The greatest WordPress.com site in all the land!

Archive for the ‘పిల్లల కథలు’ Category

అడుక్కునే వాడు

నాన్నా.. నాన్నా ..అతన్ని చూడు.  అతను అలా ఉన్నాడేంటి ..? ‘ బోర్డింగ్ స్కూల్ నుండి వేసవి సెలవులకి వచ్చిన ఏడేళ్ళ ధీరజ్ ప్రశ్న.

‘ఆ ఎవరూ .. ఓ వాడా .. బిచ్చగాడ్లే .. ‘ కొడుకు ఎవర్ని చూడమంటున్నాడు అనుకొంటూ అటుకేసి ఆసక్తితో చూసిన తర్వాత నిర్లక్ష్యంగా తండ్రి జవాబు
‘బిచ్చగాడా ..? అంటే? ‘ మరో ప్రశ్న కొడుకు నుండి
‘ఊ .. ‘ తల గోక్కుం
టూ ఒక్క నిముషం ఆగి,  ‘ బిచ్చగాడంటే  బెగ్గర్ ‘ అన్నాడు ధీరజ్ తండ్రి.
‘ ఓ .. బెగ్గరా ..’ ఏదో అర్ధమయినట్లుగా ధీరజ్
‘ అతనేం చేస్తాడు నాన్నా ..’ మరో ప్రశ్న సంధించాడు
‘అందరి దగ్గరింటికి వచ్చి అన్నం , కూర , డబ్బులు అన్నీ అడుక్కుంటాడు ‘
‘అన్నీ అంటే ..?’
‘ఒరేయ్ .. నీ  ప్రశ్నలకి జవాబు నేను చెప్పలేను.  కానీ, పోయి మీ అమ్మనడుగు పో .. ‘ కొద్దిగా విసుగ్గా అని పేపర్ లో తల దూర్చాడు.
ఇక లాభం లేదనుకున్నాడేమో లోపలికి తుర్రు మన్నాడు ధీరజ్.  గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ అంతే వేగంతో వెనక్కి తిరిగొచ్చాడు.
‘నాన్నా అమ్మ వంట పనిలో చాలా బిజీగా ఉందట. మిమ్మల్నే అడగమంది ‘ తండ్రి చెయ్యి పట్టి లాగుతూ అతని తల తన వైపు తిప్పుకుంటూ అన్నాడు.
‘కొద్దిగా ఆగు బేటా .. ‘ అన్న తండ్రి కేసి ఓ క్షణం దీర్ఘంగా చూస్తుండగా బిచ్చగాడి గొంతు ధీరజ్ చెవిన పడింది.  బిచ్చగాడు మరో ఇంటిముందు నిలబడి ‘ అమ్మా ఇంత ముద్దెయ్యమ్మా ..’ అరుస్తున్నాడు
బిచ్చగాళ్ళు అన్నం వండుకోరా ..? అతనికి వాళ్ళమ్మ అన్నం పెట్టదా ..అడుక్కుంటున్నారు.
అన్నం, కూర,  చారు, అప్పచ్చిలు ఏవేవో చాలా అమ్మ వండి పెడుతుంది. నాకు వద్దన్నా అవి తిను ఇవి తిను .. చాలా బలం వస్తుంది అంటూ నన్ను కబుర్లలో పెట్టి తినిపిస్తుంది అమ్మ .  మరి వాళ్ళెందుకు వండుకోరో .. ఎన్నెన్నో సందేహాలు ఆ చిన్ని బుర్రలో . ఆ అడుక్కునే వ్యక్తిని చూస్తే చాలా జాలి కలిగింది ధీరజ్ కి.
ఛి .. ఛ్చి .. తెల్లారిందో లేదా తయారవుతారు . వీళ్ళ కోసం వండి వార్చారని .. అతన్ని తిడుతోంది ఆ ఇంటావిడ.
మౌనంగా ముందుకు కదిలి పోతున్నాడు అతను.
‘అయ్యో పాపం నాన్నా .. అతనికి ఆకలేస్తోంది కావచ్చు .  అతనికి నా దగ్గరున్న బిస్కెట్ పాకెట్ ఇచ్చొస్తా ..’ ముందుకు కదలబోయాడు ధీరజ్
‘చీ.. నువ్వు వీడికేమైంది.  ఎప్పుడూ ఆ అలగా జనం గురించి అడుగుతాడు ‘ అటుగా వచ్చిన భార్యతో అని కొద్ది క్షణాలు ఆగి , ‘ఆ అడుక్కునేవాడి గురించి నీకెందుకురా .. పోయి వీడియో గేమ్స్ , కంప్యూటర్ గేమ్స్ ఆడుకో పో .. ‘ విసుగ్గా గడిమాడు ధీరజ్ తండ్రి
ఏంటో నాకేం అస్సలు అర్ధం కావట్లేదు.  నాన్నెళ్ళి ఓట్లు అడుక్కుంటాడు .. ఇంటింటికీ తిరిగి నాకే ఓటేయ్యమని అందరికీ దండాలు పెడతాడు అని మనసులో అనుకొని, వెళ్తోన్న తల్లి చెయ్యి పట్టుకుని ఆపి వెళ్తోన్న బిచ్చగాడిని చూపుతూ   ‘అన్నం అడుక్కుంటున్నాడని అతన్ని బిచ్చగాడు  అంటున్నాడు  నాన్న .  మరి నాన్న కూడా ఓట్ల బిచ్చగాడే కదమ్మా .. ‘ అమాయకంగా ప్రశ్నిస్తున్న ధీరజ్ మాటలకి
‘ష్ .. తప్పు అలా అనకూడదు. నాన్న నాయకుడు’ అంది వాళ్ళమ్మ
‘ఓట్లు అడిగితే నాయకుడు. అన్నం అడిగితే బిచ్చగాడా .. ‘ అర్ధం కాక అయోమయంలో పడ్డాడు ధీరజ్
వి. శాంతి ప్రబోధ
Published in Jabilli 21.1.2016

రాము – అన్నం

ఆ రామూకి రోజూ పొద్దున్న లేవగానే కాకమ్మ కావు కావు అని అరుస్తుంటే చూస్తూ తనూ కావు కావు అంటూ అనుకరించడం అలవాటు. దాన్ని చూస్తూ అమ్మ అన్నం తినిపిస్తుంటే అన్నం తినడం ఒక్కోసారి నోట్లో పెట్టుకున్న ముద్ద వూసేసేవాడు. వాడు ఊసిన మెతుకుల్ని అమ్మ గిరాటెసేది.  ఎదురుగా ఉన్న చెట్టు మీది కాకి చటుక్కున వచ్చి ముక్కుతో కరుచుకుని పోయేది. అది చూసి రాము  మల్లీమళ్లీ  ఊసేసేవాడు. అది వాడికి ఆటలా అయిపొయింది. రామూ అన్నం తింటూ ఉంటే అక్కడికి పిచ్చుకలు , కాకులు వచ్చి చేరేవి. కాకులయితే కావు కావు అంటూ తన వాళ్ళని పిలిచేవి. ఒక్కోసారి చెట్టు పై నుండి కోతి వచ్చేసేది. అప్పుడు కాకులు మరీ ఎక్కువగా అరిచేవి.  ఆ అరుపులో తేడా అమ్మ గమనించేది. తన చేతిలోని వెండి గిన్నె జాగ్రత్తగా పట్టుకుని రాముని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయేది . రాము అరిచేసేవాడు రానని.
కాదురా నాన్నా .. అటు చూడు కోతి . అది అమ్మ చేతిలో గిన్నె పట్టుకెళ్ళి పోతుంది అని చెప్పేది . వాడికేదో అర్ధమయినట్లుగా తలూపేవాడు. అన్నం త్ఫు .. అంటూ నోటి నుండి దూరంగా విసురుతుంటే  అమ్మ విసుక్కునేది. రామూని కోప్పడేది. ఒక్కోసారి వాడు తినట్లేదని బాధతో ఏడ్చేసేది. వాడికి అన్నం ఎట్లా పెట్టాలో తెలియక. కొడుకు ఆకలితో ఉంటాడేమో నని ఆమె బాధ. కేర్ సెంటర్ లో వదిలి వెళ్తుంది కదా .. వాళ్ళు పెట్టింది ఏమి తింటాడో తెలియదు. తను పెట్టింది వాడు సరిగ్గా తింటే ఆమెకు తృప్తి.  కానీ వాడు తినకుండా విసిగిస్తాడు.
ఒకరోజు వాడు తినకుండా విసిగిస్తుంటే అమ్మకి ఏడుపొచ్చింది . ‘అమ్మా ఎందుకేడుత్తున్నావ్ ..’ చిట్టి చేతులతో ముద్దు ముద్దుగా  అమ్మ కళ్ళు తుడుస్తూ అడిగాడు మూడేళ్ళ రాము
‘నువ్వు అన్నం తినట్లేదుగా .. అందుకే ఏడుపొచ్చేసింది’ అంది వాడి ప్రేమకు మనసులో ఆనందపడుతూ
‘ అమ్మా నువ్వు నాకు రోజూ అన్నం పెడుతున్నావు కదా .. కాకికి, పిచ్చుకలకి ఎవరు పెడతారు ..? అవి తినక పొతే వాటికి ఆకలేత్తుందిగా .. వాటికి ఆకలేత్తే నాకు ఎడుపోత్తుంది. అందుకే వాటికేత్తున్నా .  నువ్వు నా పొట్ట నిండేదాక పెడ్తావుగా …’. ముద్దు ముద్దుగా మనసులో మాట చెప్తూ వాళ్ళమ్మ మొహంలోకి చూశాడు .

‘మనకి అన్నం ఎట్లా వస్తుంది ?’

‘నువ్వూ , నాన్న ఆపీసుకు పోయి పనిచేత్తే పైసలు వత్తాయిగా . వాటితో  మనం అన్నీ తెచ్చుకుంతాంగా .. ‘ అన్నాడు ప్రతి నెలా తల్లిదండ్రులతో వెళ్లి సరుకులు , కావలసిన వస్తువులు తెచ్చుకోవడం గుర్తొచ్చిన రాము

‘మనుషులు పనిచేసిన డబ్బులతో ఆహారం సంపాదించుకుంటారు. కాకులు, పిచ్చుకలు, కోతులు వంటివి వాటి తిండి కోసం అటూ ఇటూ తిరిగి ఆహారం సంపాదించుకుంటాయి. ఎవరికి కావలసిన ఆహారం వాళ్ళే సంపాదించుకోవాలి.’

‘అయితే నేనూ సంపాదించుకోవాలిగా .. ‘

‘అవును , ఇప్పుడే కాదు . పెద్దయ్యాక ‘

‘పెద్దగా అవ్వాలంటే ..’

‘రోజూ అమ్మ పెట్టినవి చక్కగా తినేయాలి. అప్పుడు నీకు చాలా బలం వస్తుంది. పెద్దగా అవుతావు.. ‘ అమ్మ చెప్తున్న మాటల మధ్యలోనే అందుకుని .

‘ఆ నేను పెద్దగా అవ్వాలి ‘  ఆ అని నోరు తెరిచి ముద్ద పెట్టిచ్చుకున్నాడు.
ఏయ్ కాకులూ, పిచ్చుకలూ ఇక నేను మీకు అన్నం పెట్టను. అమ్మ చెప్పింది విన్నారుగా మీరే మీ అన్నం సంపాదించుకోవాలి. తెల్సిందా .. ? మీకు జరమొస్తే పెడ్తాలే’ అంటూ అమ్మ దగ్గరి అన్నం గిన్నె తీసుకుని తనే తినేసాడు. అర్ధం చేసుకున్న కొడుకు తెలివి తేటలకి మురిసిపోయింది రాము తల్లి

వి. శాంతి ప్రబోధ

కాగితం – కరెన్సీ నోటు

ఫోన్ మోగుతోంది చూడరా చిన్నా ..
గార్డెన్ లోని కలుపు మొక్కలు ఏరేస్తూ  అమ్మ కేకవేసింది.

కథల పుస్తకం చదువుకుంటున్న ఏడేళ్ళ చిన్నా లేచి వెళ్లి ఫోన్ ఎత్తాడు.  అవతల తండ్రి గొంతు.

ప్యాంటు జేబులో డబ్బులున్నాయి తీయడం మరచిపోయి అట్లాగే వాషింగ్ మిషన్ లో వేశాను . అమ్మకు చెప్పు అని చెప్పి పెట్టేశాడు .

‘అమ్మా…  అమ్మా’ అంటూ అరుస్తూ పరుగెత్తుకొచ్చిన చిన్నావాషింగ్ మిషన్ చప్పుడు విన్నాడు .
అయ్యో..  అయ్యయ్యో అని అరిచాడు .

ఏమయిందో అర్ధం కాని చిన్నా తల్లి వసంత కంగారు పడుతూ చిన్నా దగ్గరికి పరుగు పరుగున వచ్చింది .

వాషింగ్ మిషన్ వైపు గుడ్లప్పగించి చేయి చూపుతూ నించున్నాడు చిన్నా
ఏమైందిరా చిన్నా .. అర్ధం కాని అమ్మ అడిగింది

నాన్న ఫోన్ చేశారు కదా అంటూ తండ్రి  చెప్పిన విషయం చెప్పాడు.

‘అవునా ..’ అంటూ వాషింగ్ మిషన్ స్విచ్చి ఆఫ్ చేసింది వసంత

మూత తీసి చూస్తే వంద రూపాయల నోటు ఒకటి నలిగి నీళ్ళపై తేలి కనిపిస్తూ ..  గబగబా ప్యాంటు తీసింది.  మిగిలిన నోట్లన్నీ రబ్బరు బాండుతో కట్టేసి జేబులోనే ఉన్నాయి . వాటిని బయటికి తీసింది అమ్మ.  అవి తడిసి కొద్దిగా నలిగినట్లుగా కన్పించాయి

అమ్మయ్య, అన్నీ బాగానే ఉన్నాయని వాటిని కట్టనుండి విడదీసి ఫాన్ వేసి ఒక్కోటి ఆర బెడ్తోంది అమ్మ.
‘అమ్మా వీటిని ఇస్త్రీ చేస్తే సాపుగా అవుతాయి కదా’ వాటినే పరీక్షగా చూస్తూ అన్నాడు చిన్నా
‘అవునురా .. తడి ఆరిన తర్వాత అదే పనిచేద్దాం.  ఈ రోజు మనకి బడి లేదని మీ నాన్న భలే పని పెట్టారులే ‘ చిన్నగా నవ్వుతూ అంది అమ్మ. అవునన్నట్లు తలూపాడు చిన్నా.
అమ్మ ఆరబెట్టడం చూస్తున్న చిన్నా చిన్ని బుర్రలో సందేహం.
‘అమ్మా నేను ఒక రోజు జేబులో ఒక పేపర్ పెట్టి మరచిపోయాను. నువ్వు చూసుకోకుండా అట్లాగే మిషన్ లో వేసావు, గుర్తుందా ..?’
‘ఊ .. ఇప్పుడావిషయం ఎందుకు గుర్తొచ్చింది ‘  ?
‘అప్పడు ఆ పేపర్ నానిపోయి చిరిగి ముక్కలు ముక్కలుగా అయిపొయింది . మిగతా బట్టలకి ఆ చిన్న చిన్న ముక్కలు అతుక్కుపోయాయి. మరి రూపాయలు ఎందుకు అట్లా కాలేదు ?’ తన సందేహం వెలిబుచ్చాడు చిన్నా

‘అవును నిజమే .. ఎందుకు అట్లా కాలేదు ‘? ఆలోచిస్తూ అమ్మ అంది .

లోపలికి అడుగు పెడ్తూ చిన్నా ప్రశ్న విన్న సమంత  నేను చెప్పనా’ అంది నవ్వుతూ

‘ఓ .. చెప్పు పిన్నీ.. చెప్పు ‘ అంటూ ఆమె చేయి పట్టుకుని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు  చిన్నా .

కారణం తెలుసుకుందామని చేస్తున్న పని ఆపి చెల్లెలు చెప్పే విషయం వినడానికి సిద్దమయింది వసంత

పిన్ని ఏం చెబుతుందా అని చెవులు రిక్కించి ఆమె మొహంలోకి కళ్ళార్పకుండా చూస్తున్నాడు చిన్నా .

‘నిజమే నోటుపుస్తకాలకు , న్యూస్ పేపర్ లకు , ఇతర పుస్తకాలకు అంటే మనం సాధారణంగా వాడే పేపర్ కి కరెన్సీ తయారీకి వాడే పేపర్ కీ చాలా తేడా ఉంది. మామూలు పేపర్ చెట్లనుంచి వచ్చే పదార్ధంతో చేస్తారు.  అదే నోట్లకు వాడే పేపర్ని పత్తి , ఊలు, కొన్నిరకాల గుడ్డ పీలికల నార వేసి చేస్తారు. అందుకే అవి నీళ్ళలో త్వరగా నానిపోవు.  చిరిగిపోవు. చాలా నాణ్యంగా ఉంటాయి ‘ చిన్నా బుర్రకి అర్ధమయ్యేలా చెప్పింది పిన్ని

‘ఓ అదా సంగతి.. నాకూ తెలియదు’ అంటూ లేచి వెళ్లి చెల్లికి మంచినీళ్ళ గ్లాసు అందించింది అమ్మ

తనకు తెలిసిన విషయం చెప్దామని పక్కింటి చిన్నారి దగ్గరకి తుర్రుమన్నాడు  చిన్నా

Published in http://jabilli.in/1277.,  20.9.2015

ఎడమచెయ్యి

‘నేనే పస్ట్’ అని పరుగెత్తి వచ్చిన ఉత్తమ్ ఆయాసపడుతూ కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న మిత్ర చేయి అందుకున్నాడు
‘అత్తా మేమొచ్చేశాం .. ‘ పరుగు పరుగున లోపలికొస్తూ అన్నాడు వేణు.
వేణు వెనకే  గిరిజ, మాల, విశ్వ, ప్రసాద్ లు లోపలికి వచ్చేశారు. వారి భుజాలకి తగిలించిన చిన్న బ్యాగ్స్.  వాళ్ళంతా మిత్రకి ఇరుగు పొరుగున ఉండే పిల్లలు.  ఆరు, ఏడు తరగతులు చదివే పిల్లలు. ప్రతి ఆదివారం వాళ్ళందరికీ మిత్రతో గడపడం అలవాటు. సరదా సరదా కబుర్లతో పాటు వాళ్ళ మెదళ్ళకు మేత వేస్తుంటుంది మిత్ర.  వాళ్ళతో సమయం గడపడం ఆమెకు చాలా ఇష్టం. ఆ పిల్లలకీ అంతే. వయసు తేడా మరచి స్నేహితుల్లాగా ఉంటారు.
‘అనుకున్నట్లుగానే సరిగ్గా సమయానికి వచ్చారు . గుడ్ ‘ అంది మిత్ర వాళ్ళ సమయపాలనని అభినందిస్తూ

‘అత్తా ఈ రోజు ఏం మేత వేస్తున్నావ్ ‘ నవ్వుతూ అడిగింది మాల.

‘మొన్న కథ అయిపోయిందిగా .. పాట రాద్దామా ..’ విశ్వ

‘ఒద్దురా .. అత్త ఒక పదం ఇస్తుంది . మనం దానిపై రాద్దాం ‘అన్నాడు ప్రసాద్

‘అత్తా.. అవునా పదం ఇస్తావా .. ? త్వరగా ఇవ్వు . నేను రాసి ఇచ్చి వెళ్ళిపోతా ‘ గిరిజ తొందర
‘ఎందుకురా అంత తొందర ‘ మిత్ర ప్రశ్న

‘ఏమి లేదత్తా పోయిన వారం కథ బాగా రాసిందని మెచ్చుకుని దానికి బహుమతి ఇచ్చావ్ గా . అందుకనే దానికి కొమ్ములోచ్చాయి. ఈరోజు అవి ఇంకా పెరుగుతాయనేమో .. ‘ గిరిజనే చూస్తూ కవ్వింపుగా అన్నాడు వేణు

‘ ఒరే నీ సంగతి తర్వాత చెప్తా.. ‘ అంటూ చూపుడు వేలితో బెదిరించి ‘ అదేం కాదత్తా..ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలి . మా అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను వెళ్ళకపోతే నన్ను విడిచి వెళ్ళిపోరూ ‘ కళ్ళు పెద్దవి చేసి చెప్పింది గిరిజ

‘ ఓ . సరే అయితే .. ఈ రోజు మీ పదం “ఎడమ చెయ్యి “. అంటూ ఎడమ చెయ్యి చూపింది మిత్ర

‘చీ ఎడమచేయ్యా ..? దాని గురించి ఏమి రాస్తాం ‘  వెంటనే వేణు ప్రశ్న

‘అవును ఎడమ చెయ్యి గురించే రాయాలి . 20 నిముషాల సమయంలో కనీసం 15 వాక్యాలు రాయాలి. ఇంకా ఎక్కువ రాస్తే సంతోషం ‘ చెప్పింది మిత్ర

అంతా మొహాలు చూసుకున్నారు . ‘ఆ పని తప్ప ఎడమ చెయ్యి ఏం చేస్తుందీ ..’ ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టిన ప్రసాద్. అంతా ఘొల్లుమని నవ్వారు.

‘ఆలోచించండి. మరో పది నిముషాలు ఇస్తాలే’  అని ఎడమ చేతికున్న వాచీ చూసుకుంటూ ‘ఇప్పుడు మూడు గంటల ఐదు నిముషాలు అయింది. అంటే మూడూ ముప్పైదుకి మీరు నాకిచ్చేయ్యాలి. మీరు రాసిన వాటిలో ఉత్తమమైన దానికి నేనొక చిన్న బహుమతి ఇస్తా .   మీ టైం మొదలయింది.’ అంటూ మరో మాటకు తావివ్వకుండా వెళ్లి తన పుస్తకం అందుకుంది మిత్ర.

అత్త టైం చూసుకోవడంతో ఏదో అర్దమయినట్లు ఉత్తమ్ కళ్ళు మెరిశాయి .  మాల కేదో తెలిసినట్లు ఆమె పెదవులపై చిన్నగా నవ్వు మొలిసింది. కొద్దిక్షణాలు ఆలోచనలో పడ్డ వాళ్ళు నెమ్మదిగా తమ భుజాలకి తగిలిచుకున్న బ్యాగ్ లోంచి నోట్ బుక్ , పెన్ను , పేపర్ తీసుకుని తమకి ఇష్టం ఉన్న చోట కూర్చున్నారు.

మధ్య మధ్యలో వాళ్ళని గమనిస్తున్న మిత్ర మనసులోనే చిన్నగా నవ్వుకుంది. వారి ఏకాగ్రతకి, ఏదో పరీక్షకి సీరియస్ గా అలోచించి రాస్తున్నట్లుగా ఉన్న వారి తీరుకి.

‘అత్తా నాకేమీ రావడం లేదు ‘ మిగతావాళ్ళు రాసేస్తుంటే తనకేమీ రావడం లేదని దిగులుతో విశ్వ.

‘ఏం ఫర్వాలేదులే .. ముందు బాగా ఆలోచించు . ఇంకా ఇరవై నిముషాల సమయం ఉంది . రాయొచ్చు ‘ ధైర్యం చెప్పింది మిత్ర.

ఇంకా ఐదు నిముషాలుండగానే తను రాసింది ఇచ్చేసి ‘అత్తా నేనెళ్ళిపోతున్నా.. బై ‘ అంటూ తుర్రుమంది గిరిజ. అందరిదీ అయిపోయినట్లుగా ఉన్నారు.  టైం అప్ అని అత్తనోట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.  విశ్వ మాత్రం ఇంకా రాస్తున్నాడు.

టైం అయిపొయింది. అందరి దగ్గరా పేపర్స్ తీసేసుకుంది మిత్ర.  మీరంతా ఒక దగ్గర కూర్చొని ఈ పజిల్ పూర్తి చేయండి అని పని అప్పగించింది.  తను వాళ్ళిచ్చిన పేపర్స్ అందుకుంది.

అందరు రాసినవీ చదివింది మిత్ర.  మిగతా వాళ్ళు  రాసిన దానికి చాలా భిన్నంగా విశ్వ ఆలోచన . చాలా ఆశ్చర్యంగా , విచిత్రంగా, కొత్తగా  అనిపించింది.  ఇంత చిన్న పిల్లవాడు ఎంత అద్భుతంగా  వ్యక్తీకరించాడు.  తానెప్పుడూ అలా ఆలోచించలేదే అనుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెట్టింది మిత్ర.

‘”నాన్నకి ఎడమచేతి వైపున అమ్మ ఉంటుందట. ఎడమ చెయ్యికి చాలా పనులు తెలియవు కదా అట్లాగే అమ్మలకీ తెలియదేమో. నాన్నలకే తెల్సేమో. ఎందుకంటే మా ప్రెండ్స్ చాలామంది ఇంట్లో నాన్న ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చి కుటుంబాన్ని పోషిస్తాడు. అమ్మ ఇంట్లో అందరికీ వంట చేసిపెడుతుంది. వాళ్ళు చాలా సార్లు మాటల్లో మా అమ్మకి ఏమీ తెలియదు అంటారు.  గోపీ వాళ్ళ  నాన్న లేడని వాళ్ళమ్మ ఎప్పుడూ ఏడ్పు మొహంతో ఇంట్లోనే కూర్చుంటుంది.   కానీ మా అమ్మ అట్లా కాదు. మా  అమ్మేగా  ఎడమచెయ్యి.  కుడిచెయ్యి .. అవును, మా అమ్మ అందరి ఆడవాళ్ళలా కాదు . అందరి అమ్మల్లాగా మా అమ్మ ఎడమ చెయ్యి ఒక్కటే కాదు కుడి చెయ్యి కూడా.  రెండు చేతులతో అమ్మ పనీ ,నాన్న పనీ చేసేస్తుంది. వంట చేస్తుంది. నాకు అన్నంపెట్టి బడికి పంపుతుంది. ఆఫీసుకు వెళ్తుంది. కారు, బైకు నడిపేస్తుంది. ఒక్కటే ఎక్కడికైనా వెళ్లి రాగలదు. ఎవరితోనైనా చక్కగా మాట్లాడేస్తుంది. దేనికీ భయపడదు.   నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది.

అమ్మని రోజూ చూస్తానే ఉన్నా కదా.  కానీ ఇప్పుడు ఇది రాస్తుంటే అమ్మ చాలా కొత్తగా గొప్పగా కనిపిస్తాంది. ఇప్పుడు నాకనిపిస్తోంది. నేర్చుకుంటే అమ్మలకీ అన్నీ వస్తాయని.  ఏ చెయ్యికి ఏ పని నేర్పితే ఆ పనిచేస్తుందని. నాకు నాన్న లేడుగా..  అందుకే అమ్మే నాన్న కూడా అయింది.  ఎడమచెయ్యే  కుడిచెయ్యిగా అయినట్లుగా.  మరి అమ్మ లేకపొతే నాన్న కూడా అమ్మలాగా రెండు పనులూ అమ్మచేసినంత సులువుగా చేస్తాడా .. ఏమో తెలియదు.  ఆ.. చేస్తాడనే అనిపిస్తోంది. కుడి ఎడమ రెండుచేతులకీ తేడా చూపకుండా పనులు నేర్పిస్తే… .”
ఇంకా టైం ఉంటే ఏం రాసేవాడో అనుకుంటూ చేతిలోని పేపర్లు చూస్తూ పిల్లల్ని పిలిచింది మిత్ర.  ఎవరు రాసింది వారికిస్తూ  ఒకరితర్వాత ఒకరు పైకి చదవండి. అందరూ వింటారు. తర్వాత మీరు రాసిన విషయలపై చర్చిద్దాం. ఎవరు బాగా రాశారో నిర్ణయిద్దాం.సరేనా ‘ అడిగింది మిత్ర
‘ఒకే అత్తా ‘ అరిచారంతా .
‘ఇప్పుడే వస్తానత్తా’  అంటూ విశ్వ బయటికి పరుగు తీసాడు. అతని మొహంలో కొత్త వెలుగులు

వి . శాంతి ప్రబోధ

భయం.. హుష్ కాకి

‘అమ్మా నేనింటికి వచ్చేస్తా .. రాత్రి దొంగలు వచ్చారు.  నాకు భయమేస్తోంది’  ఏడుస్తూ గొడవ చేస్తోంది సోని.

కూతురికి ఎట్లాగయినా నచ్చచెప్పాలని ప్రయత్నిస్తోంది సోని తల్లి యాదమ్మ.

యాదమ్మది పక్కనుండే పల్లె.  కొడుకునీ కూతురినీ సాంఘిక సంక్షేమశాఖవారి హాస్టల్ లో ఉంచి చదివిస్తోంది. అంగడికి వచ్చిన ప్రతిసారీ రాకపోయినా రెండుమూడు వారాలకోకసారయినా కూతురు దగ్గరకి వస్తుంది.  ఎప్పటిలాగే చూద్దామని వచ్చిన యాదమ్మకి కూతురు మాటలు కంగారు పుట్టించాయి. ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.

‘అవునాంటి రాత్రి దొంగలొచ్చారు.. ‘ చెప్పారు మిగతా పిల్లలు.

‘హాస్టల్ లో ఏమున్నాయని దొంగలోస్తారు ..?’ తేరుకుంటూ అంది యాదమ్మ.

‘రాత్రి మా రూం తలుపు తీసి టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు. నేనూ చూశా .. ‘చెప్పింది కనక.

‘కుక్కలు మొరిగినాయ్ .. మెట్లు దిగి దనదనా పోయిన చప్పుడయింది’ అంది లలిత.

‘నాకయితే గజ్జెల చప్పుడు కూడా వినొచ్చింది’ అంది మంజుల.  ‘అవును నేనూ విన్నా’ అంటూ మరో ఇద్దరు చెప్పారు.

‘నాకయితే మస్తు భయమయింది. ముసుగు తీయలే..’ కోమలి

తలో మాట చెప్తుండగా వార్డెన్ రాజశ్రీ వాళ్ళదగ్గరకి వచ్చింది.

‘పిల్లలంతా భయపడుతున్నరు మేడం.. దొంగలోచ్చారట గద ..’ సందేహిస్తూ అడిగింది యాదమ్మ.

‘అదేం లేదు యాదమ్మా .. అదంతా వాళ్ళ భ్రమ..’ అంటూ కొట్టిపారేసింది. తనతో వాళ్ళనీ రమ్మంది రాజశ్రీ.

‘అదేంటమ్మా పిల్లంతా అట్లా భయపడుతుంటే ..’అంటూనే యాదమ్మతను కూడా ముందుకు అడుగేసింది.

అంతా మొదటి అంతస్తులో దొంగాలోచ్చారంటూన్న రూమ్ కేసి వార్డెన్ తో పాటే.  ఆ వెనకే అక్కడున్న పిల్లలంతా . వారితో పాటే యాదమ్మ.

‘అటు చూడండి ఆ చెట్టు కాయలు. అవి  గాలికి కదులుతోంటే ఎలా వినిపిస్తోంది..?” పిల్లందరినీ చూస్తూ ప్రశ్నించింది రాజశ్రీ.   శ్రద్దగా ఆలకించిన  కోమలి ‘మేడం, గజ్జెల చప్పుడు లాగా .. అనిపిస్తోంది ‘ అంది

‘నిన్న పగలు జ్వరం వచ్చిందని మల్లిక బడి నుండి వచ్చేసింది కదా.  ఆమెకు తోడు ఎవరోచ్చారు ..? నువ్వే కద జయా ‘  అప్పుడే తల స్నానం చేసివచ్చి తల తుడుచుకుంటున్న జయని చూస్తూ.

‘అవును మేడం, అప్పుడు జ్వరంతో ఉన్న మల్లిక వాంతి చేసుకుంది’  చెప్పింది జయ

‘అప్పుడు ఏ తలుపు తీసావ్ జయా?’ అని అడిగింది.

‘ఈ తలుపు  తీసి అక్కడంతా కడిగి తలుపువేసాను’  అంది తలుపు చూపుతూ

‘లోపల గడియ పెట్టావా..?’

‘ ఏమో మేడం, పెట్టినట్టు గుర్తు లేదు’ అంది తల తుడవడం ఆపి జుట్టును అలా వదిలేసిన జయ.

‘రోజూ ఆ తలుపు తెరవనే తెరవం కదా ..ఎప్పుడూ మూసి  ఉండే తలుపు అది. దగ్గరకు వేసి ఉన్న తలుపు రాత్రిపూట గాలికి కొద్ది కొద్దిగా తెరుచుకుంటూ మూసుకుంటూ ఉంది.  ఆ పక్కనే వెలుగుతున్న లైటు వెలుతురు చెట్టుకొమ్మ మీదుగా పడ్డం చూసి టార్చి లైటు అని భ్రమపడ్డారు.  అంతే .. ఈ పిల్లల దగ్గరకి దొంగ లెందుకు వస్తారు ..? ‘  విడమర్చి చెప్పింది రాజశ్రీ.

నిజంగా దొంగలు రాలేదా .. అని కొందరు ఆలోచిస్తుంటే ‘కాదు మేడం ఆ డాబా మీద ఏదో పగిలినట్లు దన్ చప్పుడయింది’ అంది ఒకమ్మాయి.  ‘సరే పదండి పైకి వెళ్లి చూద్దాం ..’ అంది రాజశ్రీ

‘మేడం చూడండి ‘ అంటూ అరిచారు ఇదరు పిల్లలు.

అక్కడ పనికిరాని ట్యూబ్ లైట్లు ఓ మూలకు ఎప్పటి నుండో పెట్టి ఉన్నాయి. అవి పగిలిన ముక్కలు కనిపిస్తున్నాయి.  వాటికి కొద్దిగా ఆవలగా కోతుల మల మూత్రాలు ఆరోజే చేసినట్లుగా ..

‘చూశారా వీటిని పడేసింది కోతులు.  మీకు తెలిసిందే కదా .. మీరు పడేసే అన్నం కోసం ఈ చింత చెట్టు మీద కోతులున్న సంగతి. నవ్వుతూ అంది వార్డెన్.

అయినా .. ఒక వేళ దొంగలే గనక వస్తే ..  ఇంతమందిమి ఉన్నాం. వారిని ఎదుర్కోలేమా .. ఏమర్రా .. ఆ దొంగను పట్టుకుని నాలుగు తన్నలేమా..?’ పిల్లలవైపు చూస్తూ ప్రశ్నించింది రాజశ్రీ.

‘ఇదిగో ఈ దుడ్డుకర్ర తో ఒక్కటిస్తే ..’ గీత యాక్షన్తో అన్న తీరుకు అంతా నవ్వారు.

‘అవును గీతా, ఆ ధైర్యం కావాలి భయపడడం కాదు .. అలా ఎందుకు జరిగిందో ఆలోచించాలి. విషయం ఏమిటో తెలుసుకోవాలి. అదేమీ చేయకుండా భయపడి ఇంటికి పొతే నష్టపోయేది ఎవరు? ‘ అందరినీ కలియజూస్తూ గీత భుజం తట్టి మెచ్చుకుంది వార్డెన్.

‘ఆ.. అవును మేడం నిజంగా దొంగలు వచ్చినా ఇడిచి పోతామా .. ఇంట్లో దొంగలు పడితే ఇల్లు ఇడిచి పోతున్నామా ..?’ సాలోచనగా  యాదమ్మ

అవును నిజమేనన్నట్లుగా పిల్లల మొఖాలు భయం పోయి విప్పారుతుండగా ‘భయం.. హుష్ కాకి ‘ అంది సోని ఆక్షన్ తో .

అంతా హుష్..  హుష్ .. అంటూ నవ్వుల పువ్వులయ్యారు.

 

వి. శాంతిప్రబోధ

Published in Jabilli children’s digital magazine August 1, 2015

చింటూ -చిరునేస్తాలు

ఏయ్ పిచ్చుక పిల్లా .. ఏమిటే ఆ గోల ? ఎందుకు అలా గొంతు చించుకు అరుస్తున్నావు. కాసేపు గమ్మునుండలేవూ .. ‘ కిటికీ పైన వెంటిలేటర్ అద్దాల మధ్యలో ఉన్న పిచ్చుక గూడు కేసి చూస్తూ ముద్దు ముద్దుగా కోప్పడ్డాడు ఏడేళ్ళ చింటూ

రెండు అద్దాల మధ్యన ఉన్న గూట్లోంచి బుజ్జి పిచ్చుక పిల్ల తల్లిదండ్రుల రాకకోసం ఎదురు చూస్తూ అరుస్తోంది. అదేపనిగా అరుస్తూనే ఉంది.

‘మా అమ్మా నాన్న నిన్నటి నుండి ఇంటికి రాలేదు ‘ గూట్లోంచి బయటికి తొంగి చూస్తూ ఏడుపు మొఖంతో చెప్పింది బుజ్జి ‘అవునా .. ఎందుకని రాలేదు ‘ దాని బాధంతా తనలో ఒమ్పుకుంటూ దిగులుగా మొహం పెట్టి చింటూ ప్రశ్న ‘ఏమో.. తెలియదు, అమ్మా వాళ్ళు బయటికి వెళ్తుంటే మేమూ వస్తామని మారాం చేశాం. నన్ను ఒక పక్క , తమ్ముడ్ని ఒక పక్క ఒళ్ళో కూర్చోపెట్టుకుని వద్దురా నా బంగారు కోండలూ .. నా బుజ్జి, బుల్లి చాలా చాలా మంచి వాళ్ళంట. అమ్మా నాన్న చెప్పినట్లు వింటారంట అని అమ్మ ముద్దు పెట్టింది’ బుగ్గ చూపిస్తూ చెప్పింది బుజ్జి.

‘ఎగరాడానికెందుకర్రా అంత తొందర. అసలే వాతావరణం బాగోలేదు. కొద్దిగా రెక్కలు రానీయండి. వాతావరణం బాగున్న రోజున మిమ్మల్ని బయటికి మేమే తీసుకెళ్తాం. అన్నీ చూపిస్తాంగా మా తల నిమురుతూ అన్నాడు నాన్న. సరేనని బుద్దిగా తలూపాం. వెళ్తూ వెళ్తూ మాకు చెరో ముద్దిచ్చి అల్లరి చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండని, బయటికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దని మరీ మరీ చెప్పి బయలుదేరారు. తొందరగా రండని బుల్లి ఏడుపు మొఖంతో అన్నాడు. మీ బొజ్జలు చూడండి ఎట్లా లోపలికి పోయాయో .. మీకు ఆకలేస్తోంది అవునా అంది అమ్మ. అవునని మేం తలలూపాం. అందుకే కదర్రా మీకు ఆహారం తేవడానికేగా మేం వెళ్ళేది. వీలయినంత త్వరగా వచ్చేస్తాం అని మమ్మల్ని బుజ్జగించి వెళ్ళారు. ఇప్పటికీ రాలేదు ‘ ఏడుపు స్వరంతో చెప్పింది బుజ్జి పిచ్చుక అయ్యో .. మీరే ఉన్నారా .. భయమేయ్యలేదా .. అని ఒక్క క్షణం ఆగి , ‘నిన్న చాలా పెద్ద గాలి, దుమ్ము తో పెద్ద వర్షం వచ్చిందికదా.. అప్పుడు ఇంట్లో మీరే ఉన్నారా .. ‘ చింటూ అమాయకపు కళ్ళలో సందేహం

‘ఊ .. అంతకు కొద్దిగా ముందే కదా అమ్మవాళ్ళు బయటికి వెళ్ళింది. మేమే బిక్కు బిక్కు మంటూ ఉన్నాం . మాకు చాలా భయమేసింది. డమ డమా .ఉరుములు.. . మెరుపులు మా మీదే పడ్డట్టు .. ఒణికిపోయాం’ చెప్పింది బుజ్జి రాత్రంతా నిద్రలేక కునుకు తీస్తున్న బుల్లి పిచ్చుక మాటలు వినబడి ఉలిక్కిపడి లేచింది. అమ్మా నాన్న వచ్చేసారేమో అని కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసింది. కనిపించలేదు. ఒక్క సారిగా లేచి బయటకు చూడబోయి జారి కిందపడింది. ‘తమ్ముడూ.. ‘ అని బుజ్జి పిచ్చ్చుక, ‘ అయ్యో.. ‘ అని చింటూ ఒకేసారి అరిచారు. దాన్ని కింద పడిపోకుండా ఆపడం కోసం తన చిట్టి చేతులతో ప్రయత్నించాడు చింటూ .. కానీ అది వాడి చేతుల్ని తాకుతూ కింద పడిపోయింది.

విలవిల లాడుతున్న బుల్లిని చేతిలోకి తీసుకుని ‘అమ్మా అమ్మా ‘ అని అరుస్తూ ఇంట్లోకి పరుగెత్తాడు. అది బాధతో అరుస్తూనే ఉంది. ‘అయ్యయ్యో ఆ చంటి పిల్లని పట్టుకోచ్చావేంటి నాన్నా .. తప్పు కదా .. అక్కడే వదిలేసిరా ..’ చింటూ అమ్మ కోప్పడింది. ‘లేదమ్మా నేను దాన్ని దాని గూట్లోంచి తీయలేదమ్మా . అదే వాళ్ళమ్మ వాళ్ళకోసం చూస్తూ జారి పడిపోయింది. అదుగో అటు చూడు బుజ్జి పిచ్చుక తమ్ముడు కోసం, అమ్మా నాన్న కోసం ఎట్లా ఏడుస్తాందో .. ‘ బిక్క మొహంతో చెప్పాడు చింటూ

‘అవునా ..’ అంటూ వెళ్లి మంచినీళ్ళు దానిపై చిమ్మింది. దాన్ని జాగ్రత్తగా చూసి ఏమీ దెబ్బలు తగల్లెదులే .. అంటూ దాని నోట్లో మంచి నీటి చుక్కలు వేసింది చింటూ అమ్మ ‘అమ్మా బుల్లి పిచ్చుక , వాళ్ళ అన్న బుజ్జి పిచ్చ్చుక నిన్నటి నుండి ఏమీ తినలేదట . వాళ్ళ అమ్మా నాన్నలకోసం బెంగపెట్టుకుని ఏడుస్తున్నాయి దీనంగా మొహం పెట్టి చెప్పాడు చింటూ.

అమ్మ బుల్లి పిచ్చుకకు సపర్యలుచేస్తుంటే చూస్తూ తనకే దెబ్బ తగిలినట్లు వలవిల లాడాడు. నా చిట్టి తండ్రికి ఎంత దయాగుణం .. తనే ఆ బాధలు పడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. గత నాలుగు రోజులుగా అవి వాడి నేస్తాలు అయ్యాయి అనుకుంటూ ‘బుల్లి పై నుండి పడింది కద నాన్నా .. , అందుకే కొంచెం షాక్ లో ఉంది. కొంచెం సేపయితే మాములుగా అయిపోతుందిలే .. నీవేం దిగులుపడకుప్పింది అమ్మ. అయినా కొడుకు విచారం తగ్గలేదని గమనించిన అమ్మ ‘వెళ్లి గుప్పెడు బియ్యం తెచ్చిదీనికి వెయ్యి, తింటుంది’ అని చెప్పింది.

‘ అమ్మా బుల్లి బియ్యం తినలేకపోతోంది చూడు ..’ తల్లి మొహం రెండు చేతులతో తన వేపు తిప్పుకుని చెప్పాడు. ‘ఇది చిన్నపిల్ల కదమ్మా .. బియ్యం ఎట్లా తింటుంది? గట్టిగా ఉన్నాయి కదా’ .. అంటూ అమ్మ చేయి వదిలి లోపలికి పరుగెత్తాడు. కుక్కర్ లోంచి గుప్పెడు అన్నం తీసుకొచ్చి దానిముందు వేశాడు. అది ఒక మెతుకు కూడా నోట్లో పెట్టుకోలేదు.

బుల్లిని తదేకంగా చూస్తూ ‘ఇది మెత్తగానే ఉందిలే తిను ‘ ముద్దు ముద్దుగా అంటున్న చింటూ మురిపెంగా చూసింది అమ్మ. ఆ బుల్లి పిచ్చుక అన్నాన్ని చూస్తూ తన అన్న ఏడుపు వినవస్తున్న దిక్కునూ చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ‘బుజ్జీ మీ తమ్ముడికి ఎట్లా ఉందోనని ఏడుస్తున్నావా .. ఏడవకు ఏం కాలేదులే నీ తమ్ముడికి . మీరు నిన్నటి నుండి ఏమి తినలేదని నాకు తెలుసుగా .. అందుకే అన్నం పెట్టా . తిని వస్తుంది’ అని గట్టిగా అరిచి చెప్పాడు బుజ్జికి విన పడాలనే ఉద్దేశంతో.

తన తమ్ముడేడి అని చుట్టూ పరికించింది బుజ్జి పిచ్చుక. కనిపించలేదు. ఎగిరి తమ్ముడు దగ్గరికి చేరాలని ప్రయత్నిస్తోంది. ఎగరలేక పోతోంది. ‘ప్లీజ్ , నన్ను మా అన్న దగ్గరకి పంపవా ‘ బతిమాలింది బుల్లి పిచ్చుక. ‘ వాళ్ళ అన్నకోసం బెంగపడుతోంది. నెమ్మదిగా గూట్లో పెట్టేయ్యి చింటూ..’ అనే మాటలు విన్పించాయి బుజ్జికి. నా తమ్ముడు బాగానే ఉన్నాడని ఆనందపడి తమ్ముడి దగ్గరకి వెళ్ళాలన్న ప్రయత్నం మానుకుంది.

సరేననిచింటూ దాన్ని చేతిలోకి తీసుకోగానే నెప్పితో అరిచింది బుల్లి . దెబ్బ నొప్పి పెద్తోందా అని జండు బాం రాసాడు. ఆ తర్వాత స్టూలు వేసుకుని కిటికీ ఊచలు పట్టుకుని పైకి ఎక్కుతోంటే చింటూ పడిపోతావ్ అంటూ అమ్మ వచ్చి నెమ్మదిగా గూట్లో వదిలింది. చింటూ పరుగు పరుగున ఇంట్లోంచి అన్నం తెచ్చ్చి అమ్మ కిచ్చాడు . అదికూడా గూట్లో వదిలింది అమ్మ .

నన్ను అమ్మా నాన్నా జాగ్రత్తగా చూసుకుంటారు . వీటిని వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవరకూ నేను చూసుకోవాలి మనసులోనే అనుకుని, ‘ చిరు నేస్తాలూ .. ఏడవకండి . మీకేం కావాలన్నా నేనున్నాను. ఈ ఫ్రెండ్ ని నమ్మండి. మీ అమ్మా నాన్నా వచ్చేవరకూ నేను మీకు తోడుంటాను’ పెద్దరికంగా అభయమిచ్చాడు చింటూ . ఆ మాటలు విన్న అమ్మ హృదయం ఆనందంతో పొంగింది.

– వి . శాంతి ప్రబోధ

published in Jabilli children’s web magazine july 22, 2015

మానవతా వర్ధిల్లు

‘అయ్యో తాతా పడిపోయావా’ అంటూ పరుగు పరుగున వచ్చి లేపబోయాడు ఆ అబ్బాయి
ఆ ముసలతన్న్ని లేపడం కష్టంగా ఉందతనికి. ఎవరైనా సాయం వస్తారేమోనని చుట్టూ చూశాడు. రోడ్డుకు ఆవలి వేపు వున్న బస్ స్టాప్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ ఎవరూ ఇటు చూడడం లేదు. మళ్లీ తాతను నిలబెట్టాలని ప్రయత్నించాడు. అతను నున్చోలేక తూలిపోతున్నాడు. ప్చ్ .. పాపం తాతకి తనలాగే ఎవరూ అన్నం పెట్టేవాళ్ళు లేరేమో అనుకున్నాడు ముసలోడుకదా అందుకే పడిపోతున్నాడు. తాత దగ్గర ఏదో వాసన . స్నానం చేసి ఎన్ని రోజులైయిందో అందుకే వాసన . స్నానం చేయడానికి ఇల్లు లేదేమో .. ఆ వాసనకి ఆ అబ్బాయి ఉదయం పంపు కింద దోసిట పట్టి తాగిన నీళ్ళు కడుపులో పేగుల్ని తిప్పేస్తూ .. బయటకు పంపడానికి సిద్దమవుతూ .. అట్లాగే తాతని చెట్టు నీడన చేర్చాడు.
‘అమ్మా ఓ ముద్దుంటే ఎయ్యన్దమ్మా .. ‘ రోడ్డవతల బస్టాప్ పక్కనున్న ఇంటి ముందు నుంచుని ఓ స్త్రీ అడుక్కుంటూ,
తను అట్లా అడుక్కుంటే .. ఒక్కక్షణం మనసులో కదలాడిన ఆలోచన.
‘దుక్కలాగున్నావు పని చేసుకు బతకోచ్చుగా… ఇళ్ళమీదపడి అడుక్కునే బదులు’ ఆ ఇల్లాలు కోపంగా
‘తాతా ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు’ అంటూ ఆ చెట్టుకింద పడుకోబెట్టి పరుగెత్తాడు.
‘అమ్మా.. అమ్మా ‘ పిలిచాడు
‘ఈ అడుక్కునే వాళ్ళతో చచ్చిపోతున్నాం .. చిన్నా పెద్దా , ముసలి ముతకా అందరూ అడుక్కోవడమే ఈ పని సులభమై పోయింది. తేరగా పెడితే తిని తిరగడం బాగా అలవాటైపోయింది జనాలకి ‘ బిగ్గరగా తిడుతూనే, విసుగ్గా గడపలోకి తొంగి చూసింది ఆ ఇల్లాలు
‘నేను అడుక్కునే వాడిని కాదమ్మా ‘ చిన్న బుచ్చుకున్న మొహంతో
‘ఆ.. మరెందుకోచ్చావ్ ‘ చిరాగ్గా ఆమె అడుగు ఆ అబ్బాయికేసి వేస్తూ
‘అమ్మా నేనునడుక్కోవడానికి రాలేదు. ఏమన్నా పని ఇస్తారేమోననీ .. ‘ భయం భయంగా
‘నువ్వా! నువ్వేం పని చేస్తావ్? నిండా పదేళ్ళు లేవు ‘ విసుగు మాయం అవుతుండగా ఆశ్చర్యంతో
‘మీరేది చెప్తే అది చేస్తానమ్మా .. ఇందాక మీరు అడుక్కోనేవాళ్ళని పనిచేసుకొమ్మని తిట్టడం విన్నానమ్మ . అందుకే వచ్చా ‘ వినయంగా
‘ఒసే రమణీ .. వాడి మాయమాటలు నమ్మకే , పిల్లల్ని అడ్డం పెట్టుకుని దొంగాతనాలెక్కువయ్యాయి ‘ ముసలావిడ హితబోధ చేస్తూ
‘అమ్మా నేను అట్లాంటి వాడిని కాదు. నేనూ అడుక్కుంటే అని ఒక్క క్షణం ఆలోచించిన మాట నిజం. మీ మాటలే నన్ను ఆ పని చేయనీయలేదు. కష్టాన్ని నమ్ముకు బతాకలనేమానాన్న మాట కూడా గుర్తొచ్చింది ‘ వినమ్రంగా ఆ అబ్బాయి
‘మీ నాన్న పని చెయ్యడా ..? ‘ కుతూహలంగా ప్రశ్నించిదావిడ
‘అమ్మానాన్న , తమ్ముడు రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయారు. చిన్నాన్న దగ్గర ఉండేవాణ్ణి. కానీ, చిన్నమ్మ పెట్టే బాధలకు ఇంట్లోంచి వచ్చేశా. నన్నంటే బాధ పడకపోదును. కానీ, చచ్చిపోయిన నా వాళ్ళను రోజూ తిడుతుంటే ఉండలేక పోయానమ్మా’ కళ్ళలో ఎగిసిపడే నీటిని, గొంతులో అడ్డుపడే బాధని అదిమిపెడుతూ చెప్పాడు
పాపం పసివాడు అన్నం తిన్నట్టు లేదు అనుకుంటూ తాము తినగా మిగిలిన అన్నం, కూరా ఉంటే ప్లేటులో పెట్టుకు వచ్చి తినమంది. వాడి కళ్ళలో మెరుపు ఆమె చూపును దాటిపోలేదు.
‘అమ్మా ఒక బాటిల్ ఉంటే ఇవ్వామ్మా’
అర్ధమయిన ఆవిడ నీళ్ళ సీసా ఇచ్చింది.
అందుకున్న వాడు పరుగుపరుగున రోడ్డు దాటేశాడు. పక్కన కుర్చుని తింటాడేమోననుకున్న ఆ ఇల్లాలు చూసేసరికి అక్కడ లేడు. అయ్యో నా ప్లేటు .. ఎంత నమ్మించాడు. ఏలెడు లేడు వెధవ. ఎన్ని అబద్దాలు చెప్పాడు. ఆ అబ్బాయి కోసం ఆమె కళ్ళు వెతుకుతూ నమ్మినందుకు తనను తాను తిట్టుకుంటూ గేటు దాటిందామె.
రోడ్డవతల ఉన్న పొగడచెట్టు కింద ఉన్న ముసలతని దగ్గరకెళ్ళి తాతా లే అంటూ లేపాడు. లేవలేదు. కాసిని నీళ్ళు చల్లాడు. నెమ్మదిగా లేచాడతను.
‘ఎవర్నువ్వు ‘ ఎగాదిగా చూస్తూ లేచి కూర్చున్నాడు
‘తర్వాత చెబుతాలే నేను లేకపోతే నువ్వు ఆ లారీ కింద ఉండేవాడివి. ఆకలేసిందా .. కాళ్ళు తిరిగి పడిపోయావా .. ‘అంటూ అన్నం కలిపి ప్లేటు అతని ముందు పెట్టాడు.
ఆ బిడ్డడి మొహం చూస్తుంటే తను తిని ఎన్నిరోజులయిందో అన్నట్టుంది. అయినా, కన్నబిడ్డలే కాదని ఇంట్లోంచి గెంటేసిన ఈ తాగుబోతు కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనుకుని నువ్వు తిను కొడకా అన్నాడా వృద్దుడు హృదయం భారమవుతుండగా ..
ఆ దృశ్యం చూసిన ఆమె మానవత్వమా వర్ధిల్లు అనుకుంటూ తృప్తిగా వెనుదిరిగింది.

Tag Cloud

%d bloggers like this: