The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘అనాధ’

మానవత్వపు చిగుర్లు

‘అబ్బబ్బ చిరాకేస్తోంది .. విసుగొచ్చేస్తోంది ‘ కారిపోతున్న చెమటని టవల్తో తుడుచుకుంటూ సతీష్. కాస్త బొద్దుగా వున్న సతీష్ కి ఎప్పుడూ చెమటలు ఎక్కువే. కరెంటులేదేమో అది మరింత ఎక్కువైంది.
ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదురా ‘సతీష్ ని చూసి కావేరి అంటున్నమాటలకి మధ్యలోనే అందుకుని ‘ అక్కా, అయితే  మిద్దె మీద పడుకుందామా ‘ అడిగింది కళ్యాణి.  సమీర పిలుపుతో అటు కదిలాడు సతీష్.
‘అది అసలే వేడెక్కి ఉంది. సాయంత్రం కాసిని నీళ్ళు  జల్లితే చల్లబడేది.  అక్కడొద్దులే , వెనుక బాల్కనీలో పక్కలు వేసుకుందాం .  పడమటి గాలి , దక్షిణపు గాలి ఏ మాత్రం వచ్చినా అందుతుంది అంది కావేరి
‘పట్నాల్లోనే కరెంటు కోతలతో చచ్చిపోతున్నాం. ఇక పల్లెల సంగతి చెప్పాలా .. పరిస్థితి అర్ధం చేసుకోగలం ‘ అంది సతీష్ తల్లి, కళ్యాణి స్నేహితురాలయిన  శశి
‘అవునే, మనం పిట్టగూళ్ళలాంటి ఇళ్ళలో కరెంటు లేక, ఇన్వర్టర్ పనిచేయకపొతే అలా మక్కి పోవాల్సిందే . జాగారం చేయాల్సిందే , ఇక్కడ చాలా నయం. కనీసం బయట పక్కలేసుకోవచ్చు’ అక్క తెచ్చిచ్చిన చాపలు పరుస్తూ అంది కళ్యాణి.
‘సరే మీరు పక్కలు పరవండి . నేనెళ్ళి డైనింగ్ టేబుల్ సర్దొస్తా’ అని లోనకి వెళ్ళింది కావేరి.  వంటింట్లో పనులు చక్కబెట్టుకుంటూ ఉందికానీ సతీష్ ని సెలవుల్లో ఎంగేజ్ చెయ్యడం చాలా కష్టమైపోతోందని మాటల సందర్భంలో శశి అన్నమాటలే ఆమె మదిలో మెదులుతున్నాయి.
కళ్యాణి, శశి ఇద్దరూ కలసి పక్కలు పరుస్తూ..,  బాల్కనీలోకి సన్నజాజి తీగ మాటునుండి తోసుకు వస్తున్న వెన్నెలను చూస్తూ ‘ఎంత హాయిలే.. ఎంత హాయిలే .. వెన్నెల్లో ఆటపాటలంటే ఎంతహాయిలే ..’ హమ్ చేస్తోంది కళ్యాణి.
సన్నజాజులోయ్ .. సంపెంగలోయ్ …’ అందుకుంది శశి. అవునే ఎంత హాయిగా ఉంది . చల్లగా సన్నగా వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ కళ్యాణి.
కావేరి రాకను గమనించిన కళ్యాణి ‘ అక్కా మన బాల్యం గుర్తొస్తోందే.. ఆరుబయట వరుసగా మంచాలు వేస్కుని పడుకునేవాళ్ళం కదా ..!  సన్నజాజి , విరజాజుల పరిమళాలు మత్తేక్కిస్తుంటే ఆకాశంలోని చుక్కలకేసి చూస్తూ వాటిని లెక్కించడానికి ప్రయత్నిస్తూ ఏవేవో  కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళం.  కబుర్లతోనో, ఏవేవో ఊహలలో విహరిస్తూనో  నిద్రలోకి జారుకునేవాళ్ళం.. పక్షుల కిల కిలారావాలతో ఉదయరాగం ఆలపిస్తుంటే నిద్రాభంగం అయ్యేది.. ‘ ఉద్విగ్నంగా చెప్పుకుపోతోంది. 

‘అర్జంటా .. కాకపోతే రేపు మాట్లాడుకుందాం…… సరే నేను త్వరగా వచ్చేస్తాలే .. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో. నేను చూసుకుంటాలే’ అని ధైర్యం చెప్పి కాల్ కట్ చేసింది కావేరి.
‘ అక్కా , మీరింకా వర్క్ చెస్తున్నారా..? మీ బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా ..! సందేహంగా అడిగింది శశి

ఆ ప్రశ్నకి వస్తున్న సన్నని నవ్వుని  పెదవి వంపులోనే దాచేసి అవునన్నట్లు తలూపింది కావేరి.
‘ఇంకా ఉద్యోగం ఎందుకక్కా ? ఆ ఉద్యోగం వేరే ఎవరికైనా ఇస్తే వాళ్లకి ఉపాధి దొరుకుతుంది కదా ..’ ప్రశ్నార్ధకంగా ఆగి కావేరి మొహంలోకి చూసింది శశి.
‘అవును శశీ .. నువ్వు చెబుతున్నది నిజమే, నేను చేస్తున్నది ఉద్యోగం అయితే , జీతం కోసమే అయితే ‘ సన్నని నవ్వు పెదాలపై మొలుస్తుండగా కావేరి
‘మరి ” అన్నట్లుగా చూశారు శశి , కళ్యాణి
‘ఇప్పుడు నేను చేసే పని నా సంతృప్తి కోసం . నా పిల్లలు నీ పిల్లలలాంటి పిల్లలెందరో .. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత అందక అల్లాడుతున్నారు. వారికి ఓ ఆలంబన అయి, వారు జీవితంలో ఎదగడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నా.. .’ కావేరి అంటుండగా లోపలి నుండి వచ్చారు పిల్లలు
‘ ఓహ్ .. ఇక్కడెంత బాగుంది , మేం రోజూ ఇక్కడే పడుకోవచ్చా పెద్దమ్మా’ సమీర ప్రశ్న .
‘అవును పెద్దమ్మా నాకూ ఈ ప్లేస్ చాలా నచ్చింది. కరెంటు ఉన్నా నేనూ ఇక్కడే పడుకుంటా ‘ అక్క మాటలకు వంత పలికింది కాశ్మీర .
‘నాకు ఎసి లేందే నిద్రేరాదు. నేనయితే ఇక్కడ పడుకోలేను. ఈ ఊళ్ళో అసలే ఉండను. ఏదో..  మా మమ్మీ బతిమాలిందని వచ్చా ..’  గొంతులో తన అయిష్టాన్ని పలికిస్తూ కాశ్మీర నుండి చూపు తల్లికేసి తిప్పుతూ నసిగాడు సతీష్ . 

‘ఏదో గొప్ప త్యాగం చేసినట్లు ఏంట్రా ఆ మాటలు ? మనూర్లో ఇంత స్వచ్చమైన గాలి , వెన్నెల, చందమామ, చుక్కలు చూసే భాగ్యం దొరుకుతుందా ..?’ పెద్దరికంగా సమీర
 ఆతర్వాత ఆకాశంలో చుక్కల్ని చూస్తూ కబుర్లలో పడిపోయారు పిల్లలు ముగ్గురూ ..
కళ్యాణి , శశిలతో చిన్ననాటి కబుర్లు పంచుకుంటూనే, మధ్య మధ్యలో తమ హొమ్ లోని పిల్లల ముచ్చట్లు కలుపుతూ పిల్లల మాటల్ని చెవిలో వేసుకుంటోంది కావేరి. ఆమెకి సతీష్ ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది.
‘ ఐ డోంట్ లైక్ దెమ్ . ఆఫ్ట్రాల్  వాళ్ళ దగ్గరకి నేను రావడమేమిటి? ‘  కొంచెం గట్టిగా వినిపించింది సతీష్ స్వరం.   అతని గొంతులో చిరాకు , వాళ్ళంటే ఉన్న నిరసన, చులకన భావం స్పష్టంగా పలికిస్తూ ..
‘తప్పు అలా అనకూడదు .. వాళ్ళూ మనలాంటి వాళ్లేగా .. ‘ కాశ్మీర సానుభూతితో . .
హమ్ చేసుకుంటున్న పాటను ఆపి వీడు ఎప్పటికి మారతాడో .. మనసులోనే మదనపడింది శశి.
వాడి మాటలు కావేరి హృదయాన్ని గాయపరుస్తూ ..మనస్తాపాన్ని కలిగిస్తూ ..  వాళ్ళు  ఇలాంటి  మాటలు వింటే రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలలాడతారు. మూగవోయింది ఆమె మనసు. నిన్న సాయంత్రం సమత వేసిన ప్రశ్నలు కళ్ళముందు నిలిచాయి

*****                *****                         ****

‘అక్కా మా డాన్స్ మాస్టర్ అట్లా ఎందుకన్నాడక్కా .. ‘ కళ్ళలో సుడి  తిరుగుతున్న నీటిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ,  కావేరి కళ్ళలోకి సూటిగా చూస్తూ పదేళ్ళ సమత ప్రశ్న
‘ఏమైందిరా ” చిరునవ్వుతో ఆమె  హావభావాలు పరిశీలిస్తూ అడిగింది కావేరి.
అవమానభారంతో ఆ మొహం కందిపోయింది.  అసలే మంచి రంగేమో .. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటుందేమో ఆ కళ్ళు ముక్కుపుటాలు ఆదరడం చూస్తే ఆమె ఎంత బాధను , వేదనను అనుభవిస్తోందో అర్ధమవుతోంది .
దీర్ఘ శ్వాస విడిచి ‘ఓ.. వీళ్ళు  అనాధలా .. ఈ గాలి పిల్లలకి నేను డాన్స్ నేర్పాలా ..  అన్నాడక్కా ఆ మాస్టారు’ చెప్తోంటే సమతకి దుఃఖం ఆగడం లేదు . ఉబికే దుఃఖాన్ని ఆ చిన్ని గుండెలోనే అదిమిపెట్టి  ‘ఎందుకక్కా మేం అంటే అందరికీ అంత చులకన ? అమ్మా నాన్నా లేకపోతే మేం పిల్లలం కాదా .. మిగతా అందరు పిల్లల్లాంటి వాళ్ళం కాదా ..? మాకు అన్నీ నేర్చుకోవాలని ఉండదా .. మాకు ఆ అర్హత లేదా .. ఉండకూడదా .. ఎందుకక్కా మేం ఎక్కడికి వెళ్ళినా  ముందు మాతో బాగున్న వాళ్ళు కాస్తా మా విషయం తెలవగానే,  ఓ..  మీరు ఆశ్రమం పిల్లలా .. అంటూ చిన్న చూపు చూస్తారు.  జాలి చూపులు చూస్తారు. వాళ్ళట్లా చూస్తుంటే మనసుకి చాలా బాధ అవుతుంది అక్కా ‘ అంది సమత చాతి ఒత్తుకుంటూ.
‘అవునక్కా మేం మంచి బట్టలు వేసుకుంటే.. ఎవరూ లేరు కానీ..  ఇంత మంచి బట్టలా ..?  ఆ .. వాళ్ళు వీళ్ళు వేస్కొని తీసేసినవేగా..  కళ్ళతో పెదాలతో వెక్కిరిస్తూ అంటారక్కా మా ఫ్రెండ్స్ ‘ అప్పుడే వచ్చిన పదవ తరగతి చదివే శ్వేత తన గోడు వెళ్ళబుచ్చింది.
‘అవునక్కా మీరు మాకు సైకిళ్ళు ఇచ్చారు కదా .. మా ఫ్రెండ్స్ కి, ఇంకా అబ్బాయిలకి ఎంత అసూయో .. మా సైకిళ్ళలో గాలి తీసేస్తారు.  బోల్టులు పీకి పారేస్తున్నారు.  సీటుని బ్లేడుతో కోయడం, టైరు కోయడం చేస్తున్నారు. మీరేమో మేం సరిగ్గా చూస్కోలేదని మమ్మల్ని కోప్పడతారు.. ” శ్వేతతో పాటే వచ్చిన నసీమా గబగబా చెప్పుకొచ్చింది
‘అక్కా మేమిప్పుడు అనాధలం కాదు కదా .. ‘ అడిగింది సమత.  కావేరి బుగ్గల్ని తన చిట్టిచేతులతో  పట్టుకుని తన వైపు తిప్పుకుని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ
‘అవునురా .. మీరు అనాధలు ఎట్లా అవుతారు . కాదు, మీకు మేమంతా ఉన్నాంగా ..’ ప్రేమగా తల నిమురుతూ అనునయంగా అంది కావేరి
‘అవునక్కా..  మేం ఎంతజేప్పినా మా బడిలో పిల్లలకి అర్ధం కాదు . మా ఫ్రెండ్స్ కీ అర్ధం కాదు. అనాధ పిల్లలు అంటారు . మా టీచర్స్ అనాధ హాస్టల్ పిల్లలు అనంటున్నారు. మేమేమో మాది హాస్టల్ కాదు ఇల్లు అని ఎన్నిసార్లు చెప్పినా అంతే  ‘ మనసులో గూడు కట్టుకున్న బాధ కక్కేసింది శ్వేత.
‘ఊ .. ఆళ్లంటే పిల్లలు.  తెలియక అన్నారేమో .. కానీ ,  ఆ డాన్సు మాస్టరు పెద్దవాడే కదక్కా .. ఆయన కూడా అంత చులకనగా మర్యాద లేకుండా మాట్లాడాడు . నాకాయనస్సలు నచ్చలేదు .హూ .. నేనసలు ఆయన దగ్గర డాన్సు నేర్చుకోను’ ఒత్తి పలుకుతూ నిక్కచ్చిగా చెప్పింది సమత
నిజమే ,  ఆశ్రమం పిల్లలందరికీ మీరు అనాధలు కాదు . మీకు మీ కన్న తల్లిదండ్రుల్ని అందించలేం కానీ వారు ఉండి వుంటే మీకు అందించే ప్రేమ ఆప్యాయతల్ని అందిస్తాం. మంచి పౌరులుగా తీర్చి దిద్దుతాం. ఇక నుండి మీకు అమ్మా నాన్నా అన్నీ ఆశ్రమమే. ఇదంతా ఒక కుటుంబం ఎవ్వరికీ లేనంత మంది అక్కలు , అన్నలు , చెల్లెళ్ళు , తమ్ముళ్ళు  మీ స్వంతం . ఎంత పెద్ద కుటుంబం మనది అంటూ వాళ్లకి కుటుంబ బంధాలు పాదుగొల్పడానికి ప్రయత్నిస్తుంటాం. వారిలో దైన్యాన్ని పోగొట్టి ధైర్యాన్ని , బతుకు పట్ల ఉత్సాహాన్ని , ఆశల్ని కల్పిస్తుంటాం.  ఈ ప్రపంచంలో మిగతా పిల్లల కంటే మీరెందులోనూ తీసిపోరనీ, తక్కువ కాదనీ వారికి భరోసా ఇస్తుంటాం అనుకుంది కావేరి.
నిజానికి , మిగతా ప్రపంచం లోని పిల్లల కంటే వీరికి పరిశీలన ఎక్కువ. అవకాశాల్ని ఉపయోగించుకుని పైకి ఎదగాలన్న తపన ఎక్కువ. స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఎదుగుతున్న వాళ్ళకి భయం , బిడియం తెలియదు.  ఇరుకు మనసులు కావు. కక్షలు కార్పణ్యాలు లేవు . ప్రేమా ఆప్యాయతలు పంచడం మాత్రమే తెలుసు. తోటివారిని ఆదరించడం తెలుసు.  అప్పుడప్పుడు గతం తాలూకు నీలి నీడలు దొబూచులాడినా , వెంటనే  మరింత వెలుగు నింపుకోడానికి ప్రయత్నిస్తూ  వెలుతురులోకి వచ్చేస్తారు.  అలాంటి పిల్లల్ని ఆ మాస్టారు అలా అనడం సమత , శ్వేతలు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం కావేరిని  కలచివేసింది.  ఉన్నపళంగా వాళ్ళ బాధను తను ఎలా తీసివేయగలదు ..

తల్లిదండ్రులు లేనంత మాత్రాన వారికి జీవితం లేదా ? వాళ్ళు అన్ని కోల్పోవలసిందేనా ?  అ మాస్టారుకి కావలసింది తన ఫీజు . అందరితో పాటు సమంగా చూడాల్సిన బాధ్యత అందరిదీ .  మిగతా పిల్లలు ఎంత అల్లరి చేసినా పట్టించుకోకుండా ఈ పిల్లల్ని మాత్రమే ఈ విధంగా మందలించడం సబబేనా ?  ఆ మాస్టారే కాదు, చాలా మందికి అనాధలంటే చిన్నచూపే , చులకన భావమే. కొందరు జాలి చూపితే కొందరు చులకన చేసి మాట్లాడతారు. రేపు , మాస్టారుతో మాట్లాడాలనుకుంటూ నిద్రకుపక్రమించింది కావేరి.

***                                      ****                                   ****

‘ఈ రోజు మనం మా కాంపస్ కి వెళ్తున్నాం’  చెప్పింది కావేరి  సమీర ప్రశ్నకి సమాధానంగా.
‘ఓ థాంక్ యూ పెద్దమ్మా ..’ అంటూ కావేరి చేయిపట్టుకుని నొక్కింది సమీర.    ‘ నేనూ రావచ్చా అక్కా .. ఎప్పుడూ చూడలేదుగా  ‘అంది శశి.

‘పిక్నిక్ లాగా మన లంచ్ ప్యాక్ చేసుకువెళ్లి అక్కడి చెట్లకింద కూర్చొని తింటే బాగుంటుంది కదా’ సాలోచనగా అంటూ ఆగింది సమీర . సతీష్ తప్ప మిగతా అందరూ గుడ్ ఐడియా అన్నారు.  పెద్దమ్మా మీ కాంపస్ ని ఆనుకుని ఉండే కొండని ఎక్కొచ్చా .. ‘ అడిగింది కాశ్మీర.  అంతలో ‘నేనయితే రాను. ఇంటిదగ్గరే ఉంటాను వెళ్తే మీరెళ్ళండి’ భుజాలెగరేస్తూ అన్నాడు సతీష్

‘ఏరా ఎందుకని అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు . ఎంచక్కా ఆడుకోవచ్చు’ బుజ్జగింపుగా కళ్యాణి.
‘హూ .. నేను అలగా పిల్లలతో కలసి ఆడుకోవడమేంటి ..? నేను రాను’ భుజాలెగరేస్తూన్న సతీష్ కళ్ళలో వారంటే ఏహ్యభావం .
శశి ముందే చెప్పింది మా వాడు వినడు అని . తను అన్నమాటే సాగాలని పట్టుబడతాడని. ఆమె అన్నట్టే చేస్తున్నాడు వాడు. తడబడుతున్న వాడి నడతని ఇప్పుడే సరిచేయాలి . అట్లాని వాడిష్టం వచ్చినట్లు సాగనిస్తే మనమూ తప్పు చేసిన వాళ్ళం , వాడిని చెడగొట్టిన వాళ్ళం అవుతాం . అది అర్ధం చేసుకోకుండా, అతి గారభంతో , ప్రేమతో వాడు కోరినట్లల్లా చేయడం వల్ల మరింత పెంకిగా తయారయ్యాడు.  చూస్తూనే ఉన్నాగా వాడి వాలకం మనసులో అనుకుంది కావేరి.  ఒక్కడే ఇంట్లో ఉండి  టి వి చూస్తా లేదంటే కంప్యుటర్ గేమ్స్ ఆడుకుంటానని మొండికేసాడు వాడు.
‘ఎవ్వరూ లేకపోతె నువ్వు చేసే పని అదే గదరా కన్నా .. ఇప్పుడిక్కడ ఇంత మందిమి ఉండగా కూడా అదే పనా చెప్పు ‘ బతిమాలుతూనట్లుగా అంది వాళ్ళమ్మ శశి. బుజ్జగిస్తున్న కొద్దీ, బతిమాలుతున్న కొద్దీ మరింతగా బిగుసుకు పోతున్నాడు వాడుఆ సంభాషణ జరుగుతుండగానే వాడికి తెలియకుండా కరెంట్ రాకుండా మెయిన్ ఆఫ్ చేసింది కావేరి.
‘అయ్యో కరెంటు పోయినట్లుంది ‘ ఆగిన సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న శశి తన పక్కనే ఉన్న సతీష్ ని చూస్తూ .
‘ఇప్పుడెట్లా ..నా హెయిర్ డ్రై చేసుకోవడం ‘ కాశ్మీర సందేహం
‘పెద్దమ్మా..  మీ ఇంట్లో ఇన్వర్టర్ లేదా ‘  సతీష్ ప్రశ్న
‘ వెళ్లి  బాల్కనీలో నిల్చో, జుట్టు అదే ఆరిపోతుంది ‘ అని కాశ్మీర తో చెప్పి సతీష్ వైపు తిరిగి ‘ఉందిరా .. కానీ అదీ పనిచేయడంలేదు .. వేసవి రాకముందు నుండే మా పల్లెటూళ్ళలో కరెంటు కోతలు చాలా ఎక్కువ కదా .. అందుకే అది సరిగ్గా ఛార్జ్ అవడం లేదు . బాటరీ వీక్ అయింది ‘ చెప్పింది కావేరి .
‘కరెంటు ఎప్పుడొస్తుందో ..ఒక్కడివీ ఏం చేస్తావ్ ? నువ్వూ మాతో వచ్చెయ్యరా’ అంది సమీర
‘అవునురా .. సాయంత్రం వరకూ రాదు. పవర్ కట్ కదా .. ఒక్కడివి ఎలా ఉంటావ్ బోరింగ్ గా .. పద వెళ్దాం’ అంటూ వాడి భుజం పై వేసిన చేయి తీస్తూ లంచ్ అందరికీ ప్యాక్ చేస్తున్నానని  చెప్పింది  కావేరి.  ‘మీ పిల్లలు కూడా చిన్నప్పుడు  మీతో వచ్చేవారా’  ప్రశ్నించాడు సతీష్ లంచ్ సర్దుతున్న కావేరి దగ్గరకొచ్చి. అవునన్నట్లు తలూపి ‘ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చినా వస్తారు ‘ అని  వేసివున్న కరెంట్ స్విచ్ లు ఆఫ్ చేయమని సమీరతో చెప్పింది. అంతా బయటికి నడుస్తున్నారు.  ఏమనుకున్నాడో తనూ బయటికి కదిలాడు సతీష్.

మొదట్లో కొద్దిగా మొహమాటంగా ,దూరం దూరంగా ఉండి  పెద్దవాళ్ళ వెనకే తిరిగినా సాయంత్రం అయ్యేసరికి సమీర, కాశ్మీర బాగా కలసిపోయారు ఆశ్రమం పిల్లలతో .  కొండ ఎక్కుదాం అంది కాశ్మీర. ఎండ వేడికి రాళ్ళు బాగా వేడెక్కి ఉంటాయి. రేప్పొద్దున ఎక్కుదాం. అప్పుడయితే వాతావరణం బాగుంటుంది. మనకి అలసట రాదు. దాహం వేయదు అన్నారు వాళ్ళు.  మా అక్క ఒప్పుకుంటే మేమూ మీతో వస్తాం అన్నాడు బాలు. అక్కతో మాట్లాడే బాధ్యత నాది అంది శ్వేత.

సతీష్ మాత్రం అంటీ ముట్టనట్టుగా .. తను ఏదో గోప్పవాడన్నట్లుగా .. వాళ్ళు ఏమీ లేనివాళ్ళు  అంటరానివాళ్ళు అన్నట్లు చిన్నచూపుతో ..  వాళ్ళు పలకరించినా మొహం చిట్లించుకుని , పొగరుమోతు సమాధానిలిస్తూ .. చివరికి కావేరి ప్రోద్భలంతో వాళ్ళతో వాలీ బాల్ ఆటకు వెళ్ళాడు.
ఆటమధ్యలో బాల్  జారవిడిచిన వాడిని ‘నీ అమ్మ .. ‘ తిట్టాడు
‘అంతే .. ఏయ్ ఏదన్నా ఉంటే నన్నను.  పడతాను. గానీ నా అమ్మని అంటే ఒప్పుకోను ‘ కోపంతో అరిచాడు వాడు
‘ఏంటిరా.. బే .. అంటా .. ఒకటి కాదు వంద సార్లు అంటా .. ఏం చేస్తావురా ..తల్లెవరో తెలియదు గాని ‘ కాలరెగరేసి నీలేష్ మీదకి ఎగబడ్డాడు సతీష్
గుడ్లురిమి పళ్ళు పటపట లాడించాడు నీలేష్
‘తినటానికి గతిలేని వాడివి. మా పెద్దమ్మవిదిలించే దయతో బతుకుతున్నవాడివి .  నీకే అంత టెంపరయితే నాకెంత ఉండాలి ..? హు..   ‘ నిరసనగా చీత్కారంగా చూస్తూ హుకరించాడు  సతీష్
ఆట ఆగిపోయింది . పిల్లలంతా సతీష్ ని మింగేయాలన్నంత కోపంగా చూస్తూ .. వాళ్ళను ఆడిస్తున్న కేర్ టేకర్ ఏమనాలో తెలియక ఆశ్రమం పిల్లలని సముదాయించబోయింది .
అంతలో ఒకడు వేప చెట్టుకింద సిమెంట్ బెంచ్ ఫై కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్న కావేరి దగ్గరకు పరుగెత్తుకెళ్ళి విషయం చెప్పాడు . తొందరగా రా..  తొందరగా రా అంటూ తొందర పెట్టి లాక్కెళ్ళాడు
ఈలోగా ‘ మా దగ్గరకి చుట్టం చూపుగా వచ్చావని, మా అక్క తీసుకోచ్చిందని ఊరుకున్నాం . లేకుంటేనా .. ‘ అన్నాడొకడు కళ్లెర్రజేస్తూ
‘ ఛి చ్చీ .. చుట్టం ఎవడ్రా నీ చుట్టం  ..? హూ .. చెప్పు , ఏంట్రా నువ్వు చూసేది . ఊరు పేరు లేనోళ్ళు .. ఎక్కడ పుట్టారో .. ఎవరికి  పుట్టారో తెలియనాళ్ళు .. గాలికి తిరిగి తిరిగి ఇక్కడికి కొట్టుకొచ్చినాళ్ళు . నా సంగతి చుస్తారట్రా .. నేను ఉఫ్ అంటే ఇంకెక్కడో పడతారు. అహ్హహ్హా…  ‘ అంటూ జుట్టు పైకి ఎగరేస్తూనే మరో చేత్తో కాలర్ పైకి ఎగరేసి ఒకడిని ఒక్క తోపు తోశాడు .  మిగతా పిల్లలంతా సతీష్ పై లంఘించబోతుండగా అక్కడికి చేరింది కావేరి
తప్పు చేసిన వారిలా అంతా తలోంచుకున్నారు. కానీ, వాళ్ళలో బాధ కన్పిస్తోంది . వంచిన తలలోంచి పైకి లేపి చూస్తున్న కళ్ళలో పొడుచుకొస్తున్న పౌరుషం .. కసి కోపం .. మానిపోతున్న గాయాన్ని కెలుకుతున్న భావన వారిలో
‘ఛి ..చ్చి .. రానంటే ఈ అలగా వాళ్ళ దగ్గరకి తీసుకొచ్చారు ‘ కాలరెగరేస్తూ ఒక నిర్లక్ష్యపు చూపు కావేరి కేసి  విసిరి వేళ్ళు జుట్టులోకి పోనిచ్చుకుంటూ సతీష్
‘అక్కా విన్నారుగా .. అలగా వాళ్ళట .. ఎంత నీచంగా మాట్లాడాడో .. మీరు రాకపోతే వీడి పని అయిపోయేది ‘  భగభగ మండుతున్న హృదయాన్ని, తోసుకోస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ అన్నాడు వాళ్ళలో కాస్త పెద్దవాడయిన ప్రభాకర్.  ‘ అవునక్కా ‘ పొంగుకొస్తున్న ఉద్వేగంతో  గుప్పెడు మనసు అలజడిని తెలిపారు మిగతావాళ్ళు.
ఆ పిల్లలందరిలో కనిపిస్తున్న నిరసన సతీష్ ని రెచ్చగోట్టిందేమో వెనక్కి తిరిగి ఒక రాయి తీసి వాళ్లపైకి విసిరేశాడు . అప్పుడే అటుగా వస్తున్న వర్ధన్ ముక్కుకి  తగిలి బోలబోలా రక్తం . 

****                  ****

రెండో రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతూ సతీష్ ని తనతో రమ్మంది కావేరి. నిన్న ఆ సంఘటన జరిగాక వాళ్ళమ్మ వాడిని కోప్పడబోయింది. నేను చెప్పేవరకూ వాడితో ఎవరూ మాట్లాడొద్దని  హుకుం జారీ చేసింది కావేరి. ఏదో అర్ధమయినట్లు  శశి ఇంకేం మాట్లాడలేదు. అంతే , అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎవరూ మాట్లాడలేదు వాడితో.  ఏమనుకున్నాడో మారు మాట్లాడకుండా వచ్చి కావేరి స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు . వాళ్ళు వెళ్లేసరికి పిల్లలందరూ సమావేశం అయ్యారు. గత వారం వాళ్ళు ఏం  చేశారో , ఈ వారం ఏమి చెయ్యాలనుకుంటున్నారో చర్చించడం కోసం ఆ సమావేశం
మా సమావేశం మొదలవడానికి ముందు ఈ రోజు నేను రాసిన పాట పాడనా అని  కావేరిని అడిగింది శ్రావణి .
‘అదేంట్రా నన్ను అడుగుతున్నావు.  ఈ సమావేశం మీది. నేను మీకు అతిధిని మాత్రమే. మీ సమావేశంలో మీరేం చేయాలనుకుంటే అది చేయండి’ అని చెప్పి సతీష్ వైపు చూసింది కావేరి. వంచిన తల ఎత్తకుండా కూర్చున్నాడు.
‘మాయా మర్మం ఎరుగని వాళ్ళం
చేయని తప్పుకి శిక్ష మోస్తున్నవాళ్ళం
మేమంటే మీకెందుకీ చులకన భావం
మా పై మీ కెందుకీ ఆధిపత్యం ”
అంటూ సాగింది శ్రావణి పాట .
‘ఎవరురా అన్నది మాకు అమ్మానాన్నా లేరని
ఎవరురా అన్నది మాకు మంచి చెడు తెలియదని
ఎవరురా అన్నది మాకు చదువూ సంస్కారం అబ్బవని
……….. ‘ నీలేష్  ఆవేశంగా చదివాడు తను రాసిన కవితని
సంతోష్ తను రాసిన కథ వినిపించాడు., శంకర్ తన కవిత అందరిముందు ఉంచాడు. ఇద్దరు ముగ్గురు తాము చార్ట్ పై వేసిన బొమ్మలు డిస్ప్లే చేశారు .  చిన్న రోల్ ప్లే చేసి ప్రదర్శించారు . ఎన్నెన్ని రూపాల్లో చెప్పినా అదే భావం. గుప్పెడు మనసులో అలజడి రేపిన గంపెడు ఆవేదనల ఆధారంగా రాసినవే, హృదయం తెరచి చూపినవే. వారి ఘోష వినిపించినవే .
వర్ధన్ శరీరానికి అయిన గాయం పై పూత మందులతో తగ్గుతుందేమో కానీ, మా మనసులకు అయిన గాయం మానేదెప్పుడు అని ప్రశ్నిస్తూ ఉన్నవే .  కన్నీటి గాయాల్ని జయించడానికి ప్రయత్నం చేస్తున్న చిన్నారుల్ని చూసి ఆర్ద్రమయింది కావేరి మనసు.  వాళ్ళు తమ హృదయ ఘోషని పంచుకున్న విధం ఆమెను ఆశ్చర్య పరచింది.  వాళ్ళలో ఉన్న సృజనాత్మకత అబ్బుర పరిచింది.
అప్పటివరకూ మౌనంగా ఉన్న సతీష్ లేచి కావేరి ఎదుటకొచ్చి వాడిన మొహంతో ‘సారీ పెద్దమ్మా ‘ అంటూ కావేరి చేయి పట్టుకున్నాడు.
‘సారీ నాకు కాదు చెప్పాల్సింది వాళ్ళకి ‘ నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా కావేరి స్వరం.  ఆమె స్వర తీవ్రతకి పిల్లలంతా ఉలిక్కిపడ్డారు.
లేచి వాళ్ళందరి కేసి ఒకసారి చూసి తలొంచుకుని ‘సారీ ఫ్రండ్స్ .. నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను. తప్పుగా అర్ధం చేసుకున్నాను. ఎక్స్ ట్రీంలీ సారీ ‘ కళ్ళు చెలిమలవుతుండగా అన్నాడు.
పిల్లల మొహాల్లో ఆశ్చర్యం కళ్ళలో మెరుపు.  తమకి అతనిపట్ల ఉన్న కోపం విడచి  స్నేహపూర్వకంగా చేయి అందించాడు వర్ధన్ , ఆ వెనకే ప్రభాకర్, నీలేష్, శ్రావణి.  తనూ బిడియంగా చేయి కలిపాడు సతీష్. కొన్ని క్షణాల మౌనం అందరి మధ్య.  ఆ తర్వాత నిశబ్దానికి భంగపరుస్తూ ‘నేను ఇక్కడ ఉన్నన్నిరోజులు మీ దగ్గరకి రావచ్చా .. మీతో నన్ను కలుపుకుంటారా .. ఆడనిస్తారా ..’ అని వర్ధన్ కేసి చూసి నా తల పగిలి రక్తం కారితే నేనెంత గోల చేసేవాడినో నాకు తెల్సు . కానీ మీ బాధని , కోపాన్ని , కసిని మీరు మీలోనే దాచుకున్నారు. ఏమీ జరగనట్టుగానే నన్ను ఇక్కడికి రానిచ్చారు. ఇక్కడ కుర్చోనిచ్చారు. కానీ, రాత్రంతా మీ చూపులు నన్ను వెన్నాడాయి. నాకే గనక అమ్మానాన్నా లేకపోతే .. ఆ ఆలోచన నన్ను వణికిన్చేసింది. అసలు నిద్ర పోనీయలేదు. మీరూ నిద్రపోలేదని ఇప్పుడు నాకు అర్ధమయింది.  సారీ ఫ్రండ్స్ , రియల్లీ సారీ .. మీరు నాకు ఏ శిక్ష వేసినా ఓకే . నా ప్రవర్తనకి నేను సిగ్గు పడుతున్నాను ‘. కళ్ళలో చిప్పిల్లుతున్న నీటిని తుడుచుకుంటూ అన్నాడు సతీష్
‘మనం ఫ్రెండ్స్ అరిచారెవరో .. అవును , మనం ఫ్రెండ్స్ .. ఏడవకు’ అరిచారంతా .
మనలో రెండురకాల వ్యక్తిత్వాలు ఉంటాయేమో ..  వెటకారం , విమర్శించడం, అవమానపరచడం వల్ల ఎదుటివారు గాయపడతారు. మనస్తాపానికి లోనవుతారు. అదే మనలో మంచితనం , స్పందించే తత్వం , సంస్కారం , ఎదుటివారిని ప్రేమించే గుణం ఉంటాయేమో, మానవత్వపు చిగుర్లు తొడిగి జీవన పరిమళాలు వెదజల్లుతాయేమో..  ఆలోచిస్తున్న కావేరి కళ్ళ నిండుగా వెన్నెల వాన కురుస్తున్నట్లుగా ఆ దృశ్యం.  అదో వింత అనుభూతి.  సతీష్ లోని  పరిణతిని మురిపెంగా చూస్తూ దగ్గరకి తీసుకొని నుదిటిపై ముద్దిచ్చి అభినందించింది ఆమె.  పిల్లలందరూ ‘ఓ … ఓ .. ‘ అరుపులు.
‘నాకు వచ్చిన హ్యాండి క్రాఫ్ట్స్ నేను మీకు నేర్పిస్తా .. మీకు వచ్చినవి నాకు నేర్పిస్తారా .. కళ్ళు తుడుచుకుంటూ’ వినయంగా అడుగుతున్నాడు సతీష్
‘తప్పకుండా ‘ అరిచారు పిల్లలు . చప్పట్లు .. వాళ్ళ కళ్ళలో ఆనందం.  అప్పటివరకూ భారంగా ఉన్న వాతావరణం తేలిక చేస్తూ చప్పట్లు , నవ్వులు కేరింతలు ..
ఎప్పుడొచ్చి అక్కడ నిలిచారో శశి, కళ్యాణి , సమీర , కాశ్మీర  చప్పట్లు .  మేటవేసిన అహంకారపు పొరలు కరిగిన కొడుకుని గబగబా వచ్చి హత్తుకుని ముద్దిచ్చింది శశి .

వి. శాంతి ప్రబోధ

( అనుపమ మాసపత్రిక జనవరి 2016 సంచికలో ప్రచురణ )

అనాధ – ఆన్లైన్ ఇబ్బందులు

సమతనిలయం లో 10 మంది పిల్లలు 5 వతరగతి పూర్తీ చేసుకున్నారు. వారిలో 5 మంది మోడల్ స్కూల్ లో చేరాలని అనుకుంటున్నారు. అందుకోసం ఆన్లైన్ లో అప్లై చేయడానికి మా మంజుల ని మీ సేవా సెంటర్ కి పంపించాను.  అవి ఎంట్రీ చేసేటప్పుడు అన్నీ సందేహాలే . మాటిమాటికీ ఫోను.  ఇతర పిల్లల అప్లికేషన్ నింపేటప్పుడు వాళ్లెవరికి రాని ఇబ్బందులు మా పిల్లలకి వచ్చాయి. కారణం వాళ్ళ వివరాలు తెలియకపొవడమే.  ఆ అప్లికేషన్ లో పేరు , ఇంటిపేరు , తల్లిదండ్రుల పేర్లు, కులం , మతం తప్పనిసరిగా ఇవ్వాలి.
కానీ మా పిల్లల్లో కొంత మందికి వారి ఇంటిపేరు తెలియదు. కులం , మతం అసలే తెలియదు .
ఇలా తమ కులం గురించి వివరాలు తెలియని పిల్లల్ని ‘కుల రహితులు’ (casteless )గా గుర్తించి  షెడ్యుల్డ్ కులాల వారికి ఇచ్చే స్కాలర్ షిప్ సౌకర్యాలు, రిజర్వేషన్ సౌకర్యాలు ఇవ్వాలని G.O.Ms.No. 34 చెప్తోంది. అదే విధంగా వీరికి 3% సీట్లు సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ అద్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లోనూ, హాస్టళ్ళలోను సీటు ఇవ్వ వచ్చని G.O.Ms. No 47 చెప్తోంది
అదే విధంగా ఈ పిల్లల నుండి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు.
గతంలోనూ 10 వతరగతి, ఇంటర్ చదివే వాళ్ళ ఫీజు విషయంలోనూ మాకు ఇబ్బందులేదురయ్యాయి. G.O  చూపించినా ఫీజు తప్పని సరిగా కట్టాల్సిందే , ఆన్లైన్ లో accept చేయడం లేదు అన్నప్పుడు మేం చేసేదిలేక ఫీజు కట్టేశాం.
ఇదిగో ఇప్పుడు మా వాళ్ళలో ఒకరికి ఇంటిపేరు, కులం పేరు తెలియదు . castless అని పెట్టమంటే ఆ ఆప్షన్ లేదు అంటున్నారు. పై G.O ల ప్రకారం యస్ సి పెట్టండి అని చెప్తే, మరో ఆప్షన్ మాల / మాదిగ ఏది అని వచ్చింది. ఎలా .. చివరికి మాదిగ అని ఇచ్చాం . సర్ నేమ్  ఆ అమ్మాయి పేరులో మొదటి అక్షరం S ఇచ్చాం. అయినా ఆ ఫీల్డ్ ముందుకుపోలేదు. అదే అక్షరం రెండు సార్లు  అంటే SS అని ఇచ్చాం.  కానీ మేం చేసింది తప్పు కదా .. మనసు ఒప్పుకోవడం లేదు. లేదంటే ఆ అమ్మాయి మోడల్ స్కూల్ లో అవకాశం కోల్పోవచ్చు.  వీళ్ళకి కులం , ఆదాయం , నివాస సర్టిఫికేట్ లు ఉండవు . orphan certificate ఉంది. సీటు వస్తే అడ్మిషన్ అప్పుడు మరెలాంటి సమస్యలు ఎదుర్కోవాలో ….

ఇప్పుడు చాలా సందర్భాల్లో birth certificate అడుగుతున్నారు. వీళ్ళకు ఆ certificate ఎలా ఇస్తారు .? మా వాళ్ళలో చాలా మందికి మేమే ఒక పుట్టిన తేదీ ఇచ్చాం. వాళ్ళ చిరునామా సమతనిలయమే. ఇక్కడే మేం ఆధార్ కార్డు కూడా తీసుకున్నాం. కానీ birth certificate కి అది సరిపోదు కదా ..
 ఈ విషయాలు  స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి ఫోన్ చేసి చర్చించాను. శాఖల మధ్య సమన్వయ లోపం  సాఫ్ట్ వేర్ చేసేటప్పుడు ఇలాంటివి జరిగి ఉండొచ్చని అనిపించి ఆ విషయమే వారితో అన్నాను.  ఈ సమస్యలని పరిష్కరిచడానికి వీలవుతుందేమో చూడగలరా అని అడిగాను.   అవునా .. ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు.  రాసి పంపించండి. స్టేట్ మీటింగ్ లలో మేం పై  వారి దృష్టికి తీసుకేళ్టాం అన్నారు.  చూద్దాం ఏమి జరుగుతుందో ..

Tag Cloud

%d bloggers like this: