The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘అమ్మ’

‘నేను ఆడపిల్లనవడం వల్లనే …. – నా గురించి నేను’

prajathanthra 0172014 సంవత్సరాన్ని Empowering Adolescent Girls: Ending the Cycle of Violence ( కిశోర బాలికల సాధికారత-హింసా నిర్మూలన) గా జరుపుకోవాలని UNO పిలుపునిచ్చింది. బాలికలు, యువతుల సంరక్షణ, సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం అంతర్జాతీయ బాలికా సాధికారదినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల వివక్ష , అత్యాచారాలు , కొట్టడం , హింసించడం, దాడి చేసి చంపడం ప్రతి రోజూ కనిపిస్తూనే, వినిపిస్తూనే…   అందుకు కారణం కుటుంబ సభ్యులో, బడిలో టీచర్ లో , తోటి వాళ్ళో, ఇరుగుపొరుగులో .. ఎవరో ఒకరు.  నిత్యం ఆడపిల్లలపై, మహిళలపై జరిగే దుశ్చర్యలకి కారణం ఏమిటి? ఎవరు? ఎవర్ని బాధ్యుల్ని చేద్దాం ..?  ఆడపిల్లని మగ పిల్లతో చూడలేనితనం, ఆమె హక్కుల్ని గౌరవించలేని గుణం కావచ్చు, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్ధికంగా ఆమెకు గుర్తింపు లేకపోవడం కావచ్చు.  ఆమెను  అధీనంలో వుండే ఒక వస్తువుగా చూడడం కావచ్చు.   సమానంగా చదువు లేకపోవడం కావచ్చు,  పెద్దల నిర్లక్ష్యం , నిరక్షరాస్యత, అవగాహనలేమి కావచ్చు.  లైంగిక, పునరుత్పత్తి, సామాజిక, ఆర్ధిక సేవలు అందుబాటులో లేకపోవడం కారణం కావచ్చు.  ఏదేమైనా  ఈ సమస్యకి  పరిష్కారం మన దగ్గరే మన కుటుంబంలోనే, మన  సమాజంలోనే ఉంది.  ఆడపిల్లలకి మహిళలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, వారిని విద్యావంతుల్ని , స్వశక్తి వంతుల్ని,  చైతన్య వంతుల్ని చెయ్యాల్సిన బాధ్యత అందరిదీ.  అందుకోసం  ప్రజలలో అవగాహన కల్గించాల్సిన, పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదొక్కటే కాదు.  దానితోపాటు వ్యక్తులు, సంస్థలు , అన్నిరకాల ప్రచార ప్రసార సాధనాలు మీడియా అందరూ బాధ్యత తిసుకున్నప్పుడే మనం ఆడపిల్లను హింస నుండి విముక్తం చేయగలం.  ఈ  హింస ఇలాగే కొనసాగితే నష్ట పోయేది ఆమె మాత్రమే కాదు. జాతి , జాతి మొత్తం ఎంతో నష్టపోతుంది.  ఆరోగ్యవంతమైన ఆడపిల్లలున్న సమాజం ఆరోగ్యవంతంగా ఎదుగుతుందన్నది ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా ..!
ఈ సందర్భంగా కిశోర బాలబాలికలతో పనిచేసిన సమయంలో వివిధ సందర్భాలలో మేం నిర్వహించిన కన్సల్టేషన్ లలోను, వర్క్ షాపులలోనూ వారు వెల్లడించిన విషయాలను, వివిధ కార్యక్రమాలలో పాల్గొని వారు పొందిన స్పూర్తితో తమ జీవితంలో తెచ్చుకున్న మార్పుని

నేను ఆడపిల్లనవడం వల్లనే

                                     – నా గురించి నేను’ 

అనే శీర్షికతో వారం వారం మీ ముందుకు రాదలచుకున్నా.

ఆ  కిశోరబాలికల అనుభవాలు, పొందిన వేదనలు, వాటిని ఎదుర్కొన్న విధం మరికొంత మందిని ఆలోచింప చేస్తుందనీ, చైతన్యం రావడానికి కొంతైనా తోడ్పడుతుందని మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాను.  ఇక్కడ మీ ముందుకు వచ్చే అమ్మాయిలు, వారి సమస్యలు కొత్తవేమీ కాకపోవచ్చు. అలాంటి మనుషులు, సమస్యలు మనమంతా రోజూ చూసేవే కావచ్చు .  వాళ్ళలో కొంతమంది  తమకింతే రాసిపెట్టి ఉందని నిర్లిప్తంగా జీవితాన్ని ఈడ్చేవారూ ఉండవచ్చు .  తమ స్థితికి కుంగిపోయి జీవితాన్ని అంతం చేసుకునేవాళ్ళు ఉండొచ్చు.  తాము ఎందుకు చిన్న చూపుకు గురవుతున్నాం, అన్నతోనో తమ్ముడితోనో సమానంగా ఎందుకు ఉండలేకపోతున్నామని ప్రశ్నించేవాళ్ళు సమానత్వం కోసం కృషి చేసేవాళ్ళూ ఉండొచ్చు.  తమకున్న క్లిష్ట పరిస్తితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు పోయేవాళ్ళూ తారసపడతారు. తమలాంటి మరి కొందరికి ధైర్యాన్ని, ఆత్మస్తైర్యాన్ని నింపేవాళ్ళూ కనిపిస్తారు.  అలాంటి వాళ్ళే మన ముందుకు వస్తారు.  మనకి స్పూర్తినందిస్తారు . అలాగే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నలుగురుకీ చెప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళూ ఉన్నారు.  అందుకే వారి ప్రైవసీ కోసం ఆ అమ్మాయిల పేర్లని, ఊర్లని  మార్చి చెప్తున్నాం. ఫోటోలు ఇవ్వలేక పోతున్నాం.

 

                                                                                       అమ్మేనా …?

“నా తల్లి కన్నా తల్లేనా అని నాకెప్పుడూ సందేహం.  ఆమె పేగు తెంచుకు పుట్టిన బిడ్డను అంత దారుణంగా తీసుకెళ్ళి అమ్మాయిలతో వ్యాపారం చేసే వాళ్లకి అమ్మేయగలదా ..?”

నా పేరు లిఖిత.  మాది నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం.  నేను చిన్నప్పుడు మా అమ్మా నాన్నలతోనే హాయిగా ఉండేదాన్ని.  అంగన్వాడి బడికి పోయేదాన్ని. నాన్న చనిపోయాడు.  ఎట్లా చనిపోయాడో తెలియదు. అమ్మ వల్లే చనిపోయాడని నాన్నమ్మవాళ్ళు అమ్మని ఇంట్లోంచి పంపేశారు.  అమ్మ వేరే అతన్ని చేసుకుంది. నేను అమ్మమ్మ ఇంటికి చేరాను.  నన్ను ఇంట్లోంచి పంపెయ్యమని మా చిన్న అత్తమ్మ రోజూ గొడవ పెట్టుకునేది.  నాన్నమ్మ వాళ్ళు నన్ను రానియ్య లేదు.   అప్పటి నుండి నాకు  అమ్మ, నాన్న, ఇల్లు అంటూ లేకుండానే..ఎప్పుడు ఎవరు ఎటు విసిరేస్తారో తెలియకుండా .. నా బాల్యం గడచి పోయింది. అందరు పిల్లలా బడి తెలియదు.  నేనున్నానని మామ వాళ్ళు అమ్మమ్మను ఇంట్లోంచి గెంటేశారు. నిజామాబాద్ వచ్చేసాం. చెట్లకిందో, బస్టాండుల్లోనో, దుకాణాలముందో  ఇంటి పంచలోనో రాత్రి పూట తల దాచుకునేవాళ్ళం.  అడుక్కు తినే వాళ్ళం.  ఓ రోజు నిద్రపోయిన అమ్మమ్మ లేవనే లేదు.  ఎవరు చెప్పారో.. ఎట్లా తెలిసిందో .. మా అమ్మ నన్ను తన దగ్గరకు తీసుకెళ్ళింది. అప్పటికే పదకొండేళ్ళు ఉండొచ్చు.

నేనెంతో సంతోషించా అమ్మ దగ్గరైనందుకు.  ఒక తమ్ముడున్నాడు. కొత్త నాన్న ఉన్నాడు.  తమ్ముడితో ఆడుకుంటూ ఉండేదాన్ని.  బడికిపోతానని అంటే, అమ్మ వచ్చే ఏడాది తమ్ముడిని నన్ను పంపుతానంది .   మా కొత్త నాన్నఆటో సరిగ్గా నడిపేవాడేకాదు. ఎప్పుడూ తాగి వచ్చేవాడు.  నన్ను ఎట్లాగో చూసేవాడు. ఒకరోజు అమ్మకి , కొత్త నాన్నకి చాలా గొడవ అయింది. ఎందుకో నాకు తెలియదు కానీ నా గురించే అని తెలుస్తాంది.   రెండు రోజుల తర్వాత అమ్మ ఊరికి పోదాం అని ఒక బాగ్ లో బట్టలు పెట్టింది. అమ్మ నేను, తమ్ముడు వెళ్లాం.  ఏ  ఊరికో తెలియదు. అమ్మ నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఏమి చెప్పకుండానే పోయింది. ఎటు పోయిందో తెలియదు.  వాళ్ళు ముప్పైవేల రూపాయలకు కొనుక్కున్నారని తెలిసింది.  అక్కడ ఉన్న వాళ్ళు అంతా నా కన్నా పెద్ద వాళ్ళే .  వాళ్ళు అదో రకంగా .. మొహాలకి , పెదవులకి రంగు పూసుకుని … ఎప్పుడూ మగవాళ్ళు చాలా మంది వచ్చి పోతుండేవారు .   నాకు అక్కడ అన్నం అన్నీ బాగానే పెట్టేవారు. బాగానే చూసుకున్నారు.  రెండు మూడు రోజులయ్యాక నా లాంటి పిల్లలు ఉన్న చోటుకి తీసుకుపోయారు.  అక్కడ మా ఫోటోలు తీసుకోవడానికి వస్తారని బాగా తయారవమని చెప్పారు.   ఆ రోజే నేను, రాజీ ఇద్దరం నెమ్మదిగా తప్పించాం.   మేం పరిగెత్తుంటే వేరే సార్లు మమ్మల్ని పట్టుకుని  వివరాలడిగి బాలసదనంకి పంపారు.  అప్పటి నుండి నేను బడికి పోతున్నా .   ఇప్పుడు ఎనిమిదోతరగతి చదువుతున్నా.  ఇప్పుడు నాకు అర్ధమవుతోంది ఇక్కడికి రాక పోతే నా జీవితం ఎట్లా ఉండేదో …  అందుకే బాగా చదువుకుని నా లాంటి పిల్లకోసమే పనిచేయాలని అనుకుంటున్నా..  మా అమ్మలాగా ఏ అమ్మా ఉండకూడని కోరుకుంటున్నా .

లిఖిత

 

 

                                                        నాన్న ఇలాంటి వాడా?  అసహ్యం వేస్తోంది

మంచి నిద్రలో ఉన్నాను. నా శరీర భాగాల్ని తడిమినట్లయింది. ఒక్క సారిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూద్దును కదా .. మా నాన్న.  నా పక్కనే నిద్రపోతూ .  నిద్రలో నా కెందుకు అట్లా అనిపించిందో నాకర్ధం కాలేదు.

అంతకు ముందు నాన్నమ్మ దగ్గర పడుకునే నేను నాన్న మస్కట్ పోయినప్పటి నుంచీ అమ్మ దగ్గరే పడుకునేదాన్ని.  అమ్మ జబ్బుతో చనిపోయింది. అప్పటి నుంచీ రోజూ నేనొక్క దాన్నేనులకమంచం వేసుకొని పడుకుంటున్నా.  రోజూ లాగే ఆ రోజూ పక్క పరుచుకు పడుకున్నా.   అమ్మ చనిపోయిందని వచ్చిన నాన్న మరి పోలేదు. బయట పందిట్లో పడుకుంటున్నాడు.  అన్న వదిన వేరే రూంలో.   నా మంచం చాలా చిన్నది. సన్నగా ఉంటుంది. నాన్న పడుకునేసరికి చాలా ఇరుకుగా అయింది. లేచి నీళ్ళు తాగి బాత్ రూంకి పొయొచ్చి మళ్ళీ పడుకున్నా.  కొంచెం సేపటి వరకూ అట్లాగే ఉన్నా . నిద్ర పట్టలేదు. లేచి చాప పరుచుకుని పడుకున్నా.

మరో రోజు కూడా అంతే. నిద్రలో హటాత్తుగా మెలకువ వచ్చి చూస్తే నాన్న నా పక్కన.  నాన్న ప్రవర్తన ఇదివరకటిలాగా లేదు. ఏదో తేడా .. తెలియడం లేదు. అతని దగ్గర మందు కంపు.  రాత్రవుతుందంటేనే భయం వేస్తోంది. నిద్ర రావడం లేదు. ఎప్పటికో నిద్ర పోయినా కలత నిద్రే.  నాన్న గురించి ఎవరికి చెప్పాలో, ఎట్లా చెప్పాలో తెలియడం లేదు.

ఓ రోజు అప్పుడే నిద్రపట్టింది. తన పురుషాంగాన్ని నాకేసి గట్టిగా రుద్దుతున్నాడు.  నా శరీర భాగాల్ని తడుముతున్నాడు. మెలకువ వచ్చేసింది. భయమేస్తోంది. ఏమనాలో , ఏమిచెయ్యాలో తెలియక భయంతో బిగుసుకున్నా. ఆ రోజు ఇంట్లో అన్న వదిన కూడా లేరు.  తట్టుకోవడం మనసుకి చాలా కష్టంగా ఉంది.  ఇక ఆగలేక  “ఏందే నాన్న .. ” అన్నాను  కోపాన్ని అదిమి పెట్టుకుంటూ.

చప్పున లేసి ధోతి సర్దుకుంటూ బయటికి పోయాడు.

లేచి వెళ్లి తలుపు పెట్టుకున్నా.  నాన్న ఇట్లా చేస్తున్నాడేంటి ? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న నాలో.   నిజానికి అమ్మ కంటే నాన్ననే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎంతో ముద్దు చేశేవాడు. అట్లాటిది ఇట్లా అయిపోయాడేమిటి.   మా నాన్న ఇట్లాటి వాడా అని చాలా బాధ, భయం కలిగాయి.  నేను కన్న బిడ్డ లాగా కనబడట్లేదా .. ? నేను ఆడపిల్లను కావడం వల్లేనా .? ఆడదానిగా మాత్రమే కనిపిస్తున్నానా .. ?           ఎప్పుడు తెల్లారుతుంది ? అన్నా వదిన మరో రోజుకి గానీ రారు.  వచ్చినా వాళ్లకి చెప్తే నమ్ముతారా ? నన్నే తప్పు పడతారా .. ? ఏమో ..అని  ఏదైనా తెల్లవారగానే అత్తమ్మ దగ్గరకి వెళ్ళిపోయా ..  ఆ తర్వాత నాన్న గురించి ఎవ్వరికీ చెప్పలేదు కానీ ఆయన్ని చూడాలన్నా నాకు అసహ్యం వేసేది.

శ్వేత

లింగాపూరు

(ఈ సంఘటన ఆ అమ్మాయి  పద్నాలుగుపదిహేనేళ్ళ వయసులో జరిగింది )

ప్రజాతంత్ర సంపూర్ణ స్వతంత్ర వర పత్రిక 23-29, నవంబర్ 2014న  ప్రచురణ అయింది

Tag Cloud

%d bloggers like this: