The greatest WordPress.com site in all the land!

Posts tagged ‘అత్యాచారం’

దుర్యోధన దుశ్శాసన పర్వమూలాలెక్కడ .. ? నీలోనే …

నేను నిరుపేద ఆడపిల్లను
నేను కులసోపానంలో కింద ఉన్న బాధితను
నిత్యం దుర్యోధన దుశ్శాసన పర్వం లో చిక్కిన సమిధను
అందుకే
ఆ జాడ లేని లోకం కోసం డేగకళ్ళతో గాలించా
ఏదీ .. ఎక్కడా అగుపించదే ?
మూలం ఏమిటని, ఎక్కడుందని
మూడో కన్ను తెరిచి
ముల్లోకాలూ అన్వేషించా
అర్ధమయింది !
మగవాళ్ళు ఎప్పటికీ మగవాళ్ళే …
ఆ మాత్రం కుర్రతనపు ఆకతాయి చేష్టలుండవా.. ?
అనే
నీ తత్వంలోనే ఉంది అసలు లోపం
ఆనాటి నుండి ఈ నాటివరకూ ..
నీ ఆధిపత్య భావనలోనే ఉంది అసలు దోషం
నేను దోషాలకు నిలయం అంటూ
నా ఆడతనానికి మరకలు వేసే నువ్వే ..
నాపై నిఘా .. అనేకానేక హద్దులూ ..
ఆంక్షలు .. ఏర్పరచే నువ్వే
నియమాలూ , విధులూ ఏర్పరచి
నన్నేదో ఉద్దరిస్తున్నట్లు , రక్షిస్తున్నట్లు
జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఫోజులిస్తూ
ఒరిపిడి రాయిపై పరీక్షలు చేసేది నువ్వే
అవును మరి !
ఆ శ్రీ రామచంద్రుని వారసులు కదా !!!
నా స్వభావం .. నా చర్యలు పాపిస్టివంటూ
నేను విశ్వసించదగిన దాన్ని కాదని ప్రచారం చేసే నువ్వే
నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి
నా గర్భస్థానాన్ని అనకొండలా ఆక్రమించేసి
అది నీ మగతనంగా విర్ర వీగుతావు
అదేనీవు
అత్యాచారం స్త్రీకి మరణం కంటే హేయం అంటావు
అనైతిక ప్రవర్తనతోఎగిసిపడే నువ్వే
నీ శీలానికి లేని పవిత్రత నా శీలానికి అంటగట్టి
నా జీవితాన్ని రాబందులా కరచిపట్టి
నన్ను సమిధను చేస్తావు
నీ ఆటలు సాగనివ్వకపోతే సహించలేవు
బలసిన కొండచిలువలా బుసకొడతావు
అహంకారంతో అరాచకం సృస్టిస్తావు
పట్టపగలు పదుగురి ఎదుటే
వివస్త్రను చేసి నిస్సిగ్గుగా
సాముహిక అత్యాచారం చేస్తావు
నడివీధిలో తుపాకితో కాల్చేస్తావు
శవాల తివాచీ పరుస్తావు
అవును మరి
తాటక వధ నీ నిర్వాకమేగా !
శుర్పణఖ చెవులు ముక్కు కోసిన ఘనత నీదేగా !!
తోడేళ్ళలా పడి నా మర్మస్థానం పై దాడిచేయడం
బానిసను చేసి లోబరుచుకోవడం ,
అడవుల పాలు చేయడం
అమ్మకానికి పెట్టడం నీకు కొత్తేమీ కాదుగా.. !
పురాణకాలం నుంచి చూస్తున్నదేగా !!
నా వ్యవహారంలో పెత్తందారులా వ్యవహరించి
నా ఆలోచనా స్రవంతిని నియంత్రించి
నా ఉద్వేగాలను భావాలను ప్రతిఘటించి
నా సామాజిక ధర్మాలను నిర్ధారించి
నా నీతి న్యాయం నిర్ణయించి
తీర్పు చెప్పే వారిగా స్థిరపరచే నువ్వు
నా శ్రమను కొల్లగొడుతూ
నా శ్రమ ఫలితాలను అపహరిస్తూ
నా ఆశలను , అభిలాషలను కాలరాస్తూ
నాపై నాకే అంతరం సృష్టించే నువ్వు
నన్ను, నీకు విశ్వాసంగా బతకాలంటావు
నా గర్భస్థలం ఆక్రమించి
నాకు గర్భాదానం చేశానని
వారసులపై హక్కు ప్రకటించి
కాకీవనపు కరకు గాలిలో బంధించాలనుకుంటావు
ఇలా ఎన్నాళ్ళు .. ఎన్నేళ్ళు
ఇకపై సాగవు నీ ఆగడాలు
నీ ఒంటెద్దు పోకడలు తుంగలో తోక్కి
సమాజాభివృద్ధికి సమానాభివృద్దికి
నూతన సంస్కృతికి తోవ చూపుతా
స్త్రీ విముక్తి మార్గాలు వెతుకుతా
తళుకు బెళుకుల గాజురాయిలా కాదు
నిగ నిగలాడే నిక్కమైన నీలమణిలా మెరుస్తా
అంటూ ముల్లోకాలూ చాటింపు వేస్తా
ఆశ్చర్యంగా ఉందా .. ?
అవును నిజంగా నీకు ఆశ్చర్యాన్నే .,!!
నా రూపు మార్చుకుంటూ ..
నా ఉనికికి గుర్తింపునిచ్చుకుంటూ…
చీదరించుకునే నోళ్లను మూయిస్తూ…
సున్నా నుంచీ ప్రశ్నార్ధకంగా.. ఆశ్చర్యార్ధకంగా మారిపోతూ..
నా అస్తిత్వానికి ఓ అర్ధం ఏర్పరచుకుంటూ.. సాగిపోతుంటా ..

– వి. శాంతి ప్రబోధ

(published in July 2014 Vihanga Web magazine)

అత్యాచారాలను అంతం చేయాల్సిన బాధ్యత అందరిదీ ..

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః
ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారని అంటారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ, జరుగుతున్నదేమిటి? ఆమెను పూజించడం కాదు, తన తోటి మనిషిగానైనా చూస్తున్నామా..? గౌరవించడం కాదు ఒక వ్యక్తిగానైనా గుర్తిస్తున్నామా..? ఆమె శరీరంలోని ఎత్తు పల్లాల మాంసపు ముద్దల్నే తప్ప ఏమీ చూడడం లేదు కదా..! ఆమెలోని ఆడతనం తప్ప ఏమి గుర్తించని గుడ్డివాళ్లయిపోయాము కదా..?! ఇది దుర్యోధన, దుస్సాశన పర్వంలో.. నిండు సభలో ఆమెపై వస్త్రాపహరణం చేసిన సంస్కృతికి కొనసాగింపు కాదు కదా..? !!
ఏ పేపర్ తిరగేసినా అత్యాచారానికి సంబంధించిన వార్తలే .. మనం నేర్చిన నాగరికత మనని ఎక్కడికి తీసుకుపోతోందని ప్రశ్నలే .. నాలుగైదు రోజులుగా పేపర్లలో వచ్చిన అత్యాచారానికి సంబంధించిన వార్తలు కొన్ని చూద్దాం.
మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన జమ్మూ-కాశ్మీర్ వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ అక్కడి డాక్టర్ల నిరసన ప్రదర్శన.
దేశ రాజధాని ఢిల్లీలో మణిపూర్ బాలికపై అత్యాచారం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఢిల్లీ దక్షిణ ప్రాంతంలోని మునిర్కా ఏరియాలో ఒక భూస్వామి కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తన కుమార్తె స్నేహితురాలిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉద్యోగం ఇస్తానని వాగ్ధానం చేసి, మహిళపై అత్యాచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రమణ్ స్వామి అనే ఆమ్ ఆద్మీ పార్టీ నేత మహిళపై జనవరి 25వ తేదీన అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
దుష్టశక్తులను వదిలిస్తానన్నాడు.. అత్యాచారం చేశాడు!.
బండిలోకి ఎక్కగానే రెండువైపుల నుంచి నలుగురు వ్యక్తులు అందులోని ప్రవేశించి ఆమెని దారుణంగా అత్యాచారం చేశారు. తొలుత ఆమె నోటిలో గుడ్డలు కుక్కి, తర్వాత కళ్ళకు గంతలుకట్టి వంతులవారీగా అత్యాచారం చేశారు ఆ కామాంధులు.
కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు అభం శుభం తెలియని బాలికను బెదిరించి ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక …
ఇద్దరు గిరిజన మహిళలను వేర్వేరు ప్రాంతాలలో అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన సంఘటనలు జంషెడ్ పూర్ నగరంలోని చోటు చేసుకున్నాయి
సొంత కూతుళ్లపై ఓ తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీ రాజధానిలో మరో ఘోరం జరిగిపోయింది. మణిపూర్ కు చెందిన 14ఏళ్ల బాలికపై కామాంధుడు పలుసార్లు ఘోరంగా అత్యాచారం చేశాడు.

ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత చిట్టా తయారవుతుంది. పై సంఘటనలు చూస్తే ఏమర్ధమవుతోంది? అత్యాచారాలకు పాల్పడేది జులాయిగా తిరుగుతూ తాగి తందానలాడేవాళ్ళు మాత్రమే కాదనీ కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులు, ప్రజలను కాపాడే బాధ్యత తీసుకున్న మంత్రులూ, నాయకులూ , బాబాలూ , ఉపాధ్యాయులు, ఆర్మీ జవానులు ఎవరూ మినహాయింపు కాదనేగా…! అత్యాచారానికి గురి అయినది గిరిజన మహిళల దగ్గరనుండి, పసివాడని పాలబుగ్గల బాలికల వరకూ, ఉన్నత విద్యావంతుల నుండి విద్యాగంధం లేని వారి వరకూ అంతా బాధితులేననీ .. .

ఈ సంఘటనలు ఇలా ఉంటే, ఈ మధ్య పత్రికల్లో వచ్చిన ఈ వార్త చూడండి. వారి చర్యలు ఎంత అనాగారకంగా , కిరాతకంగా ఉన్నాయో తెలుస్తుంది.

“పశ్చిమ బెంగాల్ లో ఓ 20 సంవత్సరాల వయసున్న మహిళ వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని ఆమెపై సామూహిక అత్యాచారం చెయ్యమని గ్రామపంచాయతీ తీర్పునిచ్చింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లా లోని సుబల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం బిర్భూమ్ జిల్లాలోని సుబల్పూర్ గ్రామంలో నివసిస్తున్న ఓ ఇరవై సంవత్సరాల వయసున్న గిరిజన మహిళను, ఆమె ప్రియుడిని ఇంట్లో కలిసి ఉండటం కొంత మంది గ్రామస్తులు చూసారు. వెంటనే కొందరు గ్రామ పెద్దలను కలిసి గ్రామ పంచాయతీ పెట్టారు.

గిరిజన కులాచారం, కట్టుబాట్లు కాదని అతన్ని ప్రేమించినందుకు చెరో 25 వేల రూపాయల జరిమానా కట్టవలసిందిగా గ్రామపంచాయతీలో తీర్పునిచ్చారు. అయితే అంతమొత్తంలో జరిమానా కట్టలేమని ఆ యువతి తరుపు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు తెలియజేసారు. దీంతో అతన్ని చితక్కొట్టి, ఆమెపై సామూహిక అత్యాచారం చెయ్యమని, గ్రామంలోకి వస్తే కిరోసిన్ పోసి తగులబెట్టమని గ్రామపెద్దలు తీర్పునిచ్చారు. ఆ తీర్పుతో మహిళను అక్కడి నుండి తీసుకువెళ్ళి 12 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా తనపై ఎంత మంది అత్యాచారానికి పాల్పడ్డారో తనకు తెలియదని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వాపోయింది. ఆ అఘాయిత్యానికి పాల్పడినవారు ఆమె ఇంటి చుట్టుపక్కల వారే. వారిని రోజూ కాకా, అన్నా, మామా అని పిలిపించుకున్న వాళ్ళే. ”

ఇది ఏమి న్యాయం? ఎక్కడి న్యాయం? ఇలాంటి సంఘటనలు వింటుంటే రక్తం మరిగిపోతుంది. బాధతో హృదయం కరిగిపోతుంది. ఇలా తీర్పులిచ్చే వారిని, ఎగబడే వారిని తెగబడే వారిని ఏమి చెయ్యాలి? ఆటవిక అనాగరిక సమాజంలో కూడా ఇలాంటి అమానవీయమైన, దుర్మార్గమైన తీర్పులు ఉండేవి కాదేమో …?! ఆమె స్వేచ్చని అణచివేయడం లేదా తమ చేతుల్లోకి తీసుకోవడం ప్రజాస్వామికమా..? ఆమెని అణచివేయాలన్టే అత్యాచారం వారికి సాధనమా ..?

ఆడపిల్లకి బయటి ప్రపంచంలోనే కాదు ఇల్లు కుటుంబం కూడా రక్షణ ఇవ్వలేకపోతోంది. అయిన వారినుండి కాని వారినుండి ఎవరినుండైనా ఒకటే తీరు. మానవ సంబంధాలు పలుచనై అపహాస్యం చేస్తుంటే, నిలువునా దహించి వేస్తుంటే ఏదో ఒకటి చేయక తప్పదు. ఇకనైనా తప్పదు. ఇప్పటికైనా పరిస్థితి చక్కదిద్దుకోక తప్పదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా లేచి నిలబడక తప్పదు. తల ఎత్తుకు నిలబడాలంటే ఆడపిల్ల ‘ఆడ’పిల్లలా కాదు అగ్గిపుల్లగా, ఆడపులిగా మారక తప్పదు .

అసలు ఇలాంటి సంఘటనలు రోజు రోజుకీ పెరిగి పోవడానికి కారణం ఏమిటి? మనం మనుషులమన్న వాస్తవం మరచి మృగాలుగా, రాక్షసులుగా మారడానికి కారణం ఏమిటి? ఎవరు? మనం కాదూ ..?! సమాజంలో నానాటికీ తీసికట్టవుతున్న పరిస్తితులు కాదూ… ? నీతి నియమం మరచి వికృత పోకడలతో, చేష్టలతో వికటాట్టహాసం రాజ్యం కాదా? అనకొండలా నోరు తెరిచి సృష్టిస్తున్న అసమానతలు కాదా? జనమంతా రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టినా .. నిర్భయ సంఘటన తర్వాత చట్టం వచ్చినా అత్యాచార పర్వం ఆగిందా…? అంటే, లేదు. ఎందరో నిర్భయలు .. అభయలు బలవుతూనే ఉన్నారు. ఇలాంటి కేసులు రెట్టింపు పెరిగాయి. చట్టం, శిక్షలు అందులో ఉండే లోసుగులు నేరస్తుల పాలిట చుట్టాలై రక్షిస్తున్నాయి.

మీడియాలో ఇలాంటి వార్తలు చూసి, ‘అమ్మా రేప్ అంటే ఏమిటి? నాన్నా అత్యాచారం అంటే ఏంటీ? అని అడిగే చిన్నారులకు ఏమి సమాధానం చెప్పాలి ?

కీచక పర్వానికి ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాం :

సామాజిక అసమానతలు:

కుటుంబంలో, కార్యప్రదేశంలో, సమాజంలో, ప్రభుత్వంలో ‘ప్రజలంతా సమానం’ అని మనం వల్లే వేసే మాటలు బూటకం . అన్ని చోట్లా అసమానతే. ఏ ఇంట్లో చూసినా, ఏ కులంలో చూసినా, ఏ మతంలో చూసినా, ఏ జాతిలో చూసినా అసమానత స్పష్టంగా కనిపిస్తూనే … రాజ్యమేలుతూనే… సమానత పొందలేని మహిళలు బలహినులే కదా…? అసమాన అస్తవ్యస్త సమాజంలో ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు జరుగుతూనే ఉంటాయి .

సమాజంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులు అవడం సహజం. వారి మానసిక, శారీరక అవసరాలు కోరికలు ఒకేలా ఉంటాయి. వాటిని అనుసరించి ప్రజలను సక్రమ మార్గంలో నడపడానికి నీతి నియమాలు ఉండాలి. అవి పురుషుడికి ఒక నీతిని , స్త్రీకి ఒక నీతిని బోధించ కూడదు కదా ?

కానీ మగవాళ్ళు నియమించిన విధి విధానాలు, నీతి నియమాలు పురుషుడికి అనుకులంగాను, మహిళకు ప్రతిబంధకంగాను మారాయి. మహిళను ఒక వ్యక్తిగా కాక వస్తువుగా, భోగ వస్తువుగా చూడడంతోనే వస్తోంది ఇబ్బంది అంతా. మన సినిమాలు, సీరియళ్ళు, సంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ ఆమెని ఆవిధంగా చూపడం వల్లే ఆ అసమానతలు మరింత పెరుగుతున్నాయి .

ఒక నిర్భయ కుటుంబానికి ఎంత పరిహారం ఇచ్చినా వారికి జరిగిన నష్టం తీరదు. అయినా జవాబుదారీ ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. కాని ఆ కుటుంబానికి భారీ పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఇతర అత్యాచార బాధితులకు ఏం చేస్తుంది? అదేరోజు సామూహిక అత్యాచారం బాధితురాలైన పదేళ్ల దళిత బాలికకు ఏమిస్తారు? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆల్తమస్ కబీర్ అడిగారు. పత్రికలు కనీసం ఆ వార్తను మొదటి పేజీలో కూడా వేయలేదు. కొన్ని కేసులను ప్రముఖంగా చూస్తూ ఇంకెన్నో కేసులను అసలు పట్టించుకోకపోవడం ఎంతో అన్యాయం అని ప్రధాన న్యాయమూర్తి బాధపడ్డారు అంటే బాధితుల మధ్య ఇది అసమానతే కదా ..?!

అభద్రత

అభద్రతకి మూలాలు మన అసమాన సమాజంలోనే ఉన్నాయి. ప్రభుత్వాలను, చట్టాలను చుట్టాలుగా చేసుకొని శాసించే డబ్బు ఒక కారణం. నేరస్తుడు బలవంతుడు అయితే, డబ్బు గల వాడయితే, సమాజంలో పలుకుబడి గలవాడయితే, ప్రభుత్వ అండదండలు తోడయితే తమపై జరిగిన నేరం గురించి చెప్పుకోవడానికి, ఫిర్యాదు చేయడానికే భయపడుతున్నారు. ఒక వేళ వెళ్ళినా పొలీసు స్టేషన్లు, కోర్టులు వీళ్ళకు న్యాయం చేస్తాయన్న నమ్మకం, అనుకూల పరిస్థితులు లేకపోవడం జరుగుతోంది. బాధితులనే నేరస్థులుగా చూస్తూ వేసే ప్రశ్నల బాణాల్ని, చూసే చూపుల్ని తట్టుకోనే ధైర్యం లేక పోవడం. సమాజం వారిని చూసే దృష్టి అన్నీ వారి అభద్రతకు కారణాలే. కొందరు బలవంతులుగా కొందరు బలహీనులుగా ఉన్నంత కాలం, సామాజిక అసమానతలు ఉన్నంత కాలం బలహీనులకు భద్రత ఎక్కడ దొరుకుతుంది ?

మీడియా

వినోదం పేరుతో ఆకతాయి వేషాలు వేసి, అమ్మాయిల్ని ఏడిపించేవాల్లని హీరోలుగా చూపించే సినిమాలూ, మన ఇళ్ళలోకి చొచ్చుకొచ్చిన టివీల్లో చూపే అక్రమ సంబంధాల సీరియళ్ళు, క్రైం స్టోరిలు, వివాహేతర సంబంధాలు మంచిది కాదు అని కాకుండా సురక్షిత సెక్స్ కోసం కండోములు వాడమని ప్రోత్సహించే ప్రకటనలు, చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాట్లోకి వచ్చి ప్రేరేపించే అశ్లీల చిత్రాలు … ఒకరకంగా కారణమైతే .. జరిగిన అఘయిత్యాన్ని నిరసించే సంఘటనల కంటే ఆమెనో, ఆమె తాలుకు వారినో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వారిని రంపపు కోత కోస్తూ మరింత నరకం చూపుతూ ఉండడం .. చూపిందే పదే పదే మషాలా దట్టించి చూపుతూ రేటింగ్ పెంచుకోవాలనే తపనా .. దుర్మార్గుల కంటే, వారికి పడిన శిక్ష కంటే జరిగిన సంఘటనకే ఎక్కువ ప్రాదాన్యతనివ్వడం .. చేస్తోంటే నేరస్తుడు కాలర్ ఎగరేసుకు తిరగక ఏమి చేస్తాడు ..?!

మీడియా విలువలు తప్పి ప్రవర్తిస్తోంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఒకరు అనైతిక వార్తలు రాస్తేనో, ప్రసారం చేస్తేనో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? ఒకరిని చూసి మరొకరు రేటింగ్ పెంచుకోవడం కోసం విలువలను కాలరాయడం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు నియంత్రించడం లేదు? ఆ బాధ్యత ప్రభుత్వానిది కాదా!?

నిర్భయ సంఘటన జరిగినప్పుడు మీడియా స్పందనకి, మారు మూల గ్రామాల్లో జరిగే సంఘటనలకీ ఒకే విధంగా చూడాలి. ఒకే విధంగా స్పందించాలి. వాస్తవాన్ని బహిర్గతం చెయ్యాలి.

విష సంస్కృతి

అవన్నీ మరచి, అవన్నీ వదిలి అత్యాచారానికి కారణం ఆడపిల్లలే .. ఆమె వస్త్రధారణ అని ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా నోరు జారడం చూస్తే ఏమనిపిస్తుంది? ముక్కు పచ్చలారని పదేళ్ళ పసిపాప ఏ రకంగా రెచ్చగోడుతుంది? కాటికి కాళ్ళు చాసుకున్న అవ్వ ఏమని ప్రేరేపిస్తోంది ? వాళ్ళు రెచ్చగొడితే మాత్రం మీ విజ్ఞత, వివేకం ఏమయిపోయినట్లు ? ఈ విష సంస్కృతికి బీజాలు అసమాన సమాజంలోనే ఉన్నాయి .

సమాజం చూసే తీరు

ఆడవాళ్లంటే ఆటలాడుకుని అవతల విసిరేసే బంతులా ..? ఆమెకి విలువ లేదా ? ఒకసారి అత్యాచారానికి గురైన ఆడపిల్లని లేదా మహిళని ఆమె మైల పడి పోయిందని, పూజకు పనికిరాని పువ్వని అంటారు. అందుకు కారణమైన వాడి దుర్మార్గాన్ని పట్టించుకోరు సరికదా వాడు మగవాడు ఏమి చేసినా చెల్లుతుంది అని సమర్దిస్తారు. ఈ ద్వంద్వనీతితో ఇలాంటి సంఘటనలని మరింత ప్రోత్సహించినట్లే కదా ..?

పరువు ప్రతిష్టలు

అమ్మాయిని ఏమిచేసినా ఫరవాలేదులే .. అవి ఆ అమ్మాయి గొంతు దాటి, ఆ ఇంటి వాకిలి దాటి రాలేవులే .. పరువు ప్రతిష్టల కోసం పాకులాడే సమాజం ఇది అని భావించి రేచ్చిపోయే వారూ ఉన్నారు.

నివారణ మార్గాలు:

నిర్భయ సంఘటన తర్వాత అత్యాచారాలపై చర్చలు, సమావేశాలు, ర్యాలీలు జరిగినా ఎంతో కొంత చైతన్యం కనిపిస్తున్నా, నిందితులకు కఠినశిక్షలు విధిస్తూ చట్టం వచ్చినా అత్యాచార కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగించే అంశమే. అయితే నేరస్థులను పట్టుకోవడంలో, శిక్షించడంలో మునుపులా ఉదాసీనంగా ఉండకుండా దర్యాప్తు వేగవంతం అవుతోందేమో కానీ అత్యాచార పర్వాన్ని ఆపలేక పోవడం చర్చించవలసిన అంశమే.
1098 కి ఫోన్ చేసినట్లు గానే , 108 కి ఫోన్ చేసినట్లు గానే ఇలాంటి కేసుల్ని నమోదు చేయడానికి ఒక ప్రత్యెక నంబర్ కేటాయించాలి. అన్యాయాన్ని బట్టి చర్యలు , చర్చలు జరగాలి.
మహిళలని గౌరవించేలా ప్రచారం చేయాలి.
చిన్నప్పటి నుండి పిల్లలకి నైతిక విలువలు తెలియజేప్పాలి.
పిల్లలో వచ్చే మార్పుల్ని గమనించాలి.
ఇంటర్నెట్, సెల్ఫోన్ లలో అశ్లీల చిత్రాలు చూపే సంస్థల్ని బాన్ చెయ్యాలి. అశ్లీల వెబ్ సైట్ లను బాన్ చెయ్యాలి . అశ్లీల సాహిత్యం అందకుండా నియంత్రించాలి.
ఆడవారి గౌరవానికి భంగం కలిగించే విధంగానూ, వారిని చిన్నచూపు విధంగానూ ఉండే అంశాలను సినిమాలలో, బుల్లితెర సీరియళ్ళు, కార్యక్రమాల్లోను, పుస్తకాల్లోను లేకుండా చూడాలి .
గల్లి గల్లికి మద్యం షాపులకు అనుమతులిచ్చేస్తూ, మద్యం ఏరులై పారిస్తూ ఉంటే మద్యం మత్తులో జరిగే అనర్ధాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటిని ఆపాలంటే మద్యం అమ్మకాలు ఆపాలి .
మద్యం వేలం పాటలతో వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలు నడపాలన్ని ఆలోచనలు మానేయ్యాలి .
పరువు ప్రతిష్టలు అని ఆలోచించకుండా నేరం చేసిన వాడికి శిక్ష పడే చర్యలు తీసుకోవాలి.
అత్యాచారానికి గురయిన మహిలళకి, బాలికలకి ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వాలి.
ఇలాంటి కేసులలో పోలీసులు వెంటనే FIR నమోదు చేయాలి. సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా చూడాలి.
ఒంటరిగా వెళ్ళే మహిళలు స్వీయ రక్షణా పద్దతులు నేర్చుకోవాలి. తగు జాగ్రత్తలు పాటించాలి. అవి తరగతి పుస్తకాల్లో సిలబస్ గా ఉండే విధంగా చొరవ చూపాలి.
రేప్ అనే పేరు ఆ అత్యాచారపు తీవ్రతను తెలియజేసే పేరు. ఆ పేరుతో నేరాన్ని శిక్షించడానికి చేసే ప్రయత్నాలు ప్రజలకు త్వరగా అర్థమవుతాయని జస్టిస్ వర్మ కమిషన్ వివరించింది. మరో ప్రధానాంశం ఉరి శిక్ష. అత్యాచారం ద్వారా మరణానికి, లేదా బాధితురాలు జీవచ్ఛవంలా మారడానికి కారణమయ్యే నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆర్డినెన్సు నిర్దేశించింది. ఈ నియమాన్ని మార్చాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. శిక్షలు కఠినంగా ఉండాలనే నిర్ణయించింది. అత్యాచారానికి ఏడేళ్ల జైలు శిక్షను 20 ఏళ్లకు పెంచాలన్ననియమంలోనూ ఏ మార్పూ చేయకూడదని భావిస్తున్నది. లైంగిక వేధింపుల పరిహార చట్టాన్ని పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది .ఉరిశిక్షలు విధించడం వల్ల మనుషుల్లో పరివర్తన వస్తుందా?
ఆమె మనో ఫలకం పై చెరిగిపోని దాడుల్ని, అఘాయిత్యాల్ని , అత్యాచారాల్ని భరిస్తూ ఇంకెన్నాళ్ళు .. ఇంకెన్నాళ్లో… !

ఇవాళే అంకురిద్దాం !

అన్నా
నాలో నీకు
నీతోడ బుట్టిన చెల్లి కనిపించలేదా !?

నాన్నా
నాలో నీకు
కన్నకూతురు కనిపించలేదా !?

తాతా
నాలో నీకు
ముద్దు మురిపాల మనుమరాలు అగుపించలేదా !?

నాలో మీకు
మన వావి
వరుసలు తెలియడం లేదా !?

ఎందుకని?
నాలో మీకు కనిపించేవి
మాంసపు ముద్దల వంపు సొంపులేనా !?

నేను ఒంటరిగా
కనిపిస్తే చాలు
జుగుప్స కలిగే మాటలతో వేధించవచ్చా !?

వావి వరుసలు మరచి
సభ్యత సంస్కారం విడిచి
వెకిలిచేస్టలతో ఎక్కడైనా చేయి వేయచ్చా!?

వివేకం విచక్షణ నశించి
విషపు కోరలు చాచి
అదను చూసి అత్యాచారం చేసేయ్యచ్చా!?

తల్లిగా, చెల్లిగా, ఆలిగా
ఇంటా, బయటా దిక్కులేని
ఆడపిల్లలా బలవుతున్నాం
మూగ సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాం !?

ఎక్కడికి పోతున్నాం మనం
ఆదిమ మానవుడి కాలానికా
యుగాల వెనక్కి ఆటవిక యుగంలోకా ..
అలా అనడం తప్పేనేమో … !?

ఆనాడు ఒంటిపై నూలుపోగు లేకుండా
ఆకులు అలములతో అరకొర ఆచ్చాదనతో ఉన్నా
ఇంతటి అనాగారికంగా లేరేమో
మృగాళ్ళుగా మారలేదేమో!?

ప్రకృతి సహజమైన సంబందాల్ని
సాంస్కృతిక విలువలతో
ఉన్నతీకరించాల్సిన అవసరం లేదా
చెప్పండి నాన్నా .. అన్నా.. తాతా !?

మీ ప్రవర్తనతో నేను మరమనిషిలానో
మాట పలుకులేని పక్షులూ జంతువుల్లానో
మానసిక ఉద్వేగాలను , వేదనను
వెల్లడించకుండా ఎలా ఉండగలను !?

అవ్వా, అమ్మా , అక్కా ఇవాళే అంకురిద్దాం
ఆత్మ రక్షణా పద్దతులు అందుకొందాం
ఏదో ఒక రోజు పెను ఉప్పెనలా విరుచుకుపడదాం
ఎగబడే తెగబడే వారి విషపు కోరల్ని పెకిలిద్దాం .

– వి. శాంతి ప్రబోధ

‘జనవిజయం’ ఫిబ్రవరి మొదటి పక్షంలో ప్రచురణ

Tag Cloud

%d bloggers like this: