The greatest WordPress.com site in all the land!

Archive for the ‘ఆడపిల్ల కావడం వల్లనే’ Category

అమ్మా … వెలుతురు కెరటం నీ సువర్ణ  

వాళ్ళు  చెప్పేది నిజమేనా .. ? నిజం కాదని ఎవరైనా చెప్తే ఎంత బాగుండునని  బస్ ఎక్కే లోపల ఎన్నిసార్లు అనుకుందో…  ఉరుములు మెరుపులు లేని ఆకాశం పిడుగుని వర్షించినట్లుగా ఉందా వార్త ఆమెకు .

కిటికీలోంచి కదిలిపోతున్న ఉషోదయ దృశ్యాలు ఆమెను ఏమాత్రం ఆకట్టుకోవడంలేదు .  అమ్మ మొఖమే సినిమా
రీలులా అటూ ఇటూ కదులుతూ ..
నా జీవితంలో కొత్త రాగాల్ని , రుచుల్ని పండించాలని ఎంతో ఆశపడింది  అమ్మ .. అవి ఫలించేలోపునే వెళ్లిపోయిందా .. అస్సలు నమ్మ బుద్ది కావడంలేదు.

అమ్మ .., నిజ్జంగా చనిపోయిందా .. ? అదెలా .. ఎలా సంభవం ?  నిన్నటివరకూ బాగానే ఉందిగా ..  రాత్రి పదిగంటల సమయంలో కూడా  మాట్లాడింది.   అవే అమ్మ చివరి మాటలు.
ఆ క్షణంలో తాను అనుకుందా..  తెల్లవారేసరికి పరిస్థితి తలకిందులవుతుందని ..?!
రేపు అందుకోబోయే గ్రూప్ వన్ ఫలితాలని తలుచుకుని అమ్మా  ఇకనుంచి మనకన్నీ మంచి రోజులే అంటే..
అవునే .. నిజమే కావచ్చు . సర్కారు  3 ఎకరాలు ఇస్తదట. ఊర్లోకి పోతే కచేరి కాడ అంటున్నరు .  కానీ నేను తీసుకోవద్దనుకుంటున్న అని మనసులో మాట చెప్పి హాయిగా నవ్వింది.
ఎందుకమ్మా అన్న ప్రశ్నకు  ఇయ్యాల్నో రేపో నా బిడ్డ సర్కారీ నౌకరీలకు ఎక్కుతది కదా .. ఆ భూమి ఇంకెవరికన్నా అక్కర్ల ఉన్నోళ్లకు ఇత్తరని మరోసారి నవ్వుతూ వివరించింది.
ఏమీ చదువుకోని అమ్మ ఎంత సంస్కారయుతంగా , బాధ్యతగా ఆలోచించింది ?  .. వెయ్యిమైళ్ళ వేగంతో  చెలరేగే ఆలోచనల నడుమ చేతిలో ఫోన్ మోగడాన్నే గమనించడం లేదు సువర్ణ.
అది చూసింది శారద.  వెంటనే సువర్ణ  చేతిలోని  మొబైల్  నెమ్మదిగా తన చేతిలోకి తీసుకుని ఇప్పుడే బస్సెక్కాము.
అవతల నుండి ఏమన్నారో కానీ .. ఈ పరిస్థితిలో ఒక్క దాన్ని ఎట్లా పంపిస్తామండీ ..  మీరు కంగారు పడకండి సువర్ణని నేను వెంటబెట్టుకుని వస్తున్నాను అంటూ  నెమ్మదిగా అవతల ఉన్న వాళ్ళకి చెప్పింది శారద .

శారద మాటలేవీ చెవికెక్కని సువర్ణకి రాత్రి అమ్మ ఫోన్ చేసినప్పటి మాటలే వినిపిస్తున్నాయి.!
అమ్మ ఇంకా ఏదో మాట్లాడబోయింది. తనే కట్ చేసింది రేపు మాట్లాడుకుందాం అమ్మా నిద్రొస్తోంది అని చెప్పి .  లేకపోతే అమ్మ ఏం చెప్పేదో ..

వర్షాకాలంలో సుడిగాలిలా .. ఏమిటిది ? ఆశల పల్లకిలో ఊరేగుతున్న సమయాన పడమటి సూరీడు తూరుపు దిక్కు చేరకుండానే అమ్మ కానరానిలోకాలకు తరలి పోయిందని వార్త . నమ్మ లేకపోయింది.  అసలే నమ్మలేకపోతోంది. అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది అంటున్నారు.  సన్నగా ఎండిపోయిన పుల్లలాగా ఉండే అమ్మకి హార్ట్ ఎటాక్ రావడం ఏంటి ?

సువర్ణ హృదయం బాధతో మెలిపెడుతోంది.  ఎక్కడో చిన్ని ఆశ మినుకు మినుకు మంటూ .. అమ్మకి ఏమీ కాలేదని వార్త ఈ ఫోను మోసుకురాకపోతుందా అనిపించి ఆశగా మొబైల్ వైపుచూసింది . మళ్ళీ  మళ్ళీ  అవే ప్రశ్నలు అలల సమూహంలా ఒకదాని వెంట ఒకటి  చేరి రొదపెడుతూ .. ఆమె ఎక్కిన నాన్ స్టాప్ బస్సు వేగం కంటే ఎన్నో రెట్ల వేగంతో పరుగులు పెడుతూ  సాగుతున్నాయి సువర్ణ  ఆలోచనలు .

పాలిపోయిన ఆమె కంటి నుండి చుక్క నీరు కారడం లేదు కానీ హృదయంలోనే ఆమె దుఃఖిస్తున్న తీరు శారదని కలచివేసింది.   శారద, సువర్ణలు ఒకే పిజి హాస్టల్ లో , ఒకే రూంలో ఉండడం వరకూ మాత్రమే వారి పరిచయం. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరతనం , స్నేహం లేవు . ఎవరి లక్ష్యాలని చేరుకునే ప్రయత్నంలో వాళ్ళు  తీరిక లేకుండా  ఉండడం వల్లనో .. తమకు తాము ఏర్పాటు చేసుకున్న చట్రంలో బందీలుగా ఉండడం వల్లనో , వయస్సులో వ్యత్యాసం వల్లనో కానీ వారి మధ్య పెద్దగా  స్నేహం పెరగలేదు.  మంచి నిద్రలో ఉండగా సువర్ణ ఫోన్ శారదని డిస్ట్రబ్ చేసింది.  విషయం తెలిసి ఆ పరిస్థితుల్లో ఒంటరిగా పంపించడం ఇష్టం లేక సువర్ణ వద్దన్నా తనూ బయలుదేరింది శారద.

కళ్ళు మూసుకుని కణతల దగ్గర ఒత్తుకుంటున్న సువర్ణని చూసి  శారద నెమ్మదిగా భుజం తట్టింది.  పొడారిపోతున్న ఆమె పెదాలు గమనించి కొంచెం నీళ్ళు తాగమంటూ వాటర్ బాటిల్ మూత తీసి తాగించబోయింది శారద.  వద్దంటూ కొద్దిగా కదిలి తిరిగి కళ్ళు మూసుకుంది సువర్ణ.

వారి వెనక సీట్లో పసిపాప ఎందుకో గుక్కపట్టి ఏడుస్తూ ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ .. బహుశా ఆకలేసిందేమో .. పాలసీసా తెచ్చుకోవడం తెలీదా ఆ బిడ్డ తండ్రి భార్యని కసురుకుంటున్నాడు. తెచ్చా.. ఆ బ్యాగ్ మీరు పైన పెట్టారు .  కొద్ది దూరంలో వెళ్తున్న ట్రైన్ చూపుతూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూనే భయపడుతూ నెమ్మదిగా చెప్పింది తల్లి. ఆ పీల గొంతులో అతనంటే ఉన్న భయం స్పష్టంగా తెలుస్తోంది.  ఆ ముక్క ముందేడ్వోచ్చుగా .. గర్జించాడు  భర్త .  కొద్దిగా ఆ చారల బ్యాగ్ తీసిస్తారా .. భయం భయంగా  నసిగినట్లుగా ఆమె ..  తల్లి అందించిన స్తన్యం తన ఆకలి తీర్చలేదేమో పాప ఓ క్షణం ఏడుపు ఆపి మళ్ళీ గట్టిగా గొంతు పెంచింది . పాల కోసం తడుము కుంటూనే ఉంది .  అపుడప్పుడే వస్తున్న పళ్ళతో పాప కసిగా కొరికిందేమో .. అబ్బా .. అని బాధ పంటికింద నొక్కి  పెట్టింది తల్లి. అదేమీ పట్టనట్టే  కూర్చున్నాడతను మొహం విసుగ్గా పెట్టి .  లేచి పైన పెట్టిన బ్యాగ్ తీసే ప్రయత్నం చేయకపోవడంతో నిస్సహాయంగా అతనికేసి చూసింది ఆ యువతి.   అతను అదేమీ పట్టనట్టు ఉండడంతో చంకలో బిడ్డతోసహా తానే లేవబోయింది.

బిడ్డ గుక్కపట్టి ఏడుస్తంటే అట్లా కసురుకుంటావేమయ్యా .. లేచి ఆ సంచీ ఇవ్వరాదు..కొద్దిగా గట్టిగానే అంది వాళ్ళ వెనక సీటులో ఉన్న నడివయస్సు స్త్రీ .  ఒక్క క్షణం ఆవిడ కెసి తీక్షణంగా చూసి  మౌనంగా లేచి సంచి భార్యకి అందించాడు .  పాలసీసా నోటికందగానే పాప ఏడుపాగిపోయింది.

హైదరాబాద్ నిజామాబాద్ బస్సు వేగంగా కదులుతోంది . ఆ బస్సుకంటే వేగంగా కదులుతున్నాయి సువర్ణకి అమ్మ జ్ఞాపకాలు . ఈ  అమ్మ లాగే తన తల్లీ నా కంట తడి రానీయలేదు. తనకోసం అమ్మ ఎన్ని కష్టాలు పడింది . ఎన్నెన్ని అవమానాలు భరించింది . సంప్రదాయం ముసుగులో చీమూ నెత్తురూ లేని పరాన్నబుక్కులు లూటీ చేసిన తన శరీరంలాగా, ఆమె జీవితపు పత్రహరితాన్ని పీల్చేసిన పురుగుల బారిన  కన్నబిడ్డ పడకూడని ఆరాటపడింది. జాగ్రత్త పడింది.  ఆ జీవితం తాలుకు ఛాయలుపడని హాస్టల్ లో ఉంచి చదివించింది. తన బతుకు నాకు తెలియకూడని అనుకుంది.

సువర్ణ చేతిలో ఫోన్ బీప్ శబ్దం చేసింది . చూడకుండానే శారద చేతికిచ్చింది.  ఆమె మెసేజ్ ఏదో వచ్సినట్లుందని  చూసి ఏదో ప్రమోషన్ మెసేజ్ అని అట్లాగే పట్టుకుంది .  మళ్ళీ తల్లి తలపుల్లోకి పోతున్న సువర్ణ కి అంతరాయం కలిగిస్తూ ముందు సీట్లోంచి వినిపిస్తున్నాయి మాటలు .

నాకు ఈ రోజు సెలవు పెట్టడానికి కుదరదు .  తప్పని సరిగా ఫీల్డ్ విజిట్ కి పోవాలి .  బతిమాలుతునట్లుగా ఆమె గొంతుకలో.   నువ్వు  ఇంట్లో ఉన్నావని నన్ను సెలవు పెట్టమనడం బాగోలేదు హరీ .. అట్లా అయితే జాబ్ మానేస్తాలే ……. , అది  కుదరదంటే ఎలా .. నాకేమన్నా సరదానా .. నాలిగింటికి లేచి వండి వార్చి ఊరు నిద్రలేవకుండానే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటపడడం ‘ ఆమె గొంతు పదును దేరుతోంది   అవతల్నించి ఏమన్నాడో గానీ ఫోన్ గొంతు నొక్కి  బ్యాగ్లో పడేసింది .  హాయిగా , విశ్రాంతిగా , ఆనందంగా బతకాలని ఎవరికుండదు ?  ఈ మగాళ్ళకి పెళ్ళాం తెచ్చే జీతం కావాలి. అన్నీ అతని చెప్పు చేతుల్లో నడవాలి.  ఆఖరికి  ఆమె ఉద్యోగం కూడా అతని కనుసన్నల్లోనే చేయాలి ..గొణుక్కుంటోంది  ఆ స్త్రీ .

ఆ మాటలు సువర్ణ చెవిన పడ్డాయి.  తాను చూసిన ఆడవాళ్ళలో చాలామందిని కట్టుకున్న భర్త, తండ్రి , అన్న తమ్ముడు , కొడుకు ఎవరో ఒకరు హక్కుగా అజమాయిషీ చేస్తారు.  కానీ తన తల్లి పరిస్థితి అది కాదే ..
చెడ్డీ వేసుకున్న ప్రతి మగాడూ … ఎట్లా భరించిందో అమ్మ ..  జీరబోయిన  గుండె గొంతుకలోంచి ఎగిసిపడే దుఃఖాన్ని అదిమిపడుతూ ఆది కనిపించనీయకుండా  చేసేప్రయత్నంగా కిటికీలోంచి బయటకు మొహం పెట్టింది  సువర్ణ .

కొద్ధి క్షణాల అనంతరం శారదతో ఏదో చెప్పబోయి  అటు తిరిగి ఆగిపోయింది సువర్ణ .
అవతల పక్క సీటులోని నడివయస్కుడు శారదనే  తదేకంగా కొరికి తినేసేలా చూస్తున్నాడు. అది గమనించిన శారద అతన్ని చుర చురా కాల్చేసేలా చూసి చేతిలోని దినపత్రికలో మొహం దూర్చింది.
‘ఎవరైనా నన్ను అలా చూస్తే అమ్మ రగిలిపోయేది’ సువర్ణ మనసులో మాట అప్రయత్నంగా పైకి  తన్నుకొ చ్చేసింది .

విస్మయంగా పేపర్లోంచి తల తిప్పి సువర్ణకేసి చూసిన శారద ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని  ఆత్మీయ స్పర్శ అందించింది.  సువర్ణ మనస్థితి అమ్మచుట్టూరా తిరుగుతోందని అర్ధం చేసుకుంది.  అదిమి పెట్టిన ఆమె దుఖాన్ని బయటికి తెచ్చే అవుట్ లెట్ కావాలి.   ఒక్క సారిగా బద్దలయిందంటే ఆమెని ఆపడం తన తరం కాదని భావించిన శారద ‘ ఇంకా ..’ అంది .

‘ఎదుగుతున్న క్రమంలో నన్ను ఇతరులు చూసే దృష్టి అమ్మని చాలా కలవర పరిచేది .  కాలేజిలో  సామాజికాంశాలపై ఊరూరు తిరిగి వీధినాటకాలు వేసేదాన్ని . అది అమ్మకు అస్సలు నచ్చేది కాదు.  బహుశా ఆడామగా కలిసి ఒకే బృందంగా వెళ్ళడం వల్ల కావచ్చు .  ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలిస్తున్నానని ఓ రోజు చాలా పెద్ద గొడవపెట్టుకుంది. బాగా చదువుకుని నీడ పట్టున ఉద్యోగం చేసుకుంటావనుకుంటే ఈ తిరుగుళ్ళు ఏమిటి ? అంటూ బాధపడింది . నేను తప్పు పని చేయడంలేదని అందరికీ మంచి జరగడంకోసమేనని ఎంతచెప్పినా ఆమెకు అది ఎక్కలేదు . నన్ను ఎంతో స్వేచ్చగా పెంచిన అమ్మ  ప్రవర్తన నాకెంతో ఆశ్చర్యం గాను కొత్తగానూ అనిపించి అదే అడిగాను .  నేను చేసే పని మంచిది కాదని ఆమె ఖఛ్చితమైన అభిప్రాయం .   నాకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించింది.  గొడవ పడింది . అమ్మ అంత గట్టిగా వాదించడం , నా ఆలోచనని, పనిని  సరిచేయాలని ప్రయత్నించడం  నా జీవితంలో అది రెండోసారి  ‘ బయటకు దీర్ఘంగా చూస్తూ చెప్పింది సువర్ణ

‘అవునా ..?’  శారద ప్రశ్నార్ధకం
ఒకసారి దీర్ఘ శ్వాస  తీసుకుని వదలుతూ  ‘అవును, నా కులంలో చాలా మంది ఆడపిల్లలాగా నేనెప్పుడూ లేను. అందుకు భిన్నంగా పెంచింది అమ్మ.  బుడిబుడి నడకల నన్ను చదువుల తల్లి ఒడిలో చేర్చింది.  ఊళ్ళో  నాతోటివాళ్ళు  తమ్ముళ్ళను సాకుతూనో , కడవలతో నీళ్ళు మోస్తునో , బండెడు చాకిరీ చేస్తునో , అడివికిపోయి కట్టెలు తెస్తూనో .. ఉంటే .. నేను మాత్రం అలా కాదు.
సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి పొరిగింటి రాజమణి తో కల్సి  కట్టెలకు పోయాను.  అమ్మకి పని భారం తగ్గిద్దామనే ఉద్దేశంతో . అందుకు అమ్మ సంతోషపడలేదు సరికదా చెడామడా తిట్టింది. అమ్మ ఎప్పుడూ అట్లా తిట్టలేదు.  ఎందుకట్లా చేసిందో చాలా సేపు అర్ధం కాలేదు. అమ్మ కోపం తగ్గాక సారీ చెప్పి , మన చుట్టుపక్కల ఆడపిల్లలంతా రోజూ చేస్తున్న పనేకదా .. వర్షాలు దగ్గరపడుతున్నాయ్ .  పొయ్యిలో కట్టెలు లేవు . నీకు కష్టం కావద్దని , సాయం చేద్దామని  నేను వాళ్ళతో పాటు వెళ్తే  తప్పేమిటన్న నా  ప్రశ్నకు  ‘మనసొంటి మాదిగోళ్ళ  ఆడపిల్లలపై అచ్చోసిన ఆంబోతుల్లెక్క తిరిగేటోల్ల కళ్ళు, పడతయ్ బిడ్డా …  మనసొంటి ఆడోల్లని చెరబట్టే కీచక మూకలు  అవకాశం కోసం ఎదురు చూస్తనే ఉంటయ్ బిడ్డా ..జర బద్రం ..  ఊర్ల పెరిగిన పిల్లలకు ఎవరెసొంటోల్లో అంతో ఇంతో ఎర్కుంటది. నువ్వా  సుడాబోతే పట్నం పిల్లలెక్క , పెద్దిండ్లల్ల పిల్ల లెక్క సక్కదనాం ముంటివి. ఈ గుడిసెల్ల కాపాడుడు నాతోని అయితదా .. గందుకే మందిలకు పోకు’ అని విశదపరిచింది.  ఆనాడు అమ్మ మాటలు అర్ధమయ్యి అవనట్లుగా ..  అంతగా పట్టించుకోలేదు కూడా .  ఇప్పుడాలోచిస్తుంటే ఎర్నాకులంలో న్యాయ విద్యార్థిని జిషకి జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత గానీ నేను రియలైజ్ అవలేదు ఆనాడు అమ్మ ఎందుకంతగా చెప్పిందో ..  అంటూ శారద మొహంలోకి  ఓ క్షణం అలా  చూసి చూపు తిప్పుకుంటూ

‘గర్భ దరిద్రంలో  మోసిన బరువుల మోత, రంపపు కోత అనుభవించిన అమ్మ అంతకు మించి లాలిత్యంతో ఎలా చెప్పగలదు ?  ఏ గుడ్లగూబ ఆబగా కబళిస్తుందో నన్న భయంతో  తల్లి కోడి  రెక్కల కింద పిల్లను దాచుకునే ప్రయత్నం ఆమెదని అర్ధం చేసుకునే వయసు కాదు నాదప్పుడు .’ అంటూ చెప్పడం ఆపి సీరియస్ గా  వింటున్న శారద మోహంలో భావాల్ని చదవడానికి ప్రయత్నం చేస్తోంది సువర్ణ .

తర్వాత  అన్నట్లు చూస్తున్న శారద తన చేతిలోని సువర్ణ చేతిని నెమ్మదిగా వదిలి  గాలికి  చెల్లాచెదురవుతున్న సువర్ణ  జుట్టుని సవరించింది.   ఆ చర్య  తల్లి ఆత్మీయ స్పర్శ  పొందిన ఫీలింగ్ కలిగించింది సువర్ణకి .  శారద భుజంపై తల వాల్చిందల్లా  లేచి చిన్నపిల్లలా శారద మొహంలోకి చూసింది . శారద ఆమె తలను తన ఒడిలోకి తీసుకుంది . చెమర్చిన కళ్ళు  కనిపించనీయకుండా  ఓక్షణం కళ్ళు మూసి తెరిచింది సువర్ణ . ఎంత వద్దన్నా ఓ కన్నీటి చుక్క ఆమె కనుకొలుకుల్లోంచి  పక్కకు జారింది.
నెమ్మదిగా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది .   ట్రాన్స్ లో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఆమె తీరు చూస్తుంటే .

నా ఇంటర్ ఎగ్జామ్స్ ముందు జరిగిన సంఘటన అమ్మని ఎంత ఆందోళనకు గురి చేసిందో .. చిగురుటాకులా వణికిపోయింది .
ఏమైంది ? శారద కళ్ళతోనే ప్రశ్నించింది

‘ ఇంటర్ ఎగ్జామ్స్ లో   సాధారణంగా వచ్చే ముఖ్యమైన  ప్రశ్నలు చెప్తానని  చెప్పి మేకతోలు కప్పుకున్న తోడేలు లెక్చరర్  లైంగిక దాడికి పాల్పడడంతో అతన్ని ఎదుర్కుంటున్న క్రమంలో అతను అన్న మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి .

‘ ఏమిటే .. అంత నీల్గు తున్నావు ?  పత్తిత్తయినట్టు .. అయ్యేవడో తెల్వకుండా పుట్టినదానివి .. అంటూ సైంధవుడిలా వెంటపడి దుర్భాష లాడినప్పుడు ఆ క్షణంలో వచ్చిన ఆవేశంతో లెక్చరర్ అనికూడా  చూడకుండా చెప్పు తీసుకుని చెడామడా వాయించేసాను.  కానీ భవిష్యత్ పరిణామాల్ని ఊహించలేదు . ఆ అవమానాన్ని భరించలేక తెల్లారితే పరీక్ష ఉన్నదనే విషయం పట్టించుకోక ఇంటికి పరిగెత్తుకుపోయాను.  అమ్మని ఒక బిడ్డ అనరాని మాటలన్నాను . ఎన్నిమాటలన్నా అమ్మ ఒక్క మాట తూలలేదు.  మనసులోపల ఉప్పొంగుతున్న త్సునామీ అలల్ని ఎలా అదిమిపెట్టగలిగిందో .. ఆమెలో ఎన్ని నెత్తుటి నదులు పారాయో .. ఎంత తప్పుగా అర్ధం చేసుకుంది .. ప్చ్ పాపం ..అమ్మ .   చీర చెంగు మాటున అలవికాని అవమానాలు, విషాదాలు దాచేస్తూ .. ఎక్కడి బాధల్ని, బెంగల్ని  అక్కడే పాతరేస్తూ నా కోసం ..నిభాయించుకుంది. ఆశావహంగా  నాకోసం  ముందుకు నడుస్తూనే ఉంది.  మరిప్పుడెందుకు ఆ నడక ఆగిపోయిందో ..?విధి ఆమెను ఏ తీరాలకు విసిరేసిందో ‘  సువర్ణ కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి . గొంతు జీరబోయింది .

తన ఒళ్ళో  ఉన్న సువర్ణ  భుజంపైఓ చేత్తో  తడుతూ మరో చేత్తో ఆమె తలపై చేయి వేసి అనునయంగా  నిమురుతోంది శారద .
కొద్ది సేపు ఇద్దరి మధ్యా మౌనం . ఆ తర్వాత  శారద ఒడిలోని తల లేపి ఆమె మొహంలోకి చూస్తూ
‘తాత చనిపోకముందు తన పేర ఉన్న అరెకరం చేను పండించుకొమ్మని అమ్మకి ఇచ్చాడు. చెట్టు,పుట్టలతో అడవిలాగా ఉన్నదాన్ని చంటి బిడ్డలా సాకింది.  ఒంటి చేత్తో సాగులోకి తెచ్చింది . తిండిగింజలకి ఇబ్బందిలేకుండా చేసుకుంది.  తాత చనిపోయాడు. అమ్మమ్మ నోరులేని జీవి. అది అలుసుగా తీసుకుని పెద్దమామ, చిన్న మామ ఆ పొలం గుంజుకున్నప్పుడు ఆబోతుల్లా కొమ్ములతో కుమ్మి, కొట్టి  హింసించినప్పుడు, కుటుంబంలో , సమాజంలో వచ్చే ప్రతి సంకెలని తెన్చుకుంటూ సాగిన అమ్మకి ఇప్పుడు ఏమయింది శారదా ? ‘ బేలగా అడిగింది సువర్ణ .   మళ్ళీ ఆమే  ‘నా కోసం..  నా కోసమే,  పొగచూరిన కళ్ళలో ఒత్తులేసి నాకు బాట చూపే ప్రయత్నం చేస్తూనే ఉండేది అమ్మ .  ఎటు నుండి ఏ కష్టం వచ్చి మీదపడుతుందో అని అమ్మ కాపు కాస్తూనే ఉండేది. అయినా ఈ మగాళ్ళకెంత అలుసో కద శారదా ఆడవాళ్లంటే .. అందునా మా లాంటి వాళ్ళంటే ..’
అవునన్నట్లు తలూపుతూన్న శారద చేతిని చేతిలోకి తీసుకుంటూ  ‘పేదలం , దళితులం .. జోగినీ కుటుంబం .. ఆడవాళ్ళం ..ఒంటరి ఆడవాళ్ళం ..  వాళ్ళు  అట్లనే ఉంటరు బిడ్డా ..అలుసు తీసుకుంటరు బిడ్డా .. ఒంటి బలుపు తీర్సుకుంటరు బిడ్డా ..  మనం  యుద్ద తంత్రాలు నేర్వాలే బిడ్డా అని చెప్పిందో నాడు  నేను అడిగిన ఓ  ప్రశ్నకి సమాధానంగా .. అక్షరం చదవని అమ్మ నాకెన్ని జీవిత పాఠాలు చెప్పిందో .. ‘ ఆకాశంలో అలుముకుంటున్న చీకటి మేఘాల్లాటి జ్ఞాపకాల్లోంచి తొలుచుకొస్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే

‘నిజమే సువర్ణా, ఎంతబాగా చెప్పింది మీ అమ్మ … ఆమె అనుభవం చెప్పిన పాఠాలు ఎన్ని డిగ్రీలు చదివినా వస్తాయా ..?  ఎంతటి గడ్డు స్తితి నైనా ఎదుర్కొనే ధైర్యం, విశ్వాసం లేకే కదా యువత ఆత్మహత్యలు చేసుకునేది  ‘ సాలోచనగా అంది శారద .  అదేమీ పట్టించుకోనట్టే .. తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది సువర్ణ.

‘అమ్మ జోగిని అని అనడం చిన్నప్పుడు విన్నాను. కానీ జోగినీ అంటే ఏమిటో  తెలియదు. తెల్సుకోవాల్సిన అవసరమూ రాలేదు. నాకు  అమ్మ పోలికలున్నా రంగు రాలేదు. అమ్మది నాణ్యమైన నలుపు .  నేను చిన్నప్పటి నుండి హాస్టల్ లో ఉండి చదువుకోవడం , సెలవులకి  ఇంటికి వెళ్ళినా మళ్ళీ  హాలిడే కాంప్ లకు వెళ్ళడంతో సరదాగా గడచిపోయేది. లేదంటే ఉపాధి పనులకు అమ్మతో పాటే వెళ్ళేదాన్ని. ఆ పనులకు తీసుకెళ్ళడం , నాతో పని చేయించడం అమ్మకు అస్సలు ఇష్టముండేది కాదు. నేను కమిలిపోతానని, నా రంగు మాసి పోతుందని అనేది.  కానీ ఇంటి దగ్గర ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కాదనే ఉద్దేశం. అమ్మే నన్ను చూడాలనిపించినప్పుడల్లా నా దగ్గరకు వచ్చేది .   బడి  పాఠాల్లో మంచి మార్కులు తెచ్చుకునే నేను అమ్మ చెప్పిన జీవిత పాఠాలను ఆనాడు సరిగ్గా బుర్రకు ఎక్కించుకోలేదేమో ..అర్ధం చేసుకోలేదేమో ..  ! నాకు పెళ్లి చేసెయ్యాలని ఎంతో  తపన పడింది .  పెళ్లి లేని తల్లిగా ఎన్ని అవమానాల్ని తన గరళంలో బిరాడాతో బిగిన్చేసిందో .. ప్చ్ ,, ‘ నిట్టూర్చింది  కనుకోలుకుల్లో దాగిన కన్నీటి చుక్కని చున్నీతో తుడిచేస్తూ .

అప్పటివరకూ జోగిని అంటే అర్ధం కాని శారద ఏదో అర్ధమయిన దానిలా సానుభూతిగా చూసింది సువర్ణ వైపు .
‘నే చెప్పింది నీకు అర్ధమయ్యే ఉంటుందనుకుంటున్నా …  అమ్మ ఆరాటానికి  కారణం అప్పుడు నాకు అర్ధం కాలేదు . తనకి లేని దాన్ని కూతురికి అందించాలని ఆమె తపన, తాపత్రయం అందులో సంతోషం వెతుక్కునే ప్రయత్నం కావచ్చని ఇప్పుడనిపిస్తోంది.  ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి అని భీష్మించుకు కూర్చున్న నన్ను బాగా చదువుకున్నావు . మంచీ చెడూ నాకంటే నీకే ఎక్కువ తెలుసు అంటూ సరిపెట్టుకుంది .

ఎక్కడిదాకా వచ్చారని చిన్న మామ ఫోన్ కి కామారెడ్డి దగ్గరలో ఉన్నామని సమాధానం చెప్పిన సువర్ణ కేసి చూస్తూ  ‘నువ్వూ మాలాగే పేదింటి పిల్లవనుకున్నా కానీ  ఎంతటి గడ్డు పరిస్తితుల్లోంచి ఎదిగోచ్చావో తెలుస్తుంటే  ఆశ్చర్యంగానూ గర్వంగాను  ఉంది సువర్ణా .  నీవసలు అలా కనిపించవు .  ‘ ఆశ్చర్యంగాను, ఆప్యాయంగా సువర్ణ చేతికి గట్టిగా పట్టుకుంది శారద .

‘నీకు నేను చెప్పింది చాలా తక్కువ  శారదా .. పన్నెండో ఏడు వెళ్లిందో లేదో అమ్మకి  నేను పుట్టానట.   ఆ తర్వాత ఏడాదిన్నరకి తమ్ముడు .. ఆమె ప్రమేయం లేకుండానే .. మా పుట్టుక గురించి ఆమె ఆరాటపడకుండానే .. ఎవరెవరి శరీర తాపం తీర్చుకునే క్రమంలోనో… సాంప్రదాయపు చట్రంలో చిక్కి విలవిలాడే అమ్మ రక్తం పంచుకుని మేమీ లోకంలోకి వచ్చేశాం. కానీ ఏమైందో కానీ తమ్ముడు ఏడాదిలోపే మమ్మల్ని వదిలిపోయాడు.

నాకు ఊహ తెలిసినప్పటి నుండీ నాన్నంటే  తెలియదు.  అమ్మని అడిగితే వదిలి వెళ్ళిపోయాడంది.  ఒంటి చేత్తోనే మమ్మల్ని పెంచింది అమ్మ .  ప్రభుత్వం జోగినులకు ఇచ్చే పునరావాస కార్యక్రమాల్లో కుట్టుపని నేర్చుకుంది.  జాకెట్లు , గౌన్లు , లంగాలు వంటివి కుట్టడం నేర్చుకుంది.  కానీ అమ్మ దగ్గర కుట్టించుకోవడానికి వచ్చేవారు కాదు.  కారణం అప్పటికే ఆమె జోగినులకోసం కట్టించిన ఆశానగర్ కాలనీలో ఉండడమే .  ప్రభుత్వం హాస్టళ్లకు కుట్టే బట్టలు వీళ్ళతో కుట్టించింది.  జోగినుల కాలనీ అని ముద్ర పడడంతో  అల్లరి చిల్లరి  మగవాళ్ళు  అక్కడ చేరి అల్లరి పెట్టడం మొదలు పెట్టారు . ఇక అక్కడ ఉండలేక అమ్మ లాగే మిగతావాళ్ళు  చాలా మంది అక్కడి నుండి వెళ్ళిపోయారు .  అమ్మకి మళ్లీ పనిలేదు .  కూలీకి వెళ్ళేది. మొదట్లో కూలికి కూడా రానిచ్చేవారు కాదట .  అటువంటి పరిస్తితి లోంచి వచ్చిన అమ్మ ఎంత గొప్పగా ఆలోచించిందో తెలుసా .. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని జోగినులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పిందట.  కానీ అది తీసుకోనని రాత్రి మాటల్లో చెప్పింది అమ్మ .’

‘ఏం ఎందుకని వద్దంది ‘ ఉచితంగా వస్తుందంటే ఫినాయిలు తగదానికయినా సిద్ధమయ్యే ఈ కాలంలో ఇలాంటివాళ్ళు కుడా ఉంటారా అనే ఆశ్చర్యంతో శారద ప్రశ్నదూసుకొచ్చింది.

‘ అది ఆత్మ గౌరవం కోసం కావచ్చు లేదా నేను ఉద్యోగంలో చేరితే ఆర్ధికంగా ఇక ప్రభుత్వ సహకారం అవసరం లేదని ఉండవచ్చు. లేదా తన జీవితం తాలుకు  నీలి నీడలు నాపై పడతాయని కావచ్చు ఏమైనా అమ్మ తీసుకున్న నిర్ణయం గొప్పదే కదా ..’ కొన్ని క్షణాలు అలా కళ్ళు మూసుకు తెరిచి మళ్ళీ తానే  ‘సమాజంలో ఉండే హెచ్చు తగ్గులు, సమాజపు అంతః స్వరూపం  బడిలో ఉన్నప్పుడు అంతగా తెలియదు. కారణం నేను సంస్కార్ బడిలో చదవడం కావచ్చు. అక్కడ అందరినీ ఒకే విధంగా చూడడం కావచ్చు .  కబడ్డీ , ఖో ఖో రాష్ట్ర , జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడు , కొన్ని సామాజిక కార్యక్రమాలకోసం , బాల జర్నలిస్టుగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనషుల మధ్య ఉండే అంతరాలను గమనించినా అంత సీరియస్ గా తీసుకోలేదు .. బహుశా అంతగా అర్ధం చేసుకునే వయసు కూడా కాదేమో …

ఎప్పుడయితే నేను బాలల హక్కులపై  రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయి సదస్సులకి హాజరయ్యానో అప్పటి నుండి నా మెదడు మరింత ఆలోచించడం మొదలు పెట్టింది . పదును అవడం ఆరంభమైంది.  చెప్పాను కదా ఇంటరులో ఉండగా జరిగిన సంఘటన . ఆ తర్వాత ఒంటరి స్త్రీగా తల్లి పడుతున్న కష్టాలు కొద్ది కొద్దిగా అవగతమవుతూ వచ్చాయి. నా తల్లిలానో,  గ్రామంలోని మహిళల్లాగానో బతక కూడని అప్పుడే నిశ్చయించుకున్నాను .  అమ్మ హేమలతా లవణం స్ఫూర్తి నిచ్చేది . అట్లా నలుగురికీ ఉపయోగపడేలా బతకాలని నాకు నేనే చెప్పుకునేదాన్ని.  ఆక్రమంలో అన్నింటా చురుకుగా పాల్గొంటూ వచ్చిన ఏ  అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు దూసుకుపోయే దాన్ని. అప్పటికప్పుడు ఏ విషయమైనా నదురు బెదురూ లేకుండా ఎంతమంది ముందయినా మాట్లాడేదాన్ని. విస్లేషించే దాన్ని. సూటిగా చెప్పే దాన్ని. బహుశా ఇవన్నీ నేను చదివిన బడి, అక్కడి మనషులు, వాతావరణం నాకిచ్చాయని అనుకుంటున్నా ..

ఆ లక్షణాలే అమెరికా దాకా వెళ్ళే అరుదైన అవకాశాన్నిచ్చాయి .  నేనెప్పుడూ ఊహల్లో కూడా కనని కలని నిజాన్ని చేస్తూ నా ముందుకు వచ్చిన అవకాశం అది. కానీ అప్పుడు అమ్మ పంపడానికి చాలా భయపడింది.  తెలిసిన వాళ్ళు  తెలియని వాళ్ళు అమ్మని చాలా భయపెట్టారు.  తన భయాలన్నీ తనలోనే పెట్టుకుని  హేమలతా లవణం ఆమ్మమ్మ పై ఉన్న గౌరవంతో , నమ్మకంతో అమెరికాలో జరిగే సదస్సుకి నన్ను పంపించింది ‘. గాలికి ఎగురుతున్న ముంగురులను సవరించుకుంటూ చెప్తున్న సువర్ణ మాటలు పూర్తి కాకుండానే అందుకుని  ‘ ఏమిటీ చిన్నప్పుడే నీకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందా ..?’  చెప్పలేనంత ఆశ్చర్యం కళ్ళలో నిండగా అడిగింది శారద .

‘అవును , ఆ రోజు నా జ్ఞాపకాల్లో ఇంకా పచ్చిగానే , అప్పుడప్పుడూ ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. పాస్పోర్ట్ కోసం హైదరాబాద్ వెళ్లినప్పుడు తండ్రి పేరు లేదని పాస్ పోర్ట్ ఇవ్వనని చెప్పారు.  తండ్రి ఇప్పుడు మీకు లేక పోవచ్చు కానీ నీ పుట్టుకకి కారకుడైన వ్యక్తీ పేరు చెప్పమన్నారు . ఏమి చెప్పను . ఏమని చెప్పను. భారమైన హృదయంతో తప్పుచేసిన దానిలా తల వంచుకున్నాను .  అప్పటికీ నన్ను తీసుకెళ్ళిన అంటి పరిస్థితి వివరించింది.  వాళ్ళకి జోగిని అంటేనే తెలియదు. చెప్పింది అర్ధం చేసుకోరు . వాళ్ళ టైం వెస్ట్ అవుతోందని మాట్లాడారు. ఆంటి చాలా రిక్వెస్ట్ చేశారు . ఒప్పుకోలేదు.   అప్పటికప్పుడు అమ్మని పిలిపించి జోగిని అంటే ఏంటో తెల్పుతూ ఒక అఫిడవిట్ తయారు చేయించి  అమ్మతో సంతకం చేయించి పాస్త్పోర్ట్ ఆఫీసర్ కి ఇచ్చి వివరించిన తర్వాతే  పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకున్నారు.  మొదటిసారిగా నేను జోగిని కూతురుగా పుట్టినందుకు బాధపడ్డాను. కానీ అప్పటికి జోగినీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు .

‘ అవునా ..  తండ్రి పేరు లేకపోతే ఇలాంటి కష్టాలుంటాయా .. ? విస్మయంగా శారద

అవునన్నట్లుగా తలూపి ‘ఆంటి వాళ్ళు చొరవ చూపక పోతే నాకు వచ్చిన అవకాశం నేను కోల్పోయేదాన్ని.. నేను కాకుండా మరెవరికి ఈ అవకాశం వచ్చినా తండ్రి పేరు లేదన్న కారణంగా పాస్ పోర్ట్ అప్లికేషన్ వెనక్కి ఇచ్చేసేవారు కాదు కదా .. అప్పటి నుండి నాలో ఎన్నెన్నో ప్రశ్నల తుఫానులు రేగడం మొదలయ్యాయి.  కానీ అమ్మని అడిగి తెలుసుకునే అవకాశమే రాలేదు. పాస్పోర్ట్ వచ్చాక రెండుసార్లు ధిల్లీ వెళ్లి వచ్చా వీసా కోసం ..  అక్కడ కూడా జోగిని బిడ్డగా , తండ్రి లేని బిడ్డగా మళ్ళీ రుజువు చేసుకోవాల్సి వస్తుందేమోనని భయపడ్డా . కానీ వాళ్ళు  తండ్రి పేరు లేదని అభ్యంతర పెట్టలేదు. కానీ, నేను మైనర్ ని కాబట్టి అమ్మని అడ్రెస్స్ , నివాస దృవీకరణ చేసుకునే పత్రాలు కావాలన్నారు.  తెల్లవారే సరికి అమ్మ విమానం ఎక్కి దిల్లీ వచ్చింది.  ఎక్కడో పొలాల్లో పని చేసుకుంటున్న అమ్మని పిలిపించి అప్పటికప్పుడు తోడిచ్చి ధిల్లీ పంపించారు  సంస్కారు వాళ్ళు .

బిడ్డా .. నిజామబాద్ మొకం జూడని నాకు మీది మోటార్ ఎక్కిపిచ్చినవ్ .. నీకంటే ముందు నేనే గాలి మోటార్ ఎక్కిన అంది  అమ్మ  ఢిల్లీ చేరగానే . ఇందిరమ్మ ఇక్కడే ఉండేదా ..ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏవేవో అమాయకపు ప్రశ్నలు వేసింది .  నిన్న ఈ వరకూ చేన్ల ఉంటి . ఇగో ఇప్పుడు డిల్లి గల్లిలల్ల .. అంటూ ఆశ్చర్యపోతునే ఉంది .
మా జీవితాలు ఆ మట్టి లోంచి , బురదలోంచి పైకి వచ్చి అంబరాన్ని  అందుకోవాలని,  మేమంతా సంబరాన్ని పంచుకోవాలని సంస్కార్ చాలా చాలా చేసింది.

మా రజిత టీచర్ వాళ్ళ అబ్బాయిని అమెరికా చదువుకు పంపుదామంటే వీసా రాలేదట. చాలా బాధపడిందా .. నాకు వీసా వచ్చిందని  ఈర్ష్య పడింది కూడా . బడిలో వాళ్లకి , సంస్థలో వాళ్ళకి , ఊళ్లో  వాళ్ళకి  అందరికీ ఆశ్చర్యమే ..

చుట్టుపక్కల ఊళ్ళ  వాళ్ళు   కొందరు అమ్మని అదృష్టవంతురాలివి అని పొగిడితే కొందరు ఈర్ష్య పడ్డారు.  తమ ఊర్లొ ఉన్న పెద్దరెడ్డి కొడుక్కి కూడా వీసా రాలేదట. తన కొడుకు వెళ్ళలేని చోటుకు నేను వెళ్తున్నందుకు తమ పీఠం కదిలిపోతున్నంత బాధపడిపోయారు . లేని పోనివి ప్రచారం చేశారు.  విపరీతంగా భయపెట్టారు. తన భయాలన్నీ గుప్పిట బంధించి కళ్ళ నిండిన నీటిని నా కళ్ళ పడకుండా తుడిచేస్తూ అమ్మ నన్ను పంపింది.  కానీ.. నేను తిరిగి వచ్చేవరకూ కంటి నిండా కునుకు లేకుండా గడిపింది. ‘  సువర్ణ  అమ్మ తలపులను భంగపరుస్తూ సెల్ ఫోన్ మోగింది .
‘హార్టీ కంగ్రాట్స్ సువర్ణా ‘
‘…’
‘ఏంటి రిజల్ట్స్ వచ్చాయిగా  .. ఇంకా చూసుకోలేదా ..?  ట్రీట్ ఎప్పుడిస్తున్నావ్ ..?
‘ …’
‘స్టేట్ సెకండ్ రాంక్ కొట్టేశావ్ ‘ . రిజర్వేషన్ లో చూస్తే నీదే ఫస్ట్ ‘ కంగ్రాట్స్ అగైన్ ‘ సెలెబ్రేషన్ ఎప్పుడు ?’
‘ …’ కళ్ళలోంచి నీరు కారిపోతోంది
‘ఏమిటే మౌన వ్రతం చేస్తున్నావా .. లేక  ఫస్ట్ రాంక్ రాలేదనా ..’ అంతలో సువర్ణ చేతిలోని మొబైల్ లాక్కున్న శారద సారీ ఇప్పుడీ విషయం చెప్తున్నందుకు .. సువర్ణ వాళ్ళ మదర్ ఎక్ష్పైర్ద్ ‘ అని చెప్పింది .
‘ఓ అయాం సారీ .. తర్వాత మాట్లాడతా ..’ పెట్టేసింది .  ఆ తర్వాత వెంటవెంటనే చాలా ఫోన్లు .. ఏవీ రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు సువర్ణ .  అప్పటికి  హై వే దిగి డిచ్ పల్లి క్రాస్ చేసింది బస్సు .

‘ఒక్క  రోజు ముందుగా ఈ వార్త అందితే .. అమ్మ ప్రాణం నిలిచేదేమో … రక్త సంబందీకులు, పేగు తెంచుకు పుట్టిన నేనూ  ఉండీ లేనట్లు బిక్కు బిక్కుమంటూ బతికింది  అమ్మ .   మనసులో జరిగే సునామీ విధ్వంసాన్ని , హృదయంలో ఉడికే నెత్తుటి మూటల్ని మూటకట్టి  దాచేసేది . లోపల జరిగే యుద్దపు కన్నీటి చారికల్ని కనిపించనీయకుండా  చిరునవ్వు లేపనం పూసుకు తిరిగేది. నన్ను శిఖరాగ్రంపై చూడాలని కలలు కనేది.   ఆ కలలు నిజమవుతున్న వేళ ..  అమ్మా  ఏంటమ్మా .. అంక్షల పంజరాలను  విప్పుకుని ఆశల రెక్కలతో విహరిద్దామని వెళ్ళిపోయావా ..  దుఃఖం తన్నుకొస్తోంది  ఆమెకి .

వాళ్ళ మాటలు చెవిన పడ్డాయేమో .. కొందరు సానుభూతిగా సువర్ణకేసి చూస్తున్నారు.  బద్దలవుతున్న అగ్నిపర్వతాల్ని లోలోనే ఆర్పే ప్రయత్నంలో గట్టిగా కళ్ళు మూసుకు కూర్చుంది సువర్ణ . మనసులో మూగగా తల్లితో మాట్లాడేసుకుంటోంది

నీ దారి పొడవునా ఉన్న ముళ్ళ జెముళ్లను ఏరేసి పూల పాన్పు పరచాలనుకుంటున్న  నా ఆశల్ని పేకమేడల్లా కూల్చేసి పొలిమేరలు దాటి పడమటి కొండల్లోకి  చేరిపోయావా .. అమ్మా  చిక్కటి చీకటి పాయల్లో చిల్లు పిడతలా నన్నిలా వదిలేసి  .. ? !
ఊహు .. కాదు, నే చిల్లు కుండని కాదు. కాకూడదు . నిండు కుండను.  నీవిచ్చిన సప్త వర్ణాలని నింపుకుని ఉదయపు వెలుతురు కెరటం అవుతుందమ్మా నీ సువర్ణ.  ప్రేమంతా నింపుకుని వేళ్ళు జుట్టులోకి పోనిచ్చి సవరిస్తూ లాలించే అమ్మ మొహం కళ్ళలో మెదులుతుండగా సువర్ణ ఆలోచనలకు భంగం కలిగిస్తూ నిజామాబాద్ బస్ స్టేషన్ లో బస్ ఆగింది .
.
వి. శాంతి ప్రబోధ

Published in Matruka 2017 March
(2016 నోముల పురస్కారం పొందిన కథ )

చితికిపోతున్న ‘సింగల్ పేరెంట్ చైల్డ్ ‘ బతుకు

ఆమె సింగల్ పేరెంట్ చైల్డ్ . తల్లి తప్ప తండ్రి తెలియదు . ఆమె పుట్టగానే
ఆడపిల్ల అనే కారణంతో అతను ఆమె మొఖమే చూడలేదు . ఆమె తల్లినీ పలకరించలేదు .
నిర్దాక్షిణ్యంగా వదిలేసి తనదోవ తాను చూసుకున్నాడు . తల్లీ బిడ్డలు
బతికారో చచ్చారో కూడా చూడలేదు . తల్లీ తండ్రీ అయి ఆమెను ఆమె తల్లి
పెంచింది.  బడిలోనూ, ఆధార్ కార్డులోనూ బ్యాంకు ఖాతాలోనూ తల్లి పేరే ఉంది
.  అందుకు ఆమె కొంత పోరాటం చేయాల్సివచ్చినా అది సాధించుకుంది ఆ తల్లి .
ఇప్పుడామె పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంది.  అప్పటి నుండి మొదలయ్యాయి ఆమె
కష్టాలు.

పాస్ పోర్ట్ అప్లికేషన్ లో తండ్రి పేరు లేని కారణంగా అది తిరస్కరణకు
గురయింది.  ఆమెకు ముక్కు మొహం తెలియని , ఈనాడూ ఇసుమంత ప్రేమ చూపని అతను
తన జన్మకు కారకుడైనప్పటికీ అతని పేరు చేర్చడం ఆమెకు ఇష్టం లేదు. కానీ
పాస్పోర్ట్ అధికారులు తల్లిదండ్రులిద్దరిపేర్లూ కావాలంటున్నారు. తండ్రి
పేరు లేకుండా పాస్పోర్ట్ ఇచ్చేది లేదని వత్తిడి తెస్తున్నారు.  ఒకరకమైన
మానసిక హింసని అనుభవిస్తోంది ఆమె. అప్పుడు ఆమె ఏం చెయ్యాలి?  తండ్రి పేరు
చెప్పని కారణంగా పాస్పోర్ట్ పొందే తన హక్కుని కోల్పోవలసిందేనా ..?  తాను
దేశాంతరం వెళ్ళవలసి వచ్చే అవకాశాల్ని వదులుకోవలసి వచ్చిందేనా ..?

ఆమె తల్లి ప్రియాంక గుప్తా రంగంలోకి దిగింది. పాస్పోర్ట్ అధికారులకు
విషయం నివేదించింది . సీనియర్ అధికారులను కలిసింది . ఉత్తరప్రత్యుత్తరాలూ
నెరపింది . వారిని ఒప్పించడానికి శతవిధాలా  ప్రయత్నం చేసింది. కానీ ఫలితం
లేదు . .

ఒకవేళ తండ్రి పేరు చేర్చి పాస్పోర్ట్ తీసుకున్నా తనంటే ఇష్టంలేని అతని
పేరు తన పాస్పోర్టులో చూసుకున్నప్పుడు కూతురు ఎంత మానసిక వ్యధను, బాధను
అనుభవిస్తుందో అర్ధం చేసుకుంది ప్రియాంక. ఇది నా ఒక్కదాని సమస్యేనా ..?
ఎంతోమంది ఒంటరి తల్లులు / తండ్రుల సమస్య . సింగల్ పేరెంట్స్ కి ఉండే
సమస్యలకు ఇదో సమస్య తోడయింది.  ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనీ,, సమాజం
నుండి సహకారం అందుకోవాలని భావించింది.  కోర్టు తలుపు తట్టింది .

తండ్రి పేరు అవసరం లేదని న్యాయ వ్యవస్థ ప్రగతి శీలమైన తీర్పు చెప్పింది .
విడాకులు తీసుకోవడం ద్వారానో , లేదా మహిళ సింగిల్మే గా ఉండాలనుకోవడం
వల్లనో గానీ రాను రానూ దేశంలో సింగిల్ పేరెంట్స్ పెరుగుతున్నారు . ఇలాంటి
సందర్భాల్లో  తండ్రిపేరు  తప్పని సరి కాదు .  వారికి ఇష్టమైతే
పెట్టుకోవచ్చు . కానీ బిడ్డకు ఇష్టం లేనప్పుడు ఆమె ఎవరి సంరక్షణలో ఉంటే
వారి పేరు మాత్రమే ఉండొచ్చని  మే 2016, ఢిల్లీ హై కోర్టు తీర్పు
వచ్చినప్పటికీ పరిస్థితి మారలేదు .

ప్రధానమంత్రి , హోం మంత్రి , స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి  తదితరుల
దృష్టికి సింగిల్ పేరెంట్స్ సమస్యలపై దృష్టి సారించవలసిందిగా వేడుకుంటూ
12 జులై, 2016 న  change.org ద్వారా పిటిషన్ వేసింది. ఈ విషయం పై మహిళా
శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వెంటనే (జులై 15)స్పందించారు .

ప్రస్తుత పాస్పోర్ట్ నియమావళి  ప్రకారం తల్లిదండ్రులిద్దరి పేర్లూ తప్పని
సరి . ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని, సమాజంలో
వస్తున్న మార్పులను అనుసరించి మన వ్యవస్థలోనూ , విధి విధానాల్లోనూ , నియమ
నిబంధనల్లోనూ సానుకూల మార్పురావలసిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు .
తనవైపు నుండి ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇటువంటి న్యాయబద్ధమైన అంశాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పడంతో పాటు
” నీ  భర్త ఆమెకు తండ్రిగా ఏనాడూ లేడు .  ఆ బాధ్యతలు నిర్వహించలేదు
కాబట్టి మీ అమ్మాయికి తల్లి పేరు మాత్రమే పెట్టుకునే హక్కు ఉంది . ” అంటూ
ప్రియాంకకు కొండంత అండగా నిలిచారు మేనకా గాంధీ .

ఇప్పుడు ప్రియాంక గుప్త కేంద్ర  విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మా స్వరాజ్ ఈ
విషయంలో జోక్యం చేసుకొని పాస్పోర్ట్ నియమ నిబంధనల్లో అవసరమైన మార్పులు
చేయవలసిందిగా అప్పీల్ చేశారు . అందుకోసం సోషల్ ప్రజల మద్దతు
కూడగట్టుకుంటున్నారు.

మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని మనం ఏర్పరచుకున్న నియమ నిబంధనావళి
వల్ల మనం కోల్పోకూడదు. అంటే, మారుతున్న సామాజిక పరిస్థితులకనుగుణంగా మనం
ఏర్పరచుకున్న నియమాలని మనం మార్చుకోవలసిందే .  వివిధ కారణాల కారణంగా
సమాజంలో సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఆ సింగిల్
పేరెంట్స్ఎక్కువగా ఉన్నది మహిళలే . పురుషులు చాల తక్కువే .

పిల్లలకి తల్లిదండ్రుల ద్వారా సమాజంలో ఓ గుర్తింపు లభిస్తుంది.
తల్లి/తండ్రి మాత్రమే ఆ బిడ్డ బాధ్యతలన్నీ మోసినప్పుడు తల్లి/తండ్రి ఎవరో
ఆ బిడ్డకు తెలియనప్పుడు లేదా తెలిసినా వారిపేరు పెట్టుకోవడానికి
ఇష్టపడనప్పుడు ఆ గుర్తింపు తల్లి/తండ్రి ఏ ఒక్కరికో మాత్రమే ఉంటుంది.
అదే సరైంది కూడా . కానీ ఆ బిడ్డని వదిలించుకుని లేదా వదిలేసి దూరంగా
అనామకంగా ఉన్న వ్యక్తి పేరు తప్పని సరి అని బలవంతం ఎందుకు ?  పురుషాధిక్య
సమాజంలో  సింగిల్ పేరెంట్స్ గా మహిళలు మానసికంగా, చట్టపరంగా ,
సామాజికపరంగా   అనుభవిస్తున్న ఇటువంటి సమస్యలపై చర్చ జరిగి సానుకూల
ఫలితాలు రావాలనీ , వారి సమస్యలకు తెరపడాలని కోరుకుందాం. వీలయినంత త్వరలో
పాస్పోర్ట్ చట్టంలో మార్పులు చోటు చేసుకోవాలని,  ప్రియాంక గుప్తా
కుమార్తె పాస్పోర్ట్ పొందాలని ఆశిద్దాం .

వి. శాంతి ప్రబోధ

(October 17, 2016, Navathelangana, Vedikalo Prachurana)

న్యాయమా.. నీకూ నేనంటే చిన్న చూపేనా ..?

praja Aug 9-15 praja 1 aug 9-15
“నేనొకటే కోరుకుంటాను , ఈ దేశంలో ఆడవాళ్ళుగా పుట్టకూడదని.   కారణం ఆమె వేసే ప్రతి అడుగునూ అద్డుకునే మూర్ఖులే .. ” అని ఒక ట్రైనీ ఐఏఎస్ ఆవేశపడిందంటే, ఆవేదన చెందిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చేమో ..
చత్తిస్ గడ్ కు చెందిన రిజూ  బఫ్నా 1998 లో పుట్టింది. 1914 బాచ్ కి చెందిన ఆమె మధ్య ప్రదేశ్ క్యాడర్ కు చెందినా ట్రైనీ ఐఏఎస్ అధికారి.  ఆమె ఆవేశానికి, ఆవేదనకి కారణం ఏంటో చూద్దాం .  మధ్యప్రదేశ్ మానవ హక్కుల సంఘం అయోగ్ మిత్ర  సంతోష్ చౌబే  రిజూకి  అసభ్యకర సందేశాలు పంపించాడు.  ఈ విషయం సియోన్ జిల్లా కలెక్టర్ భరత్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్ళింది రిజూ .  సంతోష్ చౌబే పై లైంగిక వేధింపుల ఆమె కేసు పెట్టింది. అతన్ని ఆరెస్ట్ చేశారు. బెయిలు పై విడుదల అయ్యాడు.  మనవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి అతన్ని పదవిలోంచి తొలగించింది .  ఈ కేసు విషయంలో  వాంగ్మూలం ఇచ్చేందుకు ఆగస్ట్ 1వ తేదిన రిజూ బఫ్నా కోర్టుకు వెళ్ళింది. అందరిముందు వాంగ్మూలం ఇవ్వడానికి బిడియపడిన, ఇబ్బంది పడిన ఆమె అక్కడున్నవారిని అవతలికి పంపవలసిందిగా న్యాయమూర్తిని కోరింది . అప్పటి వరకూ రిజూ పక్కనే నిల్చున్న లలిత్ శర్మ అనే న్యాయవాది  కూడా అందరితో పాటే బయటికి వెళ్ళాలి.  కానీ అతను వెళ్ళకుండా  ఉగ్రుడై  ‘నీకెంత ధైర్యం ? నేను   లాయర్ని. నన్ను వెళ్లి పొమ్మంటావా ..? నువ్వు ఐఏఎస్  ఆఫీసరు అయితే కావచ్చు. అది నీ ఆఫీసులో ఇక్కడ కోర్టులో కాదు” అంటూ తీవ్ర పదజాలంతో దూషించాడు. ఇదంతా జరిగింది న్యాయమూర్తి ఎదుటే.  తను ఆ విధంగా కోరడానికి కారణం న్యాయమూర్తికి  వివరించడానికి రిజూ ప్రయత్నించింది. ‘నీవు చిన్నదానివి . నీకు కోర్టు పద్దతులు తెలియవు అందుకే ఏదో ఎక్స్పెక్టేషన్ తో ఉన్నావు. డిమాండ్ చేస్తున్నావు’ అంటూ ఆయన క్లాసు పీకాడు. ఒక ఐఏఎస్ అధికారిగా కాకుండా ఒక మహిళగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కు విజ్ఞప్తి చేసానని చెప్పినా వినకుండా  ఆమెతో వాదిస్తూ దిగిపోయారు న్యాయమూర్తి .

తన గోడు విని న్యాయం చేయాల్సిన చోటే చేదు అనుభవాలు ఎదురైతే .. ఎవరైనా ఏమి చేస్తారు ..?  బాధ పడతారు. భయపడతారు. ఇంకేం చేస్తామని నోరు మూసుకుని ఉంటారు . అందులో మహిళలయితే .. మరీను.  కానీ రిజూ బఫ్నాఅందరిలాంటిది కాదు. అలా భయపడలేదు. బేలగా  బెదిరిపోలేదు. నోరుమూసుకుని పడి ఉండలేదు.  లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఎదుర్కొనే మహిళలు ముందుకు వచ్చి ఎందుకు న్యాయం కోరడంలేదో స్పష్టంగా అర్ధమయింది ఆమెకి. ఇలాంటి సమస్యల్ని ఉపేక్షించకూడదు. ప్రపంచం ముందుకు పెట్టాలి. లేకపోతే మహిళలకి న్యాయం జరగదు.  ఇంకా చిన్నచూపు చూస్తూ ఉంటుంది అని భావించింది రిజూ.  అందుకే  విషయాన్ని సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి చేరవేసింది. ఒక స్థాయికి ఎదిగిన ఆమె ఓ ఆడపిల్లగా ఎదుర్కొన్న సమస్యని ప్రపంచం ముందు పెట్టింది. సాధారణ మహిళకి ఏపాటి న్యాయం మనం ఆశించవచ్చో ఈ కేసు తెలియజేస్తోంది కదా … ?  .

నిన్న ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున యునివర్సిటి లో కడతేరిన రిషికేశ్వరి మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. భవిష్యత్ పై ఎన్నో ఆశలతో ఆమె  కాలేజీలో చేరినప్పటి నుండి రాగింగ్ పేరిట సీనియర్ల నుండి హింస, లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఈ విషయం తండ్రికి చెప్పింది. అయన ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేశారు.  అయినా పలితం లేదు. సీనియర్ల వికృత చేష్టలు కెమెరాలో బంధించి తమ దగ్గరకు రాకపోతే యు ట్యూబ్ లో ప్రసారం చేస్తామన్న బెదిరింపులతో నరకం అనుభవించిన ఆమె తనలేఖలో నిందితుల పేర్లు రాసి ఉంటే వారికి శిక్ష తప్పేది కాదేమో . కానీ ఆమె సంస్కారం వారి తప్పు వారు తెలుసుకుంటే చాలు . మరో ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి కల్పించకుంటే  చాలు అని చెప్పింది .   హాయ్ ల్యాండ్ లో జరిగిన   ఫ్రెషర్స్ పార్టీలో ప్రిన్సిపాల్ కూడా అసభ్యంగా ప్రవర్తించిన తీరు వీడియో టేపుల్లో బయటపడింది. రిషితేశ్వరి డైరీలో కొన్ని పేజీలు చింపేసి ఉన్నాయంటున్నారు. రిషితేశ్వరి మరణంలో  ప్రిన్సిపాల్ కి సంబంధం ఉందని వార్తలొస్తున్న సమయంలో నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు చాలా నిర్లక్ష్యంగా  వ్యవహరించిన తీరు మరింత బాధాకరం. రిషితేశ్వరి బలహీనమైన మనస్కురాలవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆమె బలహీన మనస్కురాలు కాదని ఆమె శక్తి కొలది పోరాడిందని అసలు విషయాన్ని పక్కన బెట్టి మసిపూసి మారేడుకాయ చేయ యత్స్తున్నారని మరో వాదన.  ఈ సమయంలో ఆమెది ఆత్మహత్యా .? హత్యా అని నిర్ధారణ కావలసిన అవసరం ఉంది.

రిజూ బఫ్నా, రిషితేశ్వరి ఇద్దరి విషయంలోనూ సారూప్యం ఏమిటంటే తమకి న్యాయం చేస్తారనుకున్న వాళ్ళే , న్యాయం చేయాల్సిన వాళ్ళే అన్యాయం చేశారు.  వారిని  లైంగిక హింసలకు, మానసిక హింసకు గురి చేశారు. ఇలా చేస్తే ఏమి చెయ్యాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి?   లైంగిక హింసకు గురైన  ఆడపిల్ల న్యాయం కోసం వెళితే న్యాయం జరగక పోగా మరింత హింసకు గురైతే సమాధానం చెప్పేదెవరు ? న్యాయం చేసేదెవరు ? సవాలక్ష సందేహాలు. మరెన్నో ప్రశ్నలు. వీటికి సమాధానం కోసం రిజూ బఫ్నా ప్రజల్లోకి వెళ్ళింది.  రిషితేశ్వరి ప్రజలలోకే కాదు కన్నవారికి కూడా తన పరిస్థితి పూర్తిగా చెప్పుకోలేకపోయింది.  కక్కాలేక మింగాలేక చివరికి ప్రాణం తీసుకుంది.

రిజూకి ఉన్న ధైర్యం రిషితేశ్వరికి లేకపోయిందా ..?   రిజూ బఫ్నా అసభ్యకరమైన సందేశాలు మాత్రమే అందుకుంది . రిషితేశ్వరిని ఆడపిల్లల ద్వారానే ట్రాప్ చేయించారని,  అశ్లీలంగా వీడియో తీసి యు ట్యూబ్ లో పెడతామని బెదిరించారని అంటున్నారు. రిజూ బఫ్నా ఒక అధికారి . వయసులో రిషితేశ్వరి కంటే పెద్దది. ఆమెపై జరిగిన లైంగిక హింస కంటే చాలా చాలా ఎక్కువ రెట్లు  హింస దాదాపు నెలన్నర కాలం అనుభవించింది రిషితేశ్వరి. అందులోనుండి బయటపడే మార్గాలు యోచించింది. తన మరణంతో నైనా నిందితులు మారి మరో ఆడపిల్లను వేధించరని ఆశాభావంతో మరణించిన రిషితేశ్వరి నేరస్తుల పేర్లు వెల్లడించకుండా సంయమనం పాటించింది.  ఇదో సంచలన విషయంగా చేసి వార్తల్లోకి రావడం కోసమే, ప్రచారం పొందడం కోసమే రిజూ బఫ్నా తన సమస్యని పేస్ బుక్ లో పెట్టిందని కొందరు వ్యాఖానిస్తున్నారు.  ఈ రెండు సంఘటనల్లోనూ న్యాయం కోరిన బాధితుల మాటకు విలువ ఇవ్వకపోవడం కాదనలేని వాస్తవం.  విలువ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి ? వాళ్ళు ఆడపిల్లలు కావడమేనా ..? అవును , ఖచ్చితంగా కారణం అదే .  వారిపై లైంగిక హింసకి అదే కారణం. వారిని ఒక అధికారిగాను , తమ తోటి విద్యార్తిగాను లేదా తన దగ్గర చదివే విద్యార్థిగానో చూడలేక పోవడమే. ఆమెలోని స్త్రీత్వాన్ని మాత్రమే చూడడమే. మనువాద సంస్కృతిలో పెరిగిన మనవాళ్ళ దృష్టి స్త్రీలపట్ల ఎలా ఉంటుందో తెలిపే మచ్చుతునకలు ఇవి.  ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ చిత్రంలో నేరస్తుడు, అతనికి సంబంధించిన న్యాయవాదులూ ఇదే దృక్పథంతో మాట్లాడిన విషయం మనకు తెలిసిందే కదా .. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ఇళ్ళలో ఉండే మగవాళ్ళ స్పందన వారికి ఆడవారిపట్ల ఉండే దృష్టి కోణం ఏంటో బాగా తెలుపుతుంది.

ఇక రిజూ విషయానికొద్దాం.   .ఆమె కోర్టును ప్రైవసీ కోరినప్పుడు అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇప్పటి చట్టాల ప్రకారం ఆమె అసలు కోర్టుకు రాకుండా ఆన్లైన్లో కూడా వాంగ్మూలం ఇవ్వవచ్చు.
ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని, జరిగినా ఆడపిల్లలు భయపడకుండా  ధైర్యంగా ఎదుర్కోవాలని , ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రిజూ ముందుకు వెళ్ళడం గర్వించదగ్గ విషయం. అందుకు మనందరం మనకు తోచిన రీతిలో చేయి కలుపుదాం. మన గళం వినిపిద్దాం.

వి. శాంతి ప్రబోధ
(published in Prajathantra Aug 9-15 ’15)

పెళ్లి – పంచాయితీ తీర్పు రద్దు: పడతి పోరాటం

praja july 19 -25 '15నేను బాగా చదువుకోవాలి . టీచర్ అవ్వాలి ‘ 19 ఏళ్ళ  శాంతాదేవి మేఘ్వాల్  కోరిక ఇది.

ఆ పడుచు కోరికలో వింత ఏమి లేదు. అది చాలా సహజంగా కుడా ఉంది.  మరి ఎందుకావిషయం మనం ఇక్కడ ముచ్చటించుకుంటున్నట్లు ..? ఆ విషయం ఆమె మాటల్లోనే చెప్పాలంటే

నాకు పదహారేళ్ళ వయసు వచ్చాక తెలిసింది నాకిప్పటికే పెళ్లి అయిపోయిందని. కానీ ఆ పెళ్లి నాకే మాత్రమూ గుర్తులేదు . ఆ పెళ్లిని నేనెట్లా అంగీకరించాలి .  అందుకే అది రద్దు చేయమని కోరుతున్నా ‘‘ అంటోంది శాంతాదేవి మేఘ్వాల్.
రోహిచ ఖుర్ద్ గ్రామం జోద్ పూర్ జిల్లాలోని చిన్న పల్లెటూరు .  ఆ గ్రామంలోనే శాంతాదేవి మేఘ్వాల్ వాళ్ళు , ఆమె అత్తింటివాళ్ళు ఉండేవాళ్ళు. 

ఉహ తెలియనప్పుడు ,ముద్దు మాటలు రాని,  ఇంకా అడుగులు వేయని సమయంలో అంటే 11 నెలల వయసులో జరిగింది ఆమె పెళ్లి.  ఆమెను పెళ్లి చేసుకున్న వరుడి వయస్సు అప్పుడు  తొమ్మిదేళ్ళు.  ‘నాకు తెలియని తనంలో జరిగిన ఆ పెళ్లిని నేను ఎట్లా గౌరవించను? నా జీవితం పట్ల ఆశలు, కోరికలు నాకున్నాయి. వాటిని సాకారం చేసుకోవాలని కలలు కంటున్నాను. కానీ ఆ కలలు నిజం కావాలంటే నేను పెళ్లి రద్దు చేసుకోవాలి. నాకు ఉహ తెలియనప్పుడు ఏర్పడిన ఆ బంధాన్ని రద్దు చేసుకోవాలంటే, ఆ బంధం నుండి విముక్తం కావాలి‘  అనుకున్నా అంటుంది శాంతాదేవి.  ఆ విషయం కుల పెద్దల ముందుకొచ్చింది. పంచాయితీ పెట్టారు.   పెళ్లి రద్దు కావాలంటే 16 లక్షల రూపాయలు వరుడి తరపు వారికి చెల్లించాలని శాసించింది పంచాయితీ.  పెళ్లి రద్దు చేసినట్లయితే వరుడికి నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఆమెపై వత్తిడి పెంచారు. ఆ విధంగా నైనా ఆమె వివాహబంధంలో ఉంటుందని వారి ఆశ కావచ్చు .   నాకు తెలియని వయస్సులో జరిగిన ఈ పెళ్లికి నేనెందుకు మూల్యం చెల్లించాలి ? అనుకొన్న ఆమె పెళ్లిని  రద్దుచేసుకోవడానికే సిద్దమయింది. నా బాల్య వివాహాన్ని నేను ఎప్పుడయితే ఒప్పుకోలేదో , రద్దు చేయమని కోరడం ఎప్పుడయితే  మొదలు పెట్టానో అప్పటి నుండి నా అత్తింటి వారు రకరకాల ప్రయోగాలు చేశారు. శతవిధాల ప్రయత్నించారు నన్ను తీసుకుపోవడానికి. నా ప్రయత్నాలు ఆపడానికి.   29 ఏళ్ల నా భర్త కాని భర్త నన్నుదూషించడం, భయపెట్టి  బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నించడం చేశాడు. మొదట్లో నేను చాలా భయపడ్డాను. ఆ సమయంలో ఇంట్లో నా తల్లిదండ్రులు కూడా లేరు. కులపంచాయితీ తీర్పుని శిరసావహించక పొతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరింపులు .. దాంతో మా ఇంట్లో వాళ్ళు నన్ను బుజ్జగించే ప్రయత్నాలు .   వారు నాపై తెచ్చే ఒత్తిడి, దాడులు ఎక్కువైన కొద్దీ, నష్టపరిహారం చెల్లించమని బలవంతం చేసిన కొద్దీ ఈ వివాహ బంధం నుండి విముక్తం కావాలన్న కోరిక నాలో మరింత పెరిగిపోతోంది అంటోంది శాంతాదేవి మేఘ్వాల్.

praja july 19-25 '15జోధ్ పూర్ లోని జయ్ నారాయణ్ సిటీ కాలేజ్ లో డిగ్రీ  రెండో సంవత్సరం చదువుతున్న శాంతాదేవి మొదట జోధ్ పూర్ కేంద్రంగా పనిచేసే సారథి ట్రస్ట్ సంస్థ వారిని కలిసింది . బాల్య వివాహాల రద్దు కోసమే పని చేస్తున్న ఆ సంస్థ వారి సహాయం కోరింది.  న్యూయార్క్ లోని ప్రైస్ ఆఫ్ సైలెన్స్ ,  డిల్లీ లోని 16 డిసెంబరు  క్రాంతి, ముంబైలోని  ఫెం పాజిటివ్, ఫెమినిజం ఇండియా వారు శాంతాదేవికి న్యాయం జరగాలని కోరుతూ పిటిషన్ వేశారు. ప్రపంచవ్యాప్తంగా చిత్ర ప్రదర్శన, కాంపెయిన్ మొదలు పెట్టారు.  ఆమెకు అనుకూలంగా  సంఘీభావం కోరుతూ ప్రదర్శనలు చేస్తున్నారు.

ఈ పెళ్లిని,  కుల పెద్దల తీర్పును రద్దు చేయమని కోరుతూశాంతాదేవి  గత మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పిటిషన్ పంపింది. అదే విధంగా కేంద్ర హొమ్ మంత్రి రాజనాథ్ సింగ్ కి , మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనక గాంధీకి , న్యాయ వ్యవహారాల మంత్రి డి .వి . సదానంద గౌడ లకు  కూడా పంపింది. దాంతో ఇదో సంచలన వార్తగా ప్రపంచం దృష్టికి వచ్చింది.

శాంతాదేవి మేఘ్వాల్ పెళ్లి రద్దు చేయడం, అదేవిధంగా ఒప్పందం ప్రకారం ఆమె ఇవ్వాలని చెబుతున్న నష్టపరిహారం రద్దు చేయడం జరిగితే అది ఆమెకు మాత్రమే కాదు అలా ఊహ తెలియని వయసులో జరిగిన పెళ్ళిళ్ళు , ఆ పెళ్ళిళ్ళలో పెద్దలు ఏర్పరచుకున్న ఒప్పందాలు, కుల పంచాయితీలు ఇచ్చే తీర్పులు రద్దవుతాయి.  ఆ పెళ్లిళ్లకు గుర్తింపు లేకుండా పోతుంది. బాలల హక్కులను , మానవ హక్కులను కాపాడినట్లు అవుతుంది. ఆడపిల్లలు తమ కలల తీరం చేరే మార్గం సుగమం అవుతుంది.

2006 బాల్య వివాహాల నిరోధం చట్టం ప్రకారం పెళ్లి వయస్సు ఆడపిల్లకి 18, మగపిల్లవాడికి 21 ఏళ్ళు తప్పని సరి. ఆ వయస్సుకు లోపు పెళ్లి జరిపిస్తే అందుకు కారకులయిన వారికి రెండేళ్ళ జైలు శిక్ష , రెండు లక్షల రూపాయల జురిమానా విధిస్తారు. అయినా అవి ఆగడం లేదు . 2014లో  UNICEF జరిపిన  సర్వే ప్రకారం  మనదేశంలో 47 శాతం పెళ్ళిళ్ళు అమ్మాయికి 18 ఏళ్లలోపే జరుగుతున్నాయి. బాల్య వివాహాలు జరిపే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది అంటే పరిస్థితి ఏమిటో అర్ధమవుతోంది. బాల్యవివాహాలు జరగకుండా ఉండాలంటే ప్రతి పెళ్లి తప్పని సరిగా రిజిస్టరు చేయాలి.  వివాహ వయస్సు ఉంటేనే ఆ పెళ్లి రిజిస్టరు చేస్తారు కాబట్టి బాల్య వివాహాలు జరగవు.  వయస్సు ధృవీకరించే బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ రిజిస్టర్ లో ఉన్న పుట్టిన తేదీని లెక్కలోకి తీసుకోవాలి. రిజిస్టరు అయిన పెళ్ళినే పెళ్ళిగా గుర్తంచాలి. అదే విధంగా పెళ్ళిలో వధూవరుల అంగీకారం తెలిపే పత్రాలు ఉండాలి.  బాల్య వివాహం జరిపించిన పెద్దలకు, హాజరయిన వ్యక్తులకు జురిమానా వేయాలి. శిక్షలు విధించాలి. చేసుకున్న చట్టాల్ని అమలు చేయాలనీ,  బాల్య వివాహాల్ని నిరోధించాలనీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ప్రజలలో ఆ మార్పు తేవడం అంత కష్టసాధ్యం కానే కాదు. 
అది జరిగిన నాడు ఆడపిల్లల, మహిళల ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు కళ్ళు తెరిచి చూస్తే, పరిస్తితి చక్కదిద్దితే ..శాంతాదేవి లాంటి వారి కష్టాలు కడతేరతాయి.  ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొంటూన్నా ధైర్యంగా ముందుకొచ్చిన శాంతాదేవిలాంటి  వారికి విజయం అందాలని కోరుకుందాం .
published  in Prajathanthra weekly July 19 -25, 2015
 
 

వి. శాంతి ప్రబోధ

నాకెంత తృప్తిగా ఉందో ..  

   

praja jan 25 - 31సాలేహా నేనూ ఇద్దరం పదవతరగతి పరీక్షలు రాశాం.  ఇంటరు చదవాలని అనుకున్నాం. సాలేహ ఎప్పుడు క్లాసులో ఫస్టు వచ్చేది. నాకేమో ఎప్పుడూ అత్తెసరు మార్కులే. తను చదవడంలోనే కాదు మా పిల్ల సంఘం మీటింగుల్లో బాగా మాట్లేది. ఏది చెప్పినా పండు వొలిచి తినమని ఇచ్చినట్లుగా ఉండేది. తను చాలా ఆక్టివ్ కదా అందుకే ఆమెను ఇష్టపడేవారు.

అలాంటి సాలేహ ఈ మధ్య మా సంఘం కార్యక్రమాలకి రావడంలేదు. వాళ్ళ తమ్ముడిని అడిగితే ఏమో .. అని సమాధానమిచ్చాడు. వాళ్ళిల్లు మా ఇంటికి దూరమే అయినా నేనే వాళ్ళింటికి వెళ్ళా. వాళ్ళింటికి సున్నం వేసి కొత్తగా కనిపిస్తోంది. వాళ్ళమ్మ మిషనుపై బట్టలు కుడుతోంది. సబీనా చేత్తో ఏదో కుడుతోంది. అంతా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. తమ పనులు చేసుకుంటూ నేను అక్కడ ఉన్నంత సేపూ సాలేహ అక్క సబీనా , చెల్లెళ్ళు సురయా , సలీమా మాతో పాటే ఉన్నారు. ఒక్క క్షణం కుడా కదలలేదు. వాళ్ళమ్మ ఏదో సైగ చేసింది.  నాతో ఆ ఇంట్లో వాళ్ళెవరు ఇదివరకటిలా ఆప్యాయంగా మాట్లాడలేదు. ఎందుకువచ్చానా అన్నట్లుంది వాళ్ళమ్మ చూపు.  సాలేహ కూడా పోడిపోడిగానే మాట్లాడుతోంది. సరైన సమాధానం లేదు. వాళ్ళక్క పెళ్లి కుదిరింది కావచ్చు . ఆ పనుల్లో ఉన్నట్లున్నారని అందుకే సాలేహ రావడం లేదని అనుకున్నా. ఈ సమయంలో వచ్చి తప్పు చేశానా అనిపించింది.   మంచి ఎండలో వచ్చానేమో దాహంగా ఉంది. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది సాలేహ. గ్లాసు నా చేతిలోంచి తీసుకుంటూ చిన్న చిట్టి నా చేతిలో పెట్టింది . ఎవరి కంట పడకుండా .

ఇంటికి రాగానే విప్పి చూసి మానైపోయాను . సాలేహ కి పెళ్లట . అతని వయస్సు 35 పైనేనట. సాలేహ వయసున్న కొడుకు , అంతకంటే కొంచెం చిన్నగా ఒక కొడుకు ఉన్నారట. అతని భార్య తో అతనికి కోర్టు కేసు నడుస్తోందట. సలేహనిచ్చి పెళ్లి చేస్తే కట్నం వాడు ఎం వద్దు  ఎదురు నలబై వేలు ఇస్తామన్నారట.  ఆ పైసలతో సాలేహ అక్క పెళ్లి చేయాలనుకున్టున్నారట. మరో ఐదు రోజుల్లో పెళ్లి.

సాలేహ ఇస్తా ఇస్తాలతో ఏమాత్రం పనిలేకుండా జరగబోతున్న పెళ్లి .. ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఇలాంటి సమయాల్లో సలేహనే చక్కటి నిర్ణయాలు తీసుకునేది. ఇప్పుడు తనదే సమస్య  ఎలా .. అలోచించి వెంటనే ఆ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎం చేయాలో నిర్ణయం చేసుకున్నాం. మా పేర్లు బయటికి తెలిస్తే మాకు ఇంట్లోనూ , ఊళ్లోనూ ఇబ్బంది అవుతుందేమో నాన్న భయం .. అట్లా కాకుండా ఉండాలంటే ఎట్లా అని చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.  మేం అంతరం ఎవరికీ వరం మా MRO, S.I, జిల్లా కలెక్టర్ ఫోన్ నంబర్లు సేకరించాం. వారికి,1098 లకు ఫోన్ చేసి విషయం చెప్పాం. మా పేర్లు బయటకి రావద్దని , పెళ్లి ఎట్లాగయినా ఆపమని కోరాం.

మాలో ఉత్కంట ఏమవుతుందోనని. వాళ్ళింటికి వెళ్ళాలంటే ఏదో జంకు . వాళ్లకి మా మిద అనుమానం వస్తుందేమో నని. అలా ఒక రోజు గడిచి పోయింది. పెళ్లి ఎల్లుండి అనగా అప్పుడు వచ్చాయి మా ఊళ్ళోకి జీప్ లు.

బాల్య వివాహం గురించి ఆరా తీశారు. అలాంటిది ఏమీ లేదని చెప్పారు ఊళ్లో వాళ్ళు. ఖాసిం ఇల్లు అడిగి తెలుసుకుని వెళ్తుంటే మాకు అర్ధమయి పోయింది . అయినా ఏమి ఎరగనట్లే ఉన్నాం. వచ్చిన వాళ్ళకి అక్కడి వాతావరణం చూస్తే పరిస్థితి అర్ధమయినట్లుంది.  కానీ , ఆ ఇంట్లో వాళ్ళు పెళ్లి సబీనా కి ఆమెకి 18 ఏళ్లున్నాయి అన్నారు. సాలేహ ఎవరంటే తనేనని చెప్పింది సాలేహ.  ఆమెతో వాళ్ళ అక్కతో విడివిడిగా మాట్లాడారు. సబీనా పెళ్ళికి తాము అడ్డు చెప్పమని సాలేహ పెళ్లి జరిగితే మాత్రం కేసు అవుతుందని , జైలుకి  వెళ్ళాల్సి వస్తుందని, రేషన్ , కరెంట్ అన్నీ బందు అని బెదిరించారు.  అబ్బాయి వివరాలు అడిగారు. చివరికి వాళ్ళ నాన్న సలేహని చదివిస్తామని చెప్పారు.   చాలా గోప్యంగా ఉంచిన విషయం ఊళ్లో ఎవరికీ తెలియకుండా సర్కరోల్లకు ఎట్లా తెలిసిందో వాళ్ళకి అర్ధం కాలేదు.  మేమూ చెప్పలేదు.

నాకు చాలా తృప్తిగా అనిపించింది సాలేహా పెళ్లి ఆపినందుకు. తను నాతో పాటు కాలేజికి వస్తున్నందుకు.

లలిత

కొత్తపల్లి 

జనవరి 25 – 31, 2015 ప్రజాతంత్ర లో ప్రచురణ

భాగ్య – రేఖ

pajatantra 1తమ్ముడిని కొనుక్కొచ్చిన అమ్మ
అమ్మకి అప్పుడప్పుడు కడుపు నెప్పి వచ్చేది. సర్కారు దవాఖానకు పోయి మందులు తెచ్చుకునేది.  ఒక రోజు అమ్మ దవాఖానా నుంచి వచ్చేటప్పుడు చంకలో చిన్నబాబుని తెచ్చింది. ఎవరు అంటే తమ్ముడు అని చెప్పింది. ఎక్కడ తెచ్చావంటే కొనుక్కోచ్చానని చెప్పింది.  మా ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఆ తమ్ముడికి పాలపొడి డబ్బాలు కొనుక్కొచ్చి ఆ డబ్బా పాలు పట్టేది.  కాళ్ళకున్న కడియాలు, మెడలో హారం అమ్మి ఆ పైసలు ఇచ్చి ఈ తమ్ముడిని కొనుక్కొచ్చింది.

మా నాన్నకి మా అమ్మ పెద్ద భార్య. మా అమ్మకి నేను చెల్లి పుట్టిన తర్వాత ఒక తమ్ముడు పుట్టుకలోనే చనిపోయాడట.  ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్ళ పుట్టారు. ఒక చెల్లి పుట్టగానే చనిపోయిందని ఇంటికి తేలేదు. ఇంకో చెల్లిని దవఖానలోనే అమ్మేసింది నాన్నమ్మ.

నారుపోసే కొడుకు లేదట. అందుకనే మానాన్న మళ్ళీ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అయినా కొడుకు పుట్టలేదు. అందరూ ఆడపిల్లలే .  అందుకే అమ్మ కొడుకుని కొనుక్కొచ్చింది.  తమ్ముడు వచ్చినప్పటి నుండి ఏమున్నా దాచిపెట్టి తమ్ముడికి పెడుతుంది. వాడంటే నాకూ ఇష్టమే .  కానీ , ఒక్కోసారి చెల్లివాడిని  కొడ్తుంది.  అమ్మ ఏది తెచ్చినా మాకుపెట్టినా పెట్టకున్నా వాడికి పెడుతుంది కదా అందుకని.  అమ్మా నాన్నలకు మా కంటే వాడి మీదనే ప్రేమ ఎక్కువయిపోయింది .  అమ్మ పనికి పోతుంది కదా .. వాడిని చూసుకోవడానికి నన్ను బడి మానిపించారు. వాడు అంగన్వాడికి పొయిన తర్వాత నేను మళ్ళీ బడికి పోతానని ఏడిస్తే సరేనని కస్తూరిబా బడిలో వేశారు.  నా తోటివాళ్ళంతా 9, 10 తరగతుల్లో ఉంటే నేను ఆరో తరగతిలో ఉన్నా.

తమ్ముడు వచ్చినంక నాన్న అమ్మని మంచిగా చూసుకుంటున్నాడు. కొట్టడం లేదు. తిట్టడం లేదు. సొమ్ములు పోయినా  తమ్ముడోచ్చాక నాన్న తనతో మంచిగా ఉంటున్నాడని అమ్మ సంతోషపడింది.
కానీ .. నాకు అర్ధం కానిదోకటే .. అదేంటంటే .. మేమింతమంది బిడ్డలం ఉన్నాం కదా .. మా అందరి కంటే ఎక్కువగా ఎవరో కన్న కొడుకుని ప్రేమగా చూసుకుంటున్నారెందుకని ? మా అమ్మకు పుట్టిన నా చెల్లెళ్ళు ఇద్దరు , మా చిన్నమ్మ కు పుట్టిన బిడ్డ ఇంటికే రాలేదు. కారణం ఆడపిల్లలు కావడం వల్లేగా ..?! కన్న పిల్లల కంటే మగపిల్లవాడు ఎక్కువా .. ? ఎందుకు?

యమున
గుర్జాల్ తండా

10.

  
భాగ్య – రేఖ
భాగ్య నేను చిన్నప్పటి నుంచి దోస్తులమే. వాళ్ళిల్లు మా ఇల్లు దగ్గర దగ్గరే . ఆమె తమ్ముళ్ళని పట్టుకొని కొన్ని రోజులు బడి మానేసింది. ఆ తర్వాత ఆమెని ఎవరో సార్లు వచ్చి తీసుకెళ్ళి RSTC లో చేర్చారు. అక్కడి నుండి భాగ్య మా బడిలో చేరింది. నా తరగతిలోనే వేశారు. మేము నాలుగో తరగతి అయి ఐదో తరగతిలోకి వచ్చాం.  అప్పటికి భాగ్యకి 12 ఏళ్ళు ఉండొచ్చు. నీ కంటే రెండు మూడేళ్ళు పెద్దది దాని సోపతి ఏంటి అనేది  అమ్మ.

ఒక రోజు మంచి సంబంధం వచ్చిందని ఆమెకి పెళ్లి చేసేసారు.  నేను చదువుకుంటా పెళ్లి వద్దు అని ఏడ్చి చాలా గొడవ చేసింది. అయినా ఆమె మాట ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి ఎట్లాగయినా ఆపమని బడిలో మా టీచర్ కి చెబుదామనుకుందట. కానీ ఆ అవకాశమే లేకుండా గుట్టు చప్పుడు కాకుండా వేములవాడకు తీసుకుపోయి పెళ్లి చేసుకొని తీసుకోచ్చారు.  పెళ్లి చేసుకుని వచ్చేవరకూ మా కెవరికి ఆ విషయం తెలియనే తెలియదు.  ఇంతకీ ఆమె భర్త వయసు ఎంతో తెల్సా 30 ఏళ్ళు.

పెళ్ళయి ఏడెనిమిది నెలలు గడిచాయో లేదో భర్త వేధింపులు మొదలయ్యాయి.  అత్తమామలు కొడుకునే కోప్పడేవారట.  కానీ భాగ్యతో అతను సరిగ్గా ఉండేవాడు కాదు. నువ్వు అందంగా లేవు . నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఏమో .. చామంతి లాంటి అమ్మాయి కావాలనుకున్నా . ఎండిపోయిన కట్టెపుల్లలాగా ఉన్నావు అంటూ రోజూ బాధ పెట్టేవాడని, బాగా తాగి వచ్చి ఆమె బట్టలిప్పి అతనికి ఆనందం వచ్చేవరకూ బీడీ కాల్చిఒళ్లంతా  చురకలు పెట్టేవాడట.

బతుకమ్మ పండుగకి తమ ఇంటికి తీసుకుపోడానికి వెళ్ళిన భాగ్య అన్న చెల్లెను చూసి ఏడ్చేశాడు. ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె ఇక్కడ ఉండగానే ఆమె భర్త విడాకుల నోటీసు పంపాడు. భర్తకి సుఖం ఇవ్వని భార్య తనకి వద్దని అందులో రాశాడట. తన పరిస్థితి ఏమిటో అర్ధం కాని భాగ్య చనిపోదామని నిర్ణయించుకుంది.  ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటే  భాగ్యని పక్కింటి వాళ్ళు కాపాడారు.

మా అమ్మా నాన్నా ఎంత వత్తిడి చేసినా నేనయితే చిన్నప్పుడే పెళ్లిచెసుకోను. భాగ్యని చూస్తే ఏడుపోచ్చేది నాకు. తను అదివరకటి లాగా గలగలా మాట్లాడడం లేదు. తనని ఎట్లా నవ్వించాలొ నాకు తెలియదు. నా ఐదో తరగతి అయ్యేసరికి భాగ్య జీవితంలో ఏమేమో జరిగి పోయాయి.
ఇప్పుడు ఆమె వంటి మీద మచ్చలు నెమ్మదిగా మానుతున్నాయి. కానీ , మనసుకి అయిన గాయం ఇంకానే పచ్చిగానే ఉంది అంటుంది పక్కింటి ఆంటి. అది మానాలంటే నువ్వు మళ్ళీ బడికి పోవలసిందే అని భాగ్యకి నచ్చచెప్పింది కూడా.  భాగ్య వాళ్ళింట్లో వాళ్ళు మొదట్లో ఒప్పుకోకున్నా తర్వాత  అందుకు ఒప్పుకున్నారు.  వచ్చే ఏడాది ఆమెను కస్తూరిబా బడిలో వేస్తారట. అది తెలిసి నాకు చాల సంతోషం అయింది.

రేఖ
కొల్లూరు

నేనూ .. నా రేడియో కార్యక్రమం

praja jan11-17ఎప్పటికైనా మా వాళ్ళని కలుస్తానా ..?

నాకు ఐదుగురు అక్కలు . ఒక అన్న. నేను అందరి కంటే చిన్నదాన్ని.  నేను పుట్టిన కొన్ని రోజులకే అమ్మ కోమ్లి  చచ్చిపోయింది. మా నాన్న పనికిపోయి వచ్చేటప్పుడు బాగా తాగి వస్తాడు.

అమ్మ లేదు కదా .. అందుకని  మా పెద్దక్క విజ్జక్కే నన్ను పెంచింది. అమ్మలాగా సాకింది.  తర్వాత మా పెద్దక్కకి పెళ్లి అయిపొయింది. నన్ను చూసుకోడానికి అక్క లేదుగా .. నన్ను అమ్మేస్తానని అన్నాడట మా నాన్న.  మా అక్క ఒప్పుకోలేదు. తనతో తీసుకుపోతానంది. కానీ మా బావ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదట. మా రెండో అక్కే నన్ను చూసుకుండేది. అంతలో మా రెండో అక్క పెళ్లి కూడా అయింది.  తను మా తండాలోనే ఉండేది.

మా రెండో అక్క పెళ్లి అయ్యేప్పటికి మా నాన్నకి చాలా అప్పులయ్యాయి.  అప్పులు తీర్చమని అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చేవాళ్ళు.  మా నాన్నకి మళ్ళీ నన్ను అమ్మేయ్యాలన్న బుద్ది  పుట్టింది.  అమ్మేస్తానని ఎవరికో బేరం కుదుర్చుకున్నాడు.  వాళ్ళ దగ్గర కొన్ని పైసలు తీసుకున్నాడు.  ఆ విషయం మా రెండో అక్కకి తెలిసింది.  పెద్దక్కకి కబురు పెట్టింది.  ఇద్దరు అక్కలూ వచ్చి నాన్నతో గొడవ పెట్టుకున్నారు. నాన్న వినలేదు. వాళ్ళనే తిట్టాడు. వాళ్ళు ఏడ్చారు. బతిమలాడారు. అయినా మా నాన్న వినలేదు.  అంతా నేను చూస్తూనే ఉన్నాను. అక్క వాళ్ళు ఏడుస్తాంటే నేనూ అన్న ఇద్దరు చిన్నక్కలు ఏడ్చేసాం.

రెండో అక్కకి కొంచెము  కోపం ఎక్కువ కదా .. వెంటనే నాన్న మీదికి రోకలి బండ తీసుకొని లేచింది.  చెల్లెళ్ళను అమ్మినవా..  ఇగో నిన్నిక్కడే చంపి నేను పోలీసులకు లొంగిపోతా అని అన్నది. పెద్దక్క అట్లా ఎందుకు గానీ నాన్ననే పోలీసులకు పట్టిస్తం అన్నది.

తర్వాత రెండు రోజులకే మా రెండో అక్క బావ వచ్చి నన్ను తీస్కపోయి అనాధాశ్రమంలో చేర్చారు.  నేను అనాధాశ్రమంలో చేరేటప్పటికి నాకు మా భాష అంటే లంబాడి భాష తప్ప ఏమి రాదు.  ఎవరితో మాట్లాడే దాన్నే కాదు. ఎవరేమన్నా నవ్వేదాన్ని అంతే .  మా అక్కల దగ్గర గారాబంగా పెరిగాను కదా .. ఇక్కడ వాళ్ళు కూడా నన్ను ముద్దు చేసేవారు. అందరి కన్నా చిన్న దాన్ని కదా .. కానీ , నాకేమో మా అక్కలు , అన్న, నాన్న , మా తండాలో  అందరూ గుర్తోచ్చేవారు.   వాళ్ళు పెట్టె తిండి తినబుద్ది అయ్యేది కాదు.  మా ఇంటికాడ రొట్టెలు తింటే ఇక్కడేమో తెల్లన్నం పెడతారు.  మా అక్క ఉడుకుడుకు నీళ్ళు కాసి స్నానం చేపిచ్చేది.  ఇక్కడేమో నాకు నేనే చల్లటి చన్నీళ్ళు చెయ్యాలంటే గజ్జ గజ్జ ఒణుకు వొచ్చేది.  నేను మా ఇంటి కాడ ఎప్పుడూ బట్టలుతుక్కోలేదు. ఇక్కడ నా బట్టలు నేనే ఉతుక్కోవాలి కదా .. పెద్ద అక్కలు అప్పుడప్పుడూ ఉతికి పెట్టేవారు.

నేను అనాదాశ్రమానికి వచ్చినప్పుడు నాకు ఆరేళ్ళు ఉంటాయేమో. అప్పటికి నేను ఎప్పుడన్నా మా తండాలో ఉన్న అంగన్వాడి బడికి పోయేదాన్ని. లేకపోతే లేదు. ఇప్పటికి నేనొచ్చి ఎనిమిదేళ్ళు దాటింది. ఒక్క సారి కూడా మా వాళ్ళు నన్ను చూడడానికి రాలేదు.  ఒక్కసారో రెండు సార్లో మా పెద్దక్క ఫోన్ చేసింది. అంతే . ఆమె మా భాషలో మాట్లాడితే  నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుకే ఎక్కువ మాట్లాడ లేదు.  అప్పటి నుండి ఇప్పటి వరకూ మళ్ళీ పోన్ చెయ్యలేదు.  అప్పుడయితే వాళ్ళంతా గుర్తొచ్చి ఏడ్పు  వచ్చేది.  ఇప్పుడు రాదు. కానీ , వాళ్ళు అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటారు.

నాకిక్కడ బాగానే అలవాటయింది. నిజానికి మా ఇంటికాడ కంటే ఇక్కడే బాగుంది కూడా . కానీ ఎప్పుడన్నా సెలవులు వస్తాయి కదా .. దసరాకి, సంకురాత్రి కి, ఎండాకాలం  అప్పుడు మా దోస్తులని తీసుకుపోవడానికి వాళ్ళ చుట్టాలు వస్తారు.  వాళ్ళని తమతో తీసుకు పోతారు. కొన్ని రోజులుంచుకుని పంపుతారు. మధ్యలో కూడా ఎప్పుడన్నా చూడడానికి వస్తారు. వచ్చేటప్పుడు ఎవన్నా తెస్తారు. వాళ్లకి అమ్మా నాన్నా లేకున్నా వాళ్ళకి ఎవరన్నా వస్తారు. నాకు నాన్న ఉండీ రాడు. ఇంకా కొందరికి కుడా ఎవరూ రారు. మా నాన్నకి నేనొక్కదాన్నే ఎక్కువయ్యానా .. అని నాన్న మీద కోపం వస్తుంది. అవసరం లేనప్పుడు ఎందుకు పుట్టించాడు అని తిట్టుకుంటాను.  సెలవులిచ్చినప్పుడు  మేమే ఉంటాం కదా .. ఎవరన్నా వచ్చి నన్నూ తీసుకుపోతారేమోనని ఆశగా చూస్తూ ఉంటా.. ఎవరూ రారు కదా..  అప్పుడు చాలా ఏడుపు వస్తుంది.  అన్నం తినబుద్దికాదు.  బాదం చెట్టు కింద కూచుని ఆ చెట్టుతో మాట్లాడుకుంటా.  ఆ చెట్టు నన్ను నవ్వించడానికి బాదం కాయలు రాలుస్తుంది. వాటిని ఏరుకుని పగలగొట్టి పలుకు తింటా .

ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. నేను ఆడపిల్లను కావడం వల్లే మా నాన్న నన్ను వదిలేశాడని. మా చిన్న అక్కల్ని ఉంచాడో .. అమ్మేశాడో .. లేకపోతె నాలాగా ఏ అనాధాశ్రమంలోనో చేర్చాడో .. అనుకుంటూ ఉంటా .. మా అమ్మ ఉంటే ఇట్లా జరిగేది కాదేమో .. ఏది ఏమైనా నేను బాగా చదివి మా వాళ్ళను కలవగలనేమో ..

విష్ణుబాయి

లింగి తాండ

8.

 నేనూ .. నా రేడియో కార్యక్రమం

నాకు మొదట్లో ఏమీ తెలిసేది కాదు. బడి నుంచి వచ్చాక ఇంట్లో అమ్మ వెనుక తిరగడం , అక్కతో పాటు కూర్చొని టివి సీరియళ్ళు చూడడం చేసేదాన్ని.  ఒక రోజు మా ఫ్రెండ్ ఊరికే  ఇంట్లో కూర్చుంటావు ఎందుకు .. ? నువ్వూ మా బాలసేవాసంఘంలో చేరొచ్చు కదా అంది.  వాళ్ళ సంఘం గురించి, వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి బడిలో ఉన్నప్పుడు  అప్పుడప్పుడు మాతో చెప్పేది.  తను చాలా ఉషారుగా ఉండేది. స్కూల్ లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది. ఎవరితో మాట్లాడాలన్నా భయపడేది కాదు. తనే కాదు వాళ్ళ సంఘంలో పిల్లలంతా అంతే  చాలా చురకుగా ఉండేవారు.  వాళ్ళని చూస్తే నాకూ అలాగే ఉంటే బాగుండు అనిపించేది.  ఇప్పుడు తనే అంది కదా వాళ్ళ సంఘంలో చేరమని .. వెళ్తే .. ఆలోచించా .  మా ఫ్రెండ్ సునీత ఉండేది ఎస్ సి కాలనీలో.  వాళ్ళ సంఘం కార్యక్రమాలు జరిగేదీ అక్కడే.  అక్కడికి వెళ్తానంటే ఇంట్లో ఏమంటారో నన్న భయం. అసలే మా అమ్మకి పట్టింపులు ఎక్కువ. అని కొంత కాలం గడిపేసా.  ఒక ఆదివారం తెగించి మా పక్కింట్లోనే ఉండే మరో మిత్రురాలితో కలసి సునీత వాళ్ళింటికి వెళ్ళా.  మేం వెళ్లేసరికి ఆ కాలనీ పిల్లలంతా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు.  మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు వాళ్ళు. అంత మా బడి పిల్లలే కదా .. అక్కడ వాళ్ళు మాట్లాడే విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పెద్ద వాళ్ళలాగా గ్రామంలో వాళ్ళకున్న సమస్యల గురించి, బడిలో సమస్యల గురించి పెద్ద వాళ్ళలాగా మాట్లాడేస్తున్నారు .  గత  నెలలో వారెం పనులు చేశారో చెప్పి అప్పుడు వచ్చిన ఇబ్బందుల్ని చెప్తూ వాటిని ఎలా ఎదుర్కొన్నారో పరిష్కరించుకున్నారో కూడా చెప్పారు కమిటీల వారిగా. అదే విధంగా ఆ నెలలో ఏమి చేయ్యలనుకుంటున్నారో నిర్ణయించుకున్నారు. ఎలా చేయాలో చర్చించుకున్నారు.  వాళ్ళంతా మాకు రోజూ బడిలో కనిపించే వాళ్ళే . కానీ అప్పుడక్కడ వాళ్ళు చాలా కొత్తగా మరో లోకం నుంచి వచ్చిన వాళ్ళలాగా …

క్లాసులో నేనే ఫస్ట్ రాంకర్ ని నాకు కొంచెం గర్వం.  వీళ్ళు కాలని వాసులు అని కొంచెం చిన్న చూపు ఉండేవి నాలో. కానీ , నా కన్నా వీళ్ళకు చాలా తెలుసు. చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు అని అప్పుడే అర్ధమయింది అందుకే నా అభిప్రాయం మార్చుకున్నా.

ఆ రోజు మీటింగ్ అయ్యాక రేడియో కార్యక్రమం కోసం స్క్రిప్ట్ తాయారు చేసుకున్నారు కొందరు . కొందరు తాము తాయారు చేసుకున్న వాటిని ప్రాక్టీసు చేస్తున్నారు.

నేను ఎప్పుడన్నా రేడియో వినేదాన్ని. కానీ రేడియో లో మాట్లాడ్డం గురించో .. అందులో తమ గొంతు వినిపించడం గురించో ఎప్పుడూ ఆలొచించనైనా ఆలోచించలేదు.  కానీ వీళ్ళు ఆ ఆలోచన చేశారు. రేడియో ద్వారా తమ గొంతుని ప్రపంచానికి వినిపించడానికి తయారవుతున్నారు అదీ పిల్లలకు సంబంధించిన వివిధ విషయాలపై .  వాళ్ళ పని చాలా గొప్పగా అనిపించింది.  నేను పాటలు బాగా పాడతానని అంతా అంటూ ఉంటారు.  నా గొంతు నా పాట రేడియోలో వినాలంటే .. ఆ ఊహే నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. అందుకే వాళ్లనడిగా నేనూ ఒక పాత పాడవచ్చా అని.

మా సంఘంలో చేరితే మా సభ్యురాలిగా నీకూ అవకాశం ఉంటుంది అని చెప్పారు వాళ్ళు.  సభ్యత్వం కింద ఏడాదికి 20 రూపాయలు కట్టాలి అన్నారు.  అమ్మ నడిగితే ఏమంటుందో .. భయం .. వాళ్ళ దగ్గరకి వెళ్ళానని తెలిస్తే మళ్లీ  రానివ్వదేమోననే సందేహం అమ్మకి ఈ విషయం చెప్పనివ్వలేదు. అక్కతో చెప్పాను ఏమన్నా సలహా ఇస్తుందేమోనని . తను ఏమి మాట్లాడకుండా ఆ విషయం అన్నకు చెప్దాం అంది.

ఆ కాలనీలో పిల్లలు ఎంత ధైర్యంగా ఉన్నారు. సర్పంచ్ దగ్గరకి, పోలీసుల దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినా భయపడరు. నేను అమ్మా నాన్నల  దగ్గర నా విషయం భయపడుతున్నానెందుకు ? నేనేమీ తప్పు చెయ్యడం లేదు కదా .. అని నాకు నేనే ధైర్యం తెచ్చుకుని నాన్నకి చెప్పా .. 20 రూపాయలు కావాలని అడిగా. అది విన్న అమ్మ ఆడపిల్ల ఆ తిరుగుళ్ళు ఏమిటని కేకలేసింది.  చదువుని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని నాన్న డబ్బులిచ్చారు.  అవి తీసుకెళ్ళి వాళ్లకిచ్చాను.  ఆ తర్వాత వారంలో మా కార్యక్రమం రికార్డ్ చేశారు. ఆ తర్వాతి వారం రేడియో లో వచ్చింది.  మా ఇంట్లో రేడియో పని చెయ్యడం లేదు. మా అన్న మా నాన్నవాడే  సెల్ ఫోన్ తీసుకుని దాని ఇయర్ ఫోన్ చెట్టుపై వేసి నిజామాబాద్ రేడియో వచ్చేలా పెట్టాడు. మా ఇంట్లో వాళ్మే కాకుండా , మా చుట్టుపక్కల వాళ్ళు అంతా మా రేడియో కార్యక్రమం విన్నారు. నా గొంతు రేడియో వినడం నాకెంత గొప్పగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.  మా వాళ్ళంతా అందరూ నా గొంతు రేడియోలో చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. అప్పుడు నాకు ఏదో ఘనకార్యం చేసి ఏదో సాధించేసినంత సంతోషం కలిగింది.

నేను ఆడపిల్లను కదా అని ఊరుకుంటే నాకీ ఆనందం దక్కేదా ..?  ఇకనుండీ ఎవరేమి అంటారో అని  వెనుకాడుతూ అవకాశాల్ని వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నా.

కళ్యాణి

చీలపల్లి
(జనవరి 11 -17, 2015 ప్రచురణ )

Tag Cloud

%d bloggers like this: