైతన్యం తీసుకురావలసిన అవసరం లేదా ..?

మగవాడికి ప్రాధ్యాన్యతనివ్వడం ఎప్పుడు ఎలా మొదలయిందో తెలీదు కానీ, ఆడపిల్లని సామాజికంగా, సాంస్కృతికంగా అప్పుగా భావిస్తూ ఉండడం మనం దాదాపు ప్రతి ఇంటా చూస్తున్నదే. ఆడపిల్లకు జన్మనిచ్చి వేలూ, లక్షలూ ఖర్చు చేసే బదులు గర్భస్థ దశలోనే వెయ్యో రెండువేలో ఖర్చు చేసి వదిలించు కోవడం ఉత్తమం అనుకుంటున్నారు కొందరు. ఆ విధంగా కొన్ని ఆసుపత్రులూ ఒకప్పుడు ప్రకటనలు ఇచ్చేవి. తల్లిదండ్రులను ప్రేరేపించేవి. చట్టం వచ్చిన తర్వాత బహిరంగంగా అలాంటి ప్రకటనలు లేక పోయినా ఆడ శిశువులు మాయం అవడం మాత్రం ఆగిపోలేదు సరికదా నానాటికీ పెరిగిపోతూనే వుంది. ఇంట్లోనూ, సమాజంలోనూ ఆడపిల్ల ఆహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం , సమాచారం, పని విభజన , స్వేచ్చ, భద్రత అన్ని విషయాల్లోనూ తీవ్ర వివక్షతకు లోనవుతోంది. ఆధునిక విజ్ఞాన తోడ్పాటు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గర్భస్థ శిశువు శారీరక వైకల్యాలు, జన్యు పరమైన లోపాల్ని తెలుసుకోవడం కోసం కనుగొన్న ఆధునిక విషయ పరిజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆడపుట్టుకల నిరోధానికి ఉపయోగించుకోవడం మామూలై పోయింది. ఆమ్నియోసెంటిసిస్ పరీక్షలు, కొరియన్ విల్లియన్ బయాప్సీ, ఆల్ట్రా సోనోగ్రఫి, పుట్టబోయే శిశువును ఎంపిక చేసుకునే విధానంతో మన ముందుకు వచ్చాయి. అవన్నీ ఆడపిల్ల పుట్టుకను నిరోధించడంలో ప్రధాన భూమిక వహిస్తున్నాయి.

2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 933 మహిళలు ఉన్నారు. 1991 లెక్కలతో పోలిస్తే (927) కొద్దిగా అభివృద్ది కనిపిస్తుంది. అయితే 0-6 వయస్సు పిల్లల సెక్స్ రేషియో చూస్తే 1991 లో 945 బాలికలు ఉంటే, 2001 నాటికి అది 927కి దిగజారింది. 2011 నాటికి 914కి దిగజారింది. తల్లి గర్భంలోనే వివక్ష ఈ విధంగా ఉంటే తర్వాత పుట్టిన ఆడ శిశువును చంపివేయడం , తల్లిపాలు పట్టకపోవడం, జబ్బు చేస్తే నిర్లక్ష్యం చేయడం, సరైన ఆహారం అందివ్వక పోవడం కనిపిస్తాయి . ఆ తర్వాత వీటికి తోడు ఆమె అభివృద్దిని నిరోధిస్తూ బడికి పంపకపోవడం, చదువు అనవసరం అనడం, పనికి పంపడం , పోషకాహార లోపంతో బాధపడడం కనిపిస్తాయి. యుక్తవయస్సులో ఆడపిల్లలు ఎక్కువగా లైంగిక హింస, కుటుంబ హింసకు గురవ్వడం, ట్రాఫికింగ్, పెళ్లి-గర్భం, వరకట్నం, రక్తహినత, శారీరక మానసిక వేధింపులు , జీవన నైపుణ్యాలు లేకపోవడం, స్వేచ్చ కరువవడం, ఆత్మవిశ్వాసం కలిగించే పరిస్తితులు లేకపోవడం వంటి అనేక సమస్యలకు కారణం అవుతోంది వివక్షత.

ఒక మహిళగా కుటుంబంలో నిర్ణయాధికారం, ఆర్ధిక స్వేచ్చ, రక్షణ లేకపోవడం, తెల్సిన విషయాలు కుడా చెప్పనివ్వక పోవడం , ఏదీ చెప్పే అవకాశాలు లేకపోవడం , నైపుణ్యం లేకపోవడం, తన మీద తనకు నమ్మకం లేక పోవడం, ఆత్మన్యూనతా భావం , తనను తాను చిన్న చూపు చూడడం వాటి వాటికి వివక్ష కారణం అవుతోంది. అదే వయసు మళ్ళిన స్త్రీలైతే భావుకంగా , ఆర్ధికంగా, సామాజికంగా నిర్లక్ష్యానికి గురై ఒంటరితనంతో బాధపడడం అన్నీ ఆడపిల్లల పట్ల , ఆడవారిపట్ల చూపే వివక్షతా రూపాలే.

“సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గే కొద్దీ కొడుకు కావాలన్న కోరిక పెరగడమే కాక కూతురు వద్దనే అభిప్రాయం బలపడుతోంది. కనీసం ఒక కొడుకు , మహా అయితే ఒక కూతురు అనుకుంటున్నారని ,

మనందరం ప్రగతిశీల మార్పులుగా భావించే – స్త్రీల విద్య, పెళ్లి వయసు పెరగడం వంటి వన్నీ కుడా మనం ఊహించని విధంగా కూతుర్ల పెంపకానికయ్యే ఖర్చుని పెంచి, ఆమెని మరింత బరువుగా మారుస్తున్నాయి. ఈ దుష్ఫలితాల్ని అధిగమించాల్సి ఉంది ” అంటారు ప్రొఫెసర్ మేరి జాన్. ఆమె డిల్లీలోని సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ (CWDS) డైరెక్టర్.

ఆడపిల్ల పుట్టుకను నిరోధిస్తే ఏమవుతుంది ?

తగ్గిపోతున్న ఆడపిల్లల పుట్టుక ప్రభావం సామాజిక , ఆర్ధిక, ఆరోగ్య అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల మహిళలపై లైంగిక నేరాలు , సాంఘిక నేరాలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ. అత్యాచారాలు , బాల్య వివాహాలు, అమ్మాయిల అమ్మకం , బలవంతంగా ఎత్తుకెళ్ళడం , బలవంతంగా ఒకరి కంటే ఎక్కువ మందికి భార్యగా ఉండవలసి రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాకుండా వ్యభిచారం , లైంగిక దాడులు పెరగడంతో పాటు లైంగిక వ్యాధులైన HIV/AIDS, STD లాంటి జబ్బులూ పెరగవచ్చు . స్త్రీ పురుష నిష్పత్తిలోని అసమతౌల్యం వల్ల మహిళల్లో మానసిక , శారీరక రుగ్మతలు ఏర్పడవచ్చు. శరీర ధర్మాల్లో క్రమం తప్పవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మళ్లీ మళ్లీ గర్భం రావడం తోను, కావలసిన బిడ్డ కోసం ఎదురు చూస్తూ జరిగే గర్భ విచ్చిత్తి వల్ల మహిళల్లో ఆరోగ్య సమస్యలు , చిక్కులు , తలెత్తవచ్చు. అధికరక్తస్రావం, గర్భసంచికి రంధ్రం పడడం, వదులు కావడంతో పాటు, అనస్తిషియా వల్ల వచ్చే రకరకాల చిక్కులు , దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్య్లులు హెచ్చరిస్తున్నారు.

ఏడవడం, భయం, హిస్టీరియా, నాడీవ్యవస్థ దెబ్బతినడం, కుంగిపోవడం, తనకు తాను తక్కువగా చూసుకోవడం, తన మీద తనకు నమ్మకంలేకపోవడం, తనను తాను శిక్షించుకోవడం, లైంగిక కోరికలు కలుగక పోవడం , కలత నిద్ర వంటి మానసిక గాయాలు అవవచ్చని సైకాలజిస్టులు చెప్తున్నారు. అంతే కాకుండా స్త్రీ లింగాన్ని అసహ్యించుకునే విధానం వల్ల గర్భ విచ్చిన్నం అయ్యే ప్రమాదం ఉందట. రక్తస్రావం , శ్వాస సంబంధ సమస్యలు, నిర్ణిత సమయానికంటే ముందే బిడ్డ పుట్టడం లేదా చనిపోవడం లేదా శాశ్వత వైకల్యం కలుగవచ్చని అంటున్నారు వైద్యులు.

ఆడపిల్లల రక్షణ – అందరి బాధ్యత

తరతరాలుగా వివక్షకు, అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లల్ని రక్షించడానికి మనం చాలా గట్టి ప్రయత్నం చేయాలి. చట్టాల్ని ఖచ్చితంగా అమలు చేయడానికి తగు చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి . అన్ని స్థాయిలలోనూ ప్రజల మైండ్ సెట్ ని మార్చడానికి ప్రయత్నం జరగాలి. ఆడ పిల్లల హక్కుల్ని కాపాడడానికి ప్రజల్లో చైతన్యం తేవాలి . ఆలోచన రేకెత్తించాలి . పురుషులకున్నంత విశాల ప్రపంచం , విస్తృత అవకాశాలు మహిళలకూ ఉన్నాయన్న భరోసా కలిగించాలి. అలా జరగాలి అంటే మనం ఏం చేయాలో ఆలోచిద్దాం

మన ఇంట్లో

మన ఇంట్లో మనం లింగ నిర్ధారణ పరీక్షల్ని చేయించకూడదు. గర్భంలో ఉన్నది ఆడ శిశువైనా, మగ శిశువైనా ఒకే విధంగా చూడాలి.
మన ఇంట్లో పెరుగుతున్న ఆడ-మగ పిల్లల్ని తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు వివక్ష లేకుండా ఎదిగేలా చూడాలి
ఆడవాళ్ళను కించపరిచే లేదా వివక్షకు గురిచేసే సామెతలు , పలుకుబడులు సరదాగా కూడా ఉపయోగించకూడదు.
ఆడపిల్లల సంపూర్ణ అభివృద్ధికి , రక్షణ , శ్రద్ధ , రక్షిత పరిసరాలు అవసరం అని కుటుంబం గుర్తించాలి.
గర్భస్రావం చేయించుకునే స్వేచ్చకు లింగ నిర్ధారణ పరిక్షలకు తేడా తెలుసుకుని మసులుకోవాలి
మన ఇంట్లో ఆడపిల్లలు చేసే పనికి, శ్రమకి తగిన గుర్తింపు నివ్వాలి
ఆడపిల్లల / మహిళల హక్కులు కాపాడడంలో పురుషుల పాత్రకూడా ఉందని కుటుంబం గమమనించాలి. అందరికీ తెలియచేయాలి.

ఆడపిల్లల సమస్యకు పరిష్కారం స్త్రీ – పురుషులు కలసి తెలుసుకోవాలి
గ్రామ స్థాయిలో

తల్లిదండ్రులు, స్వచ్చంద కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ – ప్రభుత్వేతర అధికారులు సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం, విద్యావంతుల్ని చేయడం కోసం, ఆడపిల్ల పట్ల తమకున్న భావనల్ని , అపోహల్ని పోగోటడం కోసం కృషి చెయాలి. ఆడ, మగ ఎవరైనా ఇద్దరూ సమానమేనన్న సమదృష్టి అలవారుచుకునేలా కృషి చేయాలి.
ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు , గ్రామ కార్యకర్తలు, మహిళా సంఘాలు , యువజన సంఘాలు మొదలైన వారికి ఆడపిల్లల సమస్య పట్ల అవగాహన కలిగించి ఈ సమాచారం సమాజంలో ఇంకా ఎక్కువ మందికి తెలియజేసే విధంగా చేయొచ్చు .
మత పెద్దల ద్వారా ఆడ పిల్లల సమస్యల పట్ల అవగాహన కలిగించి , వివక్ష లేకుండా అందరికీ తెలియజేయడం
మూసపోసిన విధానాలకు స్వస్తి చెప్పి ఆడపిల్లని అన్ని రంగాలలో ప్రవేశించే దిశలో ప్రోత్సహించడం
ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య సంబంధాల్ని అభివృద్ది చేయడం, ప్రజాసంఘాలు / సంస్థలు చట్టాలు అమలయ్యేలా చూడడం
ఆడవాళ్ళు తమ అభిప్రాయాల్ని , భావనల్ని స్పష్టంగా చెప్పగలిగే విధంగా వారిని ప్రోత్సహించడం
ప్రభుత్వ స్థాయిలో

విధాన నిర్ణేతలు, కార్యక్రమ రూపకర్తల్లో చైతన్యం కల్గించడం
విధానాలు, చట్టాలను, కార్యక్రమాలను జెండర్ దృక్పధంతో చూసి పునఃపరిశీలించడం
ఆడ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే క్లినిక్ లపై గట్టి నిఘావేసి అలా జరగకుండా చూడడం
పుట్టిన ప్రతి శిశువు జననాన్ని వెంటనే రిజిస్టరు చేయడం
ఆడపిల్లల ప్రాధాన్యతని తెలిపే విధంగా కార్యక్రమాలు రూపొందించడం
ఆడవారికి మగవారితో సమాన వేతనం అందేలా చేయడం
వైద్య , విద్యా సదుపాయాల్ని విస్తృత పరచడం, ఆడపిల్లల విద్య పట్ల ప్రత్యెక శ్రద్ధ వహించడం అంటే తన తర్వాత పిల్లల్ని పట్టుకోవడం కోసం బడి మాన్పించాకుండా, పనికి వెళ్ళే తల్లులని దృష్టిలో ఉంచుకొని బాలల సంరక్షణా కేంద్రాలను ఏర్పరచడం
మహిళలకు ప్రత్యేక అవకాశాలు సృష్టించడం
మహిళలకు, యుక్తవయస్సులోకి వచ్చిన ఆడపిల్లల కోసం జెండర్ ఇక్వాలిటి పై కార్యక్రమాలు ఏర్పరచడం
విద్యా కార్యక్రమాల్లో, తరగతి పుస్తకాలలో అమ్మ వంట పని, నాన్న పేపర్ చూస్తున్నట్లు కాకుండా శ్రమను ఇద్దరూ కలిసి పంచుకోవడం, ఆడవారి పట్ల సానుకూల దృక్పధం అలవారచే విధంగా తయారు చేయడం
పాఠశాలలో టీచర్లు , ప్రిన్సిపాళ్లు కుడా జెండర్ దృక్పథంతో వ్యవహరించేలా చూడడం చేయాలి
ప్రచార ప్రసార సాధనాల బాధ్యత ఏమిటంటే :
లింగ వివక్షతను కలిగించే ప్రకటనలు ప్రచురించకూడదు. ప్రసారం చేయకూడదు.
ఆడపిల్లల పట్ల ఆశావాహ దృక్పధాన్ని పెంచడంలో అన్ని రకాల ప్రచార ప్రసార సాధనాలు అంటే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, ఫోన్, సాంప్రదాయ కళా రూపాలు అన్నిటినీ ఉపయోగించుకోవడం
లింగ నిర్ధారణ పరీక్షల్ని చేసేవారిని, ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవారిని, వివక్ష కనపరిచే సంఘటనల్ని, వ్యాసాలూ, కేస్ స్టడీస్ రూపంలో రాయాలి .
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై తీసుకునే చర్యల్ని ప్రముఖంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలి .
చట్టాల్ని అమలు పరచడంలో వచ్చే ఇబ్బందుల్ని బయటికి తీయాలి.
ఆడపిల్లల పట్ల వివక్షతను తొలగిస్తూ , ఆడపిల్లల పట్ల సమాజంలో ఆశావాహ దృక్పథం ఏర్పరచడంలో ప్రచార, ప్రసార సాధనాలు తమ వంతు సహకారం అందివ్వాలి.
రాచపుండు లాంటి వివక్షతని పారదోలాలంటే అన్ని స్థాయిలలోనూ జెండర్ అవగాహన కలిగిస్తూ, చట్టాలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ.

మానవి – మరోని

నేను

క్యా.. ర్..క్యా ర్..మనగానే..

రోహిణీ కార్తె ఎండలో వడగాల్పుల సుడులలా

చీ ..మళ్లీ ఆడపిల్లేనా ..తాత ఈసడింపు

దాని మొహం నాకు చూపొద్దు  నాన్న హుంకరింపు

ఒక్క మగ నలుసునీ కనలేదు నాన్నమ్మ చిదరింపు

నేనింకా కళ్ళు తెరవనే లేదు

అమ్మ ఒడి వెచ్చదనం  పరిచయమే కాలేదు

పురిటి  రక్తపు మరకల్తోనే ..

గడప దాటించేసాడు  నాన్న

కంఠం తెగిన పక్షిలా . ..

విరిగిన కెరటాల్ల్లా   .. నేను

ఎదలో దాగిన తల్లి మనస్సు   వెల్లువై  ఉబికింది

నవమాసాలూమోసిన  మమకారం  కన్నిరై  పారింది

కానీ, తప్పుచేసిన  దానిలా మిన్నకుండిపోయింది

అరికాళ్ళకు చుట్టుకున్న ముళ్ళ తీగ తియలేని  అశక్తతకు కుమిలిపోయింది

శిథిల   వీణను మీటుతూ  ఓ  హృదయం ద్రవించింది

ఎవరైనా  పెంచుకుంటారేమోనని  వాకబు చేసింది

అంతా , ఆ.. ఆడపిల్లా.. మా కొద్దు అన్న మరుగుజ్జు వాళ్ళే..

అప్పుడు

ఏ చెత్త కుప్పలోనో .. మురికి గుంటలోనో ..

పడనియకుండా

ఏ కుక్కలకో..గద్దలకో..

ఆహారం కానీయకుండా

చిత్తకార్తెలో స్వాతి చినుకులా  ఓ కరుణామయి

ఆమె మరోని అమృతమయి 

కటిక పేదరాలే కాచ్చు

గుణ సంపన్నురాలు

నాగరికత తెలియక పోవచ్చు

కానీ మానవీయురాలు

పీలగా పిట్టలా ముది వయస్సులో ఉండొచ్చు

కానీ,  ముడుతల ఆ ముఖకవళికలు ఔన్నత్యపు ఆభరణాలు

బలమైన సామాజిక నేపథ్యం లేకపోవచ్చు

కాని, తెలుసు అనుభవాల లోతుపాతులు

మానవ  హక్కులేమిటో  తెలియక పోవచ్చు

కానీ, వెదజల్లుతుంది మానవత్వపు పరిమళాలు

తనకి తినడాని తిండి లేకపోయినా

ఆవు పాలు కొని నా ఆకలి తీర్చింది

పాలు పడక నేను ఏడుస్తుంటే

పగలనక రాత్రనక హాస్పిటల్ చుట్టూతిప్పింది

నానా హైరానా పడింది

పొత్తిళ్ళలో పెట్టుకుని తల్లి ప్రేమను పంచింది

తన ఒంట్లో  సత్తువ లేకున్నా .. కాయ కష్టం చేసింది

నా ఆలనా పాలనా చూసింది

కుటుంబం భూకంపాలు, సునామీలు  సృష్టి స్తోంటే

నాపై ద్వేషం లావాలా మంచితనాన్ని దహించి వేయాలనియత్నిస్తుంటే

నా కోసం వారిని వదులుకుంది

పేగు బంధం కాక పోయినా

కంటిపాపలా రక్షణ కవచమై నిలిచింది

విలువకట్టలేని లేని   వాత్సల్యం కురిపించింది

నాకొక   ఉనికినిచ్చింది

విద్యాబుద్దులు నేర్పింది

శ్రమైక జీవన సౌందర్యం తెలిపింది

నా బతుకులో పచ్చదనం నింపింది

ఆమె ఋణం ఎలా తీర్చుకోను ?

నేనెలా తీర్చుకోను ?

ఏమిచ్చి తీర్చు కోగలను ?

ఊపిరి లేని ఊహల్లో ఊసుల్లో

నింపు కోవడం తప్ప

తొలకరిజల్లుకి పులకరించిన

పుడమి తల్లి మట్టివాసనల్ని వెదజల్లడంతప్ప

వి. శాంతి ప్రబోధ

(వాస్తవ సంఘటన కి అక్షర  రూపం.  మరోని నిజామాబాదు జిల్లా వర్నిలోని ఒక తండా  నివాసి. దినసరి కూలి.  అరవై ఏళ్ళు ఉండవచ్చు.  ఆడపిల్ల అని ఎవరో వదిలించుకుంటే మానవత్వంతో పురిటి పసిగుడ్డుని తెచ్చి పెంచి పెద్ద చేసింది.  ఆ పాపకి చైతన్య అని పేరు పెట్టింది.  ఇప్పుడా అమ్మాయి ఆరవ తరగతి చదువుతోంది. ఈ పిల్ల విషయంలో తన స్వంత పిల్లలనుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంది.  మనుమరాలి వయస్సున్న  ఆ పిల్ల భవిష్యత్ గురించి బెంగ పడుతోంది.

Tag Cloud

%d bloggers like this: