The greatest WordPress.com site in all the land!

మా నా య న మ్మ … నా జ్ఞా ప కా ల్లో ..

మా నా య న మ్మ పే రు కా మే శ్వ ర మ్మ . ఆవిడ పొయి దాదాపు పద్దెనిమిదేళ్ళు దాటింది. అయినా మా జ్ఞాపకాల్లో పదిలంగా ఉంది. ఈ రోజు నేను మా నాయనమ్మ గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని అనుకుంటున్నా.

ఓ రోజు నేను నా మిత్రులతో కలసి మంచిర్యాల నుండి నేను పెరిగిన ఊరు బుద్దిపల్లికి వెళ్ళా. ఆ రోజు నా చిన్ననాటి నేస్తం అరుణ పెళ్లి. మిత్రులందరినీ మా నాయనమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళా. అక్కడ మాటల్లో ఒకరిని పరిచయం చేస్తూ ఇతను మా విద్యార్ధి సంఘం నాయకుడు అని చెప్పా. ఏ పార్టీ తరపున అని అడిగింది. కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పా. రివిజానిస్టా అని అడిగింది. అంతే మా వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ఊరు మా బుద్దిపల్లి. ఇక్కడ ఉండే యీవిడ కి ఈ జ్ఞానం ఎక్కడినించి వచ్చింది అని వాళ్ళ ఆశ్చర్యం. రాజకీయాలు మాట్లాడడం నేను కొత్తగానే చూస్తున్నా. నిజానికి రివిజానిస్ట్ అంటే నాకు తెలియదు. ఆ రోజే మా నాయనమ్మే చెప్పింది.

ఆ రోజుల్లో మేము బుద్దిపల్లిలో ఉన్నన్ని రోజులు మా ఊరిలో వార్తాపత్రిక వచ్చేది మా ఇంటికి మాత్రమే. ఈ రోజు పేపర్ పోస్ట్ లో దాదాపు వారానికి వచ్చేది. అలా వచ్చిన పేపర్ ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు చదివేది మా నాయనమ్మ. రేడియోలో వచ్చే వార్తల్ని ఏ పని చేస్తున్నా ఆలకించేది. అంతే తెలుసు నాకు. ఆవిడ పరిజ్ఞానం అబ్బురపరిచింది.

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మా కుటుంబం చెట్టుకొకరు పుట్టకొకరుగా అయ్యాం. మా నాయనమ్మ, తాత మాత్రం బుద్దిపల్లిలోనే ఉన్నారు. నాన్న అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. చిన్నాన్నని పోలీసులు తీసుకెళ్ళారు. నేను చిన్నాన్న ఇంటిలో ఉంటే తమ్ముడు పెద్ద అత్త ఇంటి దగ్గర ఉన్నాడు. అమ్మ చెల్లెళ్ళు ఇద్దరూ మంచిర్యాలలో ఉన్నారు. అప్పుడు వ్యయసాయం చేయించేది. కొడుకుల గురించిన దిగులు, బాధ తనలోనే దిగమింగుకొని మా అమ్మకి ధైర్యం చెప్పేది. అప్పట్లో ఇప్పటిలాగా ఫోన్లు లేవు కదా. సమాచారం ఉత్తరాల ద్వారానే జరిగేది. ఎమర్జెన్సీ లో మా ఇంటికీ వచ్చే ఉత్తరాలు సరిగ్గా వచ్చేవి కాదు. వచ్చినా చిరిగి ఉండేవి. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మా చిన్నాన్న సమాచారం తెలుసుకోవడం కోసం మా నాయనమ్మ మా దగ్గరికి నిజామాబాదు జిల్లాలోని ఎల్లారెడ్డికి వచ్చింది. అప్పుడు మా ఇంటి ఓనర్ వాళ్ళు ఒక్కటే వచ్చిందని చాలా ఆశ్చర్యపోయారు. నాలుగు బస్సులు మారి వచ్చింది. నీకు భయం వేయలేదా అని వాళ్ళు అడిగారు. ఎందుకు భయం. నేనేమి తప్పు చేసానని? ధిల్లీ కైనా వెళ్ళి రాగలను అని చెప్పి వాళ్ళను మరింత ఆశ్చర్యచకితులను చేసింది.

మా నాయనమ్మ సమకాలికుల్లో గానీ ఆ తర్వాతి తరంలో గాని లేని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో, గుండెనిబ్బరంతో మెలగడం మా నాయనమ్మకే స్వంతం అనిపిస్తుంది.

కృష్ణా జిల్లాలో పుట్టిన ఆవిడ, చిన్నప్పుడు తన అమ్మమ్మ ఇంట ఖమ్మం జిల్లాలో పెరిగింది. అక్కడ కమ్యునిస్ట్ పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవట. అక్కడి వాతావరణం చాలా చైతన్యవంతంగా ఉండేదిట. ఆనాటి ఆ వాతావరణమే మా నాయనమ్మ వ్యక్తిత్వాన్ని మలిచిందేమో!

శాంతిప్రబోధ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: