The greatest WordPress.com site in all the land!

 

“సంఘం రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే .. 

అందరూ బాగున్నరా? ఏం జేస్తున్నరు? 

పొద్దుబోయింది. పొద్దంతా చేన్లల్ల పనులన్నీ ముగించుకొని ఇంటికొచ్చిన్రు గదా .. పిల్లలను జ్యూసుకుంటా, రొట్టె కూర జేసుకుంట సంగం రేడియో తట్టు ఒక చెవి పెట్టుకుంటే మంచిగుంటదని కోరుతున్న”  

ఆత్మవిశ్వాసం, ఆత్మీయత తొణికిసలాడుతుండగా తీయని కంఠంతో శ్రోతలను పలకరిస్తుంది ఆ స్వరం. 

ఆసియాలోనే తొలి మహిళా రేడియో స్టేషన్, దేశంలో మొదటి గ్రామీణ కమ్యూనిటీ రేడియో నడుపుతున్న వారిలో ఒకరు. 

2008, అక్టోబర్ 15 తేదీన తన గళం కమ్యూనిటీ రేడియోలో వినిపించిన మొదటి వ్యక్తి ఆమె. 

పదవ తరగతి మాత్రమే చదివిన ఆమె రేడియో ప్రసారాలు చేస్తుంది . ఎడిటింగ్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ చేస్తుంది. అవుట్ డోర్ ఇండోర్ రికార్డింగ్ చేస్తుంది. గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తుంది. ఆక్టివిటీ లాగ్ చేస్తుంది. రేడియో జాకీగా, యాంకర్ గా  వ్యవహరిస్తుంది. . 

సమాజపుటంచుల్లోకి నెట్టివేయబడిన ఈ గ్రామీణ మహిళ “అవుట్ స్టాండింగ్ వర్క్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (విధి కి మించిన విశేష కృషి)” అవార్డు అందుకోవడం విశేషం.  

ఆమెనే అందరూ జనరల్ అని పిలిచే జనరల్ నర్సమ్మ జహీరాబాద్ జిల్లా పస్తాపూర్ నివాసి. పదేళ్లు నిండిన తర్వాత దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నడిపిన నాన్ ఫార్మల్ స్కూల్ పచ్చ బడి లో చేరి పదో తరగతి పాసయ్యింది.  కూలీపనులకు వెళ్తూనే చిన్నప్పటి నుంచి రేడియో నారో కాస్ట్ చేసేది. 

“మీ రేడియో లో మాకు జాగా ఉండదు. ఇచ్చినా చాలా చాలా కొద్దిగా ఇవ్వగలరు. మా రేడియో మాకుంటే మా మాట, మా పాట, మా ముచ్చట, మా వంటలు, మా తిండి, మా తిప్పలు.. అన్నీ మావి మేమే  చెప్పుకుంటాం. అందుకే అనుమతుల కోసం పెద్ద యుద్ధమే చేసి  సాధించుకున్నాం” అని ఒకింత గర్వంగా చెబుతుంది ఆమె.  

డిడిఎస్ సహకారంతో నిర్మించుకున్న సంఘం రేడియో స్టేషన్ లో ట్రాన్స్మిషన్ పని చేయమన్నప్పుడు భయపడింది. అమ్మో, నేనేం చేయగలను అని అనుమానపడింది. సంస్థ కొంత శిక్షణ ఇచ్చింది. ధైర్యంగా ముందుకు సాగింది. 

150 గ్రామాలకు పరిచయమై స్థానిక పలుకుబడులు, సామెతలతో వినసొంపుగా ఉండే భాషతో, కమ్మటి స్వరంతో  శ్రోతలకు దగ్గరైంది. 

ఏ చెట్లకిందో కూర్చుని ముచ్చట పెడుతున్న పెద్దల దగ్గరకి పోయి వాళ్ళతో ముచ్చట పెడుతుంది. చర్చలు చేస్తుంది. పాటలు పాడిస్తుంది. కథలు చెప్పిస్తుంది. ఏది చేసినా అందుకోసం రిహార్సల్ ఉండదు. ఆయా ముచ్చట్లు , చర్చల ద్వారా వాళ్ళ అనుభవసారాన్ని టేపుల్లో నిక్షిప్తం చేస్తుంది. 

జనరల్ కి భాష పట్ల మక్కువ ఎక్కువ. తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ పదాలతో ఉండే తమ వాడుక భాష నుంచి ఎన్నో పదాలు అంతరించిపోవడం గురించి బెంగ పడుతుంది. వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. పదిల పరుచుకునే మార్గాలు అన్వేషిస్తుంది. అందులో భాగంగానే రేడియో ద్వారా ప్రతి రోజు ఒక కొత్త పదం పరిచయం చేస్తుంది. 

 బుడగ జంగాలు చెప్పే కథల్లో తమ భాష పదాలు సజీవంగా ఉన్నాయని సంతోష పడుతుంది.  వాళ్ళ మాటలను, పెద్ద వయసు వారి మాటలను రికార్డ్ చేసినప్పుడు వారి మాటల్లో దొర్లిన పదాల్లో తనకు కొత్తగా అనిపించిన వాటిని ఏరుకుంటుంది. రేడియో ద్వారా తిరిగి జనంలోకి తీసుకొస్తుంది.  అలా చేయడంలో తనకి ఆసక్తి మాత్రమే కాదు తృప్తి కూడా ఉంది అంటుంది జనరల్. 

కనుమరుగై పోతున్న పండుగలు, వ్యవసాయ విధానాలు, జానపదుల పాటలు, కథలు, వైద్యం వంటి వాటిని నిలుపుకోవడం తో పాటు మందులు లేని వ్యవసాయం,  ఆడవాళ్ళ సమస్యలు, పిల్లల చదువు, ఆరోగ్యం , ఎన్నో విషయాలను జనం నుంచి తీసుకుని జనంలోకి తీసుకుపోతుంటుంది జనం మనిషి జనరల్. ఆమె చేసే “యారాళ్ల ముచ్చట్లు”  మహిళా శ్రోతలకు మరింత ఇష్టం. 

ఆకాశంలో పిట్టలాగా ఎగిరే విమానాన్ని అబ్భురంతో చూడడమే గాని ఎక్కగలననని కలలో కూడా అనుకోని ఆమె విమానం ఎక్కి శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వెళ్లింది. 

నాకు రేడియో సంతోషాన్నిచ్చింది . గౌరవాన్నిచ్చింది అంటుంది జనరల్ నర్సమ్మ.  

భార్య భర్త మధ్య ఉండాల్సింది ఎక్కువ తక్కువ కాదని, స్నేహం పరస్పర అవగాహన  ఉండాలని చెప్పే జనరల్ కి డిగ్రీ చదవాలని కోరిక. ఆమె కోరిక నెరవేరాలని ఆకాంక్షిద్దాం  

వి. శాంతి ప్రబోధ 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: